హైదరాబాద్ రైల్వేస్టేషన్.. జనమంతా కిటకిటలాడుతున్నారు. 'దయచేసి వినండి.. విజయవాడకు వెళ్ళు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మరికాసేపట్లో ప్లాట్ ఫాం నెంబర్ 2 కు వచ్చుచున్నది!’ అంటూ అనౌన్స్‌మెంట్ వినపడగానే..
'రేయ్ క్రిష్ లేవరా.. బండొస్తుంది..!`
'హా.. ఓకేరా శ్యాం!`
ఇద్దరూ ట్రైన్ ఎక్కారు. విండో సీట్లకు ఎదురెదురుగా కూర్చున్నారు. బండి నిదానంగా స్టార్ట్ అయ్యింది. సీటులో తలవాల్చిన క్రిష్ మెదడులో ఆలోచనలు నిదానంగా కదులుతున్నాయి..
అది విజయవాడ రైల్వేస్టేషన్.. శ్యాం, క్రిష్ ఇద్దరూ ఎంతో సంబరంగా హైదరాబాద్ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మానాన్నలు ప్రేమతో కట్టిన పార్శిల్స్, ఫుల్‌లగేజీలతో.. కొత్త ఆశలతో ఉన్నారిద్దరూ..! ట్రైన్ కూతపెట్టుకుంటూ ప్లాట్‌ఫారం పైకి వస్తుంటే వారిద్దరి బంగారు భవిష్యత్తు పరుగెత్తుకొస్తున్నట్లు అనిపించింది క్రిష్‌కి.
'రేయ్ క్రిష్ .. ఏంట్రా అప్పుడే నిద్రపోతున్నావా?` అని శ్యాం అడిగిన వెంటనే..
నిదానంగా కళ్లు తెరిచాడు క్రిష్. కళ్ల వెంట కన్నీళ్లు కారుతుంటే.. శ్యాం చూసి షాకయ్యాడు.
'లేదురా.. శ్యాం. మనిద్దరం హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు మనం ఊహించిన ప్రపంచం వేరు.. ఇప్పుడు ఇలా.. !`అంటూ తలదించాడు క్రిష్.
'రేయ్ క్రిష్.. బాధపడకురా.. కలగన్నామా ? ఉద్యోగాలు పోతాయని..! ధైర్యంగా ఉండ్రా!` అంటూ భుజం తట్టాడు శ్యాం.
'ఏరా శ్యాం నిజం చెప్పు.. నీకు బాధ లేదా? మనిద్దరం సాఫ్ట్‌వేర్ జాబ్స్ వచ్చాయని ఎంత మురిసిపోయామురా.. మన ఇంట్లోవాళ్లు ఎంత ఆనందించార్రా.. ఎన్నో ఆశలతో వచ్చాము. ఇప్పుడు ఇలా ఉద్యోగాలు పోయి, ఖాళీగా వెళుతున్నాం కదరా..!` అని ఆవేదనగా అన్నాడు క్రిష్.
'అవున్రా క్రిష్ నాక్కూడా చాలా బాధగా ఉంది.. ఇంట్లో అమ్మానాన్నలను తలుచుకుంటుంటే ఇంకా ఏడుపొస్తుందిరా..!` అంటూ శ్యాం కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇద్దరూ అలా బాధ పంచుకుంటూ ఒకనొకళ్లు ఓదార్చుకుంటూ ఉండగానే.. విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చింది. బరువెక్కిన గుండెలతో ఫ్రెండ్స్ ఇద్దరూ లగేజీలను పటుకొని, రైలు దిగి, బయటికొచ్చారు.
శ్యాం, క్రిష్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ కలిసే చదివారు. కలిసే ఉద్యోగాలు సంపాదించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా నాలుగేళ్లు ఉద్యోగాలు చేశారు. అకస్మాత్తుగా లేఆఫ్ (ఉద్యోగాల నుండి తొలగించడం) తో ఇంటిబాట పట్టారు.
ముందుగా ఇద్దరూ క్రిష్ ఇంటికెళ్లారు..
