హరితారణ్యానికి రాజు కేసరి అనే సింహం. దానికి మంత్రి హస్తి అనే ఏనుగు. హస్తి బాగా ముసలిది అయ్యాక కేసరిని అనుమతి అడిగి, విశ్రాంతి తీసుకోసాగింది. అడవిలో బాగా తెలివైన వారెవరా అని ఆలోచించి కేసరి ఎలుగుబంటిని తనమంత్రిగా నియమించుకుంది. ఎలుగుబంటిని మంత్రిగా నియమించుకున్నప్పటి నుండి దానిమీద మిగిలిన అడవి జంతువులకంతా అసూయ ఎక్కువ యిపోయింది.
ఒకరోజు తోడేలు కేసరిని కలిసి,
'మహారాజా! పోయి పోయి ఎలుగుబంటిని మంత్రిగా చేసుకున్నారే! అదొక వికారి. ఒళ్ళంతా వెంట్రుకలే!’ అన్నది.
ఆ విషయం కేసరి, ఎలుగుబంటితో అన్నది. ఎలుగుబంటి ఆశ్చర్యపోయింది. తోడేలు తనకు బాల్యమిత్రుడు. అతడే తనను అలా అన్నాడే అని బాధపడింది. తర్వాత కొద్దిరోజులకు కుందేలు కేసరిని కలిసి ‘రాజా! మీరేమిటీ? ఎవరూ దొరకనట్టు ఎలుగుబంటిని మంత్రిగా పెట్టుకున్నారు. జాగ్రత్త!. సమయం చూసి ముంచేయగలదు’ అన్నది. ఆ మాట కేసరి ఎలుగుబంటితో అన్నది ‘అరే ఏమిటీ? కుందేలు అలా అన్నదా? కనపడగానే ‘‘ఎలుగు మామా’’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుందే' అని ఎలుగుబంటి బాధపడింది.
తర్వాత జింక కేసరిని కలిసి, ‘ప్రభూ! జాగ్రత్త! ఎలుగుబంటి అసలే మంచి జంతువుకాదు’ అన్నది. ఈ విషయం కూడా కేసరి ఎలుగుబంటితో చెప్పింది. ఎలుగుబంటి బాధ అంతా ఇంతా కాదు. తనను జింక చూసినప్పుడల్లా ‘‘అన్నా..’’ అంటూ ఆప్యాయత చూపిస్తుంది. అలాంటి జింకే ఇలా అన్నదంటే ఏమనుకోవాలి? అనుకుంటూ కనిపించిన జంతువుకల్లా తోడేలు, కుందేలు, జింక చేసిన పని చెప్పి బాధపడసాగింది.
ఆ సంగతి హస్తి ఏనుగుకి తెలిసింది. ఎలుగుబంటిని కలిసింది. ‘ఎంత మనకు దగ్గరవారయినా మనకు ఏదైనా గొప్ప మేలు జరిగినపుడు అసూయపడడం సహజం. ఆ అసూయ ద్వేషాన్ని కలిగించి, చెడుగా మాట్లాడేటట్టు చేస్తుంది. అది విని మనం బాధపడకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంతే తప్పా.. వారి మాటలు గురించి ఆలోచించి, మనసు పాడు చేసుకోకూడదు. అంతలో అక్కడకు వచ్చింది కేసరి సింహం. ‘ఈ విషయం తెలియజేయడానికే నిన్ను ఎవరేమన్నా వెంటనే నీకు చెప్పాను. మన పనే.. వాటి విమర్శలకు సమాధానం చెబుతుంది’ అన్నది కేసరి. మంచి పాఠం నేర్చుకున్నానని ఎలుగుబంటి సంతోషించింది.
డా. గంగిశెట్టి శివకుమార్
9441895343







కామెంట్‌లు (0)