ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅడవే ఆవాసం.. ప్రకృతే ప్రాణం

1 గంట క్రితం

adivassi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 08:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

అడవి ఆదివాసీలకు కేవలం నివాస ప్రాంతం కాదు. అది వారి జీవనాధారం. కొండలు కేవలం రాళ్ల సమూహాలు కావు.. అవి తరతరాల జ్ఞాపకాల నిలయాలు. నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు.. అవి వారి జీవన గీతాలు. ప్రకృతిని జయించాలనే ఆలోచనకు భిన్నంగా, ప్రకృతితో కలిసి జీవించడమే నిజమైన నాగరికత అని ప్రపంచానికి చాటి చెబుతున్న సమాజం ఆదివాసీ సమాజం. వేల సంవత్సరాలుగా అడవులు, కొండలు, నదీ పరివాహక ప్రాంతాలను తమ ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్న ఆదివాసీలు మానవ నాగరికతకు విలువైన సంపద. ఆధునిక ప్రపంచం సాంకేతిక అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ప్రకృతితో సమతుల్యంగా జీవించే విధానాన్ని ఆదివాసీ జీవన విధానం ఇప్పటికీ ప్రపంచానికి నేర్పుతోంది. ప్రకృతే వారి జీవితం ఆదివాసీలకు ప్రకృతి ఒక వనరు మాత్రమే కాదు.. అది వారి జీవన విధానం. చెట్టు వారికి కేవలం కలపను ఇచ్చే వస్తువు కాదు.. ఒక జీవం. నది కేవలం నీటి వనరు కాదు.. ఒక తల్లి. భూమి కేవలం ఆస్తి కాదు.. ఆరాధనీయమైనది. అందుకే ప్రకృతిని పరిరక్షించడం తమ బాధ్యతగా భావిస్తూ ఆదివాసీలు తరతరాలుగా సహజ వనరులను కాపాడుతున్నారు. అడవుల్లో లభించే పండ్లు, దుంపలు, తేనె, ఆకుకూరలు, ఔషధ మొక్కలు వారి జీవనాధారాల్లో ముఖ్యమైనవి. వ్యవసాయం, పశుపోషణ, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి నుంచి అవసరమైనంత మాత్రమే తీసుకోవడం, మిగిలిన వనరులను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడం వారి జీవన తత్వం. నేడు ప్రపంచం చర్చిస్తున్న సుస్థిర అభివృద్ధి భావనను ఆదివాసీలు ఎన్నో తరాల క్రితమే ఆచరించారు.

ఆదివాసీ సంస్కృతి ప్రకృతితో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటుంది. వారి పండుగలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు ప్రకృతిని కేంద్రంగా చేసుకుని కొనసాగుతాయి. వర్షం, పంటలు, అడవి, జంతువులు, పక్షులు వారి సాంస్కృతిక జీవితంలో ప్రత్యేక స్థానం పొందాయి. వారి కళారూపాలు కేవలం వినోద సాధనాలు కావు.. అవి వారి చరిత్రను, అనుభవాలను, సామాజిక విలువలను తరతరాలకు అందించే మాధ్యమాలు. ఆదివాసీల వస్త్రధారణలోనూ వారి ప్రాంతీయత, సంప్రదాయం ప్రతిబింబిస్తాయి. మహిళలు రంగురంగుల వస్త్రాలు, పూసల హారాలు, గాజులు, వెండి ఆభరణాలతో అలంకరించుకుంటారు. పండుగలు, జాతరల సమయంలో పూలు, ఆకులు వంటి సహజ పదార్థాలతో చేసుకునే అలంకరణలో వారి ప్రకృతి ప్రేమ కనిపిస్తుంది. సహజ ఆహారం.. ఆరోగ్యకర జీవనం ఆదివాసీల ఆహార విధానం ప్రకృతి ఆధారితమైనది. అడవుల్లో లభించే పండ్లు, దుంపలు, తేనె, వెదురు మొగ్గలు, పుట్టగొడుగులు, ఆకుకూరలు వంటి సహజ పదార్థాలను వారు వినియోగిస్తారు. జొన్న, రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలు వారి సంప్రదాయ ఆహారంలో ప్రధానమైనవి. సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం, రసాయనాల వినియోగం తక్కువగా ఉండటం వారి ఆరోగ్యకర జీవన విధానానికి కారణం.

adivasi 1

సంప్రదాయ జ్ఞానానికి నిలయాలు

ఆదివాసీ సమాజాలు కేవలం ప్రకృతి సంరక్షకులు మాత్రమే కాదు.. అపారమైన సంప్రదాయ జ్ఞానానికి నిలయాలు. ఔషధ మొక్కల వినియోగం, ప్రకృతి వైద్యం, వర్షాధార వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతుల్లో వారికి తరతరాల అనుభవం ఉంది. అటవీ, కొండ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని సమయంలో ఆదివాసీ మహిళలు, సంప్రదాయ మంత్రసానులు తల్లి–శిశు సంరక్షణలో కీలక పాత్ర పోషించారు. 2026 అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం సంప్రదాయ ఆదివాసీ మంత్రసానుల సేవలను గుర్తించడంపై దృష్టి సారిస్తోంది. వారి స్థానిక వైద్య పవిజ్ఞానాన్ని గౌరవించి, ఆధునిక ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది.

