హాయ్ ఫ్రెండ్స్
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి ‘శనివారం.. నో బ్యాగ్ డే’గా పాటిస్తుండటం మా కెంతో ఆనందంగా ఉంది. ఆరోజున మేము బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్రతిరోజూ నిర్వహించే తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహిస్తుండటంతో మేమంతా ఆసక్తిగా పాల్గొంటున్నాం. కొత్తదనం ఉండేలా క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, వృత్తి విద్య అంశాలపై అవగాహన, క్రీడలు, రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు లాంటివి నిర్వహిస్తుండటం చాలా బాగుంది. రోజంతా చేతిపనులు, ఆటలు, చిత్రలేఖనం లేదా జట్టు వ్యాయామాలు వంటి కార్యకలాపాలకు కేటాయించటం కూడా మరో కొత్త అనుభూతి. మాలో కొందరు మట్టితో బొమ్మలు లేదా విత్తనపు ఉండలు తయారుచేస్తుండగా, ఇంకొందరం కాగితాన్ని కత్తిరించి బొమ్మలు, పడవలు, కాగితపు పూలగుత్తులు తయారుచేస్తున్నాం. మా జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు గారు ‘నో బ్యాగ్ డే’ సందర్భంగా కలర్ పేపర్ తో కుందేలు ఫింగర్ పప్పెట్లను మా అందరి చేత తయారు చేయించారు. వీటిని ఉపయోగించి మేము కథలను కూడా చెప్పడం జరిగింది.
-కొంజెర్ల అక్షర, 6వ తరగతి, చెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,
గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా.








కామెంట్‌లు (0)