ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅంధుడు

1 గంట క్రితం

MAN1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:03 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

మనకు సూర్యకాంతి ఎందుకంత ఆనందాన్నిస్తుంది? ఆ ప్రకాశవంతమైన ఆ కాంతి భూమి మీద పడగానే మనం జీవిస్తున్న ఆనందాన్ని ఎందుకు పొందుతాం? ఆకాశమంతా నీలంగాను, పొలాలన్నీ పచ్చగాను, ఇళ్ళన్నీ తెల్లగాను ఉండడాన్ని చూసి మన కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి. ఉజ్వలమైన ఆ రంగులను చూసి మన మనసులు ఉత్సాహంతో ఉరకలేస్తాయి. అప్పుడే మనకి నాట్యం చేయాలనిపిస్తుంది.. పాడాలనిపిస్తుంది. మనసు దూదిపింజంలా తేలికపడుతుంది.. మన చుట్టూ సున్నితత్వం అలమకుంటుంది. మనం వెచ్చటి సూర్యుడిని కౌగిలించుకోవాలని తపిస్తాం. ​గుడ్డివాళ్లు తలుపులు పక్కనే కూర్చుంటారు. అంతులేని తమ చీకటి ప్రపంచంలో, ఇంతటి అద్భుతమైన తాజా ప్రపంచానికి కూడా ఎప్పటిలాగే ఏమాత్రం స్పందన లేకుండా కూర్చూంటారు. వారి చుట్టూ ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారి చుట్టూ చేరి ఆడుకుంటున్న కుక్కలను మాత్రమే అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు.

సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తన చేతిని పట్టుకున్న అన్న, చెల్లెలు, "ఈరోజు చాలా బాగుంది" అంటే, అతడు మాత్రం," అవును, నాకూ అలాగే అనిపించింది. లవ్లీ అల్లరి చేయకుండా ఒక్క క్షణమైనా ఊరుకోలేదు " అంటాడు. ​నాకు ఇలాంటి ఒక గుడ్డివాడి జీవితం గురించి తెలుసు. అదొక దుర్భరమైన జీవితం. వాస్తవ రూపం దాల్చకముందే ముగిసిన జీవితం.

అతడు ఒక రైతు. సామాన్య దేశ రైతుకి పుట్టినవాడు. అతని తల్లి, తండ్రి బతికినన్నాళ్లు అతని గురించి శ్రద్ధ తీసుకున్నారు. అతని వైకల్యం మినహాయిస్తే మరే రకమైన ఇతర అసౌకర్యాలకీ గురికాలేదు. కానీ ముసలాళ్ళు ఇద్దరూ చనిపోయిన తర్వాత అతని జీవితం దుర్భరంగా మారింది. అతడు తన అక్క మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉండే ప్రతి మనిషి అతనిని ఒక ముష్టివాడిలాగా చూసేవాళ్ళు. ఎవడో ఎరుగని వాడి తిండి తింటున్నట్టు భావించేవాళ్ళు. అతను భోజనం చేస్తున్నంతసేపూ, ప్రతి ముద్ద తింటున్నప్పుడూ, తిట్ల దండకం మొదలయ్యేది. సోమరిపోతని, హాస్యగాడని ఎద్దేవా చేయడం మొదలుపెట్టేవాళ్ళు. నిజానికి అతని బావ, అతను తల్లిదండ్రుల నుంచి పొందిన వాటాను పూర్తిగా హస్తగతం చేసుకున్నాడు. కానీ తిండి పెట్టేటప్పుడు కాస్తంత గంజి కూడా తిట్టుకుంటూనే పోసేవాడు. కేవలం అతను ఆకలితో చనిపోకుండా, బతికి ఉండడానికి సరిపడినంత తిండి మాత్రమే పెట్టేవాడు. ​అతను పాలిపోయి ఉండేవాడు. అతని పెద్ద కళ్ళు గాజుకళ్ళలా నిర్జీవంగా ఉండేవి. ఎన్ని రకాల అవమానాలనయినా భరిస్తూ నిశ్చలంగా ఉండేవాడు. అతనిని చూసేవాళ్ళు నిజంగా ఇవన్నీ అతనికి వినిపించాయా? లేదా? అని అనుమానపడేవాళ్ళు.