'బాబూ వచ్చారా!. మీకోసమే ఎదురుచూస్తున్నాం.. ఏంనాన్నా ఇద్దరూ ఇలా డీలా పడిపోయారేంటీ? పోనీరా వెధవ ఉద్యోగాలు.. అక్కడికి వెళ్లారన్న మాటే కానీ.. ఏనాడూ మనస్స్ఫూర్తిగా మాతో మాట్లాడింది లేదు.. ఎప్పుడూ బిజీబిజీ.. కడుపుకు తిండి లేకుండా, టైముకి నిద్ర లేకుండా పని చేసీ.. చేసీ.. చూడండి ఎలా అయిపోయారో..! ఇక్కడే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి.. మీరేం బెంగ పెట్టుకోకండి.. ఏం నాన్నా.. ధైర్యంగా ఉండాలి.. సరేనా..! బాబూ శ్యాం నువ్వు కూడా రానాన్న .. ఇద్దరూ భోజనం చేద్దురుగాని..!` అంటూ క్రిష్ తల్లిదండ్రులు ఇద్దరినీ లోపలికి తీసుకెళుతుండగా..
'లేదాంటీ.. ఇంట్లో అమ్మానాన్న నాకోసం ఎదురుచూస్తున్నారు. దారిలోనే ఇల్లు కదా.. వీడ్ని దిగబెట్టి నేను వెళదామని వచ్చాను. తర్వాత కలుస్తాను అంకుల్..` అని శ్యాం అనడంతో..
'సరే శ్యాం.. జాగ్రత్తగా వెళ్లు బాబు..!` అన్నారు క్రిష్ తల్లిదండ్రులు.
'ఏం నాన్న శ్యాం ప్రయాణం బాగా జరిగిందా? ఏంట్రా ముఖం అలా అయిపోయింది..? తిన్నావా లేదా? నువ్వేం దిగులుపడకు నాన్న. మంచి ఉద్యోగం వస్తుంది. ధైర్యంగా ఉండాలి.. ముందు భోజనం చేద్దువుగాని పద..!` అని శ్యాం లగేజీని పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
కొన్ని రోజులు గడిచిన తరువాత.. శ్యాం, క్రిష్ ఫ్రెండ్ ప్రకాష్ పెళ్లి వేడుకకు స్నేహితులందరికీ పిలుపు వచ్చింది. ఆ పెళ్లిలో దోస్తులంతా కలిశారు.
'రేయ్ శ్యాం, క్రిష్ ఎన్నాళ్లయిందిరా మిమ్మల్ని చూసి! ఎలా ఉందిరా సాఫ్ట్‌వేర్ లైఫ్!` అంటూ ఫ్రెండ్స్ అందరూ ఆసక్తిగా అడిగారు.
శ్యాం, క్రిష్ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
'ఏంట్రా ఇద్దరూ అలా అయిపోయారు! ఏమైందిరా?` అని ఆశ్చర్యంగా అడిగారు.
'రేయ్ మా ఉద్యోగాలు పోయాయిరా. కొన్నిరోజులుగా ఊళ్లోనే ఉన్నాం. ఇప్పుడే ఇలా ప్రకాష్ గాడి పెళ్లిలో మిమ్మల్ని కలిశాం` అని భారంగా చెప్పాడు క్రిష్.
'అరే క్రిష్, శ్యాం మీకో ట్విస్ట్ చెప్పమంటారా.. మేం కూడా లేఆఫ్ బాధితులమేరా!` అంటూ ఫ్రెండ్స్ అనడంతో శ్యాం, క్రిష్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
‘ఏంట్రా మీరు కూడానా ?` అని శ్యాం, క్రిష్ ఆశ్చర్యపోయారు.
'అవున్రా.. కాకపోతే మేం మీకంటే రెండు నెలల ముందే ఊరొచ్చేశాం.. కొన్నాళ్లు డీలాగా ఉన్నాం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగాలు దొరకలేదు.. పిచ్చెక్కిపోతున్నాంరా.. ఇదిగో ఇప్పుడే ఇలా ప్రకాష్ గాడి పెళ్లిలో కాస్త నవ్వుతున్నాం.. మొత్తానికి లే ఆఫ్ బాధితులమంతా ఒకేచోట చేరామన్నమాట..!` అంటూ ఫ్రెండ్స్ అందరూ పకపకా నవ్వుకున్నారు.
