ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గురువు చేతుల్లోనే రేపటి సమాజం

2 గంటల క్రితం

sneha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 10:02 పూర్వాహ్నం | 11 నిమిషాల చదవడం

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అంటే కేవలం ఉపాధ్యాయులను సన్మానించుకునే రోజు కాదు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను మరోసారి గుర్తుచేసుకునే రోజు. పాఠశాల గదిలో నిలబడి పాఠం చెప్పే వ్యక్తిని మాత్రమే ఉపాధ్యాయుడు అనలేం. ఒక తరాన్ని ఆలోచింపజేసే వ్యక్తి, ప్రశ్నించే ధైర్యాన్ని నింపే వ్యక్తి, తప్పును సరిదిద్దే వ్యక్తి, సమాజం పట్ల బాధ్యతను కల్గించే వ్యక్తి నిజమైన ఉపాధ్యాయుడు. పుస్తకంలోని అక్షరాలను విద్యార్థి మెదడులో నింపడం మాత్రమే బోధన కాదు. ఆ అక్షరాల వెనుకనున్న జీవితాన్ని, సమాజాన్ని, మానవ సంబంధాలను అర్థం చేసుకునేలా చేయడమే అసలైన విద్య. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజును ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశ విద్యా వ్యవస్థకు, ఉపాధ్యాయ వృత్తికి ఆయన అందించిన గౌరవం అపారమైంది. ఆయన్ను స్మరించుకోవడం అంటే కేవలం పూలమాలలు వేయడం కాదు. ఆయన కలలుగన్న విద్యా విలువలను ఆచరణలోకి తీసుకురావడం. విద్యార్థుల్లో విజ్ఞానంతోపాటు వివేకాన్ని, స్వేచ్ఛా ఆలోచనను, మానవత్వాన్ని పెంపొందించడం. అదే నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం.

మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపే వ్యక్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు బిడ్డకు జీవితం ఇస్తే, ఉపాధ్యాయుడు ఆ జీవితానికి దిశానిర్దేశం చేస్తాడు. ఇంటి నుంచి పాఠశాలకు వచ్చిన చిన్నారి మనసును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర అపారమైంది. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రోత్సాహం, ఒక సానుకూల సూచన విద్యార్థి జీవితాన్నే మార్చగలదు. అదే నిరుత్సాహపర్చే మాట అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చు. అందుకే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ నిపుణుడిగానే కాకుండా విద్యార్థుల మనసులను అర్థం చేసుకునే మార్గదర్శిగా ఉండాలి. విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించాలి. అతని బలహీనతలను అర్థం చేసుకోవాలి. వెనుకబడటానికి కారణాలను తెలుసుకోవాలి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, భాషా సమస్యలు, సామాజిక నేపథ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రేమతో, ఓర్పుతో, నమ్మకంతో విద్యార్థిని ముందుకు నడిపించాలి. ప్రతి విద్యార్థి ఒకేలా ఉండడు. కొందరు చదువులో ముందుంటారు. మరికొందరు క్రీడల్లో ప్రతిభ చూపుతారు. ఇంకొందరు కళలు, సంగీతం, రచన, విజ్ఞాన ప్రయోగాల్లో రాణిస్తారు. మరికొందరికి ప్రత్యేక శ్రద్ధ అవసరం కావొచ్చు. అందరినీ ఒకే కొలమానంతో కొలవడం సరైంది కాదు. ప్రతి బిడ్డలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి వెలికితీయడం ఉపాధ్యాయుడి బాధ్యత. ‘నువ్వు ఏమీ చేయలేవు’ అనే మాట ఒక చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని జీవితాంతం దెబ్బతీయొచ్చు. అదే ‘నీకు ఇది సాధ్యమే’ అనే మాట అతని జీవితాన్ని మార్చగలదు. అందుకే ఉపాధ్యాయుడి ప్రతి మాటకు విలువ ఉంది. ప్రతి చర్యకు ప్రభావం ఉంది.


