తెల్లని అక్షరాలతో_ వున్న బోర్డుని చేతి గుడ్డతో శుభ్రంగా తుడిచి, ఒకసారి దానివంక అభిమానంగా చూసుకుంది సీతమ్మ. _ఎప్పటిలాగే ఉదయాన్నే నాలుగున్నర కల్లా స్నానం కానిచ్చి, తన సరంజామాతో, రమణయ్య రిక్షాలో రేవు దగ్గరికొచ్చేస్తుంది. అతను ఆమెకి_ నమ్మిన బంటు._ ముందుగా కొట్టు శుభ్రం చేసుకుని, దేవుడి పటాలకు పూల దండలు వేసి, దీపం వెలిగించి అగరబత్తుల ధూపం వేసి, తన వ్యాపారం బాగా సాగాలి.. అందరూ క్షేమంగా వుండాలి, ఆ గోదారి తల్లి చల్లగా చూడాలని నమస్కారం పెట్టుకుంటుంది. ఇహ ఆ తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న ఇడ్లీ పిండితో వాయలు దింపుతుంటే, ఆ సువాసన ఆకలికే ఆకలి పుట్టించేటట్లు వుంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్కళ్ళుగా వచ్చి ఇడ్లీలు తింటూ, “అబ్బ.. నీ చేతిలో అమృతం వుంది సీతమ్మా!” అని పొగిడితే, వినేసి ఓ నవ్వు నవ్వుతుంది.
‘ఏరా రమణయ్యా, ఇప్పటిదాకా రాలేదే!’ అని పక్కనున్న గిన్నె మూత తీస్తూ అంది ఆగిన రిక్షా చప్పుడు_ విని. అలసటతో చెమట తుడుచుకుంటూ వుస్సూరుమంటూ రమణయ్య వచ్చాడు. ‘ఇదిగో ముందు ఈ మంచినీళ్ళు తాగు’ ఆమె ఇచ్చిన నీళ్ళు అందుకుని గటగటా తాగి ‘అబ్బా! మన గోదారి నీళ్ళు ఓ గ్లాసుడు తాగితే ఆకలి దప్పులే వుండవు’ అంటున్న అతని చేతికి నాలుగు వేడి వేడి ఇడ్లీలు, ఇంత అల్లం పచ్చడి వేసిన ఆకు ఇచ్చి ‘ఇది తిని మాట్లాడు’ అంది._మారు మాట్లాడుకుండా అందుకున్నాడు. బల్ల దగ్గర కూర్చుని, ఇడ్లీ ముక్క తీసుకుంటూ.. ‘ఈ ఇడ్లీ వాసన దూరం నుంచి వచ్చినా కడుపు నిండిపోతుంది. నీ చేతి వంటే పుష్కరాల కన్నా, పుణ్యం కన్నా మహత్తరమైంది’ అన్నాడు నవ్వుతూ.
‘హా.. హా.. పుష్కరాలు పుణ్యం, నా ఇడ్లీలు తింటే వస్తుందా? అయ్యో అంత మాటకాదు కానీ, నా వంట మీ అందరికీ నచ్చడం నా భాగ్యం.’ అంది సీతమ్మ.
కొంతసేపటికి రమణయ్య వెళ్ళిపోయాడు. సీతమ్మ కూడా పది గంటలకు కొట్టు కట్టేసి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళి మళ్ళీ మూడు గంటలకల్లా తిరిగి వస్తుంది.
