వేగంగా దూసుకుంటూ ఆటో గేటు ముందు ఆగింది. ఆటో దిగి మధుబాబు తన భార్యతో కలిసి గబాగబా లోపలికి వెళ్ళాడు. ఇంతలోనే అంతే స్పీడుతో కారు వచ్చి ఆగింది. కారు దిగుతూ సూర్యం తన భార్యతో లోపలికి వెళ్ళాడు. అప్పటికే రమ్య తన భర్తతో కలిసి లోపలికి వెళుతుంది. ‘అమ్మా.. అమ్మా..’ అని పిలుస్తూ టెన్షనుగా లోనికి వెళ్ళారు. లోపలికి వెళ్లి చూడగానే రాధమ్మ హాల్లో కూర్చొని టీ.వీ సీరియల్ చూస్తూ లీనమైపోయింది. పిల్లల రాకను గమనించలేదు తను. రాధమ్మకి అరవయ్యేళ్ల వయసు. దబ్బపండు ఛాయ. గుండ్రటి ముఖం. ఆత్మీయత ఉట్టిపడే చిరునవ్వు. వృద్ధాప్యం దరిచేరని శారీరక దృఢత్వం. అన్నిటికీ మించి రాధమ్మది కోమల మనస్తత్వం. ‘ఉన్నపళంగా హుటాహుటీన రమ్మంటే ఏమైందోనని భయపడి చచ్చాం. ఏమైందమ్మా?’ అంటూ పెద్దకొడుకు మధుబాబు అడుగుతుండగా ‘మరే! నాకు సెలవు దొరకలేదు. మా మేనేజరుని ఒప్పించడానికి తలప్రాణం తోకకు వచ్చింది నాకు. ఇంత అర్జంటుగా ఎందుకు రమ్మన్నావో తెలియడం లేదంటూ’ చిన్న కొడుకు సూర్యం ‘మా అత్తయ్యకి బాగా లేకపోయినా, నీకేదో అయిందని ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టి, ఆయన్ను తీసుకొని హఠాత్తుగా వచ్చేసాను. నువ్వు చూస్తే ఇలా..`అంది కూతురు రమ్య.
వాళ్ల అసహనానికి కారణం రాధమ్మ సెల్ నుండి వచ్చిన వాట్సాప్ మెసేజ్. ‘వెరీ అర్జెంట్. స్టార్ట్ ఇమీడియట్లీ.’ అని. తిరిగి ఫోన్ చేస్తుంటే రాధమ్మ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందోనని కంగారుపడి అందరూ వచ్చేశారు. ‘ఏమైందర్రా! ఎందుకిలా ఆయాసపడుతున్నారు. ముందు మీరు కూర్చోండి. ఇప్పుడే వచ్చారుగా రెస్ట్ తీసుకోండి. సాయంత్రం మాట్లాడుకుందాం’ అంటూ నిమ్మళంగా చెప్పింది రాధమ్మ. ‘లేదమ్మా! మాకంత టైంలేదు. చాలా అర్జెంటు పనులున్నాయి. నువ్వు విషయమేమిటో తొందరగా చెప్తే మంచిది’ అన్న సూర్యం మాటలకు అవునన్నట్టు మిగిలిన వాళ్ళు తలూపారు. ‘ఇది కూడా చాలా ముఖ్యమైన పనే. నా శేష జీవితానికి, మీ ముగ్గురి భవిష్యత్తుకి సంబంధించిన విషయం. మీ అవసరం ఉంది కనుకనే రప్పించాను. ఒక్కరోజు ఓపిక పట్టండి. రేపు పనయ్యాక మీ ఇష్టం’ అంటూ రాధమ్మ స్పష్టంగా చెప్పింది.
