శరత్కాలపు వెన్నెల తాగి
మత్తుగా పడుంది
ఊరచెర్వు
చెట్టుకింద రాలిపడ్డ
ఎండుటాకుల్ని
ఓ సాయంత్రం గాలి తుడిచేసింది
తెల్లకాగితమిచ్చాను
ఇంద్రధనుస్సును చేసి
నాచేతిలో పెట్టాడు
ఇసుకలో తాబేలు పిల్లలు
వాటి మధ్య
నేను ఓ సెల్ఫీ
ఎండిన కొమ్మన
క్షణం పూసినపువ్వు
సీతాకోకరెక్కలతో ఎగిరిపోయింది
గడ్డి మొలిచి
మట్టి సమాధిని
కప్పేసింది
గేదె కొమ్ము చివర
వాలింది సీతాకోక
మేయటం ఆపలేదు
గడ్డిపూవు
గాలికి ఊగుతుంది
అందం రెట్టింపు
నేలపూరి రత్నాజీ
8919998753









కామెంట్‌లు (0)