ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోడల్లోపలి గోడలు

1 గంట క్రితం

main katha image
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 06:56 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

sveccha. నగర శివార్లలో ఇరవై ఐదు విల్లాల గెటెడ్ కమ్యూనిటీ. ఒకే గేటు. ఒకే బోర్డు. దాని కింద Married Couples Not Allowed. ఇంకో బోర్డు. ఆ బోర్డు చూసి శ్వేత నవ్వుకుంది. దాని కింద చిన్న అక్షరాల్లో " Two consenting adults can build a home without permission."

‘ఇదీ ఒక వివక్షే కదా.’ కార్తిక్ అన్నాడు.

‘అవును. అయినా లోపలికి వెళ్తున్నాం’

‘ఆ రెండో లైన్ కొంత ధైర్యాన్నిస్తోంది కదా’

‘గోడలు కూల్చినవాళ్లే ముందుగా గోడలు కడతారు.’ శ్వేత అననైతే అన్నది కానీ ఆ వాక్యం అప్పుడు వాళ్లిద్దరికీ పెద్దగా అర్థం కాలేదు. అది ఐదేళ్ల క్రితం మాట. ఇప్పడు ఐదేళ్ల తర్వాత ఆ మాటకు అర్థం తెలుస్తుండడం వల్ల కావచ్చు శ్వేతకు ఆ రోజు గుర్తొచ్చింది.


అప్పట్లో హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఆ గేటెడ్ కమ్యూనిటీ గురించి చాలామంది మాట్లాడుకునేవారు. కొందరికి అది నాగరికత

చివరి మెట్టు. మరికొందరికి సంస్కృతి తుది శ్వాస. లోపల ఉండేవాళ్లకు మాత్రం అది ఒక ఆశ్రయం. ఎవరూ ‘పెళ్లి ఎప్పుడు?’ అని అడగరు.

‘మీ అమ్మానాన్న ఒప్పుకున్నారా?’ అని అడగరు. ‘చట్టబద్ధమా?’ అని అడగరు. అటుపక్క ఇటుపక్క విల్లాల వాళ్ల మధ్య టీ, టిఫిన్ల, కాఫీల మార్పిడి జరుగుతుంటంది. ఏదో ఒక తిండి పదార్థం తీసుకెళ్తారు. తెచ్చిస్తారు కూడా. పుట్టినరోజులు కలిసి చేసుకుంటారు. వారాంతాల్లో ప్రొజెక్టర్ వేసుకుని సినిమా చూస్తారు. ప్రతి శుక్రవారం కమ్యూనిటీ డిన్నర్. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే అందరూ వెళ్లి చూస్తారు. వాళ్లందరిదీ ఒక ఉమ్మడి జీవనం. శ్వేత కార్తీక్ ఇక్కడికి రాక తప్పలేదు. ఇక్కడికి రాకముందు వాళ్లను చాలా ప్రశ్నలు పీడించేవి. బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్లందరినీ ఈ ప్రశ్నలు పీడించే ఉంటాయి.

‘పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటారా?’.. ‘ఇలా కూడా ఉంటుందా ?’.. ‘మీ పిల్లలకు ఏం చెబుతారు?’ ఇంకా ఇలాంటివే చాలా. ఆ ప్రశ్నల నుంచి తప్పించుకొని ఐదేళ్లు గడిచాయి. స్వేచ్ఛలో ఇప్పుడు నలభై మూడు జంటలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఆర్టిస్టులు. ఫోటోగ్రాఫర్లు. రచయితలు. డాక్టర్లు. ఒక విషయంలో మాత్రం అందరూ ఒకటే. ఎవరూ పెళ్లి చేసుకోలేదు. అది లివిన్ జంటల స్వేచ్చాస్ధలి. బయట ప్రపంచం వాళ్లను అనుమానంతోనో అవమానంగానో చూసినా...లోపల వాళ్లు మాత్రం ఒకరినొకరు ప్రేమించేవారు. శ్వేత చాలాసార్లు అనుకునేది.