రేపు రాధమ్మ చెప్పబోయే ఆ విషయం ఏమైంటుందనే ఆతృత అందరిలోనూ ఎక్కువైంది. అందులోనూ తమ భవిష్యత్తు ఉందని తెలియగానే, అదేదో తేల్చుకొని వెళ్తేనే బాగుంటుందని నిశ్చయించుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక ఫోన్ రాగానే ‘రేపు రిజిస్ట్రేషనుకు
అన్ని ఏర్పాట్లు చేశారుగా. మూడు రిజిస్ట్రేషన్లు వెంటవెంటనే అయిపోవాలి. పిల్లలు వచ్చేసారు. మళ్ళీ మళ్ళీ రావడం అంటే వాళ్లకి ఇబ్బంది. కాబట్టి ఎలాగైనా రేపు పని పూర్తిచేయాలి’ అంటూ లాయర్ పద్మనాభంతో మాట్లాడింది రాధమ్మ. ఫోన్లో తల్లి మాటలను బట్టి ముగ్గురికీ విషయం అర్థమైంది. తమ తండ్రి సంపాదించిన ఆస్తిని ముగ్గురికి వాటాలేసి, రిజిస్ట్రేషన్ కోసం పిలిచి ఉంటుందని అనుకున్నారు. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. తల్లి ఇంత వేగంగా తమ మనసుల్ని అర్థం చేసుకుంటుందని వాళ్ళు ఊహించలేదు. ఆ క్షణంలో రాధమ్మ వాళ్ళకి వరాలిచ్చే దేవతలా కనబడింది. ఆ రాత్రి రాధమ్మ పడుకుందే కానీ ఆలోచనలు ఆమె మెదడు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. తన నిర్ణయం సరైందేనా? లోకం హర్షిస్తుందా? పిల్లలు అర్థం చేసుకుంటారా? ఇలా పరిపరివిధాల మనసు ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంది. మరుసటి రోజు అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీసుకి చేరుకున్నారు.
‘నమస్కారం కృష్ణమూర్తిగారు!’ అంటూ రాధమ్మ పలకరించింది. ‘నమస్తే రాధమ్మ గారు! మీ పిల్లలా’ అన్నాడు కృష్ణమూర్తి. ‘అవునండి’ అంటూ తన వాళ్ళని పరిచయం చేసింది రాధమ్మ. ‘ఈయన ఎవరమ్మా? లాయర్ అంకుల్ ఎందుకు వచ్చారు?’ అంటూ సందేహంగా అడిగాడు సూర్యం. వాళ్ళని కూడా రాధమ్మ తన పిల్లలకు పరిచయం చేసింది. ఇంతలో రిజిస్టర్ మ్యారేజ్ కోసం దరఖాస్తు చేసుకున్న జంటల్ని సిద్ధంగా ఉండమన్న కేక వినిపించింది. మూడు జంటల వివాహా రిజిస్ట్రేషన్ అయిపోయాక, నాలుగో జంటగా ‘రాధమ్మా, కృష్ణమూర్తీ’ అని పిలిచారు. రాధమ్మ, కృష్ణమూర్తి, లాయర్ పద్మనాభం తప్ప మిగిలిన వాళ్లంతా పిడుగుపాటుకు గురైన వాళ్ళలా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. ఒక్క క్షణం వాళ్ళకి ఊపిరి పోయినంత పని అయింది. ‘ఏంటమ్మా ఇది? ఈ వయసులో నీకు పెళ్లా!’ అని పెద్దకొడుకు అంటూండగానే ‘ఇలాంటి ఆలోచనలు ఏంటమ్మా నీకు? ఇందుకేనా మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది’ అంటూ ఊగిపోతున్నాడు చిన్న కొడుకు.
‘నీకేదో అయ్యిందని గాబరాగా వచ్చాం. వచ్చాక విషయం తెలిసి మాకు ఏదో మేలు జరగబోతుందని సంబరపడ్డాం. తీరా చూస్తే ఇప్పుడిది. ఏమీ బాగోలేదమ్మా ఈ వయసులో’ అంటూ చీదరింపు మొహం పెట్టింది కూతురు. అల్లుడు, కోడళ్ళు కూడా తలోమాట అనేసి తమ అననుకూల బాణాలను అత్తగారిపై సంధించారు. ఆ క్షణంలో రాధమ్మకి నవ్వొచ్చింది. అందరూ తన వయసును ప్రశ్నిస్తున్న వారే కానీ, తన వయసుకు ఉండాల్సిన భరోసా గాని, ఆసరా గాని ఎవరైనా ఇస్తున్నారా? మరి ఇప్పుడెందుకిలా నిందిస్తున్నారో తనకు అర్థం కాలేదు. పక్షం కిందట పెద్దోడికి ఫోన్ చేసి ‘గుండెల్లో ఆయాసంగా ఉందిరా. ఒక్కసారి వస్తే హాస్పిటల్ కి వెళ్దాం’ అని పిలవగానే ‘పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నాయమ్మా. నేను లేకపోతే వాళ్ళు చదవరు. సెలవుల్లో చూద్దాములే. అంతకీ నీకు అర్జెంట్ అయితే చిన్నోడిని పిలవ’మంటూ ఉచిత సలహా ఇచ్చాడు. మొన్నటికి మొన్న చిన్నోడికి ఫోన్ చేసి రమ్మంటే ‘నాకు క్షణం తీరిక లేకుండా ఉంది. పని ఒత్తిడితో నలిగిపోతున్నానమ్మా. అయినా అరవయ్యేళ్ల వయసొచ్చాక ఇవన్నీ సహజమే’ అంటూ తేల్చి పారేసాడు.
