mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిట్టిబాబుగా ఒదిగి.. పెద్దిగా గర్జించి..

3 గంటల క్రితం

peddi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 11:33 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

'రంగస్థలం'లో చిట్టిబాబుగా అయినా, 'పెద్ది'గా అయినా పాత్రలోని ఎమోషన్‌ను ఆవాహన చేసుకుని ఆయన చేసే నటన అద్వితీయం. కేవలం స్టార్ ఇమేజ్‌తోనే కాకుండా, నటుడిగా పాత్రలోని లోతుని పట్టుకుని ఆయన స్క్రీన్‌పై పండించే నవరసాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకోవడమే కాదు.. ప్రతి సినిమాలోనూ నటుడిగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ రామ్ చరణ్ సాగిస్తున్న ఈ ప్రయాణం యువ నటులకు స్ఫూర్తిదాయం. దర్శకుడు బుచ్చిబాబు తీసిన 'పెద్ది` సినిమాలో చరణ్ నటన చూసిన ప్రతిఒక్కరూ-భావోద్వేగానికి లోనయ్యారు అంటే.. ఆయన నటన ప్రతిఒక్కరినీ కదిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


పేరు: రామ్ చరణ్ కొణిదెల

పుట్టినతేదీ: మార్చి 27, 1985.

భార్య : ఉపాసన కామినేని (అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వారసురాలు).

పిల్లలు: క్లిన్ కారా, శివరామ్‌, అన్వీర దేవి.

నివాసం : హైదరాబాద్.

సినీ అభిమానులు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్. తల్లి సురేఖ. ఈమె తెలుగు హాస్యనటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమార్తె. రామ్ చరణ్ తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో అక్కడే స్థిరపడటంతో చరణ్ చిన్నతనం అంతా చెన్నైలోనే గడిచింది. రామ్ చరణ్ తన అక్క సుస్మిత, చెల్లెలు శ్రీజతో కలిసి ఇంట్లో ఎంతో అల్లరిగా, ఎల్లప్పుడూ సందడిగా గడిపేవారు. చరణ్ చెన్నైలోని ప్రసిద్ధ పద్మా శేషాద్రి బాలభవన్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో చేరి బి.కామ్ చదివారు.

సెలవు రోజుల్లో తండ్రితో కలిసి షూటింగ్ కి వెళ్లేవారు. తండ్రిలాగానే సినిమాల్లోకి రావాలని ఆసక్తి కనబరిచేవారు. చదువు పూర్తి చేసిన తర్వాత పూర్తిస్థాయిలో నటనపై దృష్టి పెట్టారు. ముంబైలోని 'కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్' లో నటన, ఫైట్స్, డాన్స్‌లలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ నుంచే బాలీవుడ్‌లోని ఎందరో స్టార్ హీరోలు శిక్షణ పొందారు.

‘మగధీర’తో మలుపు..

చరణ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసింది డైరెక్టర్ పూరీ జగన్నాథ్. 2007లో ‘‘చిరుత’’ సినిమాతో చరణ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే చరణ్ చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాటిట్యూడ్, మెగాస్టార్‌ను తలపించేలా వేసిన స్టెప్పులు చూసి ప్రేక్షకులు అభినందనలు తెలిపారు. తొలి చిత్రంతోనే 'బెస్ట్ డెబ్ల్యూ హీరో'గా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను అందుకొని తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత దర్శకడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘‘మగధీర’’ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. రెండో సినిమాకే కాలభైరవ వంటి వీరయోధుడి పాత్ర చేయడం ఒక పెద్ద సాహసం. ఈ సినిమా కోసం చరణ్ గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. పీరియాడిక్ పాత్రల్లో గంభీరత్వం ఎలా ప్రదర్శించాలో, ఒక భారీ స్క్రిప్ట్‌ను తన భుజాలపై ఎలా మోయాలో ఈ సినిమా చరణ్‌కు నేర్పింది. అప్పట్లో మంచి విజయం అందుకుంది. అందులో ‘‘ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి రమ్మను! లెక్క ఎక్కువైనా పర్లేదు.. తక్కువ కాకూడదు!’’ అని చెప్పిన డైలాగ్‌ ‌థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. ఆ తర్వాత నటించిన ‘‘ఆరెంజ్‌’’ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా, చరణ్‌లోని భిన్నమైన నటుడిని చూపించారు. ప్రేమపై స్పష్టమైన, ప్రాక్టికల్ ఆలోచనలున్న 'రామ్' పాత్రలో చరణ్ క్లాస్ లుక్‌తో మెప్పించారు. ఆ తర్వాత ‘‘నాయక్’’, ‘‘ఎవడు’’ సినిమాల్లో మాస్‌ ‌కుర్రాడుగా నటించి మాస్ పల్స్ పట్టుకున్నారు. 'నాయక్'లో డ్యూయల్ రోల్‌తో కామెడీ టైమింగ్, యాక్షన్‌ను సమంగా పండించగా, 'ఎవడు' చిత్రంలో సస్పెన్స్, రివెంజ్ డ్రామాతో పాత్రలో ఒదిగిపోయారు.