‘ఇదే బహుశా కుటుంబం.’ శ్వేతకు పాత విషయాలు గుర్తుకు రావడానికి నిజానికి కొన్ని తాజా కారణాలున్నాయి.

ఆదివారం సాయంత్రం. కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది.

"Flat B-304 is occupied. Please welcome our new residents."

ఐదు నిమిషాల్లో యాభై వెల్కమ్ మెసేజ్‌లు. ఎమోజీలు. పూలు. హృదయాలు. రాత్రి ఏడున్నరకి క్లబ్ హౌస్‌లో పరిచయ సమావేశం. కొత్తగా వచ్చిన ఇద్దరూ తలుపు దగ్గర నిలబడి నవ్వుతున్నారు. ఇద్దరూ అమ్మాయిలే. ఒకరు పొడుగ్గా, నల్లటి జుట్టుతో. మరొకరు పొట్టిగా, కళ్లద్దాలతో.

‘'హాయ్... నేను మీరా.’

‘నేను అనన్య.’

‘మేం బెంగళూరు నుంచి.’ అంతే. ఒక్క క్షణం గదిలో నిశ్శబ్దం. ఎవరో చప్పట్లు కొట్టీ కొట్లనట్టు కొట్టారు. అందరూ చప్పట్లు కొట్టక తప్పలేదు. ఆ సగం చప్పట్లలో నిండైన సంకోచం. ‘వాళ్లిద్దరూ ఎలా చేసుకుంటారబ్బా’ పక్కనే ఉన్న స్వాతిని అడిగింది అల్లరిగా ఉండే రమణి.


రెండు రోజుల తర్వాత. లిఫ్ట్‌లో మీరా, అనన్య, శ్వేత ముగ్గురే. లిఫ్ట్ మూడో అంతస్తు దగ్గర ఆగింది. ‘మీరు ఎంతకాలంగా ఇక్కడున్నారు?’ మీరా నవ్వుతూ అడిగింది.

‘ఐదేళ్లుగా.’ ‘ఈ ప్లేస్ చాలా బాగుంది . ఇక్కడ అందరూ చాలా ఓపెన్‌గా ఉంటారని విన్నాం.’

శ్వేత చిన్నగా నవుతూ ‘అవును...’ అంది. ఆ ‘అవును’లో కొంచెం కాదు ఉంది.


వారం తర్వాత మరో మెసేజ్. " Villa 12 occupied ." ఈసారి వచ్చినవాళ్లు ఆదిత్య. నైనా. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో వాళ్ల పేర్లు అలాగే ఉన్నాయి. కానీ వాళ్లిద్దరి ఫోటో చూసిన వాళ్లలో చాలామందికి ఒకే సందేహం. ‘ఎవరు అబ్బాయి?’ ‘ఎవరు అమ్మాయి?’ నైనా ట్రాన్స్ ఉమెన్. ఆదిత్య ట్రాన్స్ మేల్. వాళ్లు చేతులు పట్టుకుని నడుస్తుంటే, బయట ప్రపంచం విచిత్రంగానూ అభ్యంతరంగానూ కొంచెం అసహ్యంగానూ చూసేది. ఈ కమ్యూనిటీలో మాత్రం మొదటిసారి వాళ్లకు అలా అనిపించలేదు.

‘ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటుందేమో.’ నైనా అంది.

ఆదిత్య నవ్వాడు. ‘చూద్దాం.’ వీళ్ల పరిచయ సభ కూడా గొప్పగా ఏం జరగలేదు. సందేహం నిండిన చప్పట్లే.

‘వీళ్లేం చేసుకుంటారో ’ పక్కనే ఉన్న స్వాతిని చెవిలో అడిగింది అంతే అల్లరిగా రమణి. మొదటి మార్పు చాలా చిన్నది. శుక్రవారపు "కమ్యూనిటీ డిన్నర్" కి ఎవరికి తోచిన వంట వాళ్లు తీసుకొస్తారు. నైనా తెచ్చిన హైదరాబాదీ దమ్ బిర్యానీని అందరూ పొగిడారు. కానీ... తీసుకునేటప్పుడు చాలామంది వడ్డించమని అడగలేదు. తామే వేసుకున్నారు. అది గమనించిన వాళ్లు కూడా గమనించనట్టే ఉన్నారు.....నైనా కూడా.


