వరండాలో కూర్చోని న్యూస్ పేపర్ చదువుతున్న మధుకు గేటు దగ్గర అలికిడి అవడంతో తలెత్తి, గేటు వైపు చూశాడు. ఒక మహిళ, ఒక పురుషుడు గేటు తీసుకొని లోపలకి వస్తున్నారు. మధు చదవుతున్న న్యూస్ పేపర్ తీసి పక్కన పెట్టి వాళ్ళ వైపు దృష్టి సారించాడు.
‘సార్, ఇల్లు అద్దెకు ఉన్నది అని బోర్డు పెట్టారు. ఉన్నదా?` అడిగాడు వచ్చిన వ్యక్తి.
మీరు..!’ అంటూ _అడిగాడు మధు. `సారీ సార్..! నా పేరు స్వరూప్, ఈవిడ మా ఆవిడ శాంతి. నేను గ్రూప్ 2 ఆఫీసర్‌ను._అద్దె ఇంటి_కోసం తిరుగుతూ ఉంటే బోర్డు కనిపించింది అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు స్వరూప్.
‘రండి సార్..!’ అంటూ కుర్చీ ఆఫర్ చేసి, తాను వేరే కుర్చీ లాక్కొని వారికి ఎదురుగా కూచున్నాడు మధు.
‘సార్ మాదేమో చిన్న ఇల్లు, మీరేమో గ్రూప్ సర్వీస్ ఆఫీసర్ని అంటున్నారు. మీ హోదాకు మా ఇల్లు సరిపోదేమో..! అని అంటుండగా.. స్వరూప్ అడ్డుపడుతూ ‘పరవాలేదు, మీకు ఇవ్వడం ఇష్టం అయితే మాకు ఇబ్బంది లేదు’ అన్నాడు.
వీళ్ళు మాట్లాడుతూ ఉండగా కాఫీ తీసుకొని మేఘన వస్తూనే ‘ఎవరెవరు ఉంటారు ?’ అని అడిగింది.
‘మేము, మా అత్తగారు, మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.` అని శాంతి చెబుతుండగా మధు అప్రయత్నంగా ‘అత్తగారు కూడా మీతో కలసి ఉంటారా? ఎంత అదృష్టవంతురాలు ఆమె` అని అంటుండగా.. మేఘన ఒక్కసారి మధువైపు ఉరిమి చూడడంతో మధు టాపిక్ మారుస్తూ.. అద్దె వివరాలు చెప్పాడు.
రేపు సామాన్లతో వస్తాం అంటూ అడ్వాన్స్ ఇచ్చారు. మేఘన జోక్యం చేసుకుంటూ రేపు అంటున్నారు..! మంచి రోజు కాదు కదా..! ఆదివారం, పైగా అమావాస్య..!’ అని మాట్లాడుతుండగా.. స్వరూప్ కల్పించుకొని `మాకు ఆ పట్టింపులు ఏమీ లేవండీ ! అంటూ తిరిగి సమాధానం కోసం వేచి చూడకుండానే వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు స్వరూప్ దంపతులు.
వాళ్ళు బయటకు నడవగానే ‘కనీసం వాళ్ళ కులం ఏమిటో? గోత్రం ఏమిటో? ఏమి కనుక్కోకుండా అడ్వాన్స్ తీసుకున్నారు.` అంటూ _మేఘన ప్రశ్నల వర్షం కురిపించింది.
కులగోత్రాలతో పనేమిటి?_చక్కగా వాళ్ళు ఇద్దరు, వాళ్ళకు ఇద్దరు, పైగా వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళతోనే ఉంటుంది. అది చాలదా? వాళ్ళు మంచి మనుషులు అని చెప్పడానికి, అంటూ మేఘన సమాధానం, స్పందన చూడకుండానే టక్కున లేచి లోపలికి వెళ్ళాడు మధు. `అవును మీ అమ్మ మంచిదే, నేను మాత్రమే గయ్యాళిని. తల్లితో కలసి ఉండడం అన్న ఒక్క విషయం నచ్చినట్లు ఉంది తమరికి. ప్రతి అంశంలోనూ అత్తగారి ప్రస్తావన రావాల్సిందే’ అంటూ విసుక్కుంది మేఘన.
