సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమనసుంటే పిల్లల నుంచీ మనం నేర్చుకోవచ్చు!

15 గంటల క్రితం

If we have the right mindset, we can learn even from children
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 02:24 అపరాహ్నం | 7 నిమిషాల చదవడం

పంచతంత్రంలోని "వడ్రంగి- కోతి " కథ మనం తరతరాలుగా పిల్లలకు చెబుతున్నాం. కొయ్యదుంగను కోస్తూ కోస్తూ వడ్రంగి నిలువునా కోసిన కొయ్య మూసుకుపోయి, అతుక్కొని పోకుండా మధ్యలో ఒక మేకు దిగ్గొట్టి ఇంటికి వెళతాడు. ఒక తుంటరి కోతి దానిమీదికెక్కి కూచుని తన చాపల్యంతో వుండబట్టలేక రెండు చేతులతో పట్టి మేకును ఊడ బెరుకుతుంది! పాపం దాని తోక దుంగ సందులో ఇరుక్కుని నలిగిపోతుంది. కోతి విలవిలలాడుతూ చచ్చిపోతుంది. ఇదీ ఏళ్ల తరబడి మనం చెబుతున్న కథ. పంచతంత్ర కారుడు పిల్లలకు నీతిబోధ కోసం చెప్పిన కథ!

దీన్ని మూడో తరగతి చదువుతున్న మా మనవడికి చెబుతున్నాను. అంతే! "ఆ కార్పెంటర్ రాస్కెల్ అలా ఎలా చేస్తాడు? వాడిని అరెస్టు చేయాలి" అంటూ వాడు ఆవేశంతో ఊగిపోయాడు. కోతి స్థానంలో పిల్లలు వుంటే ఏమయ్యేది అని వాడి ప్రశ్న. వాడి దృష్టిలో వడ్రంగిది తప్పు, కోతికి జరిగింది అన్యాయం!

మరి ఇప్పటిదాకా తరాల తరబడి మనం ఏం చెపుతున్నాం? కోతి తెలివి తక్కువ పనితో ప్రాణాల మీదికి తెచ్చుకుందనీ, అలాంటి తనకుమాలిన పనులు చేయకూడదనీ చెపుతున్నాం. కానీ తప్పు వడ్రంగిదన్న ఆలోచనే మనకు రాలేదు. అంత గొప్ప రచయితకూ ఆ మాత్రం విజ్ఞత లేకపోయింది!

ఇప్పుడు మా మనవడి తిరుగుబాటుతో నాకు మరో కోణం కూడా తెలిసొచ్చింది. పంచతంత్రకారుడు అంత చిన్న తప్పుకు కోతిని చంపేస్తాడు. ఏదో తోక నలిగిందని చెప్పి వదిలేస్తే పోయేది గదా! అంత అల్పప్రాణి చేసిన అంతచిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షా? ఇది ప్రాణుల పట్ల రచయిత దృక్పథ దోషం గాక మరేమవుతుంది? పంచతంత్ర మంతా ప్రాణులకు ఇలాంటి శిక్షలే వుంటాయి. ఈ కొత్త పాఠం కూడా నాకు అప్పుడే ద్యోతకమైంది.

మరి ఎందుకా పిల్లవాడికలా తోచింది? దీనికి కారణాన్ని వెతికితే ప్రకృతి పట్లా, ప్రాణుల పట్లా ప్రస్తుతకాలంలో జరుగుతున్న చర్చకూ, పెరుగుతున్న స్పృహకూ ఫలితమిది. తమ కాలపు వాస్తవాల నుంచి తమ సొంత దృక్పథాన్ని నిర్మించుకొంటున్న తరం వారిది! మనమేమో ఎక్కడో విష్ణుశర్మ కాలంలోనే వుండిపోయాం. పిల్లల నుంచి నిజాయితీగా నేర్చుకుంటే పెద్దల భావాలు ఇంతగా తిరగబడతాయి. కాకుంటే మనకో మనసుండాలి! స్పృహ వుండాలి.

పిల్లలకున్న ప్రకృతి ప్రేమ మనకుందా?

