ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపడమటి సూరీడు

1 గంట క్రితం

mini katha2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:35 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

పడమటన సూరీడు ఎర్రటి బంతి కొండల్లోకి దిగుతున్నట్టు కనిపిస్తున్నాడు. పక్షులు.. కిల.. కిల మంటూ గూళ్లకు చేరుకుంటున్నాయి. ఆకాశంలో కొంగల గుంపు.. మొదట ఒక కొంగ దానిని అనుసరించి, ఇరుపక్కలా మిగతా కొంగలు సైనిక విన్యాసాలు చేస్తున్నట్టుగా వెళుతున్నాయి. గొర్రెల గుంపు ఒకటి బే..బే అని అరుచుకుంటూ వస్తున్నాయి. వాటి గిట్టల నుంచి రేగిన ధూళి అస్తమిస్తున్న నారింజ రంగులో ఉన్న సూర్యకాంతితో కలసి ముదురు పసుపు రంగులా కనిపిస్తోంది. అప్పటి వరకూ కమ్మలపాకలో తడపల మంచంపై పడుకున్న సుబ్బడు లేచి స్టీలు కేరేజి పట్టుకుని మచ్చల ఆవు వద్దకు వెళ్లి.. ‘హేయ్...దా..దా..’ అంటూ ఆవును పాకలోంచి తీసుకొచ్చి, వేపచెట్టు కింద కట్టేశాడు. దూడను ఒదిలాడు. అది ఒక్క ఉదుటున చెంగు, చెంగుమని గెంతుతూ ఆవు దగ్గరికి వెళ్లి పాలు తాగడం మొదలెట్టింది. కాసేపయ్యాక దానిని వేరే గుంజకు కట్టి, సుబ్బడు పాలు పితికి ఊరి బాట పట్టాడు. ఊళ్లో రామాలయంలో వేసిన భక్తి గీతాలు మంద్రంగా వినిపిస్తున్నాయి. పాలు తీసుకువెళ్లి డైరీకి ఇచ్చాడు. ఇంటికి వచ్చి వాకిట్లో మట్టి గోలెంలో ఉన్న నీళ్లతో కాళ్లు కడుక్కుని పట్టె మంచంపై కూర్చున్నాడు. సుబ్బడి భార్య లచ్చిమి పక్కన ఉన్న మట్టి పొయ్యిని ఇనుప గొట్టం పెట్టి ‘ఉఫ్..ఉఫ్’ మని ఊదుతోంది. దాంతో పొగతగ్గి మంట వచ్చింది.

‘ఇదుగో.. ఉడుకు నీళ్లు ఎట్టాను.. కుసిన్ని నీళ్లు పోసుకుని అప్పుడు కూకో’ అంది లచ్చిమి.

‘ఆ.. అలాగే లేయే.. ఓసుకుంతానులే..’ అన్నాడు సుబ్బడు. ఈ లోగా కూతురు సీత లంగా ఓణీ రెండు అంచులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ‘నాన్నా.. అన్నయ్య వస్తున్నాడుట’ అంది. సుబ్బడు ఆశ్చర్యపోయి ‘ఏంటీ అన్నయ్య వస్తున్నాడా?...’ అంటూ ‘లచ్చిమీ..’ అంటూ భార్యను పిలిచాడు.

అప్పుడే లోపలికి వెళ్లిన లచ్చిమి.. ఆ పిలుపుతో ‘ఆ ఏటి మావా..’ అంటూ బయటకు వచ్చింది.

‘ఏటే కుమార్ దేశం నుంచి వత్తన్నాడాట..’అని అడిగాడు.

‘అవును మావా.. వాళ్ల పెండు సెప్పినాడు.. ఆడికి ఫోన్ సేసి సెప్పీనాడాట వత్తన్నానని’ అంది.

‘అదేటే.. ఉన్నపళంగా ఊడి పడతన్నాడు. ఏటయినాది’ అన్నాడు సుబ్బడు.

‘అదే మావా...అక్కడ యుద్ధం ఏటిదో జరుగుతోందాట...అందుకని ఎళ్లిపొమ్మనారాట!’

