గోదావరి నది పాయల నడుమ ప్రకృతి మాత స్వహస్తాలతో చెక్కిన పచ్చని నందనవనం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం, అద్భుతమైన నోరూరించే సంప్రదాయ రుచుల నిలయం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా. పచ్చని కొబ్బరి తోటలు, కంటిచూపు మేర విస్తరించిన వరి పొలాలు, ప్రశాంతంగా ప్రవహించే కాలువలు, మనసును దోచే హౌస్‌బోట్ ప్రయాణాలతో ఈ ప్రాంతం ప్రతి ఒక్క పర్యాటకుడిని మంత్రముగ్ధులను చేస్తుంది. కేరళ బ్యాక్‌వాటర్స్‌ను తలపించేలా ఉండే కోనసీమ సౌందర్యం పర్యాటక రంగంలో దీనిని 'ఆంధ్రా కేరళ'గా నిలిపింది. ఇక్కడి దిండి రిసార్ట్స్ ఎకో టూరిజం, అంతర్వేది సాగర సంగమ తీరం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామాలు. చారిత్రక అదుర్రు బౌద్ధ స్తూపం ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది. కేవలం ప్రకృతి అందాలే కాకుండా, భక్తిభావం ఉట్టిపడే అధ్యాత్మిక క్షేత్రాలకు ఇక్కడ కొదువ లేదు. వీటన్నింటితో పాటు, కోనసీమ సంస్కృతిలో ఆహారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆత్రేయపురం పూతరేకులు, వర్షాకాలంలో మాత్రమే దొరికే అమృత సమానమైన గోదావరి పులస చేపల పులుసు, పనస ఆకు వంటకం పొట్టిక్కలు ఇక్కడి రుచుల వైవిధ్యాన్ని చాటిచెబుతాయి. సంక్రాంతి వేళ జరిగే ప్రభల తీర్థం లాంటి ఉత్సవాలు, ఇక్కడి ప్రజల ఆత్మీయమైన ఆతిథ్యం, పచ్చటి పల్లె వాతావరణం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
పర్యాటక ప్రాంతాలు
కోనసీమలో పచ్చదనంతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
దిండి రిసార్ట్స్ : గోదావరి నది ఒడ్డున ఉన్న దిండి గ్రామం ఎకో-టూరిజానికి ప్రధాన కేంద్రం. ఇక్కడి హరిత కోకనట్ కంట్రీ రిసార్ట్స్ పర్యాటకులకు హౌస్‌బోట్ ప్రయాణాలు, బోటింగ్, ఆహ్లాదకరమైన బసను అందిస్తుంది. కొబ్బరి చెట్ల మధ్య కాలువల్లో సాగే బోటు ప్రయాణం కేరళ అనుభూతిని ఇస్తుంది.
అంతర్వేది సాగర సంగమం : గోదావరి నది పాయ అయిన వశిష్ట నది బంగాళాఖాతంలో కలిసే 'సాగర సంగమం' ఇక్కడి ప్రధాన ఆకర్షణ. సముద్రం, నది కలిసే చోట నీటి రంగులు మారే అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు. ఇదే అన్నాచెల్లెలి గట్టుగా ఇక్కడ ప్రాచుర్యం పొందింది. ఇక్కడి ప్రశాంతమైన బీచ్ విహారయాత్రకు ఎంతో అనువైనది.
అదుర్రు బౌద్ధ స్థూపం : చరిత్ర ప్రేమికులకు ఇది గొప్ప సందర్శనీయ స్థలం. అశోక చక్రవర్తి కాలానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ మహాస్తూపం, చైత్యాలు, పురాతన అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఇది కోనసీమ యొక్క చారిత్రక వైభవానికి ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధబిక్షువులు ఏటా వందల సంఖ్యలో దీన్ని సందర్శిస్తుంటారు. చరిత్ర పరిశోధక విద్యార్థులకు ఇదొక పుస్తకంలాంటిది.
కోనసీమ ప్రభల తీర్థం : కోనసీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది 'ప్రభల తీర్థం'. ఏటా సంక్రాంతి రోజున జరిగే ఈ వేడుకను చూసేందుకు రెండుకళ్లు చాలవు. ఇది అద్భుత పర్యాటక అనుభూతిని ఇస్తుంది. రంగురంగుల భారీ ప్రభలను కాలువల గుండా, పొలాల గుండా మోస్తూ ఊరేగించే ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తారు.
