నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న ఒక ఇండివిడ్యువల్ హౌస్ మాది. ఎప్పుడో మా చిన్నప్పుడు మా తాతగారి ద్వారా సంక్రమించిన ఆ ఇంట్లో నేనూ, మా ఆవిడ తప్ప ఇంకెవరూ ఉండటం లేదు. ప్రయోజకులైన పిల్లలు ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు వెళ్లిపోయాక ఇక్కడ ఒంటరిగా_ ఉంటున్నాము. మేము బాల్కానీలో కూర్చుని, హైవేలో వెళుతున్న బస్సులను, లారీలను, ఇతర వాహనాలను చూడడమే మా పని అయిపోయింది.
ఇలా కొన్నాళ్లు ఉండగా ఒకసారి మున్సిపాలిటీ వాళ్లు హైవేకానుకుని ఉన్న రోడ్డు పక్కన భూమి ఆక్రమణలకు గురవుతున్నాయి అని గ్రీన్ బెల్ట్ పేరున వాళ్లే చెట్లు నాటారు. ఆ కొంత భూమిని నిరుపేదలు ఎక్కడ ఆక్రమించేస్తారో అన్న భయంతో సదరు గవర్నమెంట్ వాళ్లు ఆ విధంగా భూమిని కాపాడేసారు.
చిత్రం ఏమిటంటే ఆ గ్రీన్ బెల్ట్ ఉన్న వరుసల్లోనే పెద్ద, పెద్ద విదేశీ కంపెనీలకు భూములను ప్రభుత్వం ధారాదత్తం చేసేస్తుండడం ఒక విచిత్రం. కానీ అడిగేవారెవరు? అడిగితే రాజకీయ కర్కశులు, పోలీసుల ద్వారా పేదలను ఎలా భక్షించాలో చెబుతుంటారు కదా!
మున్సిపల్ వాళ్లు రోడ్డు పక్కన నిబంధనల ప్రకారం, గ్రీన్ బెల్ట్ కోసం కొంత భూమి మున్సిపల్ వాళ్ళు తీసుకున్నా, మా ఇంటిముందు మొక్కలు, తోటకూ ఎలాంటి ముప్పూరాలేదు. వారికీ మాకూ మధ్య ఐరన్ పెన్సింగ్ మున్సిపాలిటీ వారే వేసేసుకున్నారు.
అయితే ఈ మధ్య గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఐక్యంగా, గ్రీన్ బెల్ట్ లో కొంత భాగాన్ని వాకింగ్ పార్క్ గా డెవలప్ చేయమని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ____ రకరకాల రాజకీయ పైరవీలతో, సిఫార్సులతో మొత్తానికి గ్రీన్ బెల్ట్ లో కొంత భాగం వాకింగ్ పార్కుగా రూపొందడానికి మార్గం ఏర్పడింది. నాకు ఇప్పుడు కొంత హాయి అనిపించింది. మా ఇంట్లో ఒక్కడినే ఒంటరిగా కూర్చునే నాకు, పార్కు_ వచ్చాక, వాకింగ్ కు వచ్చే వ్యక్తులతో, వృద్ధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. నా ఒంటరితనం కాస్త దూరమైనట్టు అనిపించింది.
అంటే.. నగరాల్లో మనస్ఫూర్తిగా మాట్లాడడానికి మనుషులే కరువవుతుంటారు. ఆ పార్కు వల్ల ప్రస్తుతానికి నాకు ఆ ఇబ్బంది లేదు. పార్క్ లో పిల్లలు, వృద్ధులు, వాకింగ్_ ట్రాక్ లలో నడిచే జనాలతో చాలా సంబరంగా ఉంటోంది. చుట్టూ పూలతో నిండుగా మొక్కలు. మృదువుగా వీచే చల్లని గాలి. ఆహ్లాదకరమైన వాతావరణం. చూడటానికి చాలా కన్నుల పండుగగా కూడా ఉంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
నేను మా ఇంటితోటలో మొక్కల పెంపకాన్ని కూడా ఇన్నాళ్లంతగా పట్టించుకోకుండా.. ఉదయం, సాయంత్రం వాకింగ్ పార్క్ లో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. కొంచెం ఎండ తగ్గాకే కదా మొక్కలకు నీరు పోసేది. నేనిప్పుడు ఆ సమయంలోనే పార్కుకు వచ్చే కొత్త మిత్రులతో కాలక్షేపం చేస్తున్నాను.