' ఫ్రెండ్స్ మీకో విషయం చెప్పనా.. ఎప్పుడైతే నా జాబ్ హుష్‌కాకి అయిందో.. పిల్లనిస్తానన్న మా మామ ఇప్పుడు కన్నెత్తి కూడా చూడటం లేదురా.. అంతేకాదురా ఎవ్వరికైనా పిల్లనిస్తాను కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి మాత్రం ఇయ్యను అంటున్నాడ్రా! ఆ రోజు ‘‘బాబూ టింకూ.. నువ్వు చాలా మంచోడివి.. నీకే నా కూతురినిస్తా అన్నాడ్రా..!’’ ఇప్పుడేమో ఇలా ప్లేటు ఫిరాయించాడ్రా!`
‘రేయ్ చిల్ మామా..! అవేం పట్టించుకోకు..!` అన్నారు ఫ్రెండ్స్ అందరూ.
' ఫ్రెండ్స్ మన పండుగాడైతే ఏకంగా సూసైడ్ అటెంప్ట్ చేశాడ్రా.. సమయానికి నేనూ, మన టింకుగాడు దగ్గర్లో ఉండబట్టి సరిపోయింది. లేకపోతేనా.. హు!` అన్నాడు అసహనంగా బుజ్జి.
'ఏరా పండుగా.. ఏంట్రా..! అంత పనిచేశావా.. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం.. దీనికే అంత పనిచేయాలా?` అన్నారు కాస్త కోపంగా ఫ్రెండ్స్.
‘ఏం చేయమంటార్రా. మా ఫ్యామిలీ గురించి మీకందరికీ తెలుసుగా. ఇప్పటికే అమ్మానాన్న చాలా అప్పులపాలయ్యారు. ఎంత ప్రయత్నిస్తున్నా ఉద్యోగం దొరకడం లేదు.. సంతలో కూరగాయల్లా జీతాలను బేరాలాడుతున్నార్రా!. ఇంత వయసొచ్చి కూడా ఇంకా మా అమ్మానాన్నల కష్టాన్ని తింటున్నాను. అప్పులోళ్ల అరుపులు వినలేకపోతున్నాను.. తట్టుకోలేక ఆ ఒత్తిడిలో అలా చేశాన్రా..! ` అంటూ వివరణ ఇచ్చాడు పండు.
'రేయ్ పండు! మీ అమ్మానాన్న కష్టపడుతుంది నీకోసమే కదరా! నువ్వు లేకపోతే వాళ్లేమైపోతారో ఆలోచించు. ఇంకెప్పుడూ అలాంటి ఆలోచనే రానీయకురా. మేమంతా ఉన్నాంగా` అంటూ సరదాగా పండు భుజం తట్టారు దోస్తులంతా.
'అరేయ్.. బయటెక్కడా ఉద్యోగాల్లేవు.. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తే చాలీచాలని జీతాలతో బతుకులీడ్చలేం.. అప్పులు తీరాలి. ఇప్పుడు మనమంతా ఏం చేయాలి? ఎలా బతకాలి?` అంటూ.. ఆందోళనగా ఉన్న టింకును చూసి ఫ్రెండ్సందరూ ఒక్క క్షణం మిన్నకుండిపోయారు.
పైకి నవ్వుతూ ఉన్నా అందరి గుండెల్లో ఉన్నది అదే బాధ, అదే ఆందోళన!
ఒక్క క్షణం మౌనం తర్వాత..
'అరేయ్ ఓ ఐడియారా!` అని అనుకోకుండా ఒకేసారి దోస్తులంతా అన్నారు.
ఫ్రెండ్స్ లోని ఆ ఆత్రుతను గమనించిన బుజ్జి..
'ఆగండ్రా.. మన ఆలోచనలన్నీ పంచుకుందాం. అయితే ఇక్కడ కాదు. రేపు మా ఇంటి దగ్గర కలుద్దాం!`
'ఓకేరా.. డన్!` అన్నారు దోస్తులంతా.. వారందరి కళ్లల్లో ఏదో కొత్త వెలుగు..!

మరుసటి రోజు బుజ్జి ఇంటి మేడపై ఫ్రెండ్స్ అందరూ కలిశారు.
'ఫ్రెండ్స్.. నిన్న మనందరికీ వచ్చిన ఐడియాలు చెప్పుకుందాం!` అన్నాడు శ్యాం చాలా నిదానంగా..!
దోస్తులంతా తాము రెడీ అన్నట్లు ఉన్నారు.
'అరేయ్.. మనమంతా కలిసి మనకున్న టాలెంట్, స్కిల్స్‌ను వాడి.. మనమే సొంతంగా బిజినెస్ చేద్దాం ఏమంటారు?` అని ముందుగా తన ఆలోచన దోస్తుల ముందుంచాడు టింకు.