లొల్ల లాకులు : గోదావరి అందాలు చూడాలంటే ఆత్రేయపురం మండలంలో లొల్ల లాకులను సందర్శించాల్సిందే. ఇక్కడ లాకుల నుంచి పరవళ్లు తొక్కే గోదావరి నీరు పంటకాలువలకు వెలుతుంది. చుట్టూ పచ్చని మొక్కలు, పంట పొలాల మధ్య ఉన్న ఈ లాకులను చూసేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లొల్ల లాకులది ప్రత్యేక స్థానం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల చిత్రీకరణ ఈ లాకుల వద్దే జరిగింది.
ఆధ్యాత్మిక ప్రాంతాలు
కోనసీమ జిల్లాలో ఎన్నో పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. విశిష్ట శిల్పకళ కలిగిన దేవాలయాలు ఎక్కడిక్కడ కనిపిస్తుంటాయి. శతాబ్ధాల నాటి ఈ అపురూప కట్టడాలు చరిత్రకు నిలయాలుగా నిలుస్తున్నాయి. అమలాపురం సమీపంలో అయినవిల్లిసిద్ధి వినాయక ఆలయంఉంది. యాత్రీకులతో నిత్యం రద్దీగా ఉంటుంది.
రావులపాలెం సమీపంలోని ర్యాలి గ్రామంలో జగన్మోహినికేశవస్వామి ఆలయంలో ఉన్న ఈ ఆలయ విగ్రహం దేశంలోనే ఏకైక శిల్పకళా అద్భుతం. ఒకే విగ్రహానికి ముందు వైపు పురుష రూపం (మహావిష్ణువు), వెనుక వైపు స్త్రీ రూపం (జగన్మోహిని) చెక్కబడి ఉంటుంది.
సాగర సంగమానికి సమీపంలో ఉన్న ఈ పురాతన ఆలయం ఎంతో విశిష్టమైనది. ఇక్కడి స్వామివారిని
దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణం చారిత్రక శిల్పకళకు నిదర్శనం. ఐ.పోలవరం మండలం మురముళ్లలో వీరభద్ర స్వామి ఆలయం ఉంది.
ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

కోనసీమ రుచులు
గోదావరి వండ్ర మట్టిలో పండే పంటలు, నదిలో లభించే తాజా చేపలు కోనసీమ వంటకాలకు ప్రత్యేక రుచిని ఇస్తాయి. ఇక్కడి భోజనం, పిండివంటలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి
గోదావరి పులస చేపల పులుసు: కోనసీమ రుచులలో 'పులస చేపల పులుసు' అత్యంత ప్రసిద్ధమైనది. వర్షాకాలంలో గోదావరి నదిలోకి వచ్చే ఈ పులస చేపతో మట్టిపాత్రలో వండే సాంప్రదాయ పులుసు రుచి అమోఘం.
పొట్టిక్కలు : పనస ఆకులను చిన్న బుట్టలుగా కుట్టి, అందులో మినప్పప్పు, బియ్యపు రవ్వతో చేసిన ఇడ్లీ పిండిని వేసి ఆవిరిపై ఉడికిస్తారు. పనస ఆకుల సువాసనతో ఉండే ఈ టిఫిన్ కోనసీమలో మాత్రమే దొరికే ప్రత్యేక వంటకం.
తాపేశ్వరం కాజా: కోనసీమ ప్రాంతానికి చెందిన తాపేశ్వరం మడత కాజా మరియు జ్యూసీ కాజాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ మిఠాయిని పర్యాటకులు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు.
ఆత్రేయపురం పూతరేకులు : కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామం ఈ అద్భుతమైన మిఠాయికి పుట్టినిల్లు. బియ్యం పిండితో తయారు చేసిన పల్చటి పొరల మధ్య నెయ్యి, చక్కెర పొడి లేదా బెల్లం ముక్కలు, జీడిపప్పు, బాదం పలుకులు వేసి దీనిని ఎంతో నైపుణ్యంతో చుడతారు.








కామెంట్‌లు (0)