ఈ రోజు ప్రాధాన్యం..

ఆదివాసీ ప్రజల హక్కులు, సంస్కృతి, సంప్రదాయ జ్ఞానం, జీవన విధానాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1982 ఆగస్టు 9న జెనీవాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజల హక్కులపై వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగింది. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి 1994లో ఆగస్టు 9ను అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజు కేవలం ఒక వేడుక కాదు.. ఆదివాసీ ప్రజల హక్కులు, అస్తిత్వం, సంస్కృతిని గౌరవించాల్సిన బాధ్యతను గుర్తుచేసే సందర్భం.

adivasi 2

మనదేశంలో..

దేశంలో అనేక ఆదివాసీ తెగలు తమ ప్రత్యేక సంస్కృతులను కొనసాగిస్తున్నాయి. గోండ్లు, సంతాళ్లు, భీళ్లు, కోయలు, చెంచులు, కొండరెడ్డిలు, సవరలు, ఖోండ్లు వంటి తెగలు దేశ సాంస్కృతిక వైవిధ్యంలో కీలక భాగంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివాసీ సమాజాలకు గొప్ప చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని మన్యం ఉద్యమం గిరిజనుల పోరాట స్ఫూర్తికి ప్రతీక. భూమి,

అడవి, స్వేచ్ఛ కోసం ఆదివాసీలు చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. మన రాష్ట్రంలో కోందు, కోటియ, కొండదొర, భాగత, వాల్మీకి, కమ్మర, కుమ్మర, పొర్జా, నూకదొక, గదబ, కొండరెడ్డి, కోయ, చెంచు, సవర, జాతాపు, గోండ్లు, ఖోండ్లు, సంతాళ్లు వంటి ఆదివాసీ తెగల ప్రజలు నివసిస్తున్నారు. ఉత్తరాంధ్రప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీల (షెడ్యూల్డ్ తెగలు) స్థితిగతులు సామాజికంగా, ఆర్థికంగా అనేక సవాళ్లతో కూడుకుని ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు భూమి హక్కులు, ఉపాధి, విద్య, వైద్యం లాంటి అంశాలలో వెనుకబడి ఉన్నారు. ప్రకృతి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆదివాసీలను కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం.

adivasi 3

ఎదురవుతున్న సవాళ్లు..

ప్రస్తుతం ఆదివాసీ సమాజాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పేరుతో భూములు కోల్పోవడం, అటవీ నిర్మూలన, గనుల తవ్వకాల ప్రభావం, విద్య, వైద్య సదుపాయాల కొరత, పేదరికం, నిరుద్యోగం, భాషలు, సంప్రదాయాల అంతరించిపోవడం వంటి అంశాలు వారి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆదివాసీల అభివృద్ధి అంటే వారి జీవన విధానాన్ని మార్చడం కాదు.. వారి హక్కులను గౌరవిస్తూ, అభివృద్ధి ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయడం. అభివృద్ధిలో ఆదివాసీల భాగస్వామ్యం అడవులు, భూములు, సహజ వనరులతో వారి జీవనం ముడిపడి ఉంది.

అందువల్ల అభివృద్ధి ప్రణాళికల్లో వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

భూమి, అడవి, నీటి వనరులపై వారికి ఉన్న సంప్రదాయ సంబంధాన్ని గుర్తించాలి. వారి భాషలు, జానపద కళలు, పాటలు, సంప్రదాయాలను పరిరక్షించడం అంటే భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటమే!.

ఆదివాసీలు ప్రకృతితో సహజీవనం నేర్చుకున్న మానవ నాగరికతకు మార్గదర్శకులు. అడవులు బతికితే నదులు బతుకుతాయి. నదులు బతికితే భూమి బతుకుతుంది. భూమి బతికితే మానవ మనుగడ కొనసాగుతుంది. అందుకే ఆదివాసీ సంస్కృతిని గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం, వారి జీవన విధానాన్ని కాపాడటం అంటే ఒక సమాజాన్ని మాత్రమే కాదు.. భూమి భవిష్యత్తును కాపాడటం. ఇదే అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం అందించే గొప్ప సందేశం.

gangullaya

డాక్టర్ వంపూరు గంగులయ్య

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ

9440732806

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్