ఏక కణం ఎన్ని కోట్ల ముక్కలవుతూ
పొందిన పరిణామ రూపాన్నో నేను!
మిధ్యా పాదాల మీద నడుస్తూనే
నిజాల జాడలను వెతుక్కుంటూ
పురా ఖండపు చిక్కటి అడవులు
దాటిన ఆదిమ అడుగును_
నిలకడలేని అనేక ఆకలి వేటల
వెతుకులాటకు దొరికిన
పంట భూమిని
దయలేని రాత్రుల చీకటి గోడలను
తడుముకున్న తరాల తండ్లాటను
నల్లని నా చేతి వేళ్ళకు తగిలిన_
ఎర్రపొద్దును_
కడుపులో గాజు పెంకుల్లా గుచ్చుకునే
దుఃఖపు ముక్కలను దాసుకుంటూ
మళ్లీ మళ్లీ చిరునవ్వు తొడిగే మొలకను
కాలంతో కలబడుతూ_
అవసరాల వెనుక అడుగులేసుకుంటూ
ప్రతికూల క్షణాలను చెలిగి కట్టుకుంటున్న
మనుగడ గూడును_
ఆగని గుండె చప్పుడులో వినబడుతూ
ఆరని మెదడు పొరల్లో మండుతూ
నిశ్శబ్దాల్లో _
కాలాన్ని శబ్దాల్లో ఒంపుతున్నాను
మట్టికి స్తన్యమిచ్చే చినుకునూ
చిగురుకు జన్మనిచ్చిన మట్టినీ
మట్టిని బతుకుచేస్తున్న
మనిషినీ నమ్ముకొని
నెరవేరని కలల కోసం
ఇంకా ఇంకా__
ఎదురు చూస్తున్నాను
నేనుగా నువ్వుగా
అతడుగా ఆమెగా
అందరూ కలిసిన మనంగా
సామూహిక స్వప్నాన్ని_
గానం చేస్తూనే ఉంటాను
_ రహీమొద్దీన్_
9010851085








కామెంట్‌లు (0)