'ఆలోచన బాగుంది.. ఏం చేయాలో అదీ చెప్పరా ?` అని అడిగారు ఫ్రెండ్స్.
'ఓ యూట్యూబ్ ఛానల్ పెడితే` అని టింకు అనగానే..
'ఇప్పుడు ఎక్కడ చూసినా అవే కదరా! మనం క్లిక్ అవుతామా? అయినా ఆ సంపాదన ఏం సరిపోతుందిరా టింకుగా?` అన్నాడు బుజ్జి.
'కాస్తాగరా బుజ్జిగా.. హా ఓకే టింకు నీ ఆలోచన యూట్యూబ్ ఛానల్! ఇప్పుడు చెప్పరా బుజ్జి నీ ఐడియా ఏంటి?` అన్నాడు శ్యాం ఆసక్తిగా.
'మనందరం కలిసి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ పెడదాం.. స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి పెడదాం.. మనకున్న టెక్నికల్ స్కిల్స్‌ను కోర్సుల్లా నేర్పిద్దాం.. ఏమంటారు?` అని బుజ్జి అనడంతో..
'ఇప్పుడెక్కడ చూసినా అవేగా.. గిట్టుబాటవుతుందా?` అని అసహనంగా అన్నాడు పండు.
'ఆగరా పండుగా.. ఓకేరా బుజ్జి నీ ఆలోచన కంప్యూటర్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లీష్.. మరి పండూ నీ ఆలోచన చెప్పరా?` అని శ్యాం అడిగాడు.
'మనకొచ్చిన టెక్నికల్ స్కిల్స్‌తో కొత్త యాప్‌లను వాడి డిఫరెంట్‌గా ప్రోగ్రాములు చేసి, యూట్యూబ్‌లలో పెడదాంరా.. రాత్రీపగలూ తేడా తెలియకుండా ఎన్నో కొత్త కొత్త కోడింగ్‌లు చేసినోళ్ళం!. మనకది చాలా ఈజీ.. క్లిక్ అయ్యిందా సెటిలైపోతాం మామా! డిఫరెంట్‌గా ఆలోచిద్దాం మామా!` అని ఎగ్జైటింగ్‌గా చెప్పాడు పండు.
'హా ఈ ఆలోచన బాగుంద్రా.. డిఫరెంట్‌గా చేద్దాం` అన్నాడు టింకు.
'ఓకే నీ ఆలోచన అది.. మరి క్రిష్ నువ్వు చెప్పు` అని అడిగాడు శ్యాం.
'పండు, టింకు చెప్పిన ఆలోచనే నాది కూడారా... కాకపోతే ముందుగా ధైర్యం చేసి కష్టపడాలి!` కాస్త నిదానంగా అన్నాడు క్రిష్.
'ఎస్ ఫ్రెండ్స్.. నిన్న రాత్రి దాదాపు మీరు అనుకున్నట్లే నేనూ ఆలోచించాను. మనదగ్గరున్న కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టి ధైర్యంగా ముందడుగు వేద్దాం. లాభమైనా నష్టమైనా కలిసే పంచుకుందాం.. ఏమంటారు?` అని దోస్తులందరి ముఖాలు చూస్తూ అడిగాడు శ్యాం.
'ఓకేరా శ్యాం.. మరి ఎక్విప్మెంట్స్రా..` అని అడిగారు స్నేహితులంతా..
'అందరం కలిసి ఈ నాలుగు రోజుల్లో ఏర్పాటు చేసుకుందాం..` అని శ్యాం చెప్పడంతో.. దోస్తులంతా ఆత్మవిశ్వాసంతో లైక్ సింబల్ చూపిస్తూ .. ఒకేరా శ్యాం.. డన్!` అన్నారు.
అనుకున్నట్టే దోస్తులంతా అన్నీ సమకూర్చుకున్నారు.
'ఫ్రెండ్స్ మా ఇంటి పైన రెండు గదులున్నాయి. ఒక గదిలో మన యూట్యూబ్ ఛానల్‌కు కావాల్సిన ప్రోగ్రామ్స్ వర్క్ జరుగుతుంది. మరో గదిలో కంప్యూటర్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జరుగుతాయి. మనమే షిప్టులవారీగా క్లాసెస్ చెబుదాం ఏమంటారు?` అని తన ప్లాన్ చెప్పాడు శ్యాం.
