ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసొరకాయతో సూపర్‌గా..

2 గంటల క్రితం

botel gourd.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:59 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నీటి శాతం అధికంగా ఉండే సొరకాయలో విటమిన్ ‘సి’, ‘బి’ సమూహం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలతో కూడిన ఈ కూరగాయ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచడంలో, బరువు నియంత్రణలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ సహాయపడుతుంది. సొరకాయతో కేవలం పప్పు లేదా కూర మాత్రమే కాదు.. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వర‌కూ ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు చేయొచ్చు. సొరకాయ దోశ, సొరకాయ–పచ్చిమిరపకాయ కూర, పచ్చడి, కోఫ్తా, హల్వా, సూప్, పరాటా వంటి ఎన్నో వెరైటీలతో కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యంతో పాటు రుచినీ అందించొచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

SORAKAYA DOSAA

దోశెలు..

కావాల్సినవి: సొరకాయ తురుము – 2 కప్పులు, బియ్యం – 2 కప్పులు, శనగపప్పు – ½ కప్పు, పచ్చిమిర్చి – 4, అల్లం – 1 అంగుళం ముక్క,

జీలకర్ర – స్పూను, కొత్తిమీర తరుగు – 2 స్పూన్లు, ఉల్లిపాయల ముక్కలు- అరకప్పు, క్యారెట్‌ ‌తురుము- అరకప్పు, ఉప్పు – తగినంత, నూనె – దోశెలు కాల్చడానికి.

తయారీ : బియ్యం, శనగపప్పును శుభ్రంగా కడిగి 5–6 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత నీరు వంపి, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా రుబ్బాలి. ఈ పిండిలో జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయముక్కలు, క్యారెట్‌తురుము, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. పెనాన్ని వేడి చేసి, కొద్దిగా నూనె రాసి, ఒక గరిటె పిండిని పోసి, గుండ్రంగా పలుచగా పరచాలి. అంచుల వెంట కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, మధ్య మంటపై రెండువైపులా బంగారు రంగు వచ్చే వరకూ కాల్చి, దోశెను తీసి ప్లేట్‌‌లోకి సర్వ్‌ ‌చేసుకోవాలి. వేడివేడిగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ లేదా టమాటా చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కరకరలాడే ఈ దోశెలు, బయట క్రిస్పీగా – లోపల మెత్తగా ఉండి సొరకాయలోని తేమ వల్ల దోశెలు మంచి రుచితో పాటు పోషకవిలువలను కూడా అందిస్తాయి.

sorakaya pacchikaram kura

పచ్చికారం కూర

కావాల్సినవి: లేత సొరకాయ – 500 గ్రాములు (రౌండు ముక్కలుగా తరగాలి), పచ్చిమిరపకాయలు – 10, ఉల్లిపాయలు – 2, అల్లం – 1 అంగుళం ముక్క, చిన్న వెల్లుల్లి రెబ్బలు – 8, వేయించిన పల్లీలు – ¼ కప్పు, ఎండుకొబ్బరి తురుము – ¼ కప్పు, జీలకర్ర – స్పూను, ధనియాల పొడి – స్పూను, గరం మసాలా పొడి – ½ స్పూను, కొత్తిమీర – ఒక చిన్నకట్ట, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె – 3 స్పూన్లు.

తయారీ : ముందుగా మిక్సీ జార్‌లో పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు, ఎండుకొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి, చిక్కటి పచ్చికారం సిద్ధం చేసుకోవాలి. లేత సొరకాయ ముక్కలను చెక్కు తీయకుండా, గుడ్రంగా ముక్కలను కట్‌ ‌చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి, నూనె పోసి, వేడి చేసి, సొరకాయ ముక్కలను ఐదు నిమిషాలు వేయించి, తీసి ప్లేట్‌‌లో పెట్టాలి. ఆ బాండీలోనే సిద్ధం చేసుకున్న పచ్చికారాన్ని వేసి మెల్లగా కలపాలి. తక్కువ మంటపై మరో 5–7 నిమిషాలు ఉడికించాలి. అందులో సొరకాయ ముక్కలను వేసి, మసాలా సొరకాయకు బాగా పట్టేలా చేయాలి. చివరగా కొత్తిమీర చల్లి దింపేయాలి. వేడివేడిగా అన్నం, నెయ్యి, చపాతీ, జొన్న రొట్టె లేదా రాగి సంగటితో వడ్డిస్తే ఈ లేత సొరకాయ పచ్చికారం కూర అద్భుతంగా ఉంటుంది.

sorakaya masala kura

మసాలా కూర

కావాల్సినవి: సొరకాయ – 500 గ్రాములు, ఉల్లిపాయలు – 1, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – స్పూను, పసుపు – ¼ టీస్పూన్, కారం – అరస్పూను, ఉప్పు – తగినంత, కొత్తిమీర – గుప్పెడు, నూనె – 3 స్పూన్లు.

మసాలా గ్రేవీ కోసం: ధనియాలు – స్పూను, మిరియాలు – ½ స్పూను, జీలకర్ర – స్పూను, యాలకులు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఎండుకొబ్బరి పలుకులు – 2 స్పూన్లు, జీడిపప్పు పలుకులు – 5, టమాటా ముక్కలు – 2, పచ్చిమిర్చి – 2.

తయారీ: ముందుగా బాండీలో కొద్దిగా నూనె వేసి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్కలను స్వల్పంగా వేయించాలి. తర్వాత ఎండుకొబ్బరి పలుకులు, జీడిపప్పు వేసి, లేత బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. వీటిని మిక్సీజార్‌‌లో వేసి, గ్రైండ్‌ ‌చేసుకోవాలి.

చివరగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్‌ ‌చేసుకోవాలి. అదే బాండీలో కొద్దిగా నూనె పోసి, వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత సొరకాయ ముక్కలు వేసి, మెత్తబడే వరకూ ఉడికించి, పసుపు, ఉప్పు, కారం, వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత మసాలా గ్రేవీ వేసి ఉడికించాలి. కొద్దిగా నీరు పోసి, కూర దగ్గరయ్యేంత వరకూ ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లి దింపేయాలి. వేడివేడిగా అన్నం, చపాతీ, పూరీ, జీరా రైస్, నాన్ లేదా ఫుల్కాలతో వడ్డిస్తే ఈ సొరకాయ మసాలా కూర ఎంతో రుచిగా ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్