నిజానికి అతడు సున్నితత్వాన్ని ఏనాడూ అనుభవించి ఎరగడు. అతని తల్లి కూడా అతన్ని నిర్దయగానే చూసేది. ఏమాత్రం ప్రేమ కురిపించేది కాదు. ఎన్నో ప్రదేశాలలో చాలామంది ఎందుకూ పనికిరానివాళ్ళు ఉంటారు. రైతులు ఎందుకూ పనికిరాని కోళ్లను చంపేయడానికే ఇష్టపడతారు. తనకిచ్చిన గంజి తాగడం పూర్తవ్వగానే వేసవికాలంలో బయటికి వెళ్లి, తలుపు పక్కన కూర్చునేవాడు. చలికాలం అయితే నిప్పు గుండం దగ్గర చలికాచుకునేవాడు. సాయంత్రం వరకూ మళ్లీ అటూ ఇటూ కదిలేవాడు కాదు. ఎవరినీ పలకరించేవాడు కాదు. ఏ రకమైన శబ్దం చేసేవాడు కాదు. కేవలం కళ్ళు మాత్రం టప టపా కొట్టుకునేవాడు అప్పుడప్పుడూ; నాడీ సంబంధిత వ్యాధి వల్ల బాధపడుతున్న వాడిలాగా. అప్పుడప్పుడు ఆ కనురెప్పలు అతని తెల్లని చూపులేని కనుగుడ్డు మీదికి జారేవి. అతడు ఏమైనా ఆలోచిస్తున్నాడా?, అసలు ఏమైనా బుద్ధి కలిగి ఉన్నాడా?, తనను గురించి తను ఏమైనా స్పృహ కలిగి ఉన్నాడా? అని ఎవరూ ఎప్పుడూ అడగలేదు. ఎవరూ అసలు అతని గురించి పట్టించుకున్న పాపానే పోలేదు.

ఇలా కొన్నాళ్ళు గడిచింది. అయితే అతను ఏ పనీ చేయలేకపోవడం వలన అతని చుట్టాలందరూ విసిగిపోయారు. అందరూ అతనిని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు; అతను నవ్వులాటకు ఒక సాకుగా మారాడు. మనుషులకు పుట్టుకతోనే వచ్చే కోపానికి, వెకిలిచేష్టలకి ఎర అయ్యాడు, చుట్టూ ఉన్న మృగాల క్రూర పరిహాసానికి బలయ్యాడు.

​ పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని అలుసుగా తీసుకొని, చుట్టూ ఉన్నవాళ్ళు చేసే అమానుషమైన పరిహాసాలు ఎలా ఉంటాయో ఊహించడం అంత కష్టమైన విషయమేమీ కాదు. అతనికి తిండి పెట్టినందుకు బదులుగా, అతడినొక పరిహాసాలు ఆడ గల వస్తువుగా తయారు చేయడానికి సిద్ధపడ్డారు. అతను తిండి తినే సమయాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ వినోదాన్ని అందించే సమయంగా మలిచారు. పాపం ఆ నిస్సహాయుడైన గుడ్డివాడికి శిక్ష అనుభవించక తప్పలేదు. దగ్గర ఉన్న రైతులు వాళ్ళింటికి వినోదం కోసం వచ్చేవాళ్ళు. ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ వ్యవసాయం క్షేత్రంలో వంటింటి ముందు జనాలు అందరూ పోగుపడేవారు. ఒక్కొక్కసారి ప్లేట్ అతని ఎదురుగుండా పెట్టి, అతను జావ తాగడానికి ప్రయత్నించేలోగా, కుక్కనో పిల్లినో పంపించి తాగించేవాళ్ళు. ఆ జంతువులు కూడా గుడ్డివాడి నిస్సహాయతను పసిగట్టి, నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్లి, శబ్దం చేయకుండా గిన్నె మొత్తం నాకేసేవి. ఆ శబ్దం విని గుడ్డివాడు జంతువులను తరిమేయడానికి స్పూన్ ని అటూ ఇటూ నాలుగు వైపులా కదిలిస్తుంటే, అవి కాస్తా నెమ్మదిగా తప్పించుకొని, జారుకునేవి.

