ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనురగల ధార

1 గంట క్రితం

alalu nuraga .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 08:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​క్యూబెక్‌ కొండల మధ్య తెరచుకున్న

ఒక తెల్లని కిటికీలా

నా ముందుకొచ్చింది

మాంట్‌మొరెన్సీ జలపాతం.

​

ఎత్తైన రాతి అంచు నుంచి

ఆకాశమే ఒక్కసారిగా విరిగి

వేలాది వెండి దారాలై

భూమివైపు పరుగెత్తినట్టుంది.

​

పడుతున్న నీటి గర్జనలో

కొండలు మేల్కొంటున్నాయి;

నురగల మధ్య ఎగసే తుంపర్లు

నా ముఖాన్ని తాకి

ప్రకృతి పలకరింపులై మారుతున్నాయి.

​

సూర్యకిరణం తాకిన చోట

నీరు వజ్రాల్ని చల్లుతుంది;

గాలిలో తేలిన తుంపర్ల మధ్య

ఇంద్రధనుస్సు

క్షణకాలం తన రంగుల్ని విప్పుతుంది.

​

పై వంతెన మీద నిలబడి

కిందికి చూస్తే..

ఆకాశం భూమికి రాస్తున్న

ఒక తెల్లని ఉత్తరం దృశ్యమానమవుతోంది

​

కింద ప్రవహించే నది

జలపాతపు జ్ఞాపకాన్ని మోస్తూ

దూరంగా సాగిపోతుంటే,

నా చూపు మాత్రం

ఆ నీటి పతనంలోనే నిలిచిపోయింది.

​

మాంట్‌మొరెన్సీ నన్ను నాలోంచి

ప్రవాహంలోకి ఒంపుతోంది

​

ఆ తెల్లని జలధార

నా కళ్లలో కాదు

నా జ్ఞాపకాలలో

ఇప్పటికీ పడుతూనే ఉంది

​బండ్ల మాధవరావు

88976 23332


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్