ఆశీర్వదించే మట్టి చేతుల వెనక
అస్థిపంజరం అన్నం పెట్టే తండ్రిదే!
గ్రామీణ భారతం వెలిగినప్పుడు
ప్రతి గుండెల్లో ఓ వెలుగు వెలిగేడు_
పొలాలన్నీ హలాల దున్నీ
ధాన్యరాశులు కురిపించి
ఖాళీ కడుపుతో కాలే కడుపుల్ని నింపేడు
నాగేటిసాలల్లో విత్తనమై నిదురించి
నల్లని నేలతల్లిపై తెల్లని మేఘమై కురిసి
తొలకరి ఝరిలో మొలకై లేచి
పచ్చని పైరులా పరుచుకున్నాడు
ఆకాశం నుండి మాటలు విని భూమికి
వొప్పజెప్పి మట్టి తడిసే శబ్దం కోసం
చెవులు రిక్కించి భగీరథుడయ్యేడు
గింజగింజలో గుంజాటన పడి
పంట యజ్ఞఫలాన్ని మనకు దారవోశాడు
పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలు
అన్నదాతకే అన్ని అరిష్టాలు
కొత్త చీడలు పాత దళారులు
అతివృష్టి అనావృష్టి
పట్టించుకోని ప్రభుత్వాలు
కాలగర్భంలో తండ్రి స్థానం తలకిందులై
రైతంటే కూలీ అయ్యేడు..
ఇంటి ముందు విరిగిన బండి చక్రం
యుద్ధంలో కూలిన కర్ణుడి రథచక్రంలా ఉంది
చిరిగిన పిల్లల బతుకు పుస్తకాలు
మాసికల చీరలో మమతలు మరచిన
కష్టాల సహభాగిని
ఇల్లంతా బావురుమన్నట్టుంది
ఎముకల గూడులా వొరిగిపోయినా
కరిగిన కలలాంటి జీవితంలో
ఎన్ని కోల్పోయినా నేలతల్లి పాదాలొదలక
ధరిత్రిపై ధాన్యరాశులు కురిపించేందుకు
భూమ్యాకాశాల మధ్య భుజశాలిలా
మూడు కాలాలు ఆరు ఋతువులు
గెలుపోటముల అతీత యుద్ధం చేస్తూనే ఉన్నాడు
భీమవరపు పురుషోత్తమ్
9949800253









కామెంట్‌లు (0)