'కళ్ళు ఎంత మూసినా నిదుర పట్టదేం.. ఏయో ఆలోచన్లు.. అలా పొద్దున్నే చేను కాడకెళ్ళి, నీళ్ళెట్టి శుభ్రం జేసి, ఆడ పనంత సక్కబెట్టి కట్టిన ఎండి పుల్లల మోపు, పచ్చగడ్డి మోపులు సైకిలుకి కట్టి, ఇంటికి రాంగానే మోపులు అందుకొని, గడ్డిమోపు పశువుల కొట్టం కాడ పడేసి, పొయ్యి కాడ ఎండిమోపు దించి, కాగులో నీళ్లు తోడిచ్చేది. ఏడి నీళ్ళు ఒంటి మీద పడగానే చిరాకంతా పోయేది. ఇంతలో సత్తుగిన్నెలో సద్దిబువ్వ, ఓ మాగాయ ముక్కో.. ఓ ఆవకాయ బద్దో వేసి, సేతికిచ్చేది లచ్చాలు. అది నంజుకుంటూ కాత్త కూడు తిని, పెరట్లోని యాపసెట్టు నీడలో అలా నడుం వాలితే చాలు జమ్మంటూ నిదుర పట్టేది. ఈ సిటీకొచ్చాక తల్రాత తిరిగిపోయింది. ఇప్పుడా చేను పోయె, కళ్ళల్లో బెట్టుకుని చూసే తోడుది పోయె. ఈడకొచ్చినాక అదేటోగాని ఈ కట్టె కూడా మొద్దుబోయి సెప్పిన మాట ఇనకుండా మొరాయిత్తుంది. నిదురకో బిళ్ళ, కూడరగడానకో బిళ్ళ.. ఇలా ఎన్ని బిళ్ళలు మింగినా లాభమైతే లేదు. ఈ జీవుడు పుట్టి పెరిగాక ఎన్నడూ నిదురకి మొహమాసింది లేదు. ఇప్పుడేటో కొత్తగా వచ్చింది శరీరానికి ఈ జబ్బు' అనుకుంటూ మంచంపై అటూ ఇటూ తిరుగుతూ నిదురపోటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు సత్తెన్న.
‘అయ్యా నీ కోసం మనూరు నుండి పలకరించడానికి చిన్నయ్యోళ్ళొచ్చారు. హల్లో కూకోబెట్టాను. ఓ పాలి ఇల్రా’ అంటూ తన కొడుకు హనుమంతు పిలిచేసరికి ఆలోచనల్లోంచి బయటకొచ్చాడు సత్తెన్న. గభాల్న హాల్లోకొచ్చి అందర్నీ చూసేసరికి, ఎక్కడ లేని దుఃఖం ముసురులాగా మనసుకి ఆవహించిందేమో అది ఒక్కసారిగా భళ్ళుమంది.
‘ఒరేయ్.. పోలయ్యా.. నన్ను చూట్టానికి ఎంత దూరం నుండి వచ్చార్రా.. నేను మీ కోసం ఏంచేసేననిరా.. నా మీద ఇంత అభిమానం.. మనోళ్ళంతా ఎట్టున్నార్రా బిడ్డా’ అంటూ పోలయ్యని కౌగిలించుకుని భోరున ఏడ్చాడు. సత్తెన్న అలా చిన్నపిల్లాడిలా బాధపడుతుంటే పక్కనే నిలబడి, చూస్తున్న మిగతావాళ్ళ గుండె కూడా కాస్త బరువెక్కిందో ఏమో.. వాళ్ళందరి కళ్ళు కూడా చెమర్చాయి.
‘అదేటన్నా అట్టంటావ్.. ఒకే ఊరోళ్ళం. తెల్లారి లెగిత్తే కలిసి తిరిగేటోళ్ళం. ఎవరికైనా కట్టమంటే పరిగెత్తుకు వాలిపోయేవాడివి. అట్టాంటిది నీకు కట్టమొత్తె రాకుండా ఎట్టుంటాం?’ అన్నాడు శివయ్య.