మారుతున్న ప్రపంచంలో పెరిగిన బాధ్యత

సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న కాలమిది. కృత్రిమ మేధస్సు, డిజిటల్‌ తరగతులు, అంతర్జాల విద్య, స్మార్ట్‌ పరికరాలు విద్యా ప్రక్రియ స్వరూపాన్నే మార్చుతున్నాయి. విద్యార్థి చేతిలో పుస్తకంతోపాటు మొబైల్‌ ఉంది. ఒక ప్రశ్నకు సమాధానం కోసం గ్రంథాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలోని అపారమైన సమాచారాన్ని క్షణాల్లో పొందగలుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడి పాత్ర తగ్గలేదు. వాస్తవానికి మరింత పెరిగింది. సమాచారం అందుబాటులో ఉండటం ఒక విషయం; దానిని విశ్లేషించి జ్ఞానంగా మార్చుకోవడం మరో విషయం. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది శాస్త్రీయ సమాచారం? ఏది తప్పుడు ప్రచారం? ఏది నమ్మదగిన ఆధారం? ఏది పుకారు? అనే విషయాలను గుర్తించే వివేకం విద్యార్థిలో పెంపొందించాలి. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడం, ఇతరుల హక్కులను గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోవడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం వంటి లక్షణాలను యంత్రాలు మాత్రమే నేర్పలేవు. వాటికి మానవీయ అనుభవం అవసరం. ఆ అనుభవాన్ని విద్యార్థికి అందించగలిగేది ఉపాధ్యాయుడే. కృత్రిమ మేధస్సుకు భయపడటం లేదా పూర్తిగా నిషేధించడం పరిష్కారం కాదు. దానిని బాధ్యతగా, సృజనాత్మకంగా ఉపయోగించడం నేర్పాలి. విద్యార్థి స్వయంగా ఆలోచించకుండా యంత్రం ఇచ్చిన సమాధానాన్ని కాపీ చేస్తే విద్యా ప్రక్రియ దెబ్బతింటుంది. సాంకేతికత ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు. ఉపాధ్యాయుడి సామర్థ్యాన్ని పెంచే సాధనం.


మార్కుల కంటే మనిషి ముఖ్యం

మన విద్యా వ్యవస్థలో పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్కులు సాధించాలని కోరుకోవడం సహజం. విద్యార్థి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశించడం కూడా తప్పు కాదు. కానీ విద్యను కేవలం ఉద్యోగానికి ప్రవేశపత్రంగా పరిమితం చేస్తే దాని అసలు లక్ష్యం నశిస్తుంది. పరీక్షలో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థి తన పక్కనున్న మనిషి బాధను అర్థం చేసుకోలేకపోతే ఆ విద్య సంపూర్ణం కాదు. పెద్ద ఉద్యోగం సాధించిన వ్యక్తి సమాజంలోని బలహీనవర్గాల పట్ల మానవత్వం చూపకపోతే అతని విద్యలో లోపం ఉన్నట్టే. విజ్ఞానం పెరిగి వివేకం తగ్గితే సమాజానికి అది ప్రమాదకరం. అందుకే ఉపాధ్యాయుడు విద్యార్థిని కేవలం ఉద్యోగార్థిగా కాకుండా బాధ్యతగల పౌరుడిగా తీర్చిదిద్దాలి. గణితం, విజ్ఞానం, భాష, చరిత్ర, భూగోళశాస్త్రంతోపాటు ‘మనిషిగా ఎలా జీవించాలి?’ అనే ప్రశ్నకు సమాధానం వెతికేలా చేయాలి. ఇతరులను గౌరవించడం, సమానత్వాన్ని నమ్మడం, కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా వివక్ష చూపకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, ప్రజా ఆస్తిని కాపాడటం, రాజ్యాంగ విలువలను గౌరవించడం విద్యలో అంతర్భాగం కావాలి.


శాస్రీయ ఆలోచనలు పెంపొందించాలి

తరగతి గదిలో ఉపాధ్యాయుడిని ప్రశ్నించే విద్యార్థిని భయపడేలా చేయకూడదు. ప్రశ్నించడం అజ్ఞానానికి గుర్తు కాదు. తెలుసుకోవాలనే తపనకు గుర్తు. ‘ఎందుకు?’ అని అడిగే పిల్లవాడిని ప్రోత్సహించాలి. ‘ఇలా ఎందుకు జరుగుతోంది?’, ‘ఇది సరైనదేనా?’, ‘దీనికి మరో మార్గం లేదా?’ అని ఆలోచించే విద్యార్థులను తయారు చేయాలి. శాస్త్రీయ ఆలోచనకు మూలం ప్రశ్న. మూఢనమ్మకాలను ఎదుర్కొనే శక్తికి మూలం ప్రశ్న. సామాజిక అన్యాయాన్ని గుర్తించే చైతన్యానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తికి కూడా ప్రశ్నే మూలం. అందుకే ఉపాధ్యాయుడు ప్రశ్నలను అణచివేయకుండా వాటిని చర్చగా మార్చాలి. వాదనకు ఆధారాలు చూపించాలి. సాక్ష్యాలతో విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా ఆలోచించే తరాన్ని తయారుచేయడం ద్వారానే శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజాన్ని నిర్మించగలం.