స్వేచ్ఛలో ఒక సంప్రదాయం ఉంది. కొత్తగా వచ్చిన వాళ్లు గేటు పక్కన ఒక మొక్క నాటాలి. ఈసారి నైనా, ఆదిత్య వంతు. మట్టి

తవ్వుతున్నారు. పిల్లలు చుట్టూ నిలబడ్డారు. ఒక చిన్నబ్బాయి అడిగాడు.

‘అంకుల్...’

ఆదిత్య నవ్వుతూ చూశాడు. ‘చెప్పు.’

‘నువ్వు ముందు ఆంటీనా?’

అక్కడ ఉన్న పెద్దవాళ్లందరూ ఒక్కసారిగా ఇబ్బంది పడ్డారు. నైనా ఆ బాబుని దగ్గరకు తీసుకుని ‘నీ పేరు?’ అడిగింది.

‘విహాన్.’

‘విహాన్... ఈ మొక్క చూడు. ఇది చిన్నప్పుడు ఎలా ఉందో తెలుసా?’

‘లేదు.’

‘ఇదీ మారింది. మొక్క చెట్టయింది కదా’

‘అంకుల్‌ ఇప్పుడు చెట్టా?’

‘అవును.’ బాబు మొక్కను చూసి మళ్లీ ఆదిత్యను చూశాడు.

‘అయితే నువ్వూ చెట్టులాంటివాడివే కదా’ పిల్లలు కొన్నిసార్లు సమాజం కంటే తెలివైన ప్రశ్నలు అడుగుతారు. మరింత తెలివైన సమాధానాలు కూడా వాళ్లకే తెలుస్తాయి.

ఆ రాత్రి నైనా ఆదిత్య బాల్కనీలో చాలాసేపు కూర్చున్నారు . ఆదిత్య అడిగాడు.

‘నువు గమనించావా?’ నైనా అడిగింది.

‘ఏది?’

‘మన చేతి నుంచి ఎవరూ భోజనం తీసుకోలేదు.’

‘బయట అయితే నవ్వేసేదాన్ని.’

‘ఇక్కడ కూడానా అని బాధగా ఉందా?’.. నైనా సమాధానం చెప్పలేదు. ఆదిత్య చాలాసేపు ఏమీ మాట్లాడలేదు.

‘బయట కూడా ఇలాగే జరిగేది.’

‘అవును.’

‘కానీ...’

‘ఇక్కడ కూడా జరుగుతుందని ఊహించలేదు.’

ఆదివారం సాయంత్రం. క్లబ్ హౌస్‌లో సినిమా. సీట్లు దాదాపు నిండిపోయాయి. మీరా , అనన్య లోపలికి వచ్చేసరికి రెండు సీట్లు మాత్రమే

ఖాళీగా ఉన్నాయి. వాటి మధ్యలో ఒక్కో సీటు ఖాళీగా ఉంది. ఎవ్వరూ లేచి ‘ఇక్కడ కూర్చోండి’ అనలేదు.

ఎవ్వరూ ‘వెళ్లిపోండి’ అని కూడా అనలేదు. ఆ ఒక్క సీటు దూరమే...అసలు దూరం.

ఒక రోజు వాట్సాప్‌ గ్రూప్ Resident Welfare Association లో కొత్త చర్చ మొదలైంది.

​రాహుల్ ‘మన కమ్యూనిటీకి మీడియా అటెన్షన్ ఎక్కువ అవుతోంది.’

కార్తిక్‘అదేంటి?’

రాహుల్ ‘ఎవరెవరు వస్తున్నారో కొంచెం చూసుకోవాలి.’

మీరా ‘అంటే?’