మధు ఒక స్కూల్ టీచర్. మధు, మేఘన దంపతులకు ఒక బాబు, ఒక పాప. జ్యోతి మధు తోబుట్టవు. తండ్రి మాధవరావు కాలం చేసిన తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న ఆస్తులను ఆయన అక్క, మధు ఇద్దరూ సరి సమానంగా పంచుకున్నారు. తన జీతం మీద లోన్ పెట్టి, పిత్రార్జితం కలిపి తన గ్రామానికి పక్కనే ఉన్న నగరంలో రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నాడు. తల్లి వైదేహి కూడా తనతో పాటు ఉంటూ వచ్చింది. ఆస్తి సమానంగా పంచుకున్న తర్వాత తల్లి ఇద్దరి దగ్గర సమానంగా ఉండాలి అనే లాజిక్ తో మేఘన మధుతో గొడవ పెట్టుకుంది. జ్యోతి అత్త కూడా జ్యోతి వాళ్ళతోనే ఉండడంతో వియ్యపురాళ్ళు ఇద్దరికీ సరిపడకపోవడంతో జ్యోతి తన తల్లిని తనతో ఉంచుకోలేని పరిస్థితి. ఈ గందరగోళ పరిస్థితి వల్ల తన తల్లిని అనివార్యంగా వృద్దాశ్రమంలో చేర్చి, అప్పుడప్పుడు వెళ్ళి చూసి, వస్తూంటాడు మధు.
చెప్పిన ప్రకారం స్వరూప్, శాంతి, తల్లి, ఇద్దరు పిల్లలతో మధు వారి ఇంటిలో చేరారు. _చాలా తక్కువ సామాన్లతో వచ్చారు. ఒక్క _దేవుడి ఫోటో కూడా లేదు. కనీసం పాలు కూడా పొంగించలేదు. నేరుగా సామాన్లతో ఆదివారం, అమావాస్య రోజు వచ్చారు. అని మేఘన నసుగుడు మొదలుపెట్టింది. మధు మనకు కావలసింది అద్దె. ఇల్లు శుభ్రంగా ఉంచడం, ఇరుగు పొరుగుతో బాగుండడం, మిగిలిన విషయాలు మనకు ఎందుకు..?`అని మేఘనను వారించాడు మధు.
వారు ఇంట్లో చేరిన దగ్గర నుంచి ఒక క్రమ పద్దతిలో వారి రోజువారీ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మధు దంపతులకు, పిల్లలకు చాలా ఆసక్తిని రేకెత్తించాయి. అయిదుగురు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి, ఒక గంట అందరూ కలిసి వాకింగ్ చేస్తారు. అటు పైపనులను విభజన చేసుకొని, వారానికి ఇద్దరు చొప్పున చేసుకుంటారు. అందరూ అన్ని పనులూ చేస్తారు. ఒక వారం ఒక ఇద్దరు వంటపని చేస్తే, మరొక ఇద్దరు ఇంటిపని చేస్తారు. మరొకరు అనుబంధ పనులు చేస్తారు. అందరూ అన్ని పనులు చేయాల్సిందే. ఎవరికి ఇగోలు లేవు. ఉదయం టిఫిన్ అందరూ కలిసి చేస్తారు. మధ్యాహ్నం ఎవరి క్యారేజీ వారిదే. పిల్లలు దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు సైకిల్ మీద వెళతారు. స్వరూప్ తన ద్విచక్ర వాహనం మీద ఆఫీసుకు వెళతాడు. ఆయన హోదాకు ప్రభుత్వ వాహనం వాడే అవకాశం ఉన్నా, ఒక్క రోజు కూడా ప్రభుత్వ వాహనంలో ఇంటికి రావడం కానీ, ఆఫీసుకి పోవడం కానీ జరగలేదు. శాంతి, శాంతి అత్త ఇదరూ స్కూటీ మీద పిల్లలు వెళ్ళగానే వెళతారు. సాయంత్రం పిల్లలు వచ్చే సమయానికి ఇల్లు చేరుతారు. సాయంత్రం అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. వారి జీవన విధానం మేఘన, మధులోనే కాదు వాళ్ళ పిల్లలలో, చుట్టు పక్కల ఇళ్ళల్లో కూడా చర్చ జరగడానికి కారణం అయ్యింది. ఎవరిని ఏమి అడిగినా నవ్వుతూ సమాధానం ఇస్తారు. అయిదుగురు మధ్య అద్బుతమైన పరస్పర అవగాహన. ప్రేమ, సమన్వయం. భార్య, భర్త అంటే ఇలా ఉండాలి, అత్త కోడలు అంటే ఇలా ఉండాలి, అన్నాచెల్లి అంటే ఇలా ఉండాలి, అమ్మకొడుకు అంటే ఇలా ఉండాలి. తల్లి తండ్రులు, పిల్లలు అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంది వారి జీవన విధానం. అసలు ఆ కుటుంబమే ఒక కొత్త నమూనాగా ఉంది. రెండు మూడు నెలలు గడిచినా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులు కనపడలేదు. మధు, మేఘనలు కూడా వారి జీవన విధాన నమూనాను అనుకరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మధు కూడా ఇంతకు ముందులా కాకుండా మేఘనకు వంటపనిలో సహాయం చేయడం మొదలుపెట్టాడు. పిల్లలను కూడా ఇంటిపనిలో భాగస్వామి చేయడం మొదలు పెట్టారు. వీళ్ళలో మార్పుతో పాటు, స్వరూప్ కుటుంబం గురుంచి తెలుసుకోవాలనే తపన మధు, మేఘనలలో ఎక్కువ అయ్యింది. ఇరుగు పొరుగు వారు కూడా స్వరూప్ కుటుంబ వివరాల ఆడంబరాల్లేని ఆదర్శ కుటుంబం...
గురుంచి ఆరాలు తీయడం మొదలైంది. మధు తన పరిచయాల ద్వారా పిల్లల స్కూల్లో వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. మేఘన శాంతి, వాళ్ళ అత్తతో మాటల మధ్య ప్రశ్నలు తొంగి చూస్తున్నాయి. పిల్లల చదువు, ఆటల మధ్య కూడా ఇదే పద్దతి. ఈ విషయాలు అన్నీ స్వరూప్ దృష్టికి వచ్చాయి. ఒక రోజు_మధు, మేఘనలను కూర్చో బెట్టి స్వరూప్ తన జీవిత కథను చెప్పడం మొదలు పెట్టాడు.
నాది ఏ ఊరో, నా తల్లితండ్రులు ఎవరో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసేసరికి నా అడ్రస్ కేరాఫ్ రైల్వే ఫ్లాట్ ఫామ్. కొంతమంది మా చేత బిక్షాటన, దొంగతనాలు చేయించి, మాకు ఆహారం పెట్టి మేము సంపాదించిన మొత్తాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. రాత్రి పూట మా నివాసం రైల్వే ఫ్లాట్ ఫామ్. మాలాంటి పిల్లల పరిస్థితి చూసి, శరత్ బాబు గారు అనే _రైల్వే ఉద్యోగి మాకోసం నెల్లూరు జిల్లా, అల్లూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో ఒక ఆశ్రమం నిర్మించారు. మా బ్యాచ్ పిల్లలను ఆయన అక్కడికి తీసుకెళ్లారు. ఆయన తన జీతంలో అధికభాగంతో పాటు, దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో మా లాంటి ఫ్లాట్ ఫామ్ పై _తిరిగే పిల్లలకు ఆశ్రయం కల్పించారు. అక్కడ మా జీవితాన్ని ఒక క్రమ పద్దతిలో, క్రమశిక్షణతో సాగేలా చేశారు ఆ మహానుభావుడు. అక్కడ అందరం అన్ని పనులు చేయాలి. ప్రతి వారం ఒక్కొక్క టీం, ఒక్కొక్క బాధ్యత. అక్కడ జీవితం విలువ, విలువలతో జీవించడం ఆ మహానుభావుని నీడలో నేర్చుకున్నాం. ప్రభుత్వ పాఠశాల, కాలేజీలో చదువుకొని గ్రూప్ సర్వీసెస్ కు ఎంపిక అయ్యాను. నా మొదటి