ఆకాశం మబ్బుపట్టి ఉంది. ఉదయం కరిగి, మధ్యాహ్నం మొదలవ్వబోతున్న వేళైనా వాతావరణం చల్ల చల్లగా ఉంది. ఉండుండి వీస్తున్నగాలి హాయి గొలుపుతోంది. వర్ష ఋతువు కదూ. అందులోనూ కొండలు కోనల ముంచి, ఉరుకుతూ పరుగులు తీస్తూ ఎర్రటి నీళ్ళతో కళకళ్ళాడిపోతూ ఉంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ ఋతువులో నిండు అందం గోదారమ్మది. ఆ గోధూళివేళ గోదావరి అలలపై విద్యుద్దీపపు కాంతులు ఆకాశంలోని నక్షత్ర కన్యలతో పోటీ పడుతున్నాయి. సాయంత్రం అయ్యేసరికి రేవు అంతా దీపాల తోరణాలతో పట్టపగలులా వుంది. నదిలో తేలుతున్న దీపాల వెలుగులు రేవు మీద తళుక్కుమన్నాయి. పిల్లలు, పెద్దలు స్నానాలు చేస్తూనే వున్నారు. చేసినవాళ్ళు బట్టలు మార్చుకుని, అక్కడున్న మెట్ల మీద కూర్చుని వున్నారు. ఓ పక్కన గుడిలో హరికథ చెబుతున్నారు, ఇంకో పక్కన భజన చేస్తున్నారు. ఆ పుష్కర సందడంతా కళ్ళల్లో నింపుకుంటూనే పనులు చూసుకుంటోంది సీతమ్మ. అదే సమయానికి ఓ వృద్ధుడు అక్కడికొచ్చాడు. చూడటానికి బైరాగిలా వున్నాడు. నీళ్ళతో తడిసి, వణుకుతున్న కాళ్ళు. స్నానం చేసి వచ్చినట్లున్నాడు.
‘అమ్మా, కొంచెం నీళ్ళిస్తావా?’ అనడిగాడు.
‘ముందు ఆ పక్కగా కూర్చోని నీళ్ళు తీసుకోండి, ఆ తర్వాత వేడి వేడిగా టీ తాగండి, ఇడ్లీ తినండి. మా ఇడ్లీ సెంటర్‌లోకి వచ్చినవాళ్ళను, ఆకలితో_ పంపము’ అంది చిరునవ్వుతో. అతను నెమ్మదిగా తిన్నాడు. టీ కూడా తాగి సీతమ్మ వైపు చూసి చెప్పాడు,
‘అమ్మా నీ నవ్వు.. గోదావరంత చల్లగా వుంది తల్లీ’. ఆ మాటలు విన్న సీతమ్మ నవ్వింది.
‘మీరు కూడా పుణ్యస్నానం చేశారుగా తాతయ్యా! గోదావరి నీళ్ళు మనందరికీ ఆశీర్వాదం.’
మరుసటి రోజు ఉదయం రమణయ్య, సీతమ్మని కొట్టు దగ్గర దింపేసి, తొందరగా బయలుదేరాడు. ఎప్పటిలాగే ‘సీతమ్మ ఇడ్లీ సెంటర్’ బోర్డుని శుభ్రంగా తుడుచుకుంది.
‘ఈ రోజు జనం ఇంకా ఎక్కువ వస్తారని అనుకుంటున్నారు’ అన్నాడు.
‘ఇదిగో.. మొదటి వాయ అయిపోయింది. ఐదు నిముషాలు తినేసి వెళ్ళిపో’
‘తర్వాత తింటాను సీతమ్మా! స్టేషన్ కాడ గిరాకీలు బాగా దొరకుతాయి’ అంటూ నవ్వి బయలుదేరాడు. పుష్కర సంబరంతో రేవు నిద్రపోవటం లేదు. తెల్లవారు ఝామున రెండు గంటల నుంచే దీపాలు, పూజార్ల మంత్రాలు, యాత్రికుల హడావుడి. జనం భక్తి ఉత్సాహంతో గోదావరి వైపు సాగుతుంటే, మధ్యాహ్నం అయ్యేవరకూ_ సీతమ్మకి కూడా ఊపిరి సలపనంత_ గిరాకీ. ఇక తెచ్చిన పిండి అయిపోడంతో కొట్టు మూసేసి, గోదారి వైపు చూస్తోంది.
అంత హడావుడిలోనూ, ఆమె_ గుండెలో ఏదో వెలితి, శూన్యం.