'ఓకేరా శ్యాం!` అంటూ దోస్తులంతా ఆసక్తిగా సమాధానమిచ్చారు.
డిఫరెంట్ యాప్‌లను వాడి డిఫరెంట్ స్క్రిప్టులు, ఒకటేమిటీ అన్ని వర్గాలవారినీ ఆకర్షించేలా వినూత్నంగా ఆలోచిస్తూ.. ప్రోగ్రామ్స్‌ను చేశారు. ఫ్రెండ్స్ అందరూ అలుపెరగకుండా వారికున్న స్కిల్స్ అన్నింటినీ వాడి డిఫరెంట్ ఛానల్స్ పెడుతూ.. డిఫరెంట్ థింగ్స్ ప్రెజెంట్ చేశారు. అలాగే మరోవైపు కోచింగ్ సెంటర్, స్పోకెన్ ఇంగ్లీష్‌కూ ఆదరణ పెరగసాగింది.. రెండేళ్లు ఎలా గడిచాయో తెలియలేదు! ఒకరోజు శ్యాం దోస్తులందరినీ పిలిచి మాట్లాడాడు.
'ఫ్రెండ్స్.. రెండేళ్లు ఎలా కష్టపడ్డామో మనందరికీ తెలుసు. ఈరోజు మన ఛానల్స్ ఫేమస్ అయ్యాయి.. మన ఇంటర్వ్యూలకు ఫోన్లు వస్తున్నాయి. స్పాన్సర్లు వస్తున్నారు. మనం ఊహించని విజయాన్ని అందుకున్నామురా!` అని ఆనందంగా రెండు చేతులు చాచి గట్టిగా చెప్పాడు శ్యాం.
అంతే దోస్తులందరూ శ్యాం చేతుల్లోకి చిన్నపిల్లల్లా వెళ్లిపోయారు అందరూ.. వారంతా కౌగిలించుకుంటూ.. హుర్రే అంటూ.. సర్కిల్స్ తిరిగారు. మనస్ఫూర్తిగా నవ్వుతున్న ఫ్రెండ్స్ అందరి కళ్లల్లో ఆనందబాష్పాలు! అందరూ కలిసి శ్యాం తెచ్చిన స్వీట్స్‌ను ఒకరికొకరు తినిపించుకున్నారు. గట్టిగా ఊపిరిపీల్చుకుంటూ కూర్చున్నారు.
'అవున్రా శ్యాం.. ఇప్పుడు మనమంతా సెటిల్ అయ్యాం.. ఒక్కొక్కరం బాగా సంపాదిస్తున్నాం. మనకింకా మేన్ పవర్ కావాలిరా మామా` అన్నాడు క్రిష్ గట్టిగా, ఆత్రంగా!
'అలాగేరా క్రిష్.. తీసేసుకుందాం` అన్నారు దోస్తులంతా నవ్వుతూ..
'అరేయ్.. మొదట్లో కాస్త భయం వేసిందిరా.. అయినా ధైర్యం చేశాం.. ఇప్పుడు ఇలా క్లిక్ అయ్యాం మామా.. ఫుల్ హ్యాపీరా!` అన్నాడు టింకు.
‘అవున్రా.. టీమ్‌వర్క్ ఎప్పుడూ సక్సెస్సే.. మన దోస్తులం ఉన్నాం చూడు.. కిర్రాక్ రా!` ఇవ్వరా ఇంకో స్వీటు` అన్నాడు బుజ్జి.
'అరేయ్.. ఈరోజు మా అమ్మానాన్నలను ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నాను. అప్పులు తీరాయి. ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదు.. దోస్తులం అనిపించార్రా.. హ్యాపీరా మామా! ఫుల్ బిందాస్! ఖుషీరా` అన్నాడు కళ్ళ వెంట కన్నీళ్లు తుడుచుకుంటూ పండు.
' ఫ్రెండ్స్ మనమంతా ఇలా కలిసికట్టుగానే ఉండి ఇంకా లైఫ్‌లో చాలా సాధించాలి. రేపే మన సక్సెస్ మీట్ మన ఊళ్లోనే! రెడీ అవ్వండ్రా!` అంటూ శ్యాం గట్టిగా ఆకాశాన్నంటేలా అరిచాడు!
మరుసటి రోజు సక్సెస్‌మీట్!