విద్యకు రాజ్యాంగ విలువలు పునాది

స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలు పాఠ్యపుస్తకాల్లో మాత్రమే ఉండకూడదు. విద్యార్థుల జీవితాల్లో ప్రతిబింబించాలి. పిల్లవాడు తన సహ విద్యార్థి ఏ కులానికి, ఏ మతానికి చెందినవాడో ముందుగా చూడాల్సిన అవసరం లేదు. అతనిలో ఒక మనిషిని చూడాలి. పాఠశాల సమానత్వానికి తొలి వేదిక కావాలి. కుల వివక్ష, మత విద్వేషం, లింగ వివక్ష, ప్రాంతీయత, భాషా ద్వేషం వంటి సామాజిక వైరుధ్యాలు పిల్లల మనసుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కుటుంబం, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు ప్రభావం చూపుతున్న కాలంలో పాఠశాల ప్రజాస్వామ్య సంస్కారాలకు బలమైన స్థలంగా మారాలి. భిన్న కుటుంబాలు, సామాజిక నేపథ్యాలు, మతాలు, భాషలు, ప్రాంతాలకు చెందిన పిల్లలు కలిసి చదువుకోవడం, ఆడుకోవడం, ఎదగడం భారతీయతకు గొప్ప సందేశం. ఉపాధ్యాయుల గౌరవం గురించి ప్రతి సంవత్సరం గొప్పగా మాట్లాడుతున్నాం. కానీ ఆ గౌరవం వారి వృత్తి పరిస్థితుల్లో కనిపిస్తున్నదా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.


బోధనేతర పనులు వద్దే వద్దు

ఉపాధ్యాయుడు బోధనకు తగిన సమయం పొందాలి. అనవసరమైన బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి. పాఠశాలల్లో తగిన మౌలిక వసతులు ఉండాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం జరగాలి. నిరంతర శిక్షణకు అవకాశాలు కల్పించాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు అవసరమైన వనరులు అందించాలి. ఉపాధ్యాయుడి వృత్తి స్వాభిమానాన్ని కాపాడే వాతావరణం ఉండాలి. ఉపాధ్యాయులను ప్రతి సమస్యకు బాధ్యులుగా చూపడం ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతం కాదు. ఉపాధ్యాయుడిపై నమ్మకం ఉంచి, అతని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి, అవసరమైన సహకారం అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. మంచి పని వాతావరణం, వృత్తిపరమైన స్వేచ్ఛ, సామాజిక గౌరవం, నిరంతర శిక్షణ, పరిశోధనకు అవకాశం, తగిన బోధనా సామగ్రి, ఒత్తిడిలేని బోధనకు అవసరమైన సౌకర్యాలు కూడా అవసరం. అదే సమయంలో ఉపాధ్యాయుల ఆర్థిక భద్రతను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఉద్యోగ భద్రత, సమయానుకూల వేతనాలు, ఉద్యోగోన్నతులు, ఉద్యోగ విరమణ అనంతర భద్రత వంటి అంశాల్లో స్పష్టమైన, న్యాయమైన విధానాలు ఉండాలి. ఆర్థికంగా, వృత్తిపరంగా భద్రత ఉన్న ఉపాధ్యాయుడే విద్యార్థులపై పూర్తి దృష్టి పెట్టగలడు.