పోస్టింగ్ ఆఫీసు లో స్వీపర్ మా అమ్మ ఫాతిమా. ఆమెకు పిల్లలు లేరు. ఆమె భర్త మద్యానికి బానిస అయ్యి చనిపోయాడు. జీవనం కోసం అక్కడ రోజువారి కూలీగా _ఆఫీసు ఊడ్చే పని చేస్తూ ఉండేది. ఆమె నాకు ఆ ప్రదేశంలో ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి. ఇక నా భార్య శాంతి _ఆమె ఒక అనాధ. ఆమె తండ్రి, తల్లిపై అనుమానంతో ఆమెను కడతేరిస్తే, ఆయన జైలు పాలయ్యాడు. బంధువులు ఎవరి దగ్గర ఆమెకు ఆశ్రయం దొరక్కపోవడంతో ఆమె మేనమామ ఆమెను అనాధ ఆశ్రమంలో చేర్చారు. ఆమె దూర విద్య పద్దతిలో ఎం.ఎ.ఇంగ్లీషు చదివింది. నేను నా విధి నిర్వహణలో భాగంగా అనాధ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆమె పరిచయం అయ్యారు. అక్కడ ఆశ్రమ నిర్వాహకుల ముందు ప్రతిపాదన పెట్టి, ఆమె అంగీకారంతో ఇద్దరం పిల్లలు వద్దు అనే షరతు మీద మేము రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ ప్రస్తుతం శాంతి పార్ట్ టైమ్ ఉద్యోగం_చేసే కాలేజీలోనే _బి ఏ చదువుతూ ఉన్నది. ఈ పిల్లలు ఇద్దరూ మా పెళ్ళినాటికి అనాధ ఆశ్రమంలో చేరిన అనాధలు. చట్టప్రకారం వారి ఇద్దరినీ మేము దత్తత తీసికున్నాం. మేము ఎవరం ఏ కులమో, ఏ మతమో, ఎవరికి ఏమి అవుతామో అన్న ఆలోచన ఎప్పుడూ మా మధ్య రాదు. ఒకరి కోసం ఒకరం అందరం కలిసి _జీవిస్తున్నాం. ఎవరికీ ఎవరి మీద అధికారం, ఆధిపత్యం లేదు. అందరం ప్రేమను పంచుకుంటూ, ప్రతి క్షణం ఒకరికి ఒకరం కృతజ్ఞతగా ఉంటూ అందరం కలిసి ఉంటాం. మాకు భవిష్యత్ మీద ఆశ తప్ప, ఆందోళన లేదు. మాకు వచ్చే ఆదాయంలో మా కుటుంబ కనీస అవసరాలు తీర్చుకుంటూ మిగిలిన మొత్తాలను సమాజానికి ఉపయోగిస్తాం. ’ అంటూ తన గతాన్ని విన్పించాడు స్వరూప్. చెమర్చిన కళ్ళతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు మధు. మేఘన కూడా వర్షిస్తున్న కళ్ళతో చేతులు జోడించి మీ గురుంచి ఏమైనా తప్పుగా వ్యవహరించి ఉంటే క్షమించండి` అంటూ స్వరూప్ ముందు తల వంచి నిలబడింది. స్వరూప్ వారి భుజాల మీద చేయి వేసి, క్షమించండి, నేను ముందే ఈ విషయాలు చెప్పి ఉండవల్సింది. కానీ మీరు ఎలా అర్ధం చేసుకుంటారో అని చెప్పలేదు అంటూ వారి దగ్గర నుంచి సెలవు తీసుకొని బయటకు నడిచాడు స్వరూప్. మధు, మేఘనలకు తాము విన్నది తామే నమ్మలేకపోతున్నారు. మేఘన మధు భుజం మీద చేయి వేసి ‘అర్జెంట్ గా అత్తయ్య గారి దగ్గరకు తీసుకెళ్లండి. ఆమెకు క్షమాపణ చెప్పి మనతో తెచ్చుకుందాం, తెచ్చుకోవడమే కాదు, ఎప్పుడూ ఆమెను మనతోనే ఉంచుకుందాం`అంటూ తొందరపెట్టసాగింది. మేఘనలో వచ్చిన మార్పుకు స్వరూప్ కు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ, స్వరూప్ నడుస్తున్న దారిలో తాము నడవాలి అని గట్టిగా అనుకుంటూ ఇద్దరూ బయలుదేరారు వృద్ధాశ్రమానికి.
మనస్విని







కామెంట్‌లు (0)