అయితే పార్కుకు వచ్చే జనాలు పెరుగుతుంటే వచ్చిన జనాలను కంట్రోల్లో_ పెట్టడానికి రవికుమార్ అనే వ్యక్తి ఒక వాకర్స్ అసోసియేషన్ ను ప్రారంభించాడు. పార్కును పరిశుభ్రంగా నిర్వహించడానికి కొంత డబ్బు అవసరం అంటూ.. వచ్చినవాళ్ళ దగ్గర నెలకు ఇంత అనే అమౌంటు వసూలు చేసి, ఏవేవో నిబంధనలు పెట్టేసాడు.
పార్కులో మొక్కలకి నీళ్లు పోయడానికి ఉదయమూ, సాయంత్రమూ తప్ప పార్కులో బిక్షగాళ్ళలాంటి వాళ్ళు అక్కడ చేరకుండా ఉండడానికి, కాపలా_మనిషిని ఉంచారు. పార్కులోకి డబ్బులు కట్టినవారే వచ్చేలా చేయడానికి అక్కడ ఒక వాచ్ మెన్ ను నియమించాడు. వాకింగ్ కు వచ్చినవాళ్లు చాలామంది డబ్బున్నవాళ్ళే కనుక కాదనకుండా డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పార్కు ధనవంతుల దర్పంతో ధగధగలాడిపోతోంది. కానీ, గవర్నమెంట్ పార్కులో డబ్బు కట్టించుకోవడం ఏమిటి? నిరుపేదల పిల్లలను రానివ్వకుండా ఆ నిబంధనలు ఏమిటని ఎవరూ అడగలేదు.
కొద్దిరోజుల తర్వాత_ పిల్లల కోసం రకరకాల ప్లే గ్రౌండ్ ఎక్విప్ మెంట్స్_పార్క్ లోకి తీసుకొచ్చారు. గొలుసు ఊయల, ఊగుడు బల్ల, జారుడు బల్ల, ఇంకా పిల్లలు వయసు తగ్గట్టుగా వాళ్ళు జంప్ చేయడానికి రెండు మూడు హార్డిల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. రాత్రివేళలో లైటింగ్ ఏర్పాటు చేశారు. పిల్లల కేరింతలు, అరుపులు, ఆటలు, నవ్వులతో వాకింగ్ పార్కు మరింత ఆనందంగా ఉంటోంది.
అదే సమయంలో పార్కులో ఆడుతున్న తమ ఈడు పిల్లలను చూసి, నిరుపేదల పిల్లలు పార్కు బయట నిలబడి, ముళ్ళ పెన్సింగ్ కు చేతులు ఆనించి ఆశ్చర్యంగా, ధీనంగా చూస్తుంటారు. వారిని వాచ్మెన్ లోపలికి రానివ్వడు. ఒకవేళ వచ్చినా లోపల ఉన్న ధనవంతుల పిల్లల్ని, నిరుపేద పిల్లలతో కలసి ఆడనివ్వరు.
పార్కు చుట్టూరా పూలు.. పిల్లల చుట్టూరా స్వార్థపరులు కడుతున్న ఎల్లలు... వారి చుట్టూరా నల్లటి చీకటి.. రేపటి వెలుగు కోసం ఎదురుచూస్తోంది. ఇవన్నీ చూస్తూ ఈ సమాజం ఎప్పటికి మారుతుంది? అనుకొని రోజులు గడుపుతున్న సమయంలో.. మా అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్ మీద ఫోన్ లు వస్తున్నాయి. మా ఆలుమగలు ఇద్దరినీ.. తీర్థయాత్రలకై ఇంటి నుండి బయలుదేరే ఒక టూరిస్ట్ బృందంతో కేదారనాథ్, అక్కడ దగ్గర్లో ఉన్న రకరకాల ఆలయాల సందర్శనకు టికెట్లు బుక్ చేస్తున్నామని మెసేజ్ పంపారు.
