పిల్లలు అల్లరి చేయడం, మాట వినకపోవడం సహజం. కానీ చాలామంది తల్లిదండ్రులు ఓపిక కోల్పోయి పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. పిల్లల్ని కొడితేనే వారు మంచి దారిలోకి వస్తారని, మాట వింటారని అనుకోవడం పొరపాటు. నిరంతరం కొట్టడం, తిట్టడం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం తగ్గి, వారు భయం లేదా మరింత మొండితనం పెంచుకునే అవకాశం ఉంది. తిట్టి, కొట్టి పెంచితే పిల్లలు పిరికివారిగా, ఏం సాధించలేనివారిగా మారతారు. అందుకే కొట్టకుండానే పిల్లలను క్రమశిక్షణతో పెంచే మార్గాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పిల్లల మాట వినండి, అర్థం చేసుకోండి. చాలామంది తల్లిదండ్రులు తమ మాటకే ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు చెప్పేది వినరు. పిల్లలు చెప్పే మాటలను మధ్యలో ఆపకుండా పూర్తిగా వినాలి. వారు చెప్పేది పూర్తిగా విని, వెంటనే అరవకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, పిల్లలు మీ దగ్గర సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. ఇది వారిలో విశ్వాసాన్ని పెంచుతుంది.
కోపం వచ్చినా కౌగిలించుకోండి..
మీ పిల్లలు చేసే పనులకు మీకు పట్టరాని కోపం వచ్చినా, తిట్టడానికి, కొట్టడానికి బదులుగా వారిని కౌగిలించుకోండి. లేదా కాసేపు గ్యాప్ తీసుకోండి. పిల్లల్ని తరచుగా కొడితే వారు మీ మాట అసలే వినరు. మీరంటే ప్రేమ తగ్గుతుంది. ఇది మీ పిల్లల్ని మిమ్మల్ని దూరం చేస్తుంది.
ప్రేమతో హద్దులు పెట్టండి..
పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడటానికి కొందరు తల్లిదండ్రులు వారిని బయటకు వెళ్లనివ్వరు. కానీ ప్రేమతో హద్దులు పెట్టడం మంచిది. “ఇది చేయకు” అని చెప్పే బదులు “ఇలా చేయి” అని సానుకూలంగా చెప్పాలి. ఉదాహరణకు “కుర్చీ మీద నిలబడకు” అనే బదులు “కుర్చీలు కూర్చోవడానికి” అని చెప్పండి.
మంచి పనులను ప్రశంసించండి..
పిల్లలు చేసే మంచి పనులను గుర్తించి వారిని ప్రశంసించడం చాలా ముఖ్యం. హోంవర్క్ సమయానికి పూర్తి చేయడం, సహాయం చేయడం లేదా నిజం చెప్పడం లాంటి పనులు చేసినప్పుడు “నువ్వు గొప్ప పని చేసావు” అని చెప్పాలి. ఇలాంటి మాటలు పిల్లల మనసులో లోతైన ముద్ర వేస్తాయి. తల్లిదండ్రుల ప్రశంస పిల్లల్లో సానుకూల ప్రవర్తనను పెంపొందిస్తుంది.
పిల్లలను బలవంతం చేయకండి..

పిల్లలను బలవంతం చేయకుండా, వారు స్వయంగా అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఉదాహరణకు, బయట చలిగా ఉన్నప్పుడు స్వెటర్ వేసుకోమని బలవంతం చేయకుండా, “ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది, నువ్వే నిర్ణయం తీసుకో” అని చెప్పవచ్చు.
పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వండి..
తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుండే స్వయం సమృద్ధిగా ఎదిగేలా చూసుకోవాలి. వారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడం ముఖ్యం. పిల్లల చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా ఉండేలా చూసుకోవడంతో పాటు, వారికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కూడా అంతే అవసరం.
శిక్షించే బదులు పరిణామాలు చూపించండి..
పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించే బదులు, ఆ తప్పు వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూపించడం మంచిది. తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడానికి ప్రేమ, ఓర్పు, అవగాహనతో మార్గనిర్దేశం చేయాలి.
పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా క్రమశిక్షణతో పెంచడం సాధ్యమే. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పిల్లలను క్రమశిక్షణలో పెట్టొచ్చు. ప్రేమ, ఓర్పు, అవగాహనతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే వారు బాధ్యతను నేర్చుకుంటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల నుండి ప్రేమ, గౌరవం పొందాలని కోరుకుంటారు. కొట్టడం, తిట్టడం కంటే ప్రేమతో నేర్పించడమే గొప్ప పేరెంటింగ్.








కామెంట్‌లు (0)