mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'గేదె' మన తల్లి !

2 గంటల క్రితం

gede mana talli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్ నేస్తాలూ! మనకు స్కూల్లో తెలుగు పీరియడ్ అనగానే గుర్తొచ్చే కొన్ని రొటీన్ విషయాలు ఉన్నాయి కదా? వాటిలో మొదటిది—'ఆవు వ్యాసం'. "ఆవుకు నాలుగు కాళ్లు ఉంటాయి, రెండు కొమ్ములు ఉంటాయి, అది మనకు పాలు ఇస్తుంది, ఆవు మనకు తల్లి లాంటిది..." చిన్నప్పటి నుంచి మనమంతా ఇదే బట్టీ పట్టి రాస్తున్నాం. కానీ, రోజువారీ జీవితాన్ని కొంచెం శాస్త్రీయంగా పరిశీలిస్తే నాకో అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్నే నా వ్యాసంలో రాస్తే మా తెలుగు టీచర్‌కు పాపం, కోపం వచ్చేసింది! ఇంతకీ నేనేం రాశానో తెలుసా ?

నాకు ఆవు అంటే ఇష్టమే, కానీ మా ఇంట్లో ఉండే గేదె (బర్రె) అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, గేదె ఇచ్చే పాలు చాలా చిక్కగా, రుచిగా ఉంటాయి. అందులో వెన్న శాతం ఎక్కువ, మనకు బలాన్నిచ్చే పోషకాలూ ఎక్కువే. అలాంటప్పుడు, అందరూ ఆవును మాత్రమే 'గోమాత' (తల్లి) అని ఎందుకు అంటారు? నాకైతే ఆవు మా 'పిన్ని' లాగా, నిత్యం మనల్ని పాలు ఇచ్చే గేదె మా 'కన్నతల్లి' లాగా కనిపిస్తుంది!" అని రాశాను._

నేస్తాలూ, ఒక సైన్స్ విద్యార్థిగా మనమంతా ఇలా ఆలోచించాలి. జీవశాస్త్రం ప్రకారం చూస్తే ఆవుకు ఉన్నట్లే గేదెకు కూడా రెండు కొమ్ములు, రెండు చెవులు, నాలుగు కాళ్లు ఉంటాయి. రెండూ మనకు పాలిచ్చే సాధు జంతువులే. మరి, ఎప్పుడూ ఆవు గురించే ఎందుకు వ్యాసం రాయాలి? గేదె గురించి ఎందుకు అడగరు?

కేవలం ఆవు తెల్లగా ఉందని దానికి ఎక్కువ మార్కులు ఇచ్చి, గేదె నల్లగా ఉందని దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా వెనక్కి నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? రంగును బట్టి కాకుండా, అది మనకు ఇచ్చే మేలును బట్టి కదా మనం దేనికైనా విలువ ఇవ్వాలి! రూపం నల్లదైనా, గేదె ఇచ్చే పాలు తెల్లనివి, అమృతంతో సమానమైనవి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మూస పద్ధతిలో కాకుండా, కాస్త తార్కికంగా, శాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేసుకుందాం. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత గుణమే గొప్పదని నమ్మే నా ఈ వ్యాసం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరేమంటారు నేస్తాలూ ?


pravallika


- ప్రవళి వెలుగు

8వ తరగతి,

జెడ్పిహెచ్ఎస్, బీర్పూర్,_

జగిత్యాల జిల్లా,

తెలంగాణ._


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్