మా పాఠశాలలో చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన మెళకువలు నేర్పిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. మేము ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో ముందుకు సాగితే భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతామని గుర్తించాం. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు వంటివి కూడా వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని తెలుసుకున్నాం. నాయకత్వం అంటే పదవి కాదు. బాధ్యత అని తెలుసుకున్నాం. మా కళాశాలలో ఇటీవల జరిగిన సమావేశంలో ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ విద్యాసాగర్ మాట్లాడుతూ ‘నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని ఓటమిని భయపడకండి, అవకాశాలను అన్వేషించండి, భిన్నాభిప్రాయాలను గౌరవించండి, అందరితో కలిసి పనిచేయండి’ అంటూ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మేము మా సహ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలనేది నేర్చు,కున్నాం. మా పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుంటాం. క్రమశిక్షణ, వినయం, సమయపాలన విద్యార్థి జీవితానికి బలమైన పునాది వేస్తాయని పాఠశాల సెక్రటరీ డి.సుజాత, ప్రిన్సిపాల్ పి.హారిక ఇచ్చిన సందేశం మాకెంతో ఆదర్శప్రాయంగా నిలిచింది. చదువులోనూ, జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించటానికి కృషిచేస్తాం. విద్యార్థి మండలి నాయకుల ఎన్నికలలో భాగంగా స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్లెన్లను ఎన్నుకుని వారిచేత ప్రమాణ స్వీకారం చేయించి, బ్యాడ్జీలు అందజేశారు. మాతోటి విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, మార్చ్ ఫాస్ట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, స్కూల్ ట్రెజరర్ ఎం.వరప్రసాద్, కమిటీ సభ్యులు బి.వి.బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొని మమ్మల్ని అభినందించటం బాగుంది.
-బూదాడ ధనుష్, స్కూల్ హెడ్ బాయ్,
వి.దీక్షిత, హెడ్ గర్ల్
చిట్టూరి హైస్కూల్,
గాంధీనగర్, విజయవాడ.








కామెంట్‌లు (0)