ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎలినినో ...

1 గంట క్రితం

El Niño ...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 11:54 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఎలినినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఒక సహజ వాతావరణ మార్పు! సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగం (ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దగ్గర) వేడిగా ఉండగా, తూర్పు భాగం (దక్షిణ అమెరికా తీరం దగ్గర) చల్లగా ఉంటుంది. కానీ ఎలినినో సమయంలో ఈ క్రమం తారుమారవుతుంది. సముద్రంలోని వేడి నీరు తూర్పు దిక్కుగా (దక్షిణ అమెరికా తీరం వైపు) విస్తరిస్తుంది, దాంతో ఆ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చేస్తుంది. భారతదేశంలో దీని ప్రభావం వల్ల తరచుగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి, ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. స్పానిష్ భాషలో ఎలినినో అంటే 'చిన్న పిల్లవాడు' అని అర్థం. ఎందుకంటే ఇది సాధారణంగా క్రిస్మస్ సమయంలో ప్రారంభమవుతుంది.

​ దక్షిణ అమెరికా తీరంలో సాధారణంగా అధిక పీడనం, ఆస్ట్రేలియా-ఇండోనేషియా ప్రాంతంలో తక్కువ పీడనం ఉండటం వల్ల 'వాణిజ్య పవనాలు' (ట్రేడ్ విండ్స్) అనే బలమైన గాలులు పశ్చిమం వైపు (ఆస్ట్రేలియా వైపు) ఎప్పుడూ వీస్తుంటాయి. ఈ గాలులు సముద్రంలోని వేడి ఉపరితల నీటిని ఆస్ట్రేలియా వైపుకు నెట్టేస్తాయి. ఫలితంగా దక్షిణ అమెరికా తీరంలో ఆ వేడి నీరు దూరంగా జరగడంతో, అక్కడ సముద్రం అడుగు నుంచి చల్లని నీరు పైకి లేస్తుంది (దీన్ని అప్వెల్లింగ్ అంటారు). ఇలా ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది.


ఏం జరుగుతుందంటే...

ఇప్పుడు ఎలినినో ఏర్పడేటప్పుడు ఏం జరుగుతుందంటే... ఈ వాణిజ్య పవనాలు అకస్మాత్తుగా బలహీనపడతాయి. కొన్నిసార్లు అవి పూర్తిగా నిలిచిపోతాయి లేదా దిశ మార్చుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, సముద్రం, వాతావరణంలో పీడన వ్యత్యాసాలు ఒక్కసారిగా సమతుల్యం కోల్పోతాయి. ఈ బలహీనమైన గాలులు ఇకపై ఆస్ట్రేలియా దగ్గర వేడి నీటిని పట్టుకోలేకపోతాయి. దాంతో పశ్చిమాన (ఆస్ట్రేలియా) పేరుకుపోయిన ఆ వేడి నీరు, గురుత్వాకర్షణ ప్రభావంతో తిరిగి తూర్పు దిక్కుగా (దక్షిణ అమెరికా వైపు) ప్రవహించడం మొదలుపెడుతుంది. ఈ ప్రవాహాన్ని 'కెల్విన్ తరంగాలు' అనే అంతర్జల తరంగాలు మరింత వేగవంతం చేస్తాయి.

ఆ వేడి నీరు దక్షిణ అమెరికా తీరాన్ని చేరుకోగానే, అక్కడ సాధారణంగా జరిగే చల్లటి నీటి పైకి రావడం (అప్వెల్లింగ్) ఆగిపోతుంది. ఫలితంగా ఆ ప్రాంతపు సముద్ర ఉపరితలం వేడెక్కిపోతుంది. ఈ వేడి సముద్రం పైన ఉన్న గాలిని కూడా వేడి చేస్తుంది. వేడి గాలి పైకి లేస్తుంది, దాంతో ఆ ప్రాంతంలో తక్కువ పీడనం ఏర్పడి భారీ వర్షాలు, వరదలు వస్తాయి (దక్షిణ అమెరికాలో). అదే సమయంలో, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా ప్రాంతంలో గాలి కిందికి దిగడం వల్ల అక్కడ పొడి వాతావరణం, తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. సముద్రం, వాతావరణం మధ్య ఈ పరస్పర చర్య ఒకదానికొకటి మరింత బలపరచుకోవడం (ఫీడ్ బ్యాక్ లూప్) వల్ల ఎలినినో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది. ఇది సరిగ్గా నిర్ణీత కాలం లేదు, సుమారు ప్రతి రెండు నుండి ఏడేళ్లకు ఒకసారి సంభవిస్తుంది. సాధారణంగా తొమ్మిది నుండి 12 నెలల పాటు కొనసాగుతుంది.


ఆంధ్రప్రదేశ్ లో..

​ ఎలినినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది 'వాకర్ సర్క్యులేషన్' అనే వాతావరణ ప్రసరణను బలహీనపరుస్తుంది. దీని వల్ల హిందూ మహాసముద్రం పైన గాలి కిందికి దిగి, మేఘాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు తీసుకువచ్చే నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఉదా: తీరప్రాంత జిల్లాలు: బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలులు సగానికి తగ్గిపోతాయని అంచనా. దీంతో మొత్తం వర్షపాతం తగ్గడమే కాకుండా, భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య కూడా తగ్గి, నేల ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రాయలసీమ ప్రాంతం: ఇప్పటికే కరువు బాధిత ప్రాంతమైన అనంతపురం జిల్లా ఎలినినో ప్రభావానికి చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షాలు తగ్గడం వల్ల పంటల సాగు, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎలినినో కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వర్షపాతం లోటు నమోదవుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్