ఇక వీలైనప్పుడల్లా కూతురికి ఫోన్ చేసి ‘పిల్లలను తీసుకొచ్చి నాలుగు రోజులుండి పోవే. కాస్త సందడిగా ఉంటుంది. ఒక్కదాన్ని ఇంట్లో ఉంటుంటే ఏమీ తోచడం లేదు. పైగా ఏదో ఆందోళనగా ఉంటుంది’ అని చెప్పగానే ‘మా అత్తగారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఈ సమయంలో ఆవిడని వదిలి నేను రాలేనమ్మ. ఇంటి బాధ్యత అంతా నాదే’ అంటూ మొహం చాటేసేది. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో, యాక్సిడెంట్లో భర్త చనిపోయినా వాళ్ళ భవిష్యత్తుకి ఏ ఇబ్బందీ లేకుండా సకాలంలో అన్ని బాధ్యతలు నెరవేర్చింది రాధమ్మ. ఇప్పుడు తన బాధ్యత నెరవేర్చడానికి ఎవరికీ తీరిక దొరకడం లేదు. ఈ మానసిక వేదనతోనే అనుక్షణం రాధమ్మ మనసు అతలాకుతలమైపోతుంది. ఇంతవరకు పిల్లల బాధ్యత వలన తనకెప్పుడూ ఒంటరినన్న భావం కలగలేదు. వాళ్లే తన జీవితమనుకుంది. ఇప్పుడు తన జీవితానికి ఒక తోడు కావలసి వచ్చింది. కష్టంలోనైనా, సుఖంలోనైనా తనతో పాటు ఉండే ఒక మనిషి కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. తల్లి నిర్ణయాన్ని జీర్ణించుకోలేక బయటకు వెళ్ళిపోతున్న
వాళ్ళని లాయర్ పద్మనాభం ఆపాడు.
‘చూడండి! మీ అమ్మగారు ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో కాస్త ఆలోచించండి. ఆమె ఆవేదనను అర్థం చేసుకోకుండా మీరిలా వెళ్లిపోవడం సరికాదంటూ..’ చెప్పబోతుంటే ‘ఇంకా ఏముందని ఇక్కడ ఉండడానికి. ఆవిడ నచ్చినట్లు ఆవిడ చేసుకుంటుంది. ఆవిడకి పిల్లలు అక్కర్లేదు’ అంటూ సూర్యం ఆవేశపడుతున్నాడు. ‘అంకుల్! మూడు రిజిస్ట్రేషన్లు అంటూ మా అమ్మ మీతో ఫోన్లో మాట్లాడిందిగా వాటి సంగతేంటి?’ అని రమ్య అడిగిన ప్రశ్నకు
‘అదా! రాధమ్మ, కృష్ణమూర్తిల వివాహం మొదటి రిజిస్ట్రేషన్. రెండవది మీ నాన్నగారి పేరు మీదగా ఏర్పాటు చేసిన సేవా ట్రస్ట్ కు సంబంధించింది. మూడోది వాళ్ళిద్దరూ కలిసి ఆరేళ్ల పిల్లవాడిని దత్తత తీసుకోవడానికి. ఆ అబ్బాయి ఎవరో కాదు. మీ నాన్న చేసిన యాక్సిడెంట్ లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ’ అంటూ లాయర్ పద్మనాభం జరిగింది చెప్పాడు.
