తెలుగు సినీ పరిశ్రమలో కథల ఎంపికలో తనదైన అభిరుచితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్. కమర్షియల్ హంగుల కంటే కథలో బలం, పాత్రలో వైవిధ్యం, నటనకు అవకాశమే ఆయనకు ముఖ్యమైన ప్రమాణాలు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ లెక్కలతో కాకుండా కథల ఎంపికతో ఎక్కువగా అవుతుంటాయి. గంభీరమైన గొంతు, సహజమైన నటన, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలతో కూడిన డైలాగ్ డెలివరీ ఆయనను సమకాలీన హీరోల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రలతో మంచి నటుడిగా తనను తాను నిరూపించుకోవాలనే ప్రయత్నమే నారా రోహిత్ సినీ ప్రయాణంలో కనిపిస్తుంది. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆయన తాజాగా ‘‘కపాలి, ఆదర్శ కుటుంబం, సౌండ్‌ఇంజనీర్ ’’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నారా రోహిత్ తిరుపతిలో జన్మించారు. ఆయన తండ్రి నారా రామమూర్తి నాయుడు. ఆయన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు సోదరుడు. ఈ కారణంగా నారా రోహిత్ ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. హైదరాబాద్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, వడ్లమూడిలోని విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బిటెక్ పూర్తి చేశారు.
నటన కోసం ప్రత్యేక శిక్షణ
ఇంజినీరింగ్ చదివిన తర్వాత రోహిత్ నటనపై ఆసక్తి పెంచుకున్నారు. కుటుంబ నేపథ్యంపై ఆధారపడకుండా నటనను ప్రత్యేకంగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనకు సంబంధించిన కోర్సు చేశారు. తర్వాత లాస్ ఏంజెల్స్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా అభ్యసించారు. అంటే నటుడిగా తెరపైకి రాకముందే నటనతో పాటు సినిమా నిర్మాణ ప్రక్రియపై కూడా అవగాహన పెంచుకున్నారు.
‘‘బాణం’’ చిత్రం ద్వారా 2009లో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. తొలి సినిమాతోనే విభిన్నమైన కథను ఎంచుకోవడం ద్వారా రోహిత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించారు. మొదట కొన్ని అప్ అండ్ డౌన్స్ చవిచూశారు. తర్వాత వచ్చిన ‘‘సోలో’’ కుటుంబ కథా చిత్రంగా విజయాన్ని అందించింది. ‘‘స్వామిరారా’’లో ప్రత్యేక పాత్రతో ఆకట్టుకున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘‘ప్రతినిధి’’ ఆయనకు నటుడిగా మరింత గుర్తింపు తీసుకొచ్చింది. వ్యవస్థపై ప్రశ్నించే యువ నాయకుడి పాత్రలో ఆయన నటన విశేషంగా ప్రశంసలు అందుకుంది.
‘‘రౌడీ ఫెలో’’లో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా,‘‘అసుర’’లో ఇంటెలిజెన్స్ అధికారిగా, ‘‘జ్యో అచ్యుతానంద’’లో సహజమైన కుటుంబ నేపథ్యంలో సాగే పాత్రలో ఆయన తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు’’, ‘‘నీది నాది ఒకే కథ’’ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించాయి.
కొత్త తరం కోసం
"సినిమాలో ఏదో నటించామంటే సరిపోదు. కథ చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడు ఆసక్తిగా ఉండాలి. కొత్త తరం ప్రేక్షకులకు కొత్త కథలే కావాలి. అందుకే నేను చేసే ప్రతి పాత్రలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను.’’ అని రోహిత్ ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఇదే ఆయన సినీ ప్రయాణాన్ని ఇతర హీరోలతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టిన అంశం. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రోహిత్ ‘‘అరన్ మీడియా వర్క్స్’’ ద్వారా వైవిధ్యభరితమైన కథలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు.
వరుస సినిమాలతో..
రామ్ గన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘కపాలి’’ చిత్రంలో నారా రోహిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వరుస చిత్రాలతో మరోసారి బిజీ అవుతున్నారు. కొత్త సినిమా ప్రకటనలతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. సైకాలజికల్ హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘‘కపాలి’’ చిత్రంలో ఆయన పోలీసు పాత్రలో నటిస్తున్నారు. రోహిత్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది.. అలాగే వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47’’ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులోనూ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కథలో కీలక మలుపు తిప్పే పాత్రగా ఆయన పాత్రను రూపొందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘సౌండ్ ఇంజినీర్’’ చిత్రంలోనూ నారా రోహిత్ నటిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వినికిడి సమస్య ఉన్న వ్యక్తిగా నటిస్తున్నారు. ఇలా విభిన్న జానర్లలో తనను తాను నిరూపించుకోవాలనే రోహిత్ ప్రయత్నానికి ఈ సినిమా మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు ప్రయోగాత్మక పాత్రలు, మరోవైపు ప్రేక్షకులను అలరించే కథలు... ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ నారా రోహిత్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కథను నమ్మే హీరోగా, పాత్రను జీవించే నటుడిగా నారా రోహిత్ ప్రయాణం తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తోంది.








కామెంట్‌లు (0)