సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్లాస్టిక్‌ రహితంగా.. పర్యావరణ హితంగా!

20 సెప్టెంబర్, 2026

WhatsApp Image 2026-09-15 at 12.16.33 PM(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 07:47 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వినాయకచవితి పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి మా స్కూల్లో వినాయకచవితి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నాం. పూజలతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలనే మంచి సందేశాన్ని కూడా అందరికీ తెలియజేశాం. వినాయకచవితి సందర్భంగా మా స్కూలు ఆవరణను పూలు, ఆకులు, సహజసిద్ధమైన అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ పూలు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను ఉపయోగించలేదు. బదులుగా పూలు, మామిడి ఆకులు, కొబ్బరి ఆకులు, కాగితంతో చేసిన అలంకరణలను ఉపయోగించారు. మా స్కూలు చాలా అందంగా కనిపించింది. మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినమ్రంగా పూజలు నిర్వహించాం. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, పండ్లు, పూలతో నైవేద్యం సమర్పించాం. పూజ కార్యక్రమంలో మా కరస్పాండెంట్‌ వల్లభనేని మురళీకృష్ణ గారూ, ప్రిన్సిపాల్‌ వల్లభనేని నాగలక్ష్మి గారూ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ఆనందంగా నినాదాలు చేశాం. పూజ అనంతరం అందరికీ ప్రసాదం అందించారు. మా టీచర్లు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి మాకు వివరించారు. ప్లాస్టిక్‌ వల్ల ప్రకృతికి కలిగే నష్టాన్ని చెప్పారు. పండుగల సమయంలో కూడా ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ప్రకృతికి మేలు చేసే వస్తువులను ఉపయోగించాలని సూచించారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. పూజలో ఉపయోగించిన పూలు, ఆకులు వంటి సహజ పదార్థాలను వృథాగా పడేయకుండా వాటిని సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ప్రసాదాన్ని కూడా ప్లాస్టిక్‌ కవర్లలో ఇవ్వకుండా పర్యావరణహితమైన పద్ధతిలో అందించారు. మేము కూడా ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగించకూడదని, బయటకు వెళ్లినప్పుడు వస్త్ర సంచులను ఉపయోగించాలని తెలుసుకున్నాం. వినాయకచవితి అంటే కేవలం పూజలు, పండుగ సంబరాలే కాదు.. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అని ఈ వేడుకల ద్వారా మాకు అర్థమైంది. మా స్కూల్లో ప్లాస్టిక్‌ రహితంగా, పర్యావరణ హితంగా జరిగిన వినాయకచవితి వేడుకలు నాకు చాలా నచ్చాయి. ప్రతి పండుగను ఇలాగే ప్రకృతికి మేలు చేసే విధంగా జరుపుకుంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

​పర్యావరణాన్ని కాపాడుతూ.. పచ్చని భవిష్యత్తు కోసం మనమంతా ముందుకు సాగుదాం!

- ఐ. ఇప్సిక

2వ తరగతి, బచపన్‌ ప్లే స్కూలు,

తాడేపల్లి, గుంటూరు జిల్లా.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్