ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబందరు సాగరం.. హంసలదీవి సంగమం

18 గంటల క్రితం

Holidays-Under-10K-This-February1-popular.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 09:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం సముద్రతీర పర్యాటకానికి ప్రతీక. మంగినపూడి బీచ్‌ ‌చరిత్ర, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత, వినోదం కలగలిపిన ప్రముఖ పర్యాటక కేంద్రం. మచిలీపట్టణానికి 11 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ బీచ్‌ను స్థానికంగా ‘బందరు బీచ్‌’ అని పిలుస్తారు. చల్లటిగాలుల మధ్య విశాలమైన ఇసుక తిన్నెలపై సేదతీరడం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. మంగినపూడి సముద్రతీరం సముద్ర వాణిజ్య చరిత్రతో ముడిపడి ఉంది. డచ్‌, బ్రిటీష్‌ ‌పాలనా కాలంలో వాణిజ్య కార్యకలాపాలకు కీలక కేంద్రంగా ఉంది. ఒకప్పుడు తూర్పు తీరంలో వాణిజ్య కార్యకలాపాలకు మచిలీపట్నం కేంద్రంగా ఉండగా మంగినపూడి తీరం ఆ చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. చారిత్రక ప్రాధాన్యతలు, ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్రం సముద్ర తీరంలో విహరించడం, అలలను వీక్షించడం, సవ్వడిని, సముద్ర గాలిని ఆస్వాదించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. వారాంతాల్లో (శని,ఆది) రోజుల్లో రోజుకు సగటున 1000 మంది, సాధారణ రోజుల్లో 350 నుండి 400 మంది వరకు బీచ్‌‌ను సందర్శిస్తున్నారు. కుటుంబాలతో కలిసి వచ్చేవారు, యువత , పిల్లలు దూర ప్రాంత పర్యాటకులతో తీరం సందడిగా మారుతోంది. ప్రత్యేకంగా మాఘ పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది యాత్రీకులు బీచ్‌‌లో సముద్రస్నానికి వచ్చే సంప్రదాయం ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగానే బీచ్‌‌లోపర్యాటకుల అవసరాలకు దుకాణాలు వెలిశాయి. ప్రయివేటు వ్యక్తులు జీవన బృతికి పిల్లలకు ఆసక్తికలిగించే బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇసుకలో కార్‌ ‌డ్రైవింగ్‌, గుర్రపు రైడింగ్‌ వంటివి ఆకర్షణగా ఉంటున్నాయి. చరిత్ర, సుముద్రతీరం, పర్యాటక, ఆద్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సహజమైన అనుకూలతను మరింతగా వినియోగించుకుంటే మంగినపూడి రాష్ట్రంలోనే ప్రధాన బీచ్‌‌ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశం ఉంది.

గత ఏడాది బీచ్‌ ఫెస్టివల్‌ను అట్టహాసంగా నిర్వహించారు. లక్షలాది మంది సందర్శించారు. ఈ ఏడాది మంగినపూడి బీచ్‌ ‌తీరంలో వినాయకచవితికి 63 అడుగుల మట్టి వినాయక విగ్రహ ప్రతిష్టించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, విశ్రాంతి షెడ్లు, సరైన లైటింగ్‌, పార్కింగ్‌ ‌భద్రత సౌకర్యాలు మరింతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

బ్లూ ప్రాగ్‌ ‌ప్రతిపాదనలు

వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత, సముద్రపు నీటి నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, భద్రత ప్రామాణికంగా, పర్యాటక సౌకర్యాలు తదితర33 ప్రమాణాతో తీర్చిదిద్ది బ్లూ ఫ్రాగ్‌ ‌బీచ్‌‌గా గుర్తించేందుకు ప్రతిపాదనలు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. సమీపంలోనే ఓడరేవు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తీసుకోవడంతో ఈ ప్రాంతంలో సముద్ర జలాలు మట్టితో కలుషితం అవుతాయనే బ్లూ ఫ్రాగ్‌ ‌ప్రతిపాదనలను ఉపసంహరించారు.

krishna distict .jpg

మచిలీపట్నం ప్రయాణానికి జాతీయ రహదారులు

హైదరాబాద్‌-మచిలీపట్నం (ఎన్‌‌హెచ్‌65), ఒంగోలు-కత్తిపూడి (ఎన్‌‌హెచ్‌ 216), పెడన- హనుమాన్‌ ‌జంక్షన్‌, నూజివీడు జాతీయ రహదారి (216 హెచ్‌) మచిలీపట్నానికి అనుసంధానమై ఉన్నాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం నాన్‌‌స్టాప్‌ బస్సులు, మచిలీపట్నం- బీమవరం, ఏలూరు, విశాఖపట్నం, నూజివీడు రవాణా మార్గాల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో మచిలీపట్నం చేరుకుని అక్కడ నుంచి బీచ్‌‌కు వెళ్లిరావవడానికి ఆటోలు, టాక్సీలు సమకూర్చుకోవాలి. మచిలీపట్నం నుండి చిలకలపూడి, తపశపూడి తదితర గ్రామాల మీదుగా మంగినపూడి బీచ్‌‌కు చేరుకుంటారు.