ఇదంతా చూడడానికి చుట్టూ చేరిన జనాలు పగలబడి నవ్వేవాళ్ళు. చప్పట్లు కొట్టేవాళ్ళు. కాళ్లతో నేలని తంతూ.. గంతులు వేసేవాళ్ళు. ఎంత హంగామా జరుగుతున్నా అతను ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఎడమ చేత్తో ప్లేట్ ని కాపాడుకుంటూ కుడి చేత్తో తినే ప్రయత్నం చేసేవాడు.

ఒక్కొక్కసారి అతని చేత బెండు తినిపించేవారు, చిన్న కర్ర ముక్కలు తినిపించేవారు, అశుద్ధాన్ని కూడా తినిపించేవారు. అతడికి ఏది తినవచ్చో, ఏది తిన కూడదో తెలిసేది కాదు పాపం. ఇలా అతనితో కొన్నిరోజులు పరాచికాలు ఆడిన తర్వాత వాళ్లకి ఇక విసుగు పుట్టింది. అతని బావకి తిండి పెట్టవలసి వస్తోందని మహా కోపంగా ఉండేది. అతని చేతులు, కాళ్లు కట్టేశాడు. కొట్టడం మొదలుపెట్టేవాడు. పాపం ఎదిరించలేక, బాధ భరించలేక ఏడుస్తుంటే నవ్వుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్లకి మరో కొత్త ఆనందం-చెంప దెబ్బలు కొట్టే, గుద్దులు గుద్దే ఆనందం దొరికింది. పొలం

దున్నేవాళ్లు, పనిచేసే అమ్మాయిలు, ఆఖరికి పనీ పాటు లేక ఆ చుట్టుపక్కల తిరిగేవాళ్లు వచ్చి ఇష్టానుసారంగా మొహం మీద గుద్దడం, చెంపలు వాయించడం మొదలుపెట్టారు. ఆ దెబ్బలకి అతని కనురెప్పలు ఆగకుండా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అతనికి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదు. మనుషులు ఎవరూ దగ్గరికి రాకుండా ఉండడానికి రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకోవడం మొదలుపెట్టాడు.

ఆఖరికి అతనికి ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సంతలు జరిగేటప్పుడు, నలుగురు తిరిగే రోడ్డు పక్కన కూర్చోబెట్టేవాడు వాళ్ల బావ. ఎవరి అడుగులు చప్పుడైనా లేదా బండి వెళుతున్న శబ్దం వినిపించినా గుడ్డివాడు లేచి నత్తిగా,' దయచేసి దయ ఉంచండి' అని అడుక్కునేవాడు. ​కానీ రైతులు అనవసర ఖర్చులకు పోరు. వారమంతా అడుక్కున్నా పైసా కూడా దొరికేది కాదు. ​దాంతో ఇప్పుడు ఇంకా దయాదాక్షిణ్యాలు లేని విద్వేషానికి, కోపానికి బలయ్యాడు. అలాగే చనిపోయాడు.

ఒక చలికాలంలో నేలంతా మంచుతో నిండిపోయింది. మంచు బాగా కురిసి, దట్టంగా గడ్డకట్టింది. అడుక్కుంటే ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని అతని బావ అతన్ని చాలా దూరం తీసుకెళ్లి, ఓ రహదారి మీద కూర్చోబెట్టాడు. గుడ్డివాడు రోజంతా ఆ రహదారి పక్కన కూర్చుని ఉన్నాడు. రాత్రి అయింది. బావ ఇంటికి వచ్చి గుడ్డివాడు ఎక్కడా కనిపించలేదని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాడు. "మరేం పర్వాలేదు. అతని గురించి ఆందోళన పడకండి. చలిగా ఉంది కదా! ఎవరినైనా తీసుకెళ్లమని అడుగుతాడులే. ఏం భయపడకండి. ఎక్కడా తప్పిపోడు. పొద్దునకల్లా వచ్చేస్తాడు. జావ తాగే సమయానికి సిద్ధంగా ఉంటాడు" అన్నాడు.

అయితే ఆ తర్వాత రోజు కూడా గుడ్డివాడు ఇంటికి రాలేదు.

