ఓ పక్క వర్షాలు పడుతున్నాయి. చినుకుల వేళ కాసింత రోటిపచ్చడి చేసుకుంటే.. వేడి వేడి అన్నంతో ఆ రుచే వేరు. అలాగే రోజూ ఒకే రకమైన రోటి పచ్చళ్లు తింటే బోర్ కొడుతుంది. వంటింట్లో ఉన్న వాటితోనే కొత్త రుచులు చేయొచ్చు. టమాటాలో పొగ వాసన, పుట్టగొడుగుల్లో క్రీమీ టేస్ట్, మొక్కజొన్నలో తియ్యటి మజా.. ఈ మూడు రోటిపచ్చళ్లు భోజనానికి కొత్త రుచిని ఇస్తాయి. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించే ఈ వెరైటీ పచ్చళ్లను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
కాల్చిన టమాటాలతో..
కావాల్సినవి: పెద్ద టమాటాలు - 4, వెల్లుల్లి రెబ్బలు – 8, ఎండుమిర్చి –8 , పచ్చిమిర్చి – 2, జీలకర్ర – స్పూను, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు, నూనె – రెండు స్పూన్లు, ఆవాలు – అరస్పూను, మినప్పప్పు – స్పూను, శనగపప్పు – స్పూను, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
తయారీ : టమాటాలను బాగా కడిగి, నేరుగా మంటపై అన్నివైపులా సమంగా కాల్చాలి. పై తొక్క నల్లగా కాలి, లోపల టమాటా మెత్తబడే వరకూ కాలిస్తే మంచి పొగ వాసన వస్తుంది. చల్లారిన తర్వాత పైతొక్కను తీసేయాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా కాల్చుకుంటే పచ్చడికి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్రను వేయించి, చల్లారనివ్వాలి. మిక్సీజార్‌లో వేయించిన మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు వేసి ఒకసారి తిప్పాలి. తర్వాత కాల్చిన టమాటాలు, కొత్తిమీర వేసి, మరీ మెత్తగా కాకుండా, కచ్చాపచ్చాగా నూరుకోవాలి. చివరగా పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో తాలింపు వేసి, పచ్చడిలో బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన టమాటా రోటిపచ్చడి రెడీ.

పుట్టగొడుగులతో
కావాల్సినవి: పపుట్టగొడుగుల – 250 గ్రాములు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – 8, ఎండు మిర్చి – 6, పచ్చిమిర్చి – 2, జీలకర్ర – స్పూను, ధనియాలు – స్పూను, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు, నూనె – మూడు స్పూన్లు, ఆవాలు – అరస్పూను, మినప్పప్పు – స్పూను, శనగపప్పు – స్పూను, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
తయారీ : ముందుగా మష్రూమ్‌లను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి. వాటిని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి, ఎండు మిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి, బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, మష్రూమ్ ముక్కలు వేసి మధ్య మంటపై 8–10 నిమిషాలు వేయించాలి. మష్రూమ్‌లోని నీరు పూర్తిగా ఆవిరై, అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయిస్తే పచ్చడికి మంచి రుచి వస్తుంది. చల్లారిన తర్వాత మిక్సీజార్‌లో ముందుగా వేయించిన ఎండు మిర్చి, జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఉప్పు వేసి ఒకసారి తిప్పాలి. తర్వాత వేయించిన మష్రూమ్ మిశ్రమం, కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలా రుబ్బుకోవాలి. చివరగా తాలింపు సిద్ధం చేసి, పచ్చడిపై పోసి బాగా కలపాలి. ఈ పచ్చడిలో మష్రూమ్‌ల వల్ల ప్రోటీన్, బి-విటమిన్లు, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇది రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేసే ప్రత్యేకమైన రోటి పచ్చడి. ఈ పచ్చడిని వేడి అన్నం, చపాతీ, దోసె, రాగి సంగటి, జొన్న రొట్టెతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
చిట్కా: మష్రూమ్‌లను కడిగిన వెంటనే ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు. అలాగే వేయించేటప్పుడు వాటిలోని తేమ పూర్తిగా ఆవిరయ్యే వరకూ ఉడికిస్తే పచ్చడి నీరుగా కాకుండా చిక్కగా, ఘుమఘుమలాడే రుచితో వస్తుంది.
మొక్కజొన్న–కొబ్బరితో
కావాల్సినవి: ఉడికించిన తీపి మొక్కజొన్న గింజలు – కప్పు, కొబ్బరి తురుము – ¾ కప్పు, పచ్చిమిర్చి – 4, ఎండు మిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 5, జీలకర్ర – స్పూను, అల్లం – చిన్న ముక్క, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు, నూనె – రెండు స్పూన్లు, ఆవాలు – అరస్పూను, మినప్పప్పు – స్పూను, శనగపప్పు – స్పూను, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
తయారీ : ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె పోసి, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్రను స్వల్పంగా వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ వేయించాలి. చివరగా కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం మాత్రమే కలిపి దించాలి. ఎక్కువసేపు వేయిస్తే కొబ్బరి సహజ రుచి తగ్గిపోతుంది. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో చింతపండు, ఉప్పు, కొత్తిమీర వేసి, అవసరమైతే కొద్దిగావేడినీరు పోసి, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా రుబ్బుకోవాలి. చివరగా పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువతో తాలింపు చేసి, పచ్చడిపై పోసి బాగా కలపాలి. అంతే మొక్కజొన్న, కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిలో ఫైబర్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో రుచితో పాటు పోషకాలు కూడా లభిస్తాయి.








కామెంట్‌లు (0)