ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఖాళీ కుర్చీ

28 జూన్, 2026

KHALEKURCHIMINIKATHA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 06:47 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కాఫీ కప్పు రామ్మూర్తి చేతిలో స్వల్పంగా వణుకుతోంది. అది వయసు వల్లనా, వ్యాధి వల్లనా తెలియదు. కానీ కప్పు అంచు దాటి టేబుల్ మీద పడిన రెండు చుక్కలను లక్ష్మమ్మ మాత్రం అలవాటైన ప్రేమతో తన చీరకొంగుతో తుడిచేసింది. ‘నువ్వు చిన్నప్పుడు పిల్లలకు అన్నం కలిపి పెట్టేవాడివి. ఇప్పుడు నేను నీకు కాఫీ తాపించాల్సి వస్తోంది’ అంది నవ్వుతూ. రామ్మూర్తి కూడా నవ్వాడు. కానీ ఆ నవ్వు కళ్ల వరకూ చేరలేదు. అతని వయసు ఎనభై అయిదు. కొన్నేళ్లుగా ఆల్జీమర్స్ అతని జ్ఞాపకాల మీద మెల్లగా మబ్బులా కమ్ముకుంటోంది. కొన్నిసార్లు గతం మొత్తం నిన్న జరిగినట్టుగా గుర్తుంటుంది. మరికొన్నిసార్లు ఎదురుగా ఉన్నవాళ్లు ఎవరో కూడా గుర్తుకురారు. మలమూత్రాల మీద కూడా నియంత్రణ కోల్పోయాడు. తన భార్య లక్ష్మమ్మకు ఇప్పుడు భర్త రామ్మూర్తి పసిపిల్లాడిలా మారిపోయాడు.

వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు అనిల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు స్వాతి పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఒకప్పుడు పిల్లల నవ్వులతో, పాఠశాల బ్యాగులతో, పండగల సందడితో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు ఇద్దరి శ్వాసలతో మాత్రమే నిండిపోయింది.​ అలా సాగుతున్న జీవితంలో ఒకరోజు లక్ష్మమ్మ బాత్రూంలో జారి పడింది. తుంటి ఎముక విరిగింది. ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు నడవడం కూడా కష్టమైపోయింది. కొన్ని నెలలు అనిల్ సెలవు పెట్టి, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. కానీ సెలవులు ఎప్పటికీ కొనసాగవు. బెంగళూరులో ఉద్యోగం ఎదురుచూస్తోంది. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, బ్యాంకు ఈఎంఐలు. ​ప్రతి నెలా జీతం వచ్చేముందే ఖర్చులు వరుస కట్టేవి. రాత్రిళ్లు అందరూ నిద్రపోయాక అనిల్ ఒంటరిగా కూర్చుని లెక్కలు చూసేవాడు. ఒకవైపు తల్లిదండ్రుల వైద్య ఖర్చులు. మరోవైపు పిల్లల భవిష్యత్తు.

‘ఇంకో మార్గం ఉంటే ఎంత బాగుండేది...’ అని ఎన్నోసార్లు అనుకున్నాడు. ​తల్లిదండ్రులను చూసుకోవడానికి పనిమనుషులను పెట్టాడు.

​కానీ రామ్మూర్తి పరిస్థితిని తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. చివరకు అనిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి అతనికి నిద్ర రాలేదు. చాలాసేపు నిద్రపోకుండా పైకప్పు వైపు చూస్తూ గడిపాడు. ​తాను సరైనదే చేస్తున్నాడా? లేక తండ్రిని అన్యాయం చేస్తున్నాడా? అని ప్రశ్నించుకున్నాడు.

​ఆ ప్రశ్నకు సమాధానం అతనికే దొరకలేదు.

​నెల రోజుల తర్వాత. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చినుకులు పడుతున్నాయి. అనిల్ కారులో తల్లిదండ్రులను తీసుకెళ్తున్నాడు.

‘ఎక్కడికి రా?’ అని అడిగాడు రామ్మూర్తి.​

‘ఒక చోటికి నాన్న,’ అన్నాడు అనిల్. కొద్దిసేపటికి కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. బోర్డు మీద ‘సంతోష వృద్ధాశ్రమం’ అని ఉంది.

లక్ష్మమ్మకి ఒక్కసారిగా గుండె బరువైంది. రామ్మూర్తి మాత్రం బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని ముఖంలో బాధ కనిపించింది. కానీ ప్రశ్న మాత్రం కనిపించలేదు. బహుశా సమాధానం ముందే తెలిసిపోయి ఉండొచ్చు. లోపలికి వెళ్లారు. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. డాక్టర్, నర్సులు ఉన్నారు. వాతావరణం శుభ్రంగా ఉంది. ​భద్రత ఉంది. కానీ... అది ఇల్లు కాదు.​

‘నాన్న...’ అనిల్ గొంతు వణికింది.​

‘నేను ఎంతో ప్రయత్నించాను. కానీ మిమ్మల్ని చూసుకోవడం నాకు కుదరటం లేదు.’​రామ్మూర్తి మౌనంగా ఉన్నాడు.

‘నేను చెడ్డ కొడుకుని కాదు నాన్న.’ అనగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు రామ్మూర్తి అతని వైపు చూశాడు. తర్వాత మెల్లగా అన్నాడు.​

‘నీకు చిన్నప్పుడు జ్వరం వస్తే రాత్రంతా నీ పక్కనే కూర్చునేవాళ్లం. కానీ ఇప్పుడు మేము నీకు భారమైపోయామా?’ అన్న మాటలకు

​అనిల్ తల వంచుకున్నాడు. ఆ మాటకు సమాధానం అతని దగ్గర లేదు.