రాహుల్ ‘అందరికీ ఓపెన్ అంటే... అందరికీ ఓపెన్ కాదు కదా.’ ఐదు నిమిషాలు ఎవరూ రిప్లై ఇవ్వలేదు.

‘మన కమ్యూనిటీ ఇమేజ్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి.’

శ్వేత వెంటనే అడిగింది. ‘ఏమైంది?’

కొంతసేపటి తర్వాత సమాధానం వచ్చింది. ‘ఇవాళ నా ఆఫీసు వాళ్లు వచ్చారు. కొంచెం... డిస్ కంఫర్ట్ ఫీల్ అయ్యారు.’

‘ఎందుకు?’ అని మీరా అడిగింది. రాహుల్ చాలా సేపు టైప్ చేసి డిలీట్ చేసినట్టు గ్రూప్ లో అందరికీ తెలుస్తోంది. చివరకు ఒక్క వాక్యం మాత్రమే పెట్టాడు.

‘మనం లివ్ ఇన్ కమ్యూనిటీ. దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి.’

‘రాహుల్... నువ్వు ఏమనాలనుకుంటున్నావు?’

రాహుల్ రిప్లై... ‘Nothing personal.’

ఆ వాక్యం కింద నిశ్శబ్దం పేరుకుపోయింది. ఆ మెసేజ్ కింద పది నిమిషాలు ఎలాంటి స్పందన రాలేదు. నైనా ఆ చాట్‌ను చాలాసేపు

చూస్తూనే ఉంది. తర్వాత మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసింది.

‘మనుషులకి ప్రతి స్వేచ్ఛకి ఒక గోడ కావాలి.’ అని గొణుక్కుంది.


మరుసటి వారం రెసిడెన్షియల్ కమిటీ మీటింగ్. అజెండా చిన్నదే. సెక్యూరిటీ. నీటి సమస్య. పార్కింగ్.

అన్నీ అయిపోయాక రాహుల్ గొంతు సవరించుకున్నాడు.

‘ఒక చిన్న విషయం.’ అందరూ చూశారు.

‘ఇకపై కొత్త సభ్యులను తీసుకునేటప్పుడు ఒక స్క్రీనింగ్ కమిటీ ఉండాలి.’

‘ఎందుకు?’ కార్తిక్ అడిగాడు.

‘మన కమ్యూనిటీ లక్ష్యం దెబ్బతినకూడదు.’

‘మన లక్ష్యం ఏమిటి?’ మీరా అడిగింది.

‘లివ్ ఇన్ జంటలకు సురక్షితమైన స్థలం.’

‘వాళ్లు లివ్ ఇన్ జంట కాదా?’ శ్వేత ప్రశాంతంగా అడిగింది. రాహుల్ తడబడ్డాడు.

‘అది... విషయం కాదు.’

‘మరి విషయం ఏమిటి?’

‘వాళ్లు... అంటే...’

మాట బయటకు రాలేదు.

ఎందుకంటే అతనికి కూడా తన మాట సిగ్గుగా అనిపించింది కామోసు.


​ఆ రోజు రాత్రి శ్వేతకు నిద్ర పట్టలేదు. కార్తిక్ అడిగాడు.

‘ఏమైంది?’

‘ఒక విషయం గుర్తొచ్చింది.’

‘ఏది?’

‘ఐదేళ్ల క్రితం...’

‘ఏమైంది?’

‘మనం మొదటి ఇల్లు వెతుకుతున్నప్పుడు ఒక ఇంటి యజమాని అన్నాడు...’ ఆమె గొంతు నెమ్మదించింది.

‘మీలాంటి వాళ్లను ఉంచితే మా అపార్ట్‌మెంట్ ఇమేజ్ పాడవుతుంది’ శ్వేత ఒక్కసారిగా మంచం మీద లేచి కూర్చుంది.

‘ఇవాళ రాహుల్ కూడా అదే మాట అన్నాడు.’

కార్తిక్ మాట్లాడలేదు. కొన్నిసార్లు మనిషి తన మాటల్లో తన శత్రువులను కాపాడుతుంటాడని ఇద్దరికీ అర్థమైంది.