‌తూర్పు తీరంలో ఎత్తైన లైట్‌ ‌హౌస్‌

నౌకాయానానికి దిక్చూచిగా తీరాన్ని గుర్తించేందుకు మంగినపూడి బీచ్‌ ‌సమీపాన లైట్‌ ‌హౌస్‌ ‌నిర్మించారు. రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లైట్‌‌హౌస్‌లోకి సందర్శకుల ప్రవేశానికి అనుమతిస్తారు. బ్రిటీష్‌ ‌కాలం నుంచి మచిలీపట్నం ఓడరేవు ద్వారా విదేశాలకు సరుకులు ఎగుమతి చేసేవారు. అప్పట్లో మచిలీపట్నం సమీపంలోని నాగాయలంక మండలం గిలకలదిండి వద్ద లైట్‌‌హౌస్‌ ‌నిర్మించారు. అది తక్కువ ఎత్తులో ఉండటంతో 1983లో మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ ‌వద్ద 50.56 మీటర్ల ఎత్తు (165.879 అడుగుల)లో మరో లైట్ హౌస్‌ ‌నిర్మించారు. ఇది తూర్పుతీరంలోనే ఎత్తైన లైట్‌ హౌస్‌‌గా గుర్తింపు పొందింది. ఈ లైట్‌ ‌హౌస్‌‌ నుంచి మూడు ఫ్లాష్‌‌లు వస్తాయి. సముద్రంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కనిపిస్తాయి. లైట్‌ ‌హౌస్‌ వెలువరించే ‌ప్లాష్‌‌లు సంఖ్య కాలవ్యవధి ఆధారంగా నౌకాయానం చేసే వారు అది ఏ తీర ప్రాంతమో గుర్తిస్తారు. సముద్రంపై వేటకు వెళ్లి తప్పిపోయిన బోట్లకు సంబంధించి తమ దగ్గరున్న సెల్‌ ‌సిగ్నల్‌ అందక వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో బోట్లపై ఉన్న వారు గమ్యస్థానాలు చేరేందుకు ఉపయోగపడుతుంది. లైట్‌ ‌హౌస్‌‌కు రాడార్‌ ‌వ్యవస్ధను అనుసాంధానం చేసి ఉండటంతో సముద్రంలో తిరిగే అనుమతి లేని బోట్లను గుర్తించి విశాఖపట్నంలోని కేంద్ర కార్యాలయానికి సిగ్నల్‌ ఇస్తుంది. తద్వారా భద్రతా దళాలను సకాలంలో అప్రమత్తం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లైట్‌ ‌హౌస్‌ను బీచ్‌‌తోపాటు సందర్శించడం దానిపై నుంచి సముద్రపు అలలు, నౌకలు సుదూరప్రాంతం వరకు వీక్షించండం వంటివి పర్యాటకులను ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. బంటుమిల్లి, కృత్తివెన్ను తీర ప్రాంతాలు ఆకట్టుకునేలా ఉంటున్నాయి. చినగొల్లపాలెం దీవి సందర్శనీయ ప్రదేశంగా అభివృద్ధి చెందింది.

హంసలదీవి : కోడూరు మండలంలోని హంసలదీవి కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే సాగర సంగమం కారణంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన సముద్రతీరం, నదీ సంగమం, పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

బ్రదర్‌ జోసఫ్‌ తంబి పుణ్యక్షేత్రం : ఉంగుటూరు మండలం పెదఆవుటపల్లిలో ఉన్న బ్రదర్‌ జోసఫ్‌ తంబి పుణ్యక్షేత్రం ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం. దైవసేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి సమాధి ఉన్న ఈ క్షేత్రానికి యాత్రికులు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా నవదిన ప్రార్థనలు, తిరునాళ్లు నిర్వహిస్తారు. ప్రేమ, సేవ, విశ్వాసం వంటి విలువలను ఆయన బోధనలుగా గుర్తుచేసుకుంటారు.

ఘంటసాల-బౌద్ధ వారసత్వానికి చిరునామా : ఘంటసాల చారిత్రక, పురావస్తు ప్రదేశం. ప్రాచీన బౌద్ధ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు ఇక్కడ లభించాయి. స్తూపాలు, శిల్పాలు, పురావస్తు ఆనవాళ్లు ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యాన్ని తీసుకొచ్చాయి. బౌద్ధ వారసత్వ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఘంటసాల ప్రత్యేక అవకాశాలను కలిగి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్