అప్పుడే రామ్మూర్తి మనసులో ఒక జ్ఞాపకం మెరిసింది.​అనిల్ మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన రోజు. గేటు దగ్గర నిలబడి ఏడుస్తూ తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

‘నాన్న... నువ్వు వెళ్లిపోవద్దు..’

అప్పుడు రామ్మూర్తి నవ్వుతూ, ‘సాయంత్రానికి వచ్చేస్తాను రా,’ అని చెప్పి అతని చేతిని వదిలించాడు.

ఇప్పుడు...​ఏళ్ల తర్వాత...

​తన చేతిని వదిలించుకుని వెళ్తున్నది అదే కొడుకు. రామ్మూర్తి కళ్లలో నీళ్లు మెరిశాయి. ​కానీ కొడుకు భుజం మీద చేయి వేసి,

​‘సర్లే రా...’ అన్నాడు.

​ఆ రోజు సాయంత్రం అనిల్ వెళ్లిపోయాడు.

​కారు గేటు దాటి కనిపించకుండా పోయే వరకు రామ్మూర్తి చూస్తూనే ఉన్నాడు.

​ఆ రాత్రి ఒక్కసారిగా నిద్రలేచి, ‘మన ఇంటి వరండా లైట్ ఎందుకు ఆఫ్ చేశారు?’ అని అడిగాడు.

​లక్ష్మమ్మ గుండె పిండేసినట్టు అయింది. ‘ఇది మన ఇల్లు కాదు’ అని చెప్పడానికి ఆమెకు ధైర్యం రాలేదు.

​ఆమె నిశ్శబ్దంగా అతని చేయి పట్టుకుంది.

​రోజులు గడిచాయి.
స్వాతి అమెరికా నుంచి వీడియో కాల్స్ చేసేది. ​అనిల్ వారానికి ఒకసారి వచ్చేవాడు. మందులు ఉన్నాయి. డాక్టర్లు ఉన్నారు. జాగ్రత్తగా చూసుకునే వారూ ఉన్నారు. కానీ ఇంటి వాసన మాత్రం లేదు. రాత్రిళ్లు రామ్మూర్తి ఒక్కసారిగా లేచి,‘ మన ఇంటికి వెళ్దామా?’ అని అడిగేవాడు.

లక్ష్మమ్మ సమాధానం చెప్పలేకపోయేది. ఆమె దిండుకింద దాచుకున్న ఇంటి తాళాలను అప్పుడప్పుడు చేతిలోకి తీసుకుని చూస్తుండేది. ఇల్లు గుర్తు చేసుకోవడానికి.

​ ఒక వర్షపు సాయంత్రం. అనిల్ వృద్ధాశ్రమానికి వచ్చాడు. రామ్మూర్తి అతని వైపు చూసి, ‘నువ్వెవరు?’ అని అడిగాడు. అనిల్ గుండె ఒక్కసారిగా బరువైంది. ఎంతో ప్రేమగా పెంచిన తండ్రి తనను గుర్తుపట్టలేకపోయాడు. ఆ రోజు ఇంటికి తిరిగి వెళ్తూ రోడ్డుపక్కన కారు ఆపాడు. స్టీరింగ్ మీద తల వాల్చుకున్నాడు. ఎన్నో రోజులుగా ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటపడ్డాయి. కానీ వాటిని చూసేవాళ్లు ఎవరూ లేరు.

​రోజులు నెలలయ్యాయి. ​ఆల్జీమర్స్ రామ్మూర్తిని పూర్తిగా తనలోకి లాక్కుంది. ఒక రాత్రి అతని ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. లక్ష్మమ్మ మంచం పక్కనే కూర్చుంది. రామ్మూర్తి మెల్లగా కళ్లుతెరిచాడు. ఎన్నో రోజుల తర్వాత అతని చూపులో ఒక స్పష్టత కనిపించింది. చుట్టూ చూశాడు. తర్వాత అడిగాడు.

‘అనిల్ వచ్చాడా?’..​లక్ష్మమ్మ కళ్లలో నీళ్లు ఉబికాయి. ఎన్నో నెలల తర్వాత మొదటిసారి అతనికి తన కొడుకు గుర్తొచ్చాడు. అనిల్‌కు ఫోన్ చేశారు.

​కానీ అతను చేరుకునేలోపే... రామ్మూర్తి చివరి శ్వాస విడిచాడు. అతని పెదవుల మీద మాత్రం చిన్న చిరునవ్వు మిగిలింది. బహుశా తన కొడుకు వస్తున్నాడని నమ్మకంతోనో, లేదా తన ఇంటికి తిరిగి వెళ్తున్నాననే భావంతోనో... ఎవరికి తెలియదు. అంత్యక్రియలు ముగిశాయి. జనం వెళ్లిపోయారు. ఇల్లు మళ్లీ నిశ్శబ్దమైంది. బయట వర్షం పడుతోంది. గోడ మీద రామ్మూర్తి ఫోటో ఉంది. లక్ష్మమ్మ మంచం మీద కూర్చుని ఉంది. అనిల్ ఆమె పక్కన కూర్చున్నాడు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడలేదు.

‘అమ్మా...’ అనిల్ మెల్లగా పిలిచాడు.​

‘నన్ను క్షమించవా?’ లక్ష్మమ్మ వెంటనే సమాధానం చెప్పలేదు. ఒకసారి గోడ మీద ఉన్న ఫొటో వైపు చూసింది. తర్వాత అతని వైపు తిరిగి మెల్లగా అడిగింది.

​‘నువ్వు నిన్ను నువ్వు క్షమించుకున్నావా?’

​అనిల్ తలదించుకున్నాడు. సమాధానం లేదు. వరండాలో రామ్మూర్తి కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది. వర్షం మాత్రం పడుతూనే ఉంది.


- జ్యోతి మువ్వల

9008083344

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్