ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తెగిన గాలిపటం

48 నిమిషాల క్రితం

A kite with a severed string
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గగనంలో కెగరేసెను

గాలిపటం బాలుడు!

గాలిపటం స్వేచ్ఛగెగుర

గంతులేసె బాలుడు!!

ఈ దారం తెంపేస్తే

ఎగురునింక స్వేచ్ఛగ

ఇష్టమైన ప్రాంతాలకు

ఏగునూ యథేచ్ఛగ!!

అనుకొని బాలుడు తెంపెను

వెనువెంటనె దారము!

ఏగెవేగ గాలిపటం

ఇంకెంతో దూరము!!

గాలికటూ ఇటూ ఊగి

గాలిపటం ఎవరికి

చిక్కలేదనీ బాలుడు

చింతించెను చివరికి!!

దారం నే తెంపకుంటె

దారి తప్పిపోదుగ!

దారమె ఆధారమనెడి

తలపు నాకు లేదుగ!!

విచ్చలవిడిగా ఎప్పుడు

విహరించగ వీలుగ

అనుసరించు విధానాలు

ఆపేస్తే మేలుగ!!

గాలిపటం దారంలా

నేలకూలకుండా

బంధించును బంధాలే

పక్కకెళ్లకుండా!!

తెగిన గాలిపటంలాగ

తిరగవచ్చు స్వేచ్ఛగ

అనుకొన రాదెవ్వరైన

అదే జీవితేచ్ఛగ!!


​- ‘‘బాలబంధు``

అలపర్తి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

94408 05001.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్