utf


ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అత్యవసరం

ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన ఆధారం. ప్రభుత్వ విద్య బలహీనపడితే సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అత్యంత ప్రాధాన్యమైన సామాజిక బాధ్యత. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తగిన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలు ఉండాలి. డిజిటల్‌ సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు పట్టణాల్లోని పిల్లలతో సమానమైన విద్యా అవకాశాలు కల్పించాలి. పేద కుటుంబానికి చెందిన పిల్లవాడు ప్రతిభలో ఎవరికీ తీసిపోడు. అవకాశాలు లభించడంలోనే తేడా ఉంటుంది. ఆ అవకాశాన్ని సమానంగా అందించడం ప్రభుత్వ బాధ్యత. విద్య సామాజిక చలనశీలతకు ప్రధాన సాధనం. పేద కుటుంబంలో పుట్టిన పిల్లవాడు తన ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య మార్గం చూపుతుంది. ఆ మార్గాన్ని బలహీనపరిస్తే అసమానతలు తరతరాలకు కొనసాగుతాయి. అందువల్ల విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూడకుండా ప్రజా హక్కుగా బలోపేతం చేయాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెట్టుబడులు పెంచాలి. పేద, గ్రామీణ, వెనుకబడిన తరగతుల పిల్లలకు ప్రత్యేక సహాయ కార్యక్రమాలు ఉండాలి.


బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం

ఒక బాలిక చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే చదువుకున్నట్టు కాదు. ఒక కుటుంబం చైతన్యవంతమవుతుంది. ఒక తరం ప్రభావితం అవుతుంది. అందువల్ల బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాల బాలికలకు భద్రమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. వారి హక్కులపై అవగాహన కల్పించాలి. స్వయం నిర్ణయ సామర్థ్యాన్ని పెంచాలి. వారి కలలకు పరిమితులు పెట్టకుండా ప్రోత్సహించాలి. ‘అమ్మాయిలకు ఈ రంగం కాదు’ వంటి సామాజిక ధోరణులను ప్రశ్నించే ధైర్యాన్ని ఇవ్వాలి. అబ్బాయిలకు కూడా లింగ సమానత్వం గురించి బోధించాలి. మహిళలను గౌరవించడం, ఇంటి పనులను పంచుకోవడం, సహచరుల స్వేచ్ఛను గౌరవించడం వంటి విలువలు చిన్ననాటి నుంచే నేర్పాలి. లింగ సమానత్వం పాఠ్యాంశం మాత్రమే కాదు; అది జీవన విధానం కావాలి.


పుస్తక పఠనం ఆలోచనకు పునాది

మొబైల్‌ స్ర్కీన్‌పై గడిపే సమయం పెరుగుతున్న కొద్దీ పుస్తక పఠనం తగ్గిపోతున్న ఆందోళన ఉంది. పుస్తకం కేవలం సమాచారాన్ని ఇవ్వదు. ఊహాశక్తిని పెంచుతుంది. మనసును విశాలం చేస్తుంది. ఇతరుల జీవితాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి పాఠశాలలో సజీవమైన గ్రంథాలయం ఉండాలి. పిల్లలు స్వేచ్ఛగా వెళ్లి పుస్తకాలు తీసుకుని, చదివే వాతావరణం ఉండాలి. ఉపాధ్యాయుడు స్వయంగా పుస్తకాలు చదివి విద్యార్థులకు పరిచయం చేయాలి. వారితో పుస్తకాలపై చర్చించాలి. సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, జీవిత చరిత్రలు, బాలసాహిత్యం, సామాజిక చైతన్య రచనలు పిల్లల్లో విస్తృతమైన ఆలోచనలను పెంచుతాయి. పుస్తకం చదివే విద్యార్థి కేవలం పరీక్ష కోసం కాదు. జీవితం కోసం నేర్చుకుంటాడు.


ప్రకృతిని ప్రేమించే పౌరులు

వాతావరణ మార్పులు, నీటి కొరత, అడవుల నరికివేత, ప్లాస్టిక్‌ కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పర్యావరణ విద్యను పుస్తకాల్లోని ఒక పాఠంగా పరిమితం చేయకూడదు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలి. వాటిని విద్యార్థులే సంరక్షించాలి. నీటి విలువను అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. చెత్తను వేరు చేయడం, పునర్వినియోగం, పరిశుభ్రత వంటి అంశాలను ఆచరణలో నేర్పాలి. ప్రకృతిని కేవలం వనరుగా కాకుండా సహజీవన భాగస్వామిగా చూసే దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంచాలి.


ప్రజాస్వామ్య పాఠశాలలు కావాలి

పాఠశాల ఒక చిన్న ప్రజాస్వామ్య సమాజంలా ఉండాలి. పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉండాలి. తరగతి చర్చలు, బాల సభలు, విద్యార్థి మండళ్లు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇతరుల అభిప్రాయాలను వినడం, విభేదించినా గౌరవించడం వంటి ప్రజాస్వామ్య సంస్కారాలను పాఠశాల నుంచే నేర్పాలి. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల సమయంలో ఓటు వేయడం మాత్రమే కాదు. రోజువారీ జీవితంలో సమానత్వం, స్వేచ్ఛ, బాధ్యత, పరస్పర గౌరవం పాటించడం. ఈ విలువలను పుస్తకంలో చదివించడం కన్నా ఆచరణలో చూపించడం ప్రభావవంతం.


తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి నడవాలి

పిల్లల విద్యలో పాఠశాల ఒక్కటే బాధ్యత వహించదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాలి. తల్లిదండ్రులు కేవలం మార్కులు అడగకుండా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, పాఠశాలలో ఎలా ఉన్నారు? అనే విషయాలను తెలుసుకోవాలి. పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం మానుకోవాలి. ‘పక్కింటి పిల్లవాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి’ అనే మాట కంటే ‘నువ్వు నిన్నటి కంటే ఈ రోజు ఏం నేర్చుకున్నావు?’ అనే ప్రశ్న ఎక్కువ ఉపయోగకరం. పోటీ ఉండాలి. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ కావాలి. తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు పరస్పరం నిందించుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. పరస్పర సహకారంతోనే పిల్లల భవిష్యత్తు మెరుగవుతుంది.


ఉపాధ్యాయ వృత్తిలోకి ఉత్తమ ప్రతిభ రావాలి

ఒక సమాజం తన భవిష్యత్తును ఎంత విలువైనదిగా భావిస్తుందో తెలుసుకోవాలంటే అది తన ఉపాధ్యాయులను ఎలా చూస్తుందో చూడాలి. అత్యుత్తమ ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేలా పరిస్థితులు ఉండాలి. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనదిగా, సృజనాత్మకమైనదిగా, సామాజికంగా ప్రభావవంతమైనదిగా ఉండాలి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని పూర్తి చేసే ఉద్యోగి కాదు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సామాజిక శిల్పి. వారి బోధన ప్రభావం విద్యార్థి జీవితంలో, కుటుంబాల్లోనూ, పనిచేసే సంస్థలో, చివరికి సమాజంలో కనిపిస్తుంది. అందుకే ఉపాధ్యాయుడి ప్రభావాన్ని కేవలం సంఖ్యలతో కొలవలేం.


మంచి సమాజం కోసం

మన సమాజం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. సమాజానికి అవసరమైన పౌరులను తయారుచేసే ఉపాధ్యాయులను ముందుగా బలోపేతం చేయాలి. సమాజాన్ని మార్చాలంటే ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిన అవసరం లేదు. పాఠశాల తలుపు తెరిస్తే సరిపోతుంది. అక్కడి నుంచి వెలువడే ప్రతి విద్యార్థి ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని, ఒక సంస్థను, చివరికి సమాజాన్ని ప్రభావితం చేయగలడు. అందుకే పాఠశాల భవనం కేవలం తరగతి గదుల సముదాయం కాదు. అది భవిష్యత్తు సమాజ నిర్మాణశాల. ఉపాధ్యాయుడు కేవలం ఉద్యోగి కాదు. ఆ నిర్మాణశాలలో ప్రధాన శిల్పి.


ఒక సంకల్ప దినం కావాలి

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని సంకల్పాలు చేసుకోవాలి. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి. ఒత్తిడిలేని బోధనకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. ఉపాధ్యాయులకు సముచిత వేతనం, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించాలి. నిరంతర శిక్షణ అందించాలి. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి. కుల, మత, లింగ వివక్షకు పాఠశాలల్లో స్థానం లేకుండా చూడాలి. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిజిటల్‌ ప్రపంచాన్ని బాధ్యతగా ఉపయోగించడం నేర్పాలి. ప్రకృతి సంరక్షణను విద్యలో భాగం చేయాలి. రాజ్యాంగ విలువలను విద్యార్థుల జీవితాల్లోకి తీసుకురావాలి. విద్యను కేవలం ఉద్యోగానికి పరిమితం చేయకుండా సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణంగా చూడాలి. అప్పుడే ఉపాధ్యాయ దినోత్సవం నిజమైన అర్థాన్ని పొందుతుంది.

