బాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆలియా భట్.. ఇప్పుడు యాక్షన్ సీన్స్‌తో కొత్త సంచలనానికి సిద్ధమైంది. భావోద్వేగ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఆలియా, ‘‘ఆల్ఫా’’ చిత్రంలో ధైర్యవంతమైన గూఢచారి పాత్రలో కనిపించారు. సాహసోపేత యాక్షన్ సన్నివేశాలు, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆలియా ప్రేక్షకులను అలరించారు. చిత్రపరిశ్రమలోకి వచ్చిన మొదట గ్లామర్, నటనతో ప్రతిభ కనబరిచినా.. పెళ్లి, ఓ పాప తర్వాత.. ఇప్పుడు పూర్తి యాక్షన్, ప్రతి సవాలును స్వీకరిస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన ఆలియా భట్ చిన్నప్పటి నుంచే సినీ వాతావరణంలో పెరిగారు. ప్రముఖ సినీ దర్శకుడు మహేష్‌భట్ ఆమె తండ్రి. ప్రముఖ నటి సోనీ రజ్దాన్ తల్లి. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరగడం వల్ల చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ఆలియాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న ఉన్నారు. ముంబైలో పదో తరగతి వరకూ చదువుకున్నారు. అనంతరం నటనపైనే పూర్తి దృష్టి పెట్టారు. 1999లో విడుదలైన ‘‘సంఘర్ష్’’ చిత్రంలో బాలనటిగా తొలిసారి వెండితెరపై కనిపించారు.
మొదటి సినిమాతోనే..
దర్శక నిర్మాత కరణ్‌జోహార్ 2012లో తెరకెక్కించిన ‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’’ సినిమాలో ఆలియా హీరోయిన్‌గా నటించారు. తన అందం, సహజ నటన, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, భావ వ్యక్తీకరణ, డ్యాన్స్, సంభాషణల తీరు కొత్త నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
అగ్ర కథానాయికగా...
ఆలియా భట్ నటించిన చిత్రాల్లో ‘‘హైవే’’,‘‘రాజీ’’, ‘‘గంగూబాయి కతియావాడి’’,‘‘గల్లీ బాయ్’’, ‘‘డియర్ జిందగీ’’.. సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘‘హైవే’’ చిత్రంలో బందీగా చిక్కుకున్న యువతి మనోవేదనను ఆమె కళ్లతోనే చూపించారు. ‘‘రాజీ’’ లో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే గూఢచారిణిగా ధైర్యం, భయం, బాధ్యతల మధ్య సంఘర్షణను ఎంతో సహజంగా ఆలియా నటించారు. ‘‘గంగూబాయి కాఠియావాడి’’లో ఆత్మగౌరవం కోసం పోరాడే మహిళగా హుందాతనం, ఆవేశం, నాయకత్వ లక్షణాలను అద్భుతంగా పలికించారు. చురుకైన హావభావాలతో వేగంగా డైలాగ్‌లు చెప్పడం.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘‘డియర్ జిందగీ’’లో జీవితంపై సందిగ్ధంలో ఉన్న యువతిగా అంతర్మథనాన్ని ఎంతో హృద్యంగా చూపించారు. ఈ చిత్రాల్లో ఆలియా చెప్పే సంభాషణలు పాత్ర ఆత్మవిశ్వాసాన్ని, స్వాభిమానాన్ని, జీవితంపై ఆశావహ దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. కళ్లతో భావాలను పలికించడం, పాత్రలో పూర్తిగా లీనమవడం, సహజమైన సంభాషణ తీరు, ప్రతి పాత్రకు తగ్గ శరీర భాషను ప్రదర్శించడం ఆమె నటనలోని ప్రధాన బలాలు.
ఆలియా భట్, హిందీ చిత్రాలతో పాటూ అంతర్జాతీయ చిత్రసీమలోనూ తన ముద్ర వేశారు. 2023లో విడుదలైన ‘‘Heart of Stone’’ చిత్రం ద్వారా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ప్రకృతి, జంతు ప్రేమికురాలు
సినిమాల్లో విజయవంతమైన కథానాయికగా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ స్థాపించిన ‘‘కోఎగ్జిస్ట్’’ ద్వారా ప్రకృతి పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్ని స్తున్నారు. ‘‘Ed-a-Mamma’’ బ్రాండ్ ద్వారా పర్యావరణానికి హాని చేయని (సస్టైనబుల్) ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెంపొందేలా సందేశాలను అందిస్తున్నారు.
నిర్మాతగానూ విజయపథంలో..
మహిళా ప్రాధాన్య కథలు, కుటుంబ విలువలు, సమాజానికి మంచి సందేశం ఇచ్చే కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న లక్ష్యంతో 2021లో ‘‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్’’ అనే నిర్మాణ సంస్థను ఆలియా స్థాపించారు. ఈ సంస్థ నుంచి వచ్చిన తొలిచిత్రం ‘‘Darlings’’. ఇందులో ఆలియా నటించడమే కాకుండా సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు. గృహహింస వంటి సామాజిక సమస్యను వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా ఈ చిత్రం చూపించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. ఆలియా క స్టార్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, యువ నిర్మాతగానూ బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్నారు.
కఠినమైన శిక్షణ తీసుకొని
ఓ బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే, నటిగా తన లక్ష్యాలను ఏమాత్రం వదులుకోని ఆలియా భట్ 'ఆల్ఫా' చిత్రంలో మరో కొత్త కోణాన్ని చూపించారు. యాక్షన్ ప్రధాన చిత్రంలో గూఢచారిణి పాత్ర కోసం కఠినమైన శారీరక శిక్షణ తీసుకుని, మార్షల్ ఆర్ట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్, హై-వోల్టేజ్ స్టంట్స్‌లో మంచి ప్రతిభను కనబరిచారు. కొందరు సమీక్షకులు కథపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆలియా నటన, ఆమె యాక్షన్ ప్రదర్శన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచిందని ప్రశంసించారు. దీంతో కేవలం భావోద్వేగ పాత్రలకే కాదు, యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేయగలనని ఆలియా భట్ మరోసారి నిరూపించారు.
పుట్టిన తేది : 1993 మార్చి, 15న.
అక్కలు, అన్న : షాహీన్ భట్, పూజా భట్, రాహుల్ భట్
భర్త పేరు : రణబీర్ కపూర్(నటుడు)
కూతురు : రాహా కపూర్








కామెంట్‌లు (0)