హాయ్ ఫ్రెండ్స్!
నాకు చిన్నప్పటి నుంచే నాట్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యంలో నృత్యరీతుల్లోని హావభావాలు, అభినయం, అడుగులు, ముద్రలు సంగీతానికి అనుగుణంగా అనునయించటం అంటే నాకు మరింత ఇష్టం. సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నాట్యం చేయడం నాలో ప్రత్యేకత.
నేను నాట్య ప్రదర్శన ఇచ్చే ప్రతిసారీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వేదికపైకి వెళ్లే ముందు కొంచెం కంగారుగా అనిపించినా, సంగీతం మొదలైన వెంటనే నాట్యంపై దృష్టి పెడతాను. నేర్చుకున్న అడుగులను, హావభావాలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన ఇస్తాను. ప్రేక్షకులు చప్పట్లతో అభినందించినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. ఆ ప్రశంసలు నాట్యంపై నా ఆసక్తిని మరింత పెంచుతాయి. ప్రతి ప్రదర్శన నాకు కొత్త అనుభవాన్ని, మరింత బాగా నేర్చుకోవాలనే స్ఫూర్తిని ఇస్తుంది.
భరతనాట్యం కేవలం వినోదం కోసం చేసే కళ మాత్రమే కాదు. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ గాథలను అభినయం ద్వారా తెలియజేసే గొప్ప కళారూపం. ఈ కళను నేర్చుకోవడం వల్ల మన సంప్రదాయాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. భరతనాట్యంలో మరిన్ని మెళకువలు నేర్చుకొని, నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నాను.
భవిష్యత్తులో మంచి నాట్యకారిణిగా ఎదిగి, వివిధ నాట్యరీతుల ప్రత్యేకతలను అందరికీ తెలియజేయాలనేది నా ఆశయం. భరతనాట్య ఔన్నత్యాన్ని మరింతగా పెంచుతూ, మన భారతీయ కళా సంపదకు గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
మీరు కూడా చదువుతోపాటు మీకు ఇష్టమైన కళలను నేర్చుకోండి. మన సంప్రదాయ కళలను గౌరవిస్తూ, వాటిని భావితరాలకు అందించే ప్రయత్నం చేద్దాం!
ఈ రచనకు సహకారం అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు గుడిపూడి సత్యనారాయణ, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుర్లపాటి నగేష్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పి. అక్షయ,
ఇంటర్ మొదటి సంవత్సరం,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మందడం, తుళ్లూరు మండలం,
గుంటూరు జిల్లా.







కామెంట్‌లు (0)