‘ఊరు ఇడిసిబెట్టి గప్పుడే నాలుగేళ్లు అయిపోయినాది. ఏ పండక్కో, పబ్బానికో మీరంతా వత్తార్లే ఆడకి యనికుంటే ఇలా జరిగిపోయినాది. గట్టి గుండ్రాయిలా గుండేది వదిన ఇలా గయిపోనాది. ఏంటో విచిత్రంలా’ అన్నాడు నర్సన్న. ఇంతలో హనుమంతు భార్య వచ్చినోళ్ళందరికీ టిఫిన్లు, టీలు ఇచ్చింది. అవి తినేసి మరలా కబురుల్లో పడ్డారు. ‘పొద్దుగూకులు పొలంకాడే పడి, ఎంత పని చేసేదో మా తల్లి. ఇద్దరి మనుసులు సేసే పనంతా ఒక్కమ్మే జేసినా గెప్పుడూ ఆ చిర్నవ్వే ముఖాన్న గానొచ్చేది గాని అలుపు సొలుపు గిసుమంతైనా ఉండేది గాదు. ఎవరైనా ఇంటికి వత్తే కడుపునిండా బువ్వ పెట్టి, పంపేదా తల్లి.. వట్టి చేత్తో నెప్పుడూ పంపలే. అలాంటి యా అమ్మిని తీసుకుపోనాకి ఆ పయ్యోడికి మనసెట్టా ఒప్పిందో..’ అంటూ నర్సన్న మాటలకి వత్తాసుపలికాడు పోలయ్య.
‘మా యందరికీ పెద్దదిక్కులా ఉండేటోడివి. అన్నీ అమ్ముకొని, ఈడకి వచ్చేసి ఏదో పిల్లాడి దగ్గర సంతోసంగా ఉండారనుకుంటే ఇంతలోనే ఇలా అయిపోయినాది ఏం చేత్తాం’ అంటూ మరొకతను బాధపడ్డాడు.
అందరూ ఒకే ఊర్లో చిన్నప్పట్నుంచి కలిసి పెరగటం, కలిసి వ్యవసాయం చేయడం ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకోవడంతో వాళ్ళ మధ్య ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే సత్తెన్నకి కష్టం వస్తే రాకుండా ఉండలేకపోయారు వాళ్ళంతా. సత్తెన్నది మారుమూల ఓ కుగ్రామం. రెండకరాల మాగాణినే నమ్ముకుని జీవించే ఓ సన్నకారురైతు. అతని భార్య కూడా కష్టజీవి. ఇంట్లోని పాడి గేదెను చూసుకోవడంతో పాటు భర్తకి వ్యవసాయ పనుల్లో కూడా సాయమొచ్చేది. వారిద్దరూ కష్టాన్ని నమ్ముకుని బతికేటోళ్ళైనా వాళ్ళ కొడుకు హనుమంతుని మాత్రం బాగా చదివించాలనుకున్నారు. స్థోమత లేకపోయినా అప్పు చేసి, పట్నం పంపించి చదివించారు. హనుమంతుడు బుద్ధిమంతుడు, చదువు పూర్తికాగానే ఓ మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెంటనే పెళ్లి, బ్యాంకు లోన్ పెట్టి, ఓ పెద్ద ఇల్లు కొనుక్కోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి. చేసిన అప్పు ఇవ్వాళ్ళో రేపో కొడుకు తీరుస్తాడనుకునే లోపే అగ్గికణంలాంటి ఓ వార్త సత్తెన్న చెవినపడింది. కొడుకు చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందని, చాలామందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారని, అందులో తన కొడుకు కూడా ఉన్నాడని. ఒక్కసారి కుదేలైపోయాడు. అంతలోనే తేరుకుని, ఇలాంటి కష్టసమయాల్లో కొడుకు బెంగపడతాడని వెంటనే సిటీకి వచ్చాడు. ‘డబ్బు కంటే మనిసి పేనాలు చానా ఇలువైనవి. ఇయ్యాల గాపోతే రేపు సంపాదిత్తాం. నువ్వు బాగుంటే మా కంతే చాల్రా’ అంటూ కొడుక్కి ధైర్యం చెప్పాడు. చదువు కోసం చేసిన అప్పు తీరకపోగా, కొడుకు ఇంటి కోసం చేసిన అప్పు కూడా మీద పడడంతో చేసేదిలేక పొలంతో పాటూ ఇల్లు, గొడ్డు గోదా అన్నీ అమ్మి అప్పులన్నీ తీర్చి కట్టుబట్టలతో కొడుకు దగ్గరకు చేరారు. మూల్గే నక్కపై తాటిపండు పడ్డట్టు వాళ్ళనెత్తి మీద మరో బాంబు పడింది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా పడిపోయి, కాలు, చేయి లాగేసిన భార్యని చూసి హాస్పత్రికి పరిగెత్తారు. ‘అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి. లేకపోతే మనిషి దక్కదు. ఓ పది రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసుకోండి’ అన్నారు డాక్టర్లు. సమయం ఇచ్చి, డబ్బు ఎతుక్కునేలోపే ఆ మహాఇల్లాలు ప్రాణాలు విడిచింది.
