ప్రపంచ జనాభాలో సగానికి పైగా 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారు. ఈ యువతరం ఒక శక్తివంతమైన వనరు. అయితే, ఈ భారీ యువ జనాభా తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నది. ప్రతి ఏడాది జులై 11న జరుపుకునే ప్రపంచ జనాభా దినోత్సవం.. సంబంధిత సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక ప్రయత్నం. 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. 1990లో మొదటిసారిగా జరుపుకున్న ఈ రోజు, నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న జనాభా సవాళ్లపై చర్చించడానికి ఒక వేదికగా మారింది. ఈ ఏడాది యువత కలలు సాకారం చేయాలనేది థీమ్‌గా ఉంది. ఆ నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..
ప్రపంచ జనాభా దినోత్సవం 2026 యొక్క థీమ్ "యువత యొక్క ఆకాంక్షలను ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం సాకారం చేయడానికి కలిసి పనిచేయడం" అనేది ఒక ఆహ్వానం మాత్రమే కాదు, ఒక నిబద్ధత. యువతకు భద్రత కల్పించడం, ఆర్థిక స్థిరత్వం అందించడం, వారి హక్కులను పరిరక్షించడం - ఇవన్నీ స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా యువతరం ఉంది. వారి కలలు, ఆకాంక్షలు నెరవేరితేనే ప్రపంచం నిజంగా ప్రకాశవంతమైన భవిష్యత్తును చూడగలదు. ప్రతి ప్రభుత్వం, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు ఈ ప్రయాణంలో భాగస్వామి కావాలి. యువతకు మద్దతు ఇవ్వడం అనేది ఒక ఎంపిక కాదు, అది మనందరి బాధ్యత.
యువత ఎదుర్కొంటున్న సవాళ్లు ఆర్థిక అస్థిరత
నేటి యువత ఆర్థిక ఇబ్బందులు, అభద్రత, ఆరోగ్య సమస్యలు, విద్య, గృహ సమస్యల వంటి కారణాల వల్ల తక్కువ సంతానాన్ని కోరుకుంటున్నారు. యుఎన్ఎఫ్‌పిఎ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది పిల్లల సంరక్షణ సవాళ్లు, ఉద్యోగ అభద్రత, ఆరోగ్య సమస్యలు, వాతావరణ మార్పులు, మహమ్మారులు, యుద్ధాలు, పర్యావరణ క్షీణత వంటివి తాము కోరుకున్నంత మంది పిల్లలను కనడానికి అడ్డంకులుగా పేర్కొన్నారు.
భద్రతా సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా జరిగే లైంగిక వేధింపులలో సగం 15 సంవత్సరాల లేదా అంతకంటే తక్కువ వయస్సు గల బాలికలపై జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ముగ్గురు బాలికలలో ఒకరు 18 సంవత్సరాలు నిండకముందే వివాహం చేసుకుంటున్నారు. టీనేజ్ బాలికలు టీనేజ్ బాలుర కంటే మాధ్యమిక విద్యను ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి తక్కువ అవకాశం కలిగి ఉన్నారు.
హక్కుల పరిరక్షణ
ప్రపంచవ్యాప్తంగా నలుగురు మహిళల్లో ఒకరు తమ జీవితం, శరీరం, భవిష్యత్తు గురించి స్వంత నిర్ణయాలు తీసుకోలేరు. బాల్య వివాహాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరిని ప్రభావితం చేస్తున్నాయి. ఇది పేదరికాన్ని కొనసాగిస్తూ, విద్యను పరిమితం చేస్తోంది.
జరుగుతున్న చర్చలు
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, యువత హక్కుల పరిరక్షణ, వారి భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి.
న్యాయమైన, శాంతియుత, ఆశాజనకమైన ప్రపంచాన్ని నిర్మించడంలో యువత ప్రాముఖ్యతను యుఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ నొక్కి చెప్పారు. యువత హక్కులకు మద్దతివ్వడం స్థిరమైన అభివృద్ధి, శాంతి, మానవ గౌరవానికి అవసరమన్నారు.
యుఎన్ఎఫ్‌పిఎ నివేదిక ప్రకారం, నిజమైన సంతాన సంక్షోభం అనేది జనాభా తగ్గుదల కాదు, యువత తాము కోరుకున్న సంతానాన్ని పొందలేకపోవడమే. కోరుకున్నా.. ఆర్థిక, సామాజిక అడ్డంకులు వారి ఎంపికలను పరిమితం చేస్తున్నాయి.
పాకిస్తాన్‌లో "న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో యువత తాము కోరుకున్న కుటుంబాలను సృష్టించుకోవడానికి వారికి అధికారం కల్పించడం"గా ఈ ఏడాది లక్ష్యంగా ఉంది.