పన్నెండేళ్ళ సీత గలగలా నవ్వుతూ అందరినీ ఇట్టె మాటలతో ఆకట్టుకుంటుంది. కొంతకాలానికి పెళ్ళయింది. పెళ్ళికొడుకు పేరు రామయ్య. తను పెద్దదై, అత్తవారింటికి కాపురానికి వెళ్ళేసరికి ఆ మొగుడు కాస్తా దేశాంతరం వెళ్ళాడని కొందరు, కాదు కాదు బైరాగుల్లో కలిసిపోయాడని మరికొందరు, ఇంకొందరేమో కాదు అతడిని రాజమండ్రి దగ్గర గోదారొడ్డున స్టేషన్‌లో చూసామని అనడంతో,_ భర్త కనిపిస్తాడేమోననే ఆశతో ఇక్కడకు_ వచ్చి, ఇదిగో ఈ రేవు దగ్గర ఇడ్లీ కొట్టు పెట్టింది._గోదారొడ్డుకు వచ్చేవాళ్ళే కాదు, చుట్టుపక్కల ఊర్ల నుండి పనుల కోసం రైలు దిగేవాళ్ళకి, తిరిగి పని ముగించుకుని రైలెక్కే వాళ్ళక్కూడా సీతమ్మ చేసే ఇడ్లీతో పాటూ ఘాటైన అల్లం పచ్చడి అంటే ఇష్టం. ఎప్పటిలాగే రోజూ సాయంత్రం వచ్చే రమణయ్య రాలేదు. కానీ ఒక పోలీస్ జీపు సీతమ్మ ఇడ్లీ కొట్టు ముందాగింది. ఒక కానిస్టేబుల్ దిగి లోపలికొచ్చాడు._ వెంటనే వాళ్ళని చూసి “ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను, ఐదు నిముషాలు ఓపిక పట్టండి సార్! వేడివేడిగా పెట్టేస్తాను’ అంటున్న ఆమె మాటలను మధ్యలోనే ఆపుతూ..
‘అమ్మా, మీరు సీతమ్మనా?’ అనడిగాడు కానిస్టేబుల్.
‘అవును బాబూ..’
‘గోదావరిలో మీ కొట్టుకు వచ్చే రిక్షా అతను మునిగిపోయాడట.. ఎవరో పిల్లాడు, స్నానానికి దిగాడట. ఆ పిల్లాడు నీటిలో మునిగిపోతుంటే రక్షించడానికి వెళ్లి, సుడిగుండంలో చిక్కుకు పోయి, చచ్చిపోయాడు. ఆ పిల్లాడు మటుకు బతికాడు. ఈ నీలిరంగు రిక్షా అతనిదే కదా?’ ఆ మాటలకు సీతమ్మ చేతులు వణికాయి.
‘మా రమణయ్యా..?’
‘అవునమ్మా! అతని శవం దొరికింది, మీరు గుర్తించగలరా?’ అంటున్న పోలీసు మాటలకు సీతమ్మకు దుఃఖం పెల్లుబుకింది. అవి కన్నీళ్ళు మరోరోజు మొదలైంది..
కాదు, ఆ కళ్ళలో మొత్తం గోదావరే.
మరుసటి రోజు ఉదయం రేవులో అదే దృశ్యం. ఎక్కడ చూసినా జనాలు, స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. చేసినవారు మెట్ల దగ్గరున్న గుడివద్ద గుంపులు గుంపులుగా వున్నారు. సీతమ్మ కొట్టు దగ్గర అదే దృశ్యం.
‘సీతమ్మ ఇడ్లీ సెంటర్’ బోర్డు తుడుస్తోంది. కానీ ఆ చేతుల కదలికల్లో నిర్లిప్తత. అదే సమయానికి నిన్నటి వృద్ధుడు మళ్ళీ వచ్చాడు.
‘అమ్మా! నిన్న నన్ను తీసుకెళ్ళిన_అబ్బాయి పోయాడట కదమ్మా. పైగా_అన్నాడు, ‘‘తాతయ్యా! నీవు పుణ్యస్నానం చేయి, నేను వచ్చి తీసుకెళ్తా’’నని. కానీ తిరిగి రాలేదు అన్నాడు. సీతమ్మ దుఃఖాన్ని నిగ్రహించుకోలేక బావురుమంది.
‘‘గోదారమ్మా! రమణయ్య జీవితమంతా ఇతరులను మోశాడు.. ఇప్పుడు నువ్వే అతన్ని తీసుకునిపోయావా! ఇన్నాళ్ళు_ తోడుగా వుండేవాడు. నా ఒంటరి బతుకులో దీపంలా వచ్చాడు. కానీ ఒక్కమాట చెప్పేవాడు. ‘కష్టాలకు, బాధలకు లొంగకుండా ఎదిరించి_ నిలబడాలి’ అని. పైగా ‘నువ్వు సీతమ్మవి, నేను నీ బంటుని’ అంటుండేవాడు. ఆ రాత్రి సీతమ్మ నది దగ్గరకెళ్ళి ఒక దీపం వెలిగించి వదిలింది. గోదావరి మీద ఆ దీపం తేలుతూ దూరం పోతుంది. నదిలో తేలుతూ వెళుతున్న దీపం ఓ కొత్త అర్థాన్ని తెలిపింది. మానవ జీవితం ఈ గోదావరిలా ఓ చైతన్య స్రవంతి. అది ఎప్పటికీ నడుస్తూనే వుంటుంది. మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. గోదావరి మటుకు నిత్య నూతనం.