నేను ఓ పది పదిహేనేళ్ల ముందు తిరుపతిలో ఒక అంతర్జాతీయ బాలబాలికల చిత్రలేఖన ప్రదర్శనకి వెళ్లాను. దాదాపు 40-50 దేశాల పిల్లలు గీసిన చిత్రాలు అందులో వున్నాయి. ముందుగా ఒక "కాన్సెప్టు" అంటూ ఏదీ ఇవ్వకుండా ఇష్టం వచ్చినబొమ్మలు వెయ్మమంటే వేసిన బొమ్మలవి. అయినా వాటిలో 60-70 పై శాతం పర్యావరణం మీదే వున్నాయి. చాలా సీరియస్ గానూ, ఆశావహంగానూ వేసిన చిత్రాలవి. ఈ భూమిని కలకాలం కాపాడుకుందామన్న గాఢమైన ఆకాంక్షను వ్యక్తం చేసినవవి. ఇలా ప్రపంచ బాలబాలికలందరూ ఒక్కలానే ఎందుకు ఆలోచించారు? ఒక్క ఆకాంక్షనే ఎందుకు వ్యక్తం చేశారు? దీన్నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ? మన పిల్లలు మనకన్నా ప్రకృతి పట్ల బాధ్యతగా ఉన్నారనే గదూ! దీన్ని మనసుపెట్టి అర్థం చేసుకుంటే భవిష్యత్ ప్రపంచం పట్ల పెద్దలుగా మనకెంత భరోసా ఏర్పడుతుంది! నిజానికి లోకమంతా ఇలానే ఆలోచిస్తోందా? పిల్లలు మాత్రమే ఇలా ఆలోచిస్తున్నారా? ఇలా చూస్తే పెద్దలుగా మన వద్ద అంత న్యాయమైన సమాధానం లేదనిపిస్తుంది. వాళ్ల నుంచి నేర్చుకోవల్సింది ఎంతో వుందన్పిస్తుంది! భవిష్యత్తు పట్ల ఎంతో భరోసా గూడా దక్కుతుంది!

కొంతకాలం క్రితం మేము నెల్లూరు జిల్లాలో చిన్న పిల్లల చేత కథలు రాయించాం. సొంతంగా రాయాలనీ, తమ అమ్మలు, అవ్వలు, తాతలు చెప్పిన కథలే రాయాలనీ, ఎన్ని తప్పులున్నా పరవాలేదనీ వాళ్ళకి చెప్పాం. మాకు దాదాపు మూడు వేల కథలు వచ్చాయి. విచిత్రం ఏమంటే వాటిల్లో చాలా వాటిలో కథ నడుస్తూ నడుస్తూ చిక్కుల్లో పడిపోతుంది. కథానాయికో, నాయకుడో కష్టాల పాలవుతారు. ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలి? అప్పుడు ఖచ్చితంగా పార్వతీదేవి ఆకాశాన వెళుతుంటుంది ! తనకు తానో, మొగుడికి సిఫార్సు చేసో ఆదుకుంటుంది! మన జానపద కథా ప్రపంచంలో పార్వతికి ఇంత దయామయురాలిగా ఇంత గొప్ప స్థానం ఎలా దక్కిందో నాకైతే ఇప్పటికీ అంత పట్టడం లేదు.

పేదపిల్లలది లోతైన జీవితం!