థాయ్‌లాండ్‌లో యుఎన్ఎఫ్‌పిఎ తరాల మధ్య సమైక్యతపై దృష్టి సారించింది. వృద్ధాప్య సమాజాన్ని ఎదుర్కోవడానికి యువతరం పరిష్కారాలను రూపొందించడానికి వారికి అధికారం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పరిష్కార మార్గాలు
యువత ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి యుఎన్ఎఫ్‌పిఎ కొన్ని మార్గాలను సూచించింది:
కుటుంబ అనుకూల విధానాలు.. చవకైన శిశు సంరక్షణ, వేతనంతో కూడిన సెలవు వంటి విధానాల ద్వారా తల్లిదండ్రుల బాధ్యతలను అందుబాటులోకి తేవడం.
యువతకు మద్దతు.. సురక్షితమైన ఉద్యోగాలు, సరసమైన గృహాల ద్వారా యువకులు వయోజన జీవితంలోకి ప్రవేశించడానికి సహాయం చేయడం.
లింగ సమానత్వం.. పిల్లల సంరక్షణ బాధ్యతలను స్త్రీ-పురుషులు సమానంగా పంచుకునే లింగ-సమాన భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.
పునరుత్పత్తి ఆరోగ్యం.. సంతానోత్పత్తి గురించి కచ్చితమైన సమాచారంతో సహా అందరికీ పునరుత్పత్తి ఆరోగ్యం, హక్కులను కల్పించడం.
స్వేచ్ఛా నిర్ణయం.. ప్రతి ఒక్కరూ తమ పిల్లల సంఖ్య, అంతరం, సమయాన్ని స్వేచ్ఛగా నిర్ణయించుకోవడానికి వీలుకల్పించడం.
అందరికీ ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి యొక్క ప్రయోజనాలు లభించాలి. భద్రత, గౌరవం, అవకాశాలున్న జీవితాన్ని అందరూ పొందేందుకు కలిసి పనిచేద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పిల్లలే సంపద’ జనాభా విధానం, జనాభా నియంత్రణ నుండి జనాభా ప్రోత్సాహం వైపు ఒక నాటకీయ మలుపు. అయితే, ఈ విధానం ఎన్నో ప్రశ్నలను, విమర్శలను ఎదుర్కొంటోంది. ఆర్థిక ప్రోత్సాహకాలతో సంతానోత్పత్తి రేటును పెంచాలనే ఆలోచన సరళంగా కనిపించినా, దాని ఆచరణాత్మకత, సామాజిక ప్రభావం, దీర్ఘకాలిక పరిణామాలు తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నాయి.
ఈ విధానంలో అతిపెద్ద వ్యంగ్యం ఏమిటంటే, 1990లలో చిన్న కుటుంబ విధానాన్ని తీవ్రంగా అమలు చేసిన నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్ద కుటుంబాలను ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 1997లోనే జాతీయ విధానం కంటే ముందుగా రాష్ట్ర జనాభా విధానాన్ని రూపొందించింది. ఆ సమయంలో రాష్ట్రం ఏటా దాదాపు ఎనిమిది లక్షల స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు నిర్వహించేది - దేశంలోనే అత్యధిక సంఖ్య. ఆ ప్రచారం ఎంత ప్రభావవంతంగా పనిచేసిందంటే, 2005-06 నాటికి 91.5% మంది మహిళలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కోరుకోవడం లేదని తెలిపారు.
ఇప్పుడు అదే నాయకత్వం ‘జనాభా నియంత్రణ’ నుండి ‘జనాభా పెంపు’ వైపు మళ్లుతోంది. గతంలో తామే సృష్టించిన సామాజిక మార్పుకు ప్రతిగా ఇప్పుడు వ్యతిరేక దిశలో విధానం రూపొందించడం - ఇది ఒక విధమైన విధాన వైరుధ్యం.
ఆర్థిక ప్రోత్సాహకాలు - ఒక అవాస్తవిక ఆశ
మూడవ బిడ్డకు ₹30వేలు, నాల్గవ బిడ్డకు ₹40వేలు నగదు ప్రోత్సాహకాలు - ఇవి బిడ్డను పెంచే వాస్తవ వ్యయానికి అతి స్వల్పం. ఒక బిడ్డకు విద్య, ఆరోగ్యం, పోషణ, గృహం ఖర్చులు లక్షల్లో ఉండగా, ఈ మొత్తం ఒక ప్రతీకాత్మక ప్రకటన మాత్రమే.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రోత్సాహక విధానాలతో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ. ఒక దేశం యొక్క సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తగ్గితే, దాన్ని తిరిగి పెంచడం చాలా కష్టమని ‘తక్కువ సంతానోత్పత్తి ఉచ్చు’ సిద్ధాంతం చెబుతోంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చినా ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి.