చెవిటోడు పాత్రలోనూ..

చరణ్ కెరీర్‌లో అత్యంత కీలకమైన చిత్రం ‘‘ధ్రువ’’. అంతవరకూ చేసిన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌ను పక్కనపెట్టి, ఒక స్టైలిష్ ఐపీఎస్ ఆఫీసర్‌గా మైండ్ గేమ్ ఆడే పాత్రను ఎంచుకున్నారు. దీనికోసం ఆయన కష్టపడి శారీరక సిక్స్ ప్యాక్ చేశారు. సైలెంట్‌గా ఉంటూ కేవలం కళ్లతో, మైండ్ గేమ్‌తో కూడా విలన్‌ను డీల్ చేయవచ్చనే సరికొత్త నటనా శైలిని చరణ్ ఇందులో అవలంభించారు. పాత్రల ఎంపికలో ఆయన రూట్ మారడానికి ఇది పునాది వేసింది.

దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘‘రంగస్థలం’’ చరణ్ నటన ప్రస్థానంలో ఒక మకుటాయమానమైన సినిమా. వినికిడి లోపం ఉన్న పల్లెటూరి యువకుడు ‘‘చిట్టిబాబు’’ పాత్రలో చరణ్ అక్షరాలా ఒదిగిపోయారు. గ్లామర్, స్టార్‌డమ్ పక్కనపెట్టి, లుంగీ కట్టి, పల్లెటూరి యాసలో చరణ్ చేసిన నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. స్టార్ ఇమేజ్ కంటే క్యారెక్టర్ ముఖ్యం అని చరణ్ బలంగా నమ్మిన సినిమా ఇది. భావోద్వేగాలను, నవరసాలను ఎంత సహజంగా పండిస్తే ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకుంటారని ఈ చిత్రం నిరూపించింది. ఈ సినిమాకు చరణ్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ పీరియాడిక్ మల్టీస్టారర్‌లో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటించారు.‘‘నాటు నాటు’’ సాంగ్‌తో ఆస్కార్ వేదిక వరకు వెళ్లడం చరణ్ కెరీర్‌లో అతిపెద్ద విజయం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది.

మాస్ ఎమోషన్ ‘‘పెద్ది’’..

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చరణ్‌లోని రా అండ్ రస్టిక్ యాక్టింగ్ యాంగిల్‌ను చూపించారు. ‘‘రంగస్థలం’’ తర్వాత ఆ స్థాయి రూరల్ ఎమోషనల్ డ్రామాలో చరణ్ చూపించిన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను దగ్గరచేశాయి. కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు శారీరకంగా తనని తాను మార్చుకున్న తీరు, పోరాట సన్నివేశాల్లో ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. రిస్క్ అని తెలిసినా ఇటువంటి పాత్ర చేయడం నటన పట్ల ఆయన అంకితభావం కనిపిస్తోంది. మెగా వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఈరోజు తన స్వయంకృషితో 'గ్లోబల్ స్టార్'గా ఎదిగారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్