నైనాకు ప్రతి ఉదయం మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు. తన ఇంటి ఆవరణలోని వాటికే కాదు. దారిలో కనిపించిన ప్రతి మొక్కకీ.

ఒకరోజు మీరా అడిగింది. ‘అందరి ఇళ్ల ముందు మొక్కలకు ఎందుకు నీళ్లు పోస్తున్నావు?’ అని. దానికి నైనా నవ్వింది.

‘మొక్కలు నీళ్ల యాజమాన్యాన్ని చూడవు.’ ఆ మాటకు మీరా నవ్వింది, కానీ ఆ రాత్రి మీరాకు కూడా చాలా సేపు నిద్ర పట్టలేదు.


అదే సాయంత్రం...స్వేచ్ఛ మెయిన్ గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు కొత్తగా వచ్చిన ఒక కొరియర్ బాయ్‌తో వాదిస్తున్నాడు.

‘ఎక్కడికి?’

‘విల్లా 12.’

‘పేరు?’

‘నైనా.’ అతను కాసేపు ఆగి అడిగాడు.

‘అంకుల్‌కి ఇవ్వాలా... ఆంటీకి ఇవ్వాలా?’...సెక్యూరిటీ గార్డ్ నవ్వేశాడు. కొరియర్ బాయ్ కూడా నవ్వాడు. గేటుదాటి లోపలికి వస్తున్న శ్వేత ఆ నవ్వు విన్నది.

ఆ నవ్వు...ఎక్కడో చాలా సంవత్సరాల క్రితం...తన వెనక కూడా వినిపించిందే. విన్నదే. ఆ నవ్వులో తమను ఆఫీసులో హేళన చేసిన గొంతులున్నాయి. ఇల్లు ఖాళీ చేయించిన నలుగురు యజమానుల విసుర్లున్నాయి. ఆరు నెలల్లో వాళ్లు నాలుగు ఇళ్లు మారడం గుర్తుకొచ్చింది. ఐదోసారి ఒక బ్రోకర్ అన్నాడు.

‘సార్... మీలాంటి వాళ్ల కోసం ఒక ప్లేస్ ఉంది.’

‘మీలాంటి వాళ్లు? అంటే...’... అతను మింగేసిన మాటలున్నాయి.

శ్వేత ఇంట్లో పార్టీ. అందరూ వచ్చారు. వాతావరణమంతా సంగీతం. నవ్వులు. డ్యాన్స్. మీరా, అనన్య కూడా వచ్చారు. ఆదిత్య, నైనా తలుపు దగ్గరకు వచ్చేసరికి లోపలనుంచి సంగీతం వినిపిస్తోంది. డోర్ తెరిచింది శ్వేతే. ఒక్క క్షణం తడబడింది. ‘హాయ్...’ ‘లోపలికి రండి.’ లోపలికి వెళ్లగానే మాటలు ఉన్నట్టుండి ఆగిపోయాయి. అది ఎవరూ ప్లాన్ డ్ గా చేసింది కాదు. కానీ జరిగింది. కొంతమంది చూపులు నిర్లిప్తంగా మారిపోయాయి. కొంతమంది సంభాషణలు మధ్యలో ఆగిపోయాయి. ఆదిత్య గ్లాస్‌లో జ్యూస్ పోసుకుని బాల్కనీకి


గోడల్లోపలి గోడలు

వెళ్లిపోయాడు. నైనా కూడా. పది నిమిషాల తర్వాత వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.

ఎవరూ ఆపలేదు.


నైనాకు ప్రతి ఇంటి ముందు రాత్రి పూట ఏ నోట్ లేకుండా

ఒక పువ్వు పెట్టి వెళ్లడం అలవాటు. ​ఒకరోజు ఆమె తలుపు ముందు

అన్ని పూలూ తిరిగి

పడివున్నాయి. ఏ నోట్ లేదు. అది చాలా చెడ్డ రిటర్న్ గిఫ్ట్.