కేదార్నాథ్ కి వెళ్లాలంటే.. మా ఇద్దరికీ కష్టమే.. నడవడమే కష్టం అనుకునే మాకు ఆ యాత్ర చేయడం గగనాన్ని తాకడమే. "మనకు తెలిసినవారే నాన్నగారూ! మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తిప్పి, తీసుకొస్తాం అంటున్నారు. మీరేం ఆలోచించకండి. డబ్బులు ఎంతైనా మేము పెట్టుకుంటాం. చెల్లీ, నేనూ మీకు చెరో రెండు లక్షలు ఇస్తాం. హ్యాపీగా తిరిగి వచ్చేయండి.." అంటూ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఈ మధ్యన ఫోనుల్లో చెప్తూనే ఉన్నారు.
ఇప్పటికే చాలా తీర్థయాత్రలు పిల్లల సహకారంతోనే చేశాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక తీర్థయాత్రకు మమ్మల్ని పంపిస్తూనే ఉంటారు. వారికి అదో తృప్తి. అయితే ఇంకా రెండు మూడు నెలలు తర్వాత విషయం కదా అని మేము మిన్నకుండిపోయాము.
ఒక పక్క మా ఆవిడ ఆ ప్రయాణానికి ఏర్పాట్లలో ఉంది. నేను మాత్రం పార్కులో మిత్రులతో గడుపుతున్నాను. సాయంత్రం సమయంలో ఓ మూల కూర్చుని, పసిపిల్లల కేరింతల్ని, నవ్వుల్ని, వారి_ మారాములను గమనించడం నాకు హాబీ అయిపోయింది. మూడు రోజుల నుంచి ఒకామె తన అయిదారేళ్ళ_ పిల్లాడితో ఆ పార్కులోకి వస్తుంది. బాగా గమనిస్తే ఆమెకు ఒక కాలు_ పోలియోలా ఉంది. అయినా వాకింగ్ చేస్తుంది. కానీ, ఆ పిల్లాడు పార్కులో మిగతా పిల్లలు ఆడినట్టుగా తాను ఆడాలని ఆరాటపడుతున్నాడు. వాళ్ల అమ్మని అటువైపు తీసుకెళ్లమని అల్లరి కూడా పెడుతున్నాడు.
కానీ, అక్కడ పిల్లల తాకిడి ఎక్కువవ్వడం, ఈ పిల్లాడికి తన కోరిక నెరవేరే అవకాశం లేకపోయింది. వాచ్మెన్ కూడా... అక్కడ_ ఆ టూల్స్ చందాదారులకు తప్ప మిగతావారు ఉపయోగించకూడదని చెబుతున్నాడు. నిరాశ చెందుతున్న పిల్లాడి మొహం మబ్బు పట్టిన చందమామలా ఉంది.
కొడుకు కోర్కె తీర్చలేక పోతున్న ఆ తల్లి కళ్ళు.._ దైన్యాన్ని మోస్తున్న దేశ_ దారిద్ర్యంలా ఉంది.
అలా మూడురోజుల నుంచి చూస్తున్న ఆ తల్లి, ఆ రోజు ఏమనుకుందో ఏమో పార్క్ లో ఒకవైపు పచ్చగడ్డి ఉన్న నేలపై వంగింది. కొడుకు ఎగరగలిగినంత ఎత్తుకు తన నడుమును వాల్చింది. తన పైనుండి గెంతమంటొన్నది. వాడు కూడా అలానే చేస్తున్నాడు. అది చూస్తున్నవారికి అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నడుమును ఎగిరి దాటుతూ పకపకా నవ్వుతున్నాడు. అప్పుడప్పుడు నడుముకి పిల్లోడు కాళ్ళు తగిలి నొప్పి అనిపించినా వాడి సంతోషానికి ఆ తల్లి మురిసిపోతోంది.
అమ్మ ప్రేమ అక్కడ రూపు దాల్చితే.. దారిద్ర్యాన్ని పోషించే నికృష్ట పాలన అక్కడ నిక్కి చూస్తోంది.
"అమ్మాయ్.. నీవు పిల్లాడిని ఆడించడం కోసం ఇలా నడుము వంచి ఉండడం నీకు ఇబ్బంది అనిపించడం లