mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమంత ‘బంగారం’

2 గంటల క్రితం

samanthaaa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 07:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

హోమ్లీ లుక్‌తో ‘‘ఏమాయ చేసావె’’ అంటూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నేడు యాక్షన్ క్వీన్‌గా ఎదిగిన సమంత ప్రయాణం స్ఫూర్తిదాయకం. గ్లామర్ పాత్రల నుండి బాధ్యతాయుతమైన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు సమంత వేస్తున్న అడుగులు అద్భుతం. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘‘మా ఇంటి బంగారం’’ సినిమాలో క్లాస్-మాస్ అవతారంలో సమంత చూపిన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన హై-వోల్టేజ్ ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సున్నితమైన గృహిణిగా నటిస్తూనే, కుటుంబం కోసం ఉగ్రరూపం దాల్చే ‘‘స్వర్ణ’’ పాత్రలో ఆమె చూపిన నటన ఇంటెన్సిటీ, టాలీవుడ్‌లో ఆమెకున్న తిరుగులేని స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


నటి సమంత చెన్నైలోని పల్లవరం ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి జోసెఫ్ ప్రభు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాగా, తల్లి నినెట్ ప్రభు కేరళకు చెందిన మహిళ. ఈ విధంగా సమంతకు తెలుగు, తమిళ, మలయాళ సంస్కృతులతో చిన్నతనం నుంచే అనుబంధం ఏర్పడింది. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. విద్యాభ్యాసాన్ని చెన్నైలోని 'హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్'లో పూర్తిచేశారు. ఆ తర్వాత చెన్నైలోని ప్రముఖ 'స్టెల్లా మేరీస్ కాలేజీ' నుండి కామర్స్ విభాగంలో డిగ్రీ (B.Com) పూర్తిచేశారు. కాలేజీ రోజుల్లోనే తన పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. సమంత కొన్ని వాణిజ్య ప్రకటనలలోనూ నటించి, మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రవివర్మన్ చూశారు. ఆమెకు నటన వైపు రమ్మని సలహా ఇచ్చారు.

తొలి సినిమాతోనే..

ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా, కేవలం తన ప్రతిభనే నమ్ముకుని సమంత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘‘ఏమాయ చేసావె’’ (2010) సినిమాతో ఆమె టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే ‘‘జెసి’’ పాత్రలో ఆమె పండించిన హావభావాలు, నటన యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు సమంతకు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్, నంది అవార్డులను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ‘‘ఈగ’’ సినిమాలో మైక్రో ఆర్టిస్ట్‌గా, ‘‘రంగస్థలం’’ లో రామలక్ష్మిగా డీగ్లామర్ పాత్రలో, ‘‘మహానటి’’లో మధురవాణిగా విలేకరి పాత్రలో వైవిధ్యాన్ని చాటుకున్నారు. వచ్చిన ప్రతి చిన్న, పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తన నటనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోలందరి పక్కన నటించి, టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.

ఊహించని సవాలు..

సమంత ‘‘శాకుంతలం’’ (2023) సినిమా ప్రమోషన్స్, విడుదల సమయంలో జీవితంలో ఒక ఊహించని పెద్ద శారీరక సవాలు ఎదురైంది. ఆమె 'మయోసైటిస్' (Myositis) అనే అరుదైన ఆటో ఇమ్యూన్ (శరీర రోగనిరోధక శక్తి సొంత కండరాలపైనే దాడి చేసే) వ్యాధి బారిన పడ్డారు. దీనివల్ల తీవ్రమైన కండరాల నొప్పులు, వాపులు, నీరసం, దీర్ఘకాలిక బాధను ఆమె అనుభవించాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగా సమంత దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు పూర్తిగా విరామం ప్రకటించారు. ఈ సమయంలో ఆమె ఎన్నో కఠినమైన వైద్య చికిత్సలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆమె జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు, వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవడానికి దాదాపు రెండేళ్ల పాటు అత్యంత నియంత్రితమైన, చప్పని ఆహారాన్ని (Bland Diet) మాత్రమే తీసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన ఆహారం తింటూ కఠినమైన క్రమశిక్షణతో చికిత్స పొందారు. ఈ వ్యాధి వల్ల ఆమె విపరీతంగా బరువు కూడా తగ్గాల్సి వచ్చింది.

నిర్ణయాత్మక మార్పు..

ఈ విరామం సమంత ఆలోచనా విధానాన్ని మార్చేసింది. కేవలం స్టార్‌డమ్ వెనుక పరుగులు పెట్టడం కంటే, తన జీవితానికి ఒక స్పష్టమైన అర్థాన్ని ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. పాత అలవాట్లను, కెరీర్ తీరును పూర్తిగా పక్కనపెట్టి, ఆత్మవిశ్వాసంతో సరికొత్త అడుగులు వేశారు. అందులో భాగంగానే 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, నిర్మాతగా మారారు. 'శుభం' వంటి చిత్రంతో నిర్మాతగా అడుగుపెట్టారు. వెండితెరపైనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, స్వయంగా సినిమాలు నిర్మిస్తున్నారు.

‘మా ఇంటి బంగారం'తో ఘన విజయం..

సమంత నిర్మాతగా మారి, తన స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రమే ‘‘మా ఇంటి బంగారం’’. సుదీర్ఘ విరామం తర్వాత సమంత థియేటర్లలోకి తిరిగి వచ్చిన చిత్రమిది. ఈ సినిమాలో సమంత ‘‘స్వర్ణ’’ అనే గృహిణి పాత్రలో కనిపిస్తూనే, కుటుంబం కోసం ఓ మహిళ భద్రకాళి అవతారంలో అద్భుతమైన యాక్షన్‌తో అలరించారు. చీరకట్టులో ఆమె చేసిన ఫైట్స్ చూసి ప్రేక్షకులు, అభిమానులు ఈలలు వేశారు. మామూలు నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తన ప్రతిభ, కష్టంతో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత నిజంగా బంగారమే!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్