తెల్లారి స్వాతి, శ్వేతను కలిసింది. ‘మొన్న వాళ్లు ఎందుకు వెళ్లిపోయారు?’

‘తెలియదు.’

‘నీకు తెలుసు.’ శ్వేత మౌనంగా ఉంది.

స్వాతి అడిగింది. ‘మనం బయట ఎదుర్కొంటున్నదే... వాళ్లు ఇక్కడ ఎదుర్కొంటున్నారని నీకు అనిపించలేదా?’

శ్వేత వెంటనే సమాధానం చెప్పలేదు. చాలాసేపటి తర్వాత అంది. ‘ అది అంత సింపుల్ కాదేమో.’

‘ఎందుకు?’

‘ఎందుకంటే...’

ఆమె వాక్యం మధ్యలో ఆగిపోయింది. స్వాతి సూటిగా అడిగింది. ‘మనల్ని సమాజం అంగీకరించలేదు కాబట్టి మనం ఈ కమ్యూనిటీని నమ్ముకున్నాం.’

‘అవును.’

‘మరి ఇప్పుడు మనమే ఇంకొకరిని అంగీకరించలేకపోతున్నామా?’

శ్వేత మొదటిసారి స్వాతి కళ్లలోకి చూడలేకపోయింది.

ఇంకో రోజు వాట్సప్ లో మళ్లీ చర్చ జరిగింది. ఈ సారి చాలా మంది పాల్గొన్నారు. కొందరు సగం సాంప్రదాయవాదులు. కొందరు సగం

విప్లవ కారులు. కొందరు ప్రశ్నించే వారు. కొందరు ధిక్కారులు. కొందరు తటస్తులు.

‘ శారీరక అనుబంధం ఆడా మగా మధ్యే ఉండాలి. అదే ప్రకృతి ధర్మం ’

‘ప్రకృతి ధర్మమా? లేక సమాజం రాసుకున్న నియమమా?’

‘ సమాజం కూడా ప్రకృతినే అనుసరిస్తుంది.’

‘అయితే ప్రకృతిలో స్వలింగ జీవనం సాగించే వందలాది జంతు జాతుల సంగతో?’

‘అది జంతువుల సంగతి. మనుషులకు సంస్కృతి ఉంది.’

‘మన సంస్కృతిలో అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. శిఖండి ఉన్నాడు. బృహన్నల ఉన్నాడు. లింగ వైవిధ్యాన్ని పురాణాల్లో పూజించి,

మన ముందున్న మనుషులను మాత్రం అవమానిస్తాం, ఎందుకలా ?’

‘వాళ్లను గౌరవించాలి. కానీ ఇది వేరు.’

‘ఎందుకు వేరు?’

‘కుటుంబం. సంతానం.’

‘అయితే పిల్లలు కనలేని దంపతుల సహజీవనం చెల్లదా? వృద్ధాప్యంలో పెళ్లి చేసుకునేవాళ్లది పెళ్లి కాదా? అలా అయితే మరి

స్వేచ్ఛలో ఉన్న అందరి సంగతేంటి ?’

‘అది... విషయం అలా కాదు.’

‘అయితే ఇదంతా పిల్లల కోసమా? ఇద్దరు మనుషులు ఒకరికొకరు జీవితాలను పంచుకోవడమా?’

‘సమాజం ఏమంటుంది?’

‘సమాజాన్ని ధిక్కరించిన మన సమాజం కూడా ఇలా మాట్లాడడం సమంజసమేనా, సమాజం ఒకప్పుడు వితంతు వివాహాన్నీ తప్పు అనింది. కులాంతర వివాహాన్నీ పాపం అనింది. ప్రేమ వివాహాన్ని అవమానం అనింది. ఇప్పుడు వాటిలో చాలా అంగీకరించింది కదా. సమాజం వాటిని అంగీకరించేట్టు మనమే చేసామనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి’

‘అయినా... ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్ల సహజీవనం, ట్రాన్స్ జెండర్ల సంసారం జీర్ణించుకోవడం కష్టం.’

