ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తరుణోపాయం !

1 గంట క్రితం

balala katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:26 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఒక పచ్చని గ్రామం. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య నుంచి ప్రవహించే చిన్న ఏరు. ఆ గ్రామంలో కృష్ణ అనే పది సంవత్సరాల బాలుడు ఉండేవాడు. అతని తండ్రి రామయ్య కష్టపడే రైతు, తల్లి సీత గృహిణి. స్కూలు వదలగానే తోటల్లో తిరగడం, పక్షుల కిలకిలరావాలు వినడం, చెరువులో చేపలు ఎలా ఈదుతున్నాయో గమనించడం, రాలిపడిన ఆకుల ఆకారాలను సేకరించడం అతనికి అలవాటు. కానీ, ఆ ఏడాది గ్రామానికి ఒక పెద్ద కష్టం వచ్చింది. ఊరి నడిబొడ్డున ఉన్న, అందరి దాహార్తిని తీర్చే పెద్ద బావిలో నీటి మట్టం అడుగంటిపోసాగింది. ఊట రావడం పూర్తిగా తగ్గిపోయింది. వర్షాలు పడుతున్నా బావి ఎండిపోతుండటం చూసి ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర కూర్చొని, ‘ఇది అనావృష్టి లక్షణం.. గ్రామానికి ఏదో కీడు జరుగుతుంది’ అని చింతించసాగారు.

‘నాన్నా, బావి చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేసారు కదా! చెట్లు లేకపోతే వర్షం నీటిని నేల పట్టుకోలేదు. ఆ నీరంతా కొట్టుకుపోతుందే కానీ, భూమిలోకి ఇంకదని మా సైన్స్ టీచర్ చెప్పారు. బావి ఎండిపోవడానికి కారణం అదే నాన్నా!’ అని కృష్ణ వాళ్ళ నాన్నతో అన్నాడు.

‘నువ్వు చిన్నపిల్లవాడివి కృష్ణా! నీకిదంతా తెలియదులే. చెట్లకు, బావిలో నీళ్లకు ఏం సంబంధం? వర్షాలు సరిగ్గా పడక అలా జరుగుతోంది. వెళ్లి చదువుకో పో’ అంటూ కొట్టిపారేసాడు. నాన్న మాటలకు కృష్ణ నిరుత్సాహపడలేదు. తన మాటల్లోని నిజాయితీని ఊరి జనానికి ఎలాగైనా నిరూపించాలనుకున్నాడు. రెండు ఒకే పరిమాణం ఉన్న ప్లాస్టిక్ బకెట్లు తీసుకున్నాడు. మొదటి బకెట్‌లో కేవలం ఎండిన మట్టిని మాత్రమే నింపాడు.

రెండవ బకెట్‌లో మట్టి పోసి, అందులో దట్టంగా చిన్న చిన్న గడ్డి మొక్కలు, వేర్లతో కూడిన చిన్న మొక్కలు నాటాడు. రెండు బకెట్లను ఇంటి ముందరి ఖాళీ స్థలంలో ఉంచాడు. అప్పుడే ఆకాశానికి మబ్బులు పట్టి, వర్షం ప్రారంభమైంది. రెండు బకెట్లపైనా ఒకే పరిమాణంలో వర్షపు నీరు పడింది. కృష్ణ ఆసక్తిగా గమనిస్తూ నిలబడ్డాడు. గంట తర్వాత వర్షం వెలిసింది.

కృష్ణ ఆ రెండు బకెట్లను తీసుకుని నేరుగా *రచ్చబండ వైపు వెళ్లాడు. అక్కడ ఊరి పెద్దలు, వాళ్ళ నాన్న అందరూ కూర్చొని ఉన్నారు. కృష్ణ అందరిముందు ఆ రెండు బకెట్లను బోర్లించాడు. ఫలితం చూసి అందరూ ఆశ్చర్యపోయారు!

