మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఎంతో బాధ్యతతో మాకు విద్యాబోధన అందిస్తున్నారు. చదువుతోపాటు మా ప్రతిభను గుర్తించి, మమ్మల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుర్లపాటి నగేష్ గారు పాఠశాల పురోభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. చదువుతోపాటు ఆటలు, క్రీడాపోటీలు, సామాజిక కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అవకాశాలను కల్పిస్తున్నారు. మా ఆంగ్ల ఉపాధ్యాయులు గుడిపూడి సత్యనారాయణ మాస్టారు కూడా మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. చదువు ఒక్కటే జీవితానికి సరిపోదని, మన చుట్టూ ఉన్న సమాజం, ప్రకృతి, పర్యావరణం, కుటుంబం వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని చెబుతుంటారు. ఆటలు, పుస్తక పఠనం, సామాజిక సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములను చేస్తూ మాతో మమేకమవుతున్నారు. ఆయన బోధనలో చదువు ఒక బాధ్యతగా కాకుండా ఆసక్తిగా మారుతోంది. మాలో పఠనస్థాయి తక్కువగా ఉందని గుర్తించిన సత్యనారాయణ మాస్టారు, దాన్ని మెరుగుపరచాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రంథాలయ బాధ్యతలను నిర్వహిస్తూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుతున్నారు. ప్రతి ఏడాది గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, చిత్రలేఖనం, కథల పోటీలు నిర్వహించి మాలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బహుమతులతో ప్రోత్సహిస్తున్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు, బాలోత్సవాల్లో మేము పాల్గొని సత్తా చాటేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ఆంగ్ల భాషా నైపుణ్యాలతోపాటు భవిష్యత్తులో మాకు ఉపయోగపడే కెరీర్, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత నైపుణ్యాలు, సంభాషణా నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మైండ్ మ్యాపింగ్, కాలిగ్రఫీ, పుస్తక పఠనం, స్కౌట్స్ వంటి విభిన్న కార్యక్రమాల్లోనూ మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నారు. మా పాఠశాల ఉపాధ్యాయులు మాకు పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు... మా ప్రతిభను గుర్తించి, మా భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శకులు. మమ్మల్ని అర్థం చేసుకుని, మా ఆసక్తులకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్న వారి కృషి మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు తుర్లపాటి నగేష్ గారి సహకారం, ప్రోత్సాహం మరువలేనిది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మా మంచి మాస్టార్లకు మా హృదయపూర్వక అభినందనలు. వారు చూపిస్తున్న మార్గంలో నడిచి మంచి విద్యార్థులుగా, బాధ్యతగల పౌరులుగా ఎదగడమే వారికి మేమిచ్చే నిజమైన గౌరవం.
జి. హర్షవర్ధన్
7వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మందడం
తుళ్లూరు మండలం,
గుంటూరు జిల్లా







కామెంట్‌లు (0)