న్యూఢిల్లీ : ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీకి బిజెపికి, దాని మిత్రపక్షాలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం గురించి మరింత మందికి తెలిసేలా చేస్తున్నందుకు ఆ పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, నిబంధనల ఉల్లంఘన, ప్రశ్నించిన వారిపై లాఠీచార్జి వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ ఆదివారం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రజల ఓట్లను దొంగిలించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా సహించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే 'ఓటు కాపాడండి.. దేశాన్ని కాపాడండి' మార్చ్, మెగా ర్యాలీలో విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు సహా ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ ఉన్నవారంతా పాల్గొనాలని రాహుల్ కోరారు. 'ఓటు మీది.. పోరాటం కూడా మీదే' అని పేర్కొన్నారు.
నవంబర్ 1న నిర్వహించే 'ఢిల్లీ చలో మార్చ్'ను ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పార్టీ చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలోనూ, 'ఓటు దొంగలను అధికారం నుంచి తరిమికొట్టడంలోనూ, ప్రతిపక్ష కూటమి ఐక్యంగా ఉందని తమ నవంబర్ 1 ర్యాలీ బలమైన సందేశాన్ని పంపుతుందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు అక్టోబర్ 30న సిఇసి జ్ఞానేష్ కుమార్‌పై 'బహిరంగ అభిశంసన' కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి యోచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఎంపీలు, అగ్రనేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయనున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా బహిరంగ తీర్పును ప్రకటించనున్నాయి.







కామెంట్‌లు (0)