మొక్కలు లేని మొదటి బకెట్‌లోని మట్టి అంతా నీటితో కలిసి బురదగా మారి, నీరంతా పైనుంచి *వెలుపలికి కారిపోయింది. మట్టి గట్టిగా అయిపోయింది. కానీ, మొక్కలు ఉన్న రెండవ బకెట్లో నీరు అస్సలు బయటకు రాలేదు. ఆ నీటినంతటినీ మొక్కల వేర్లు, మట్టి కలిసి లోపలికి పీల్చేసుకున్నాయి. మట్టి ఇంకా తేమగా, పొడిపొడిగా ఉంది.

‘చూసారా! చెట్లు లేని చోట నీరు నేల మీద నిలవదు, కొట్టుకుపోతుంది. అదే చెట్లు ఉంటే, వాటి వేర్లు నీటిని పట్టి ఉంచి, నేలలోకి ఇంకేలా చేస్తాయి. మనం బావి చుట్టూ ఉన్న చెట్లను కొట్టేయడం వల్లే, వాన నీరు భూమిలోకి వెళ్లకుండా వృథాగా పోతోంది. అందుకే బావిలో ఊట తగ్గింది.’ అన్నాడు కృష్ణ. చిన్న బాలుడు శాస్త్రీయంగా చూపించిన ఈ ప్రయోగానికి గ్రామస్తుల కళ్లు తెరుచుకున్నాయి. రామయ్య కొడుకు తెలివికి గర్వంతో ఉప్పొంగిపోయాడు. గ్రామ పెద్దలు వెంటనే స్పందించి, బావి చుట్టూ వేప, రావి, జువ్విలాంటి సుమారు యాభై చిన్న మొక్కలు నాటారు. అయితే, ఆ చిన్న మొక్కలకు రోజూ నీళ్లు పోసి కాపాడటం ఎలా అనే ప్రశ్న వచ్చింది.

దానికి కూడా కృష్ణ ఒక 'తరుణోపాయం' ఆలోచించాడు. అతను తన స్నేహితులందరితో కలిసి ఊరిలో పారేసిన పాత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సేకరించాడు. ఆ బాటిళ్ల మూతలకు సన్నని రంధ్రాలు చేసాడు. వాటిలో నీరు నింపి, తలకిందులుగా ప్రతి మొక్క పక్కన మట్టిలో పాతారు. దీనివల్ల 'డ్రిప్ ఇరిగేషన్' పద్ధతిలో నీరు వృథా కాకుండా, బొట్టు బొట్టుగా నేరుగా మొక్క వేర్లకే అందుతుంది. కృష్ణ బృందం రోజుకు ఒక్కసారి ఆ బాటిళ్లలో నీళ్ళు నింపుతున్నారు.

గ్రామస్తుల శ్రమ, కృష్ణ ఉపాయం వృథా పోలేదు. రెండు వారాలు గడిచేసరికి ఆ యాభై మొక్కలు పచ్చని చిగుళ్లతో కళకళలాడటం ప్రారంభించాయి. ఆశ్చర్యకరంగా, భూమిలో తేమ పెరగడంతో బావిలో నీటి మట్టం క్రమక్రమంగా పైకి రావడం మొదలైంది! చెట్ల వేర్లు నేలను సడలించి, భూగర్భ జలాలు పెరగడానికి దారి చూపించాయి. ఎండిపోతుందనుకున్న బావి మళ్లీ నిండు కుండలా మారింది. గ్రామ పెద్దలు కృష్ణను భుజాల మీదకెత్తుకుని మెచ్చుకున్నారు. ఒక చిన్నారి పర్యావరణ స్పృహ, ప్రకృతిపై ఉన్న ప్రేమ ఒక ఊరి దాహాన్ని తీర్చి, ఆ గ్రామానికి కొత్త జీవాన్ని పోసాయి.

కె.వి. సుమలత

9492656255

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్