‘చూశారా అంకుల్ మా అమ్మ మా గురించి ఎక్కడా ఆలోచించలేదు’ అన్నారు పిల్లలు.
‘మీరు మీ అమ్మని సరిగా అర్థం చేసుకోవడం లేదు. నిజానికి మీ నాన్న బతికున్నప్పుడు నాకు ఒక వీలునామా రాసిచ్చారు. అందులో ఏముందో తెలుసా? ఒకవేళ అతను ముందే చనిపోతే తన భార్యకు ఎవరు జీవితాంతం ఆసరాగా ఉంటారో వాళ్ళకి ఆస్తి అంతా చెందినట్లు రాశారు. ఒకవేళ ఎవరూ చూడకపోతే ఆస్తి మీద పూర్తి స్వేచ్ఛను తన భార్యకు కల్పించారు. కాబట్టి ఆస్తి గురించి ఆశపడడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి’ అంటూ లాయర్ వారిని సందిగ్ధంలో పడేసాడు. తల్లి ఆవేదనను అర్థం చేసుకున్నాక, అందరూ లోపలికి వెళ్లి తమ అంగీకారం తెలుపుతున్నట్లుగా చిరునవ్వుతో కనిపించారు, కానీ మౌనంగా ఉన్నారు. వాళ్ళ నిశ్శబ్దాన్ని చేధిస్తూ, వాళ్ళ మనసులోని అనుమానపు పొరలు తొలగించాలనే ఉద్దేశ్యంతో రాధమ్మ మాట్లాడడం ప్రారంభించింది.
‘నా స్వార్ధం కోసం మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించండి. నేను తప్పు చేశానన్న భావన మీలో కలగకూడదనే ఉద్దేశ్యంతోనే మిమ్మల్ని ఇక్కడకి రప్పించాను. మీ ఆశల మీద నీళ్లు జల్లానని మీరు అనుకోవచ్చు. కానీ నా జీవితం కూడా నాకు ముఖ్యమే కదా! ఈ మధ్య నేను మార్కెట్ కి వెళ్తూ రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి ఉన్నప్పుడు.. ఈ కృష్ణమూర్తి గారే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి, దగ్గరుండి అన్ని సేవలూ చేశారు. అలా వారి పరిచయం నాకు ప్రశాంతతను ఇచ్చింది. వారి మాటల్లో, చేతల్లో స్వచ్ఛత కనిపించింది నాకు. ఇక ఆస్తి కోసమే కృష్ణమూర్తిగారు నన్ను పెళ్లి చేసుకుంటున్నారని మీరు అనుకోవచ్చు. అది నిజం కాదు. మన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా, కేవలం తన దగ్గరున్న డబ్బుతోనే మీ నాన్నగారి పేరిట సేవా ట్రస్టుని ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. “కలిసి పనిచేద్దాం. కలిసి జీవిద్దాం” అన్న ఆయన మాటలు నాలో కొత్త ఆశల్ని రేకెత్తించాయి. నాకొక కొత్త జీవితాన్ని చూపించాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నేను మీకు అన్యాయం చెయ్యడం లేదు. నా తదనంతరం మీ తండ్రి ఆస్తిని నాలుగు వాటాలేసి, మూడు వాటాలు మీ ముగ్గురికి, ఒక వాటా ఈ అబ్బాయికి చెందినట్లు వీలునామా రాయించాను. ఇప్పటికీ నేను చేసింది తప్పని భావిస్తే, మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు.’ అంటూ గద్గద స్వరంతో మాట్లాడింది. అందరికీ రాధమ్మ మనసు అర్థమైంది. కూతురు అమాంతంగా తల్లిని కావలించుకొని ఏడ్చేసింది. కొడుకులిద్దరూ కుడి భుజం, ఎడమ భుజమై రాధమ్మ పక్కన నిల్చున్నారు. ఏం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న ఆరేళ్ల పిల్లవాడిని చూస్తూ ‘కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకంటే వీడే మరి’ అన్న లాయరు పద్మనాభం మాటలతో అక్కడ నవ్వుల హరివిల్లు విరబూసింది.
డాక్టర్ బొద్దూరు విజయేశ్వర రావు
9499544551








కామెంట్‌లు (0)