స్టేజీ ముందున్న సీట్లలో దోస్తులందరి తల్లిదండ్రులు కూర్చున్నారు. వారి కళ్లల్లో ఆనందబాష్పాలు. 'మన పిల్లలు ఘటికులండీ.. వాళ్ల ఉద్యోగాలు పోయాయి. సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. వీళ్ల భవిష్యత్తు ఏంటి? ఏమైపోతారా? అని బెంగపడిపోయాం. ఇప్పుడు వీళ్లే ఇంకొంతమందికి ఉద్యోగాలిస్తున్నారు. మనకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి?` అనుకుంటూ వారి ఆనందాన్ని పంచుకుంటున్నారు.
చక్కని పాటలతో డ్యాన్సులతో ప్రోగ్రాం ఆసక్తికరంగా సాగింది. చివరిగా ఫ్రెండ్స్ అందరూ ఓ డ్యాన్స్ చేసి, అందరినీ అలరించారు. పార్టీ ముగింపులో దోస్తులంతా మైకులు పట్టుకొని, వరుసగా నిలబడ్డారు. ఆ దోస్తులంతా ఏం చెబుతారోనని! పార్టీకి వచ్చినవారంతా ఆసక్తిగా ఉన్నారు.
‘మా తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధువులకు, ఆప్తులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. మా ఈ సక్సెస్ మీట్ నేటి యువతరానికి ఓ పిలుపు..!` అన్నాడు శ్యాం.
'అవును.. ఎంతోమంది ఉద్యోగాలను పోగొట్టుకొని నడివీధిన పడ్డారు. మానసిక ఒత్తిడికి లోనయ్యి, మనమధ్యే చాలామంది కాలం చేశారు.` అన్నాడు క్రిష్.
'అవును.. నేనూ ఎలా బతకాలో తెలీక, తల్లిదండ్రుల కష్టం చూడలేక, అప్పులు తీర్చలేక.. ఆత్మహత్యకు యత్నించాను. నా ఫ్రెండ్స్ వల్ల బతికి బట్టకట్టాను.
మా దోస్తులమంతా చేసిన ఒక కొత్త ఆలోచన మా జీవితాలనే మార్చేసింది!` అన్నాడు పండు.
'బతకడానికి డబ్బే కాదండీ.. ధైర్యం కావాలి! ఆ ధైర్యాన్నీ, మా దగ్గరున్న కాస్త మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాం. అలుపెరుగని శ్రమతో పనిచేశాం. ఈ రోజు ఈ సక్సెస్ మీట్ పెట్టాం!` అన్నాడు బుజ్జి.
'ఎస్.. మా దోస్తులమంతా టీం వర్క్ చేశాం. రోజులు ఎలా గడిచాయో తెలీదు. మా స్కిల్క్స్ ఇంత ఇంఫ్రూవ్ అవుతాయనుకోలేదు. మాకీరోజు అన్నం పెడుతున్నాయి. మాతోపాటు ఇంకొంతమందికి కూడా!` అన్నాడు టింకు.
చివరిగా శ్యాం మాట్లాడుతూ..
'గమ్యం కనిపించని సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. సోమరితనం కూడా కాదు! ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించాలి. ధైర్యాన్నే పెట్టుబడిగా పెట్టి, ముందడుగు వేస్తే ఆ సంకల్పానికి ఎన్నో అడుగులు జత కలుస్తాయి. ఎన్నో చేతులు తోడవుతాయి.. ఊహించని విజయాలను అందిస్తాయి` అందుకు నిదర్శనం మీముందున్న మా దోస్తులమే!` అని శ్యాం చెప్పిన వెంటనే.. ఫ్రెండ్స్ అందరూ కలిసి.. ‘‘బతుకుదాం.. ఇంకొందరిని బతికిద్దాం.. !’’ అంటూ ఒకరిచేతులు ఒకరు పట్టుకొని పైకెత్తి గట్టిగా నినదించారు.
అంతే.. ఒక్కసారిగా ఆ సక్సెస్ మీట్ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. దోస్తులందరూ కౌగిలించుకున్నారు. ఆ దోస్తుల తల్లిదండ్రుల గుండెలు ఆనందంతో మురిసిపోయాయి. అక్కడున్న ఎంతోమంది యువతకు ఆ సక్సెస్ మీట్ స్ఫూర్తినిచ్చింది.
ఉమామహేశ్వరి








కామెంట్‌లు (0)