‘అన్నా కిందటేడు వరదలొచ్చి చేలను పాడుచేసింది పెనవేసుకున్న బంధాలు
కదా! ఆ నట్టపరిహారం మన రైతులందరూ అకౌంట్లో డబ్బులు పడినాయి. నీ చేను కొనుక్కున్న రాజన్న ఆ డబ్బు నీకియ్యమని ఇచ్చాడు. ఆ భూతల్లికి ఎంతో సేవ చేసిన నీకే చెందాల అన్నాడు’ అంటూ జేబులోంచి డబ్బు తీసి, సత్తెన్న చేతిలో పెట్టాడు పోలయ్య. రాజన్న మంచి మనసుకి సంతోషిస్తూ.. ‘‘చేను తల్లికి ఎట్టా తెలిసినాదో ఈ బిడ్డ కట్టాలో ఉన్నాడని, ఆదుకోనాకి డబ్బంపింది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘ఇంకో మాట కూడా సెప్పమన్నాడు. నాలుగేళ్ళ నుంచి ఆ చేను ఓ పంట కూడా ఇయ్యలే. నువ్వొత్తే నీ మాట ఇంటదని నిన్ను మనూరొచ్చి కమతం చేస్కోమన్నాడు. పంట సగం నీకు తీస్కొని, సగం ఇత్తే చాలంట. ఓ పారి ఆనోచించన్నా.. మనూరికెళ్ళిపోదాం. అరేయ్ హనుమంతు! మన ఊరికిపోదాం రా..రా.. అయ్యని చూడు మనిసెట్టాగున్నాడో. ఆ గాలి.. ఆ ఊరు.. చూడగానే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడ్రా. ఆడ మేమంతా ఉంటాం. నువ్వు మాలో ఒకడివి. నిన్నెట్టా ఇడిసిపెడతాం. ఉద్యోగం వచ్చేవరకు మాతోనే ఉందువు గానీ’ అంటూ నచ్చజెప్పి వాళ్లతో బాటే తీసుకుపోయారు వాళ్ళ కుటుంబాన్ని.
చేను దగ్గరకి పోగానే సత్తెన్న ప్రాణం లేచొచ్చింది. భోరున ఏడుస్తూ.. గబాల్న పరిగెత్తాడు చేలోకి తల్లి ఒడిన చేరిన బిడ్డలా. క్షణం కూడా ఆలోచించక ఏపుగా పెరిగిన కలుపుమొక్కల్ని పీకేసి, శుభ్రం చేయడం మొదలెట్టాడు. అప్పటివరకూ ఉన్న రోగం ఏమయ్యిందో ఒళ్ళు తెలీకుండా సాయంత్రం వరకూ పని చేసి, చేసి అలిసిపోయి ఆ గట్టు పక్కన చెట్టుకింద గోనె పరిచి ఆదమరిచి నిద్రపోయాడు. పొద్దున్ననగా ఎల్లినోడు ఇంకా రాలేదేంటోనని వెతుకుతూ వచ్చిన కొడుక్కి, విత్తనాలు ఇద్దామని వచ్చిన రాజన్నకి ఆ దృశ్యం కంటపడింది. పెనవేసుకున్న బంధాలకి ప్రేమించడం మాత్రమే తెలుసు. తల్లిఒడిని చేరిన బిడ్డలా సత్తెన్నా, బిడ్డ తిరిగొచ్చాడన్న సంతోషంలో వరి చేలు ప్రశాంతంగా ఉండటం కనిపించాయి.
పేలూరి వెంకట మీనాక్షి
99126 01765








కామెంట్‌లు (0)