అంతేకాకుండా, పేదరికంలో ఉన్న కుటుంబాలు ఈ డబ్బు కోసం పిల్లలను కనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఒక వ్యక్తి అప్పుల్లో ఉండవచ్చు, మద్యానికి బానిసై ఉండవచ్చు.. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు ₹30 వేల కోసం గర్భధారణను ఒక మార్గంగా చూడవచ్చు” అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహిళల స్వేచ్ఛా నిర్ణయాధికారాన్ని దెబ్బతీస్తుంది.
మహిళలపై తీవ్ర ప్రభావం..
ఈ విధానం మహిళల ఆరోగ్యం, కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పదే పదే ప్రసవాలు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, వారి ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. “ఈ విధానం మహిళలపై ఒత్తిడి పెంచుతుంది, వారి సమ్మతిని విస్మరిస్తుంది, మరియు మహిళలను స్వయంప్రతిపత్తి గల వ్యక్తులుగా కాకుండా జనాభా విధానానికి సాధనాలుగా చూస్తుంది” అని ముత్రేజా విమర్శించారు. 1994 ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం సంతానోత్పత్తికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు లేదా నిరోధకాలు వద్దు అని స్పష్టంగా నిర్ణయించింది. ఎందుకంటే ఇటువంటి విధానాలు మహిళల స్వయంప్రతిపత్తిని, పునరుత్పత్తి హక్కులను దెబ్బతీస్తాయి. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ విధానం రూపొందించడం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధం.
ప్రాథమిక సమస్యల పరిష్కారమేది?
ఈ విధానంలో అతిపెద్ద లోపం ఏమిటంటే - ఆరోగ్యం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచకుండా కేవలం పిల్లల సంఖ్య పెంచడంపై దృష్టి. “జనాభా సమస్య కాదు, అభివృద్ధి లోపమే ఆంధ్రప్రదేశ్ యొక్క నిజమైన సంక్షోభం” అని ది డిప్లొమాట్ వ్యాసం పేర్కొంది. “ప్రశ్న ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ‘చాలా తక్కువ మంది’ ఉన్నారా, ఇప్పటికే ఉన్నవారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత, గౌరవాన్ని అందించగలిగిందా?”. ఈ విధానం ఆర్థికంగా అభద్రత ఉన్న కుటుంబాలపై జనాభా ఆందోళన భారాన్ని మోపుతోందని, రాష్ట్రం అభివృద్ధి ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ ప్రేరణ కారణం..
ఈ విధానం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయవంతం కావడం వల్ల, భవిష్యత్తులో లోక్‌సభ సీట్ల పునర్వ్యవస్థీకరణ జరిగితే వాటి ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావచ్చు. ఒక ‘బేబీ బూమ్’ రాజకీయ విజయం కూడా కావచ్చు. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవడం సమర్థనీయమా? ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం కోసం ఆందోళన చెందడం సమంజసమే అయినా, దానికి పరిష్కారం ప్రజల శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి ద్వారా రావాలే తప్ప, కేవలం సంఖ్యాపరమైన పెరుగుదల ద్వారా కాదు.
మేధావుల స్పందన..
“నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహార లోపం, ఉద్యోగ అభద్రతతో కుటుంబాలు అలమటిస్తున్న సమయంలో పెద్ద కుటుంబాలను పెంచే బాధ్యత వారిపై ఉందా?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ మణికం ఠాగూర్ ఎఐ, రోబోట్ల యుగంలో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ సృష్టించడంపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక జనాభా ప్రోత్సాహకాలపై కాదని వాదించారు. అంతర్జాతీయ జనాభా శాస్త్రాల సంస్థ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎస్. జేమ్స్ మాట్లాడుతూ “ప్రభుత్వాలు సరైన దిశలో ఆలోచిస్తున్నాయి. కానీ తమ విధానాన్ని వైవిధ్యపరచాలి” అని అన్నారు. ‘‘ప్రత్యక్ష ప్రోత్సాహకాల కంటే తల్లిదండ్రులకు పని-కుటుంబ సమతుల్యత కల్పించడం, లింగ సమానత్వం పెంచడం, పిల్లల పెంపకానికి అనుకూల వాతావరణం సృష్టించడం వంటివి మరింత ప్రభావవంతం’’ అని ఆయన పేర్కొన్నారు.
నవ్యసింధు
8333818985






కామెంట్‌లు (0)