పుష్కర సమయంలో సూర్యుడు ఉదయించక ముందే లేచి, నదిని స్మరిస్తూ స్నానం చేస్తున్నారు భక్తులు. రేవులో ఒకటే సంబరం.. ఒకటే_ సందడి. పెద్ద, చిన్న, ముసలి, ముతక అబ్బో అదో జన ప్రవాహంతో పాటు ఆగకుండా సాగిపోయే ప్రవాహపు గోదారమ్మ,
పక్కనే సీతమ్మ ఇడ్లీ సెంటర్‌లోంచి, ఇడ్లీలతో పాటూ పచ్చి అరటాకుల సువాసన కలిపి వస్తున్నాయి. అందుకోసమే జనాలు అక్కడికి వెళుతున్నారంటే అతిశయోక్తి కాదేమో!___
సీతమ్మ చెమట తుడుచుకుంటూ, స్టౌ పైన ఇడ్లీల వాయ దింపుతూ.. ‘కిట్టయ్యా! అదిగో చెట్టు కింద కూర్చున్నవాళ్ళకి మూడు ప్లేట్లు ఇడ్లీ, ఒక టీ ఇచ్చి రా!’ అంది.
‘అలాగే అత్తా’ అన్నాడు. ‘హే సొట్ట కిట్టిగాడు కుదిరాడా పనిలోకి’ అన్న లాంచీల గుమస్తా గవర్రాజు మాటలకి చివ్వున చూసింది. సీతమ్మ.
చురుక్కున తగిలిన ఆ చూపుకి అతను కళ్ళు దించుకుని ‘పోనీలే మంచిపని చేసావు’ అంటూ గబగబా తినసాగాడు. కిట్టయ్య కాలు ఈడుస్తూ నడుస్తాడు. అక్కడే గోదారి మెట్ల మీద పడుకుంటాడు. వాడిని పిలిచి అప్పుడప్పుడు టిఫెన్ పెట్టేది. ఆ రోజున కొట్టు కట్టేస్తూ వాడికి ఇడ్లీ పొట్లం చేతికిచ్చేసరికి ‘పాపం రమణయ్య పోయాడుట కదా అత్తా’ అంటూ భోరున ఏడ్చాడు. ఆ ఆత్మీయతకు సీతమ్మ కరిగి, కన్నీరై అక్కడ మరో గోదారయింది.
‘ఈ పుష్కరాల రోజుల్లో కస్టమర్లు ఎక్కువగానే వున్నారు కదా, సీతమ్మా!’ అంటున్నారు ఎవరో.
‘ఈ సీతమ్మ చేతి ఇడ్లీలు తిని, ఒక చెంబుడు గోదావరి నీళ్ళు తాగితే నా సామిరంగా కడుపు నిండిపోతుంది.’_
‘మరే! స్వర్గం కనిపిస్తుంది’ మరెవరో అంటున్నారు. అందరి మాటలు వింటూ సీతమ్మ_ ఎప్పటిలాగే నవ్వుకుంటూ పని చేసుకుంటోంది.
కిట్టిగాడు ఆర్డర్లు తీసుకుంటూ, అందరకీ ప్లేట్లు అందిస్తున్నాడు. సీతమ్మ కొట్లోంచి వస్తున్న ఇడ్లీల_వాసనలతో రేవంతా ఘుమఘుమలాడింది.
గోదారమ్మ కూడా ఆ కబుర్లు విని గలగల మంది. అసలే కొత్త నీరు ఉధృతంగా చేరుతోందేమో, ఆ తాకిడికి పాత నీరు కొట్టుకుపోయింది.
మణి వడ్లమాని
9652067891








కామెంట్‌లు (0)