అదలా ఉంచండి. ఆ పిల్లల్ని కొందరిని నెల్లూరుకి పిలిచాము. ఇలాంటి కథనే రాసిన ఒక అమ్మాయిని "నీకు పార్వతి కనపడితే ఏం కోరుకుంటావు ?" అని అడిగాను. అమ్మాయి ఏ మాత్రం తడుముకోకుండా" అన్నం కోరుకుంటాను" అనింది. నేను ఖంగుతిని పార్వతీ దేవి "ఇంకో కోరిక కోరుకోమంటే అప్పుడేమడుగుతావు?" అంటే "కూరలు" అనింది! నాకైతే కన్నీళ్లు ఆగలేదు! నోట మాట రాలేదు! ఇప్పటికీ ఆ పిల్ల నాకు గుర్తుకొస్తూనే వుంటుంది. ఆ అమ్మాయి ఎంత నిష్ఠుర వాస్తవాన్ని చెప్పింది. ఎంత సహజంగా, సాదాసీదాగా చెప్పింది. పేద పిల్లలది అంత లోతైన జీవితం! వాళ్ళ స్థాయికి మనం ఎప్పటికీ చేరుకోలేక పోవచ్చు! చేయగలిగింది వినయంగా వాళ్ళ నుంచి ప్రపంచాన్ని చదవడం నేర్చుకోడమే.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు. పసిపిల్లల ఆలోచనలు వాళ్లకు వాళ్లుగా తమ పరిసరాల నుంచి ఏర్పరచుకున్నవి. మన కృత్రిమ పాఠాల ప్రభావానికి ఇంకా లొంగనివి. అందువల్ల వాటిలో తెచ్చిపెట్టున్న కృతక నీతులుండవు. వాటిలో గొప్ప వాస్తవికత వుంటుంది. దాన్ని వాళ్ళు ఏ సంకోచం లేకుండా బయటపెడతారు. పేద పిల్లల్ని ప్రేమిస్తే, ఏ ఆంక్షలూ లేకుండా వాళ్లని మాట్లాడనిస్తే, వాళ్ళ నుంచి తెలుసుకోవలసింది ఎంతో వుందన్న వినయం పెద్దలుగా మనకుంటే, ఏ తర్క వితర్కాలకు, ఊహాజనితాలకూ తావు లేని ప్రపంచాన్ని వాళ్లు మన ముందు సాక్షాత్కరింప చేస్తారు. దీనికి మనకు మనసుండాలి!

పిల్లలే టీచర్లయితే!

ఈ అనుభవాలు గిరిజన పిల్లల్లో పని చేసే టీచర్లకు మరీ గొప్పగా వుంటాయి. కొత్తగా చేరిన మైదాన ప్రాంత టీచర్లకు గిరిజన భాషలు రావు. వారికిది పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు ఆ పిల్లల నుంచే టీచర్లు వారి భాషను నేర్చుకోవాల్సి వస్తుంది. గమ్మత్తుగా పిల్లలే టీచర్లవుతారు! అంతేకాదు ప్రకృతిని గురించీ, ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాల గురించీ, కొండకోనల జీవన సౌరభం గురించీ, చివరకు అడవి దారుల గురించీ కూడా ఆ పిల్లలే టీచర్లకు పరిచయపాఠాలు చెపుతారు. టీచర్లకు తెలియని వందల చెట్ల

గురించి ఆ పిల్లలకు తెలుసు. తామెప్పుడూ రుచి చూడని ఎక్కడెక్కడి అడవి పండ్లూ వారు తెచ్చి తినిపిస్తారు. మన "నాగరికతా" ప్రపంచపు పిల్లల్లో ఎక్కడా కనపడని సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. వారి ముందు టీచర్లు చిన్నలైపోతారు. అలా కావడం గొప్ప అనుభూతి! అనంతకాలపు వీధుల్లో మన ఆదిమ తాత ముత్తాతల వారసత్వ మూలాల్ని వెతుక్కుంటున్న అనుభూతి! మన అహమంతా మంచుగడ్డలా కరిగిపోతున్న అనుభూతి!

విద్యావేత్తలే విస్తుపోయారు!

మనకున్న ఒక నమ్మకం ఏమిటంటే పిల్లలు చాలా సున్నితమైన వాళ్ళని. నిష్ఠుర నిజాల్ని వాళ్ళ ముందు ఎంత దాస్తే అంత మంచిదని. ప్రపంచమంతా మానవతా సుగంధాలతో గుబాళిస్తున్నట్టు వాళ్లు అమాయకంగా నమ్మాలని. ఆ అమాయకత్వాన్ని మనం కాపాడాలని! మరీ పసిపిల్లల విషయంలో ఇది కొంత నిజమైతే కావచ్చు గానీ, బడికొచ్చే వయసుకే మన పిల్లలు ప్రపంచాన్నంతా తమ అనుభవంలోంచే వడపోసుకొని వస్తారు. అమ్మానాన్నా తెల్లారే లేచి పనికి పోతే మూడో తరగతి అమ్మాయిలు సైతం అన్నం వండి పెట్టి, బడికి రావడం మన గ్రామీణ పాఠశాలల్లో చాలా మామూలు విషయం. నాన్న తాగి శివాలెత్తి, అమ్మను రోజూ రాచి రంపాన పెడుతుంటే గుడ్ల నీళ్ళు గుక్కుకొని, తానూ భరించడం మన అమ్మాయిలకు సాధారణ అనుభవం! ఇక పేదరికం సంగతి సరేసరి!

