ఒక అడవిలో అకస్మాత్తుగా అందరికీ జబ్బులు మొదలయ్యాయి. చిలుకలు రెక్కలు కొట్టలేకపోతున్నాయి. ఏనుగులకు కడుపునొప్పి, కుందేళ్లు నీరసంగా పడుకున్నాయి. కోతులు కూడా చెట్టు ఎక్కడం మానేశాయి. మృగరాజు సింహం కంగారు పడింది. ‘ఏమైంది మన అడవికి? ఒకేసారి జీవులన్నీ ఇలా అయిపోతున్నాయి?’ అని అడవి వైద్యుడు ఎలుగుబంటిని అడిగింది.
ఎలుగుబంటి పరీక్ష చేసి ‘మృగరాజా! ఈ రోగాలకు కారణం కలుషితమైన నీరు. మన అడవి మధ్యలో ఉన్న పెద్ద కొలనులోకి విషపదార్థాలు కలిసిపోతున్నాయి. మనం తాగే నీరే విషం అయిపోతోంది. ఇది ఇలాగే ఉంటే మన మనుగడకే ముప్పు!’ అని చెప్పింది.
మృగరాజు ‘ఎక్కడి నుండి వస్తోంది ఆ విషం? వెంటనే కనిపెట్టండి!’ అని ఆజ్ఞ జారీ చేసింది.
మృగరాజు తన గూఢచారులు చిలుక, కోతులను పిలిచి ‘కొలనులోకి వచ్చే నీటి దారిని వెతకండి’ అంది. కొలను వెనుక ఉన్న చిన్న వాగు వెంట కోతి, చిలుక వెళ్లాయి. వాగు పైకి వెళ్లే కొద్దీ నీళ్లు నల్లగా, నురగతో కనిపించాయి.
అడవి బయట ఉన్న ఒక చిన్న సబ్బుల కర్మాగారం నుండి వచ్చే మురికినీళ్లు నేరుగా వాగులోకి వదులుతున్నారు. అలాగే అడవిలో కూడా కొన్ని జంతువులు కొలను గట్టునే మలమూత్రాలు వదలడం, చనిపోయిన జంతువులను నీళ్లలోకి తోయడం, కోతులు గ్రామాల్లోకి వెళ్లి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, సీసాలు కొలనులో పడేయడం కూడా జల కాలుష్యాన్ని కారణంగా తెలుసుకున్నాయి. అంటే విషం రెండు వైపులా నుండి వస్తోంది- బయటి నుండీ, లోపలి నుండీ అని గ్రహించాయి. చిలుక ఎగిరి వచ్చి మృగరాజుకు విషయం చెప్పింది. మృగరాజు జంతువులను పక్షులను సమావేశపరిచి, కొన్ని నిర్ణయాలు ప్రకటించింది.
ఏనుగుల దళాన్ని పంపి, కర్మాగారం నుండి వచ్చే మురికి కాలువను మట్టితో, రాళ్లతో పూడ్చేయించింది. ‘మా నీళ్లలో మీ విషం కలపొద్దు’ అని మనుషులకు చిలుక ద్వారా లేఖ పంపింది.. భయపడిన మనుషులు ఆ కాలువను వేరే వైపు తిప్పుకున్నారు. మృగరాజు కొత్త నియమాలు పెట్టింది.
‘ఇక నుండి ఎవరూ కొలను గట్టున స్నానం చేయకూడదు. నీళ్లు తాగే చోటు, స్నానం చేసే చోటు వేరు. ప్లాస్టిక్, చెత్తను నీళ్లలో వేస్తే కఠిన శిక్ష. చనిపోయిన జంతువులను కొలనుకు దూరంగా పాతిపెట్టాలి.’ అని అందరికీ గట్టిగా చెప్పింది. ఎలుగుబంటి సలహాతో, కొలనులో తామర మొక్కలు, నాచు నాటించింది. అవి నీటిని సహజంగా శుభ్రం చేస్తాయి. చుట్టూ వేప, తులసిమొక్కలు నాటించింది. ‘జల కాపలా దళం’ అని చిన్న చేపలు, కప్పలు, తాబేళ్లతో ఒక బృందం ఏర్పాటు చేసింది అవి రోజూ నీటిని పరిశీలన చేసి, ఏదైనా చెత్త కనిపిస్తే వెంటనే పైకి తీసి పారేస్తాయి. 15 రోజుల్లో కొలను నీళ్లు మళ్లీ తెల్లగా, తియ్యగా మారాయి. జంతువులన్నీ కోలుకున్నాయి.
అప్పుడు మృగరాజు ‘చూశారా! నీరు లేకపోతే మన ప్రాణం లేదు. నీటిని కాపాడుకోవాల్సింది కూడా మనమే. నదిని, కొలనును మనం శుభ్రంగా చూసుకోవాలి. అందులో చెత్త వేస్తే, అది విషంగా మారి మన ప్రాణాలను తీస్తుంది.’ అని అంది. అప్పటినుండి ఆ అడవిలో ప్రతి సంవత్సరం నీటి పండుగ చేసుకునేవి. అన్ని జంతువులు కలిసి కొలనును శుభ్రం చేసేవి. అడవి కొలను అయినా, ఇంటి బావి అయినా, చెరువు అయినా - నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం తాగే నీరే మనకు విషం కాకూడదు. నీటిని కాపాడితే, నీరు మనల్ని కాపాడుతుంది.
మొర్రి గోపి
8897882202








కామెంట్లు (0)