దేశ భవిష్యత్తు పార్లమెంటులో తయారుకాదు. అది పాఠశాల తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. రేపటి శాస్త్రవేత్త, వైద్యుడు, రైతు, కార్మికుడు, ఇంజినీర్‌, కళాకారుడు, రచయిత, ప్రజాప్రతినిధి, న్యాయమూర్తి, పరిపాలకుడు, సామాజిక కార్యకర్త– అందరి ఆలోచనలకు తొలి రూపం పాఠశాలలోనే వస్తుంది. ఆ ఆలోచనలకు దిశ చూపే వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయుడి చేతిలో ఉండేది కేవలం చాక్‌పీస్‌ కాదు. ఒక తరం భవిష్యత్తు. అతని మాటలో ఉండేది కేవలం పాఠం కాదు. ఒక జీవితానికి దిశ. అతని బోధనలో ఉండేది కేవలం పరీక్షకు సమాధానం కాదు. సమాజాన్ని అర్థం చేసుకునే వివేకం. అతని ప్రవర్తనలో ఉండేది కేవలం వ్యక్తిగత క్రమశిక్షణ కాదు. విద్యార్థులకు ఒక ఆదర్శం. మనకు కావాల్సింది ప్రశ్నించే ధైర్యాన్ని ఇచ్చే ఉపాధ్యాయులు. మార్కుల కోసం పరుగులు పెట్టించే వారు కాదు. జీవిత విలువలను అర్థం చేయించేవారు. సమాజాన్ని చదవడం నేర్పించే ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులు ఎక్కువైతే మంచి పాఠశాలలు ఏర్పడతాయి. మంచి పాఠశాలలు ఏర్పడితే మంచి విద్యార్థులు తయారవుతారు. మంచి విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా ఎదిగితే మంచి సమాజం నిర్మితమవుతుంది. మంచి సమాజమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.

teaching

మినహాయింపుల్లేని ప్రత్యేక టెట్‌

ఉపాధ్యాయుల నాణ్యతను పెంచాలి. వారికి అవసరమైన శిక్షణ అందించాలి. బోధనా సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరచాలి. దీనిపై ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. కానీ ఉపాధ్యాయుల నాణ్యత పెంపు పేరుతో వారిపై నిరంతరం పరీక్షలు, అర్హతలు, ధృవపత్రాలు, మూల్యాంకనాలు, శిక్షణల భారాన్ని మోపడం సమస్యకు పరిష్కారం కాదు. టెట్‌ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఉపాధ్యాయుడు ఇప్పటికే నియామక ప్రక్రియలో అర్హతలు సాధించి, శిక్షణ, నియామకం పొంది, సంవత్సరాలుగా తరగతి గదిలో బోధిస్తున్న వ్యక్తి. అలాంటి ఉపాధ్యాయుడిని మళ్లీ మళ్లీ అర్హత పరీక్షల పేరుతో ఒత్తిడికి గురిచేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యత విద్యార్థులకు బోధించడం. కానీ ఉపాధ్యాయుడి దృష్టి నిరంతరం పరీక్షలు, సన్నద్ధత, అర్హతలపైనే ఉంటే తరగతి గదిలో అతని శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది.

ఇన్‌ ‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)‌ నోటిఫికేషన్‌ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2011 కంటే ముందు నియమితులై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరూ టెట్‌‌లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ, మున్సిపల్‌, రెసిడెన్షియల్‌ ఎయిడెడ్‌ ‌పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ టెట్‌‌ను నిర్వహించనుంది. ఆగస్టు 24న విడుదల చేసిన ఇన్‌ సర్వీస్‌ టీచర్ల స్పెషల్‌ టెట్‌-2026లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు. మామూలు టెట్‌ మాదిరిగానే ఈ నోటిఫికేషన్‌ ఉండటం చాలా బాధాకరమైన విషయం. విద్యా హక్కు చట్టం - 2015 లోని '23(1)' సవరణను అమలు చేస్తే తొలిగే ఇబ్బందులకు, 20 నుంచి 25 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించడం సరికాదు. అందరికీ కనీస అర్హత మార్కులు 35శాతం గానీ, లేదంటే ఆయా ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టులలో తగిన వెసులుబాటు కల్పించాల్సి వుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో కాకుండా రాత పరీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలూ కోరినా మినహాయింపు ఇవ్వకపోవడం బాధాకరం. ప్రత్యేక టెట్‌ ‌వల్ల ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.