చాలాసేపు ఎదురుచూసిన తర్వాత 'చలితో గడ్డకట్టి చచ్చిపోతున్నా' అనుకున్నాడు గుడ్డివాడు. నెమ్మదిగా నడక మొదలుపెట్టాడు. కానీ దారి తెలియలేదు. బాగా మంచు పడటం వల్ల తోచిన దారిలో నడవడం మొదలుపెట్టాడు. గుంతల్లో పడ్డాడు, లేచాడు, మళ్లీ పడ్డాడు, మళ్ళీ లేచాడు. మారు మాట్లాడకుండా, నిశ్శబ్దంగా నడక సాగించే ప్రయత్నం చేశాడు. అతని ముందున్న లక్ష్యం ఒకటే ఎలాగైనా ఇంటికి చేరాలి. తనకు కాస్తంత ఆశ్రయం దొరకాలి. కానీ మంచు కురవడం పెరగడంతో విపరీతంగా చలి పెరిగింది. అతని శరీరమంతా మొద్దుబారింది. అసలే బలహీనంగా ఉన్న కాళ్లు ముందుకు అడుగు వేయనీయలేదు. ఆ బహిరంగ ప్రదేశంలో గతకలలో పడిపోయాడు. ఇక ఆ తర్వాత లేవనే లేదు.

​ నిరంతరంగా కురుస్తున్న మంచు అతన్ని కప్పేసింది. అతని శరీరం గట్టిపడిపోయింది. ఆ తర్వాత కురుస్తున్న మంచు పేరుకుపోయి, కుప్పగా అతని చుట్టూ చేరింది. అతను ఎక్కడ ఉన్నాడో కూడా గుర్తించలేనంత మంచులో మునిగిపోయాడు. అతని బంధువులంతా వెతుకుతున్నట్టు, ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, వారం రోజులు కాలక్షేపం చేశారు.. నటించారు కూడా. ఆ వారం అంతా చలి ఉధృతంగా ఉంది. మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. ఆ తర్వాత ఒక ఆదివారం చర్చిలో ప్రార్థనకు వెళ్తున్న రైతులకు, ఒకచోట కాకులన్నీ గుమిగూడి, చుట్టూ గింగిరాలు తిరుగుతూండటం, కిందికొస్తూ పైకి వెళుతూ చక్కర్లు కొట్టటం చూస్తే, ఒక పెద్ద నల్లటి వాన కురుస్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత వారం కూడా కాకులు అక్కడే తిరుగుతూ ఉన్నాయి. అలాగే మంచు ముద్ద చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. గాలిలో పెద్ద గుంపుగా ఎగురుతున్నాయి. ఆకాశంలో నలుమూలల నుంచి ఒక్కచోటికి కాకులు ప్రవాహంలో వచ్చి చేరుతున్నాయి. కాళ్లు పెట్టి మంచులో తవ్వుతున్నాయి. ముక్కుతో పొడుస్తున్నాయి. కాకులు ఏం చేస్తున్నాయా అని ఒక యువకుడు దగ్గరకు వెళ్లి చూశాడు. అది గుడ్డివాడి శరీరం. సగ భాగం కాకులు అప్పటికే తినేసాయి. శరీరం అంతా చిన్నాభిన్నమయింది. ఎన్నడూ ప్రపంచాన్ని చూడని గుడ్డివాడి కళ్ళు అదృశ్యమయ్యాయి. తమ పొడవాటి ముక్కులతో కాకులు పొడిచి, ఆవురావురుమని తినేసాయి. ఆకాశంలో ప్రకాశంవంతమైన సూర్యుడిని చూసినప్పుడల్లా నాకు ఆ గుడ్డివాడే గుర్తుకొస్తాడు. జీవితమంతా అందరిచేత వెలి వేయబడి, భయంకరమైన చావుతో ఆ వెతల నుండి, వెలివేతల నుంచి విముక్తి పొందాడు. నిజానికి అతనిని ఎరిగిన వారందరూ చావు అతనికో ఉపశమనంగా భావించారు.


గై ది మోపాసా'

తెలుగు : కె. ఉషారాణి

94928 79210

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్