ఒక పార్కులో పరుగుల పోటీలు జరిగాయి. అప్పటికప్పుడు అక్కడ ఆడుకొంటున్న పిల్లలతో జరిగిన పోటీలవి. రెండో స్థానం వచ్చిన అబ్బాయి "మా అమ్మ నాక్కూడా కడుపునిండా అన్నం పెడితే నేనే ఫస్ట్ వచ్చేవాడిని" అంటూ గెలిచిన అబ్బాయితో అనడం విన్నపుడు ఆ బిడ్డకున్న ప్రాపంచిక దృక్పథానికి నేను దిమ్మతిరిగి పోయాను. మన పిల్లలకు నడుస్తున్న సమాజం పట్ల, అందులో తమ స్థానం పట్ల అంత స్పష్టత వుంది!

ఎలీనా వాట్స్, శివరాం గార్లు (పిల్లల ప్రేమికులూ, విద్యాప్రయోక్తలూ సముద్రానికి ఎదురుగా వీధిపిల్లల్ని కూర్చోబెట్టి "మీకు ఏమి అనిపిస్తుందో చెప్పండి" అంటే ఒక అమ్మాయి "ఓ సముద్రమా! ఎందుకిలా ఏడుస్తావు? రోజూ మా అమ్మ ఇంట్లో ఏడ్చినట్టు" అని చెప్పింది! అది విని అంతటి విద్యావేత్తలే విస్తుపోయారు. అట్లని ఆ పిల్లేమీ ఇంటి వాస్తవానికి దిగాలుపడిపోయిన పిల్లగాదు! రేపు తానూ ఇలానే కానన్న నమ్మకం వున్న అమ్మాయీ కాదు. ఒక కఠోర వాస్తవగరళాన్ని పరమశివుడి కంటే నిబ్బరంగా తాగి, జీర్ణం చేసుకొన్న పట్టపుపిల్ల ఆ అమ్మాయి!

ఓ టీచరు బుద్ధుడి పాఠం చెపుతూ "కోరికలు వుండకూడదు. అవే కష్టాలు కొని తెస్తాయి అంటాడు బుద్ధుడు. మరి మీకు ఏమి కోరికలూ లేవా?" అని అడిగితే ఒక అమ్మాయి "కోరికలు లేకుండా ఎలా ఉండగలం సార్! మా అమ్మానాన్నా కొట్లాడుకోకుండా వుంటే చూడాలని నా కోరిక" అందట! "పిల్లలతో మా అనుభవాలు" పుస్తకంలో ఒక టీచరు చెప్పిన అనుభవమిది. టీచర్ పళ్ళు పచ్చగా వుండటం చూసి ఒక గిరిజన పిల్ల "టీచర్! మర్రిచెట్టు పాలు, పసుపు కలిపి తోముకో! అప్పుడు నువ్వు ఇంకా బాగుంటావు" అందని మరో టీచర్ చెప్పుకొచ్చింది!

రాజస్థాన్ లో జైపూర్ వద్ద "దిగంతర్" అనే ప్రయోగాత్మక పాఠశాల వుంది. అదో మారుమూల పేద పిల్లల బడి. రోహిత్ ధనకర్ అనే ప్రయోక్త దాని నిర్వాహకుడు. (ఇప్పుడాయన అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ డైరెక్టరు) బడిలో పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే ఏమవుతుంది? ఒక అమ్మాయి 'నాకు నిద్ర వస్తోంది' అంటే 'వచ్చి నా ఒళ్ళో పడుకో' అని టీచర్ అంటే ఎలా వుంటుంది? ఒక గడుగ్గాయి 'నాకు గోడలెక్కాల'ని ఉంది అంటే అలాగేనని వాడిని బయటకు పంపించేస్తే ఏమవుతుంది? 'నాకు ఈ క్లాసులో కూర్చోవాలని లేదు మా అక్క క్లాసులో కూర్చుంటా' అంటే అక్కడే కూచోబెడితే ఏమవుతుంది? ఎవరిష్టం వచ్చినట్టు వారుండొచ్చు అని, వాళ్ళని గౌరవిస్తూ ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? "ఏమీ జరగదు. ఒక వాతావరణంలో పిల్లలందరూ చదువుల్లోకి కొంచం ముందూవెనకా వచ్చేస్తారు. ఐదో తరగతికి వచ్చేప్పటికి అందరూ సమానంగానే వుంటారు. మనకే బోలెడు పాఠాలు చెబుతారు. అనేది ధనకర్ అనుభవం. "స్వేచ్ఛా విద్యే సరైన విద్య అని మా పేదపిల్లలు చేసి చూపించారు. నాకేవైనా అనుమానాలుంటే పటాపంచలు చేసారు" అంటాడాయన. దిగంతర్ కెళ్ళి చూశాక నాకూ అలాగే అనిపించింది.

ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ మన ఇంట్లో, బడిలో ఇదంతా ఎందుకు సాధ్యం కావడం లేదు? ఒక సంస్కృతిగా ఎందుకిది అల్లుకోడం లేదు? పిల్లల నుంచీ నేర్చుకోగలమని మనమెందుకు ఒప్పుకోలేక పోతున్నాం? పిల్లల పట్ల సమాజం ఎందుకింత హింసాత్మకంగా ప్రవర్తిస్తోంది? రాప్తాడు ఘటన చూస్తే ఏమనిపిస్తుంది?

నిందించడం గాదు, నేర్చుకోవాలి!

"పిల్లలు మమ్మల్ని లెక్కచేయడం లేదు. సామాజిక మీడియా వచ్చి వాళ్ళని చెడగొడుతోంది. తల్లిదండ్రులు పట్టించుకోడం లేదు. మాకాలపు పిల్లలు వేరు, ఇప్పటి పిల్లలు వేరు" ఇలా మనం పిల్లల మీద వెయ్యి ఆరోపణలు చేస్తుంటాం. ఇవన్నీ నిజమా? పిల్లలతో మనం ఓపిగ్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నామా? మరీ ముఖ్యంగా వాళ్ళని స్వేచ్ఛగా మాట్లాడనిస్తున్నామా? తరగతి గదిలో ఇంట్లో ప్రేమ గుబాళిస్తోందా, పెత్తనం రాజ్యమేలుతోందా? అసలు పిల్లల నుంచి నేర్చుకోడం అనేది మనబడిలో, ఇంట్లో కలికానికైనా కనిపిస్తోందా? ఈ ప్రశ్నలు మాత్రం మనకు ఎదురుగావు. పిల్లల్లో పిల్లలుగా వుండలేకపోవడం, అమాయకంగా కన్పించే పిల్లల్లోని అసాధారణ సామర్థ్యాలను పట్టుకోలేకపోవడం, వాళ్ళ నుంచి పెద్దలు కూడా నేర్చుకోవల్సింది ఎంతో వుందన్న స్పృహ లేకపోవడం మనకెంత నష్టం తెచ్చాయో, సమాజానికెంత నష్టం తెచ్చాయో మనకింకా అవగతం కావడం లేదు. సుహోమ్లోన్ స్కీనీ (పిల్లలకే నా హృదయం అంకితం), గిజుబాయినీ (పగటికల), జాన్ హోల్ట్ నూ ( పిల్లలు ఎలా నేర్చుకుంటారు?) అడిగితే చెబుతారు.

మనది ఎగుడుదిగుడు సమాజం, అడుగుడుగునా ఇక్కడ ఆధిపత్యాలే ఉంటాయి. ప్రజల నుంచి, పేదల నుంచి, మన కంటే ఒక అడుగు కింద వున్న వాళ్ళ నుంచి వినడం ఈ సమాజానికి ఎలా సాధ్యమవుతుంది అనొచ్చు? నిజమే గానీ ఈ ఆధిపత్య సమాజం బీటలు వారడం మొదలు కావాల్సింది మన ఇంటిలో కూడా కదా! మన బడుల్లో కూడా కదా! ముఖ్యంగా మన పిల్లల దగ్గర కూడా గదా!

Vitapu-Balasubrahmanyam

విఠపు బాలసుబ్రహ్మణ్యం

మాజీ శాసనమండలి సభ్యులు, విద్యావేత్త

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్