‘జీర్ణించుకోవడం కష్టమా? లేక అలవాటు లేకపోవడమా?’

‘మరి సహజీవనాన్ని జీర్ణించుకున్నామా, అలవాటు పడ్డామా, గత్యంతరం లేకనా ’

‘పెళ్లి లేకుండానే కలిసి జీవించే హక్కు ఇద్దరికీ ఉందని అంగీకరిస్తున్నాం. అయితే అదే ఇద్దరూ చట్టబద్ధంగా ‘మేము కుటుంబం’ అని

చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నాం?’

‘అంటే మీ ఉద్దేశ్యం...’

‘ఒకరి ప్రేమను నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదు. కానీ అది వారి హక్కు అని అంగీకరించాల్సిన బాధ్యత మాత్రం ఉంది.’

‘అయితే సంప్రదాయం?’

‘సంప్రదాయం మనుషుల కోసం పుట్టింది. మనుషులు సంప్రదాయం కోసం కాదు.’

‘కొన్ని ప్రశ్నలు... సమాధానాల కంటే పెద్దవిగా ఉంటాయి.’ ‘అవును. మనం వాటికి వెంటనే సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ప్రశ్న అడిగిన వాళ్లను మాత్రం శిక్షించకూడదు.’

‘బయట గోడలను కూల్చి మనం స్వేచ్ఛలోకి వచ్చాం. మనం స్వేచ్ఛలో కూడా గోడలు కడితే ఎలా’

​ఆ తరువాత అన్నీ రకరకాల ఎమోజీలే.


అదే రోజు సాయంత్రం శ్వేత వాట్సాప్ గ్రూపులో ఒక నోటీసు పెట్టింది.

‘స్వేచ్చ ఏర్పడింది మనలాంటి వాళ్లను బయట ప్రపంచం తిరస్కరించినందుకే. ఇప్పుడు మనమే ఇంకొకరిని తిరస్కరిస్తే... ఈ గేటు బయట ఉన్న వాళ్లకీ, మనకీ తేడా ఏమిటి?’

ఈసారి సమాధానం ఆలస్యంగా వచ్చింది. మొదట రాహుల్. ‘సారీ.’ తర్వాత ఇంకొకరు.

‘బహుశా మనం సవ్యంగా ఆలోచించలేదు.’ ఆ తర్వాత...ఒక్కొక్కరిగా.

‘సారీ.’ ‘సారీ’... ‘సారీ’

నైనా మొబైల్ లోకి చూసి నవ్వలేదు. ఏడవలేదు. ఆదిత్య వైపు చూసి మాత్రమే అంది ‘క్షమాపణలు వినడం బాగానే ఉంటుంది.’

‘కానీ...’

‘తలుపు తెరవడం కంటే...గేటు తీసేయడం కష్టం.’

అనన్య మీరా కూడా చర్చంతా ఫాలో అవుతున్నా, సారీలు స్వీకరిస్తున్నా, ఎక్కడో ఏదో తెలియని నొప్పి.


కొన్ని నెలల తర్వాత... గేటు మీదున్న పాత బోర్డు Married Couples Not Allowed అలాగే ఉంది. కానీ దాని కింద ఇంకో చిన్న పలక కనిపించింది.

​ఎవరు పెట్టారో ఎవరికి తెలియదు. దానిమీద ఒక్క వాక్యం. "No one seeking dignity will be turned away." అప్పటి నుంచి "స్వేచ్చ" ఒక గేటెడ్ కమ్యూనిటీగా కాకుండా...తమ గాయాలను మాత్రమే కాదు, తమ తోటి కన్నీటి చారికలను కూడా గుర్తించడానికి ప్రయత్నించే ఒక ఇల్లుగా మారింది. గేట్లు ఇంకా ఉన్నాయి. కానీ వాటిని రక్షిస్తోంది వివక్ష కాదు. వాటిని తెరిచి ఉంచాలనే స్పృహ.​


ప్రసేన్

70133 58154


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్