‘సర్లే రేపు ఒత్తాడు కదా అప్పుడు మాట్టాడుదుగాని ముందు నీళ్లోసుకో..’ అంది లచ్చిమి. సుబ్బడు స్నానం చేసి, అలా వీధిలో రచ్చబండ దగ్గరికి వెళ్లాడు. తోవలో తన కొడుకు కుమార్ ఫ్రెండ్ వికాస్ కనిపించాడు. వెంటనే సుబ్బడు.. ‘బాబూ.. ఇకాస్ బాబూ..మా కుమార్ గాడు పోన్ సేసినాడాట. ఏటయింది బావూ..’ అని అమాయకంగా అడిగాడు.

‘అదే సుబ్బడూ.. మీ వాడు దుబాయ్‌లో ఉన్నాడు కదా! ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతోంది. అందుకే అక్కడ ‘‘ఉండొద్దు మీ దేశానికి వెళ్లిపోండి’’ అని అక్కడ వాళ్లు చెప్పారు. దాంతో వాడు వచ్చేస్తున్నాడు. నిన్ననే బయలుదేరాడు. రేపు వచ్చేస్తాడు.’ అన్నాడు.

సుబ్బడికి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు ఉంది. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడనే ధీమాతో లోను తీసుకొని, ఇళ్లు కట్టాడు. అంతకు ముందు ఉన్న పూరిల్లు తీసేసి, శ్లాబ్ ఇల్లు కట్టాడు. నెలా నెలా కుమార్ పంపే డబ్బుతో కొంచెం, కొంచెం లోను కడుతున్నాడు. ఇప్పుడు ఆడి ఉద్యోగం పోతే యేటి సేయాల అనుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటికొచ్చి వాకిట్లో ఉన్న లచ్చిమితో...‘ ఒలేయ్ కూడు ఎట్టు తినేసి తొంగోవాలా..’ అంటూ అసహనంగా పలికాడు సుబ్బడు.

‘ఏటయినాది మావా..’అని అడిగింది లచ్చిమి. ‘మన కుమార్ గాడు.. వచ్చేత్తన్నాడాట.. ఏటి సేయడం? ఆడి ఉద్యోగం నేకపోతే ఇల్లు అప్పు ఎలా తీరుతాది’ అంటూ వణకుతున్న కంఠంతో పలికాడు సుబ్బడు.

‘సూద్దాంనే మావా ఆడు రానీ..’ అంది లచ్చిమి.

తెల్లవారింది.. సుబ్బడు పొలానికి వెళ్లాడు.. సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది. కుమార్ తన ఇంటివైపు వస్తుంటే ఊరిలో ఉన వాళ్లు అంతా పలకరిస్తున్నారు.

వారందరికీ సమాధానం చెప్తూ ఇంటికి వచ్చాడు. సీత ఎదురొచ్చింది..

‘అన్నయ్యా...’ అంటూ పరిగెత్తుకు వచ్చి కౌగిలించుకుంది. ‘అన్నయ్యా బాగున్నావా..?’ అంటూ పలకరించింది.

‘ఆ..బాగున్నానే..’ అంటూ లోపలికి నడిచాడు కుమార్. లచ్చిమి కొడుకును చూసి పొంగిపోయింది.

‘బావూ..బాగున్నావేట్రా.. కాళ్లూ సేతులు కడుక్కో.. కూడు తిందు గాని’ అంది.

‘నాన్న రానీ అమ్మా.. కలసి తిందాం’ అన్నాడు కుమార్.

ఈ లోగా సుబ్బడు వచ్చాడు. వస్తూనే ఎదర కమ్మలపాక దాటి, కాళ్లు కడుగుకుని లోనికి వచ్చాడు. వస్తూనే ‘ఏరా నాయనా...కుమార్ ఏటయినాది?’ అన్నాడు.

‘ఏం లేదు నాన్నా!.. ప్రస్తుతం దుబాయ్, కువైట్ లలో యుద్ధం జరుగుతోంది. అందుకే మా కంపెనీ వాళ్లు మమ్మల్ని ఉద్యోగం లోంచి తీసేసారు. యుద్ధం తగ్గిన తర్వా చూద్దాం అనేసారు.’

