టాలీవుడ్‌లో సరికొత్తగా దూసుకుపోతున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. అందం.. అభినయంతో ఆమే మెప్పిస్తున్నారు. ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కథ, గమనం, అందులో తన పాత్ర తాలూకా విషయాలు నచ్చాకే ఆ సినిమాల్లో ఆమె నటిస్తారు. ఒప్పుకున్న తర్వాత ప్రాణం పెట్టి ఆ పాత్రలో జీవిస్తారు. మనసును తాకే కథలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది నటిగా సత్తా చాటుతున్న ఈ నటి తాజాగా ‘‘లెనిన్’’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగాను, కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఆమె నటనను చూసి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌ను పలకరించించిన భాగ్యశ్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
భాగ్యశ్రీ బోర్సే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్)లో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా. భాగ్యశ్రీ కుటుంబం నైజీరియాలో స్థిరపడింది. తల్లి డ్యాన్స్ టీచర్. డిగ్రీ కోసం ముంబయి యూనివర్సిటీలో చేరారు. ఆ క్రమంలో మోడలింగ్ లో అడుగుపెట్టారు. పుస్తకాలు చదవడం ఇష్టం. మెలొడీ సాంగ్స్ వినడం హాబీ._ప్రకటనలో భాగంగా డెయిరీ మిల్క్ సిల్క్ యాడ్ భాగ్యశ్రీకి మంచి గుర్తింపు తెచ్చింది. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి కుటుంబ పోషణ కోసం పడిన కష్టాలన్నీ ఆమెకు బాగా తెలుసు. ఆర్థిక కష్టాలను బలంగా మార్చుకున్న ఆమె నిరాశ చెందకుండా సినీరంగంలో ప్రవేశించి తనకంటూ ఓ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. నిరంతరం లోపాలను సవరించుకుంటూ, నటనలో మరిన్ని మెళకువలు పాటించసాగారు. సినిమా విజయవంతం అయినా, విఫలమయినా... దానికి బాధ్యత వహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంటున్నారామె.
స్వయంగా డబ్బింగ్
ఆమె 2023లో ‘‘యారియాన్ 2’’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కథానాయకుడు రవితేజ సరసన ‘‘మిస్టర్ బచ్చన్’’ చిత్రంలో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటన పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. వరుస అవకాశాలు వచ్చాయి. అంతేకాదు.. తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఏ భాషా అయినా
తానే స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తారు. అదే సంవత్సరంలో ‘‘చందూ ఛాంపియన్’’ (Chandu Champion) చిత్రంలో కూడా భాగమైనారు. అనంతరం ‘‘ఆంధ్రా కింగ్ తాలూకా’’, ‘‘కాంత’’, ‘‘రాజ్యం’’ వంటి బహుభాషా, తమిళ, తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం
పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలు ఒకలా ఉంటాయి. నటిగా తన ఆలోచనలు మరోలా ఉంటాయంటారు భాగ్యశ్రీ. నటిగా తన విషయంలో తల్లిదండ్రులు చాలా గర్వపడుతుంటారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాళ్లకి సక్సెస్ అంటే తాను తన పాత్రకి పరిపూర్ణంగా న్యాయం చేయడమే. వాళ్లు సినిమా చూడటానికి వెళ్లినప్పుడు ‘తెరపై భాగ్యశ్రీ కనిపించకూడదు. ఓ కుమారి, ఓ మహాలక్ష్మి, భారతి.. ఇలా ఆ పాత్రలే కనిపించాలి’ అని చెప్పేవారు. అదే వాళ్లకి నిజమైన సక్సెస్. నేను నా పాత్రతో పాటూ సినిమా విజయం అయినా, అపజయం అయినా పట్టించుకుంటాను. ఇంకా బాగా చేయడానికి ప్రయత్నింటాను.’ అని చెప్పుకొచ్చారు.
ప్రాణం పెట్టే పనిచేస్తా...
వరుసగా రెండు మూడు పరాజయాలు ఎదురవగానే ‘ఐరెన్ లెగ్’, ‘అన్ లక్కీ’ అనే మాటలు వినిపిస్తుండటం సహజం. ‘‘కాంత’’, ‘‘ఆంధ్ర కింగ్ తాలూకా’’ , ‘‘మిస్టర్ బచ్చన్’’ చిత్రాల తర్వాత ఆమె కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సినీ పరిశ్రమలో చాలామంది కష్ట కాలాన్ని దాటొచ్చిన వాళ్లను గుర్తుచేసుకున్నారట. ‘‘వాళ్లందరికీ ఫ్లాప్స్ వచ్చాయి. కింద పడ్డారు. ఒకానొక సమయంలో జనాలు ‘అమితాబ్ పని అయిపోయింద’నీ అన్నారు. కానీ, ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో మళ్లీ స్టార్ట్ చేసి.. జీవితంలో అన్నింటిని తిరిగి సాధించారు’’ అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రేక్షకుడిలా...కథలు వింటా..
‘‘నేను ఏ కథనైనా ఓ సగటు ప్రేక్షకుడిలా వినడానికే ఇష్టపడతా. ఈ కథని ఓ ప్రేక్షకుడైతే ఎలా స్వీకరిస్తాడు.. అది వాళ్ల మనసుల్ని తాకేలా ఉందా? లేదా? అలాగే ఓ ప్రేక్షకుడిలా ఇది నా మనసుకు దగ్గరైందా? లేదా? అనేదానిపై తొలుత దృష్టిపెడతా. దాని తర్వాత ఆ పాత్ర ఎలా ఉంది.. అది సినిమాకి ఎంత ముఖ్యం.. ఆ పాత్ర లేకపోతే సినిమా ఉందా? లేదా? అనే అంశాల్ని గమనిస్తా. ఇవన్నీ చక్కగా కుదిరి.. ఆ కథ మనసుకు నచ్చిందంటే మరో ఆలోచన లేకుండా నటించేందుకు సిద్ధపడతాను. నిజానికి ‘‘లెనిన్’’ కథని తొలుత నాకే వినిపించారు. కాకపోతే అప్పటికి నా డేట్లు సర్దుబాటు కాక మరొకరితో ముందుకెళ్లారు._ కానీ ఈ స్క్రిప్ట్ మళ్లీ నా దగ్గరికే వచ్చింది. నా కథల ఎంపికపై వేరెవరి ప్రభావం ఉండదు.’’ అని ఆమె స్పష్టంచేస్తున్నారు. ‘‘లెనిన్’’ సినిమాలో ‘‘భారతి’’ పాత్రలో పల్లెటూరు అమ్మాయిగా అద్భుతంగా నటించారు. ఈ విజయంతో ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)