అసలు లోపాలను గుర్తించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతపై ఆందోళన ఉంటే ముందుగా వ్యవస్థలోని లోపాలను సరిచేయాలి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. తరగతుల పరిమాణాన్ని తగ్గించాలి. బోధనేతర పనులను తగ్గించాలి. బోధనా సామగ్రి అందించాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి. ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి. ఇవి చేయకుండా ఉపాధ్యాయుడి మీద మరో పరీక్ష పెట్టడం ద్వారా విద్యా వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. వ్యవస్థను సరిచేయకుండా ఉపాధ్యాయుడిని పరీక్షించడం ఎంత వరకూ సబబు. ప్రభుత్వ విద్య బలపడాలంటే ఉపాధ్యాయుడిపై విశ్వాసం పెరగాలి. ఉపాధ్యాయుడిని ఎప్పటికప్పుడు అనుమానిస్తూ, అతని సామర్థ్యాన్ని పరీక్షలతోనే కొలుస్తూ, అతనిపై అదనపు బాధ్యతలు మోపుతూ నాణ్యమైన విద్యను నిర్మించలేం. ఉపాధ్యాయుడికి కావాల్సింది మరో భారమైన పరీక్ష కాదు. బోధించడానికి సమయం, తగిన సిబ్బంది, అవసరమైన వనరులు, వృత్తిపరమైన స్వేచ్ఛ, గౌరవం, భద్రత. టెట్‌ వంటి విధానాల ఉద్దేశ్యం నిజంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే అయితే, వాటిని ఉపాధ్యాయులపై శిక్షాత్మక ఒత్తిడిగా కాకుండా వృత్తి అభివృద్ధికి ఉపయోగపడే విధానంగా రూపొందించాలి. లేకపోతే ఉపాధ్యాయుడు రోజూ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలను చదివించాల్సిన సమయం తగ్గిపోతుంది. తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం పెరుగుతుంది. అది ఉపాధ్యాయుడికి మాత్రమే నష్టం కాదు. చివరికి దాని ప్రభావం పడేది తరగతి గదిలోని విద్యార్థిపైనే.

నిర్వీర్యానికి కుట్రలు

గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యాప్రమాణాలు గణనీయంగా పెరుగుతుండటాన్ని గమనించొచ్చు. దీనికి ఉపాధ్యాయులే కారణం.ఇప్పుడు టెట్‌ పరీక్ష‍లతో వారు ఒత్తిడికి గురౌతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యావిధానంలో కూడా మార్పులు చోటుచేసుకోవడం, నివేదికలు సమర్పించడం వంటి పనులు కూడా వారికి భారంగా మారుతున్నాయి. ఆయా ప్రభుత్వాల విధానాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నానాటికి నిర్వీర్యమౌతుంది. పాఠశాలల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించక పోవడం, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయక పోవడం, మౌలిక వసతులు అవసరమైన స్థాయిలో కల్పించక పోవడం ఈ కోవకుచెందినవే. ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం పెంచుతారు. విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు దానికి మూల కారణాలను పరిశీలించకుండా పాఠశాలల విలీనాలు చేపడతారు. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాలు అలాంటివే. చివరకు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లోనే నమ్మకం తగ్గే పరిస్థితిని సృష్టిస్తారు. ఆ తర్వాత ‘ప్రైవేటు పాఠశాలలకు డిమాండ్‌ ఉంది’ అని చెప్పడం సులభం. కానీ ఆ డిమాండ్‌ను ఎవరు సృష్టించారు? ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలే కారణం. ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గితే వెంటనే ఆ పాఠశాల అవసరం లేదని నిర్ణయించడం సరైన విధానం కాదు. అసలు విద్యార్థులు ఎందుకు తగ్గారో పరిశీలించాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు సరిపోతున్నారా? మౌలిక వసతులు ఉన్నాయా? ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? పిల్లలకు వ్యక్తిగత శ్రద్ధ లభిస్తున్నదా? తల్లిదండ్రులతో పాఠశాలకు సన్నిహిత సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా ‘పిల్లలు లేరు కాబట్టి పాఠశాల విలీనం’ అనడం సమస్యను పరిష్కరించడం కాదు. అది సమస్య నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసాన్ని పెంచకుండా పాఠశాలల సంఖ్యను తగ్గించడం పరిపాలనా సంస్కరణగా చెప్పుకోవడం వాస్తవాన్ని దాచిపెట్టడమే.


mlc

కె.ఎస్‌. లక్ష్మణరావు,

మాజీ శాసనమండలి సభ్యులు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష‍ులు

83099 65083


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్