సుబ్బడు నిట్టూరుస్తూ ‘ష్.. మరేటి సేయడంరా బిడ్డా.. ఇక్కడ ఎగసాయం (వ్యవసాయం) కూడా అంతంత మాత్రంగానే ఉంది.. పెట్టిన పెట్టుబడులే రావడం నేదురా. కూలీలు కూడా సానామంది ఊరొగ్గీసి సెన్నపట్నం ఎళ్లిపోనారురా!’ అన్నాడు.

‘సర్లే నాన్నా ముందు బువ్వ తిందుగాని రా’ అనడంతో అంతా కలసి భోజనం చేశారు.

సాయంత్రం తండ్రి సుబ్బడితో పాటు పొలానికి వెళ్లాడు కుమార్...

స్వచ్ఛమైన గాలి, పచ్చిక మీద నుంచి పచ్చివాసన వీస్తోంది. ‘అబ్బా ఎన్నాళ్లకి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాను!’ అనుకున్నాడు కుమార్ మనసులో.

‘దుబాయ్‌లో ఎటుచూసినా పొగ, కాలుష్యం, సైరన్ మోతలు.. అబ్బా మనశ్శాంతి ఉండేది కాదు’ అనుకున్నాడు. కళ్లం పక్కన చిన్న మడుగు ఉంది. అందులో చిన్నచిన్న చేప పిల్లలు భలేగా ఎగురుతూ ఆడుతున్నాయి. అది చూసిన కుమార్‌కు తన బాల్యం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. చిన్నతనంలో అలాగే ఏ బరువు, బాధ్యతలు లేకుండా నవ్వుతూ, తుళ్లుతూ ఉండేవాడిని అనుకున్నాడు. ముందుకు నడుస్తున్న కుమార్‌తో వాళ్ల నాన్న సుబ్బడు ఇలా అన్నాడు.

‘ఒరేయ్ కుమార్ ఇది పెద్దమడి.. అది ఆకుబొడ్డె.. అది పుట్టాకుమడి.. మనం నాలుగు మెతుకులు తింటున్నామంటే ఈ భూమి తల్లేరా కారణం!’ అన్నాడు.

దానికి కుమార్ స్పందిస్తూ..‘నాన్నా నేను మరే దేశం వెళ్లను ఇక్కడే వ్యవసాయం చేస్తాను’ అన్నాడు.

‘ఏటిదీ.. ఎగసాయం సేత్తావా..? అందుకా నిన్ను గొప్ప గొప్ప సదువులు సదివించినదీ.. నువ్వు సెయ్యనేవురా..’ అన్నాడు సుబ్బడు.

‘లేదు నాన్నా. మరి మళ్లీ అక్కడ ఉద్యోగం దొరకదు. అక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నాలాగే చాలామందికి ఉద్యోగాలు పోయాయి. వాళ్లు కూడా వాళ్ల సొంత ఊళ్లు వెళ్లిపోతున్నారు!’ అన్నాడు.

‘అట్టాగా.. పోనీ ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకో బిడ్డా నువ్వు ఎగసాయం ఏటి సేత్తావు.. చిన్నతనం కాదా?’ అన్నాడు.

‘నాన్నా వ్యవసాయం అంటే చిన్నతనం కాదు. నలుగురికి తిండి పెట్టే పెద్ద ఉద్యోగం నీకేం భయం లేదు. నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేసి, నాతో పాటు నలుగురికి

ఉపాధి చూపిస్తాను’ అన్నాడు ధైర్యంగా.

‘ఏటోరా.. ఆళ్లెవరో మదమెక్కి కొట్టుకోడం ఏటి.. నీలాటి కుర్రగాళ్లు ఉద్యోగాలు పోయి రోడ్డున పడడమేటి? ఏటో అంతా ఇచిత్రం.’ అన్నాడు.

కుమార్ తమ భూములను పరిశీలనగా చూసి కొంచెం, కొంచెం మట్టి శాంపిళ్లు తీసి, కవర్లలో వేస్తున్నాడు.

అది చూసిన సుబ్బడు ‘ఒరేయ్ బావూ..ఏటి సేత్తన్నావురా..? ఆ మట్టిపెళ్లలు ఎందుకురా?’ అన్నాడు ఆసక్తిగా.

‘నాన్నా ఈ మట్టి తీసుకెళ్లి భూసార పరీక్షా కేంద్రంలో ఇస్తే, వాళ్లు మన భూమిలో ఏయే పంటలు బాగా పండుతాయో.. ఏయే ఎరువులు వాడాలో చెబుతారు’ అన్నాడు.

‘ఓహో! అట్టనా.. సరే..సరే.. కానివ్వు..’ అన్నాడు సుబ్బడు. కుమార్ భూసార పరీక్షా కేంద్రానికి వెళ్లడం, ఏయే ఎరువులు వాడాలో, ఏయే పంటలు పండుతాయో తెలుసుకునిన, పట్నం నుంచి వచ్చేటప్పుడు ఆ ఎరువులు, విత్తనాలు కొని తీసుకొచ్చాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో బోరు తీయించాలని సంకల్పించాడు. అందుకు చకాచకా ఏర్పాట్లు చేశాడు. బోరు తీయడం, కరెంట్ వేయించడం జరిగిపోయాయి. ఆ రోజు సుబ్బడి ఆనందానికి అవధులు లేవు. బోరు నుంచి నీరు పైకి వస్తుంటే.. చిన్నపిల్లాడిలా గెంతులేశాడు.

‘బిడ్డా.. ఇంక పర్నేదురా.. సిరులు పండేత్తాయేస్..!’ ఈ భూమిలో అన్నాడు కొడుకుతో.. అతని ఆనందం చూసి కుమార్ కూడా ముచ్చటపడ్డాడు. ‘రైతుకు నీరు, భూమి ఉంటే చాలు ఎంతైనా పోరాడుతాడు.. ఏటా నష్టం వస్తున్నా కాడి పారేయడం లేదు కాబట్టే కదా ప్రపంచంలో అందరి కంచాల్లోకి కూడు వెళుతోంది’ అనుకున్నాడు మనసులో.

కూరగాయలు, పూలసాగు మొదలెట్టాడు కుమార్.. పట్నంలో ఒక హోల్‌సేల్ పూల వ్యాపారితో మాట్లాడి, వాళ్లే తమ పొలం దగ్గరకు వచ్చి కొనుగోలు చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు. బంతి పూల సాగు చేపట్టాడు. పూలన్నీ పసుపు పచ్చగా.. కింద మొక్కలు ఆకుపచ్చగా చూసేందుకు భూమాత పసుపు రంగు ఆకుపచ్చని అంచుతో ఉన్న చీర సింగారించుకున్నట్టు కనిపిస్తోంది ఆ దృశ్యం. ఆ చీరపై అక్కడక్కడా బుటాలు పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. రంగు, రంగుల సీతాకోకచిలుకలు. ఆ సంవత్సరం అన్ని ఖర్చులు పోను, దాదాపు లక్ష రూపాయలు మిగిలాయి. అది చూసి సుబ్బడు ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. కుమార్ ఇంటికి వచ్చాడు. లచ్చిమి తన కొడుకుని చూసి “ఏరా..కాస్త కూడు తిందుగాని రా..’ అంది.

‘ఆ సరే అమ్మా.. అమ్మా నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికీ వెళ్లను’ అన్నాడు తల్లితో

‘సర్లేరా.. తిన్నది కూడు.. ఉన్నది ఊరు.. ఇక్కడే ఉండు మా కళ్లెదురుగా ఉంటావు..’ అంది.

తన తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు కుమార్.. అది చూసి లచ్చిమి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘పాపం బిడ్డ ఎంతగా బెంగ ఎట్టీసుకున్నాడో!’ అనుకుంది.

కుమార్ తల ప్రేమగా నిమిరింది. తెల్లవారింది. తూర్పున సూరీడు ఎర్రటి వెలుగుతో బద్ధకం వదిలించుకుని, వెలుగులు చిమ్ముతూ వచ్చాడు.. రేపటి భవిష్యత్ కోసం..

ఆర్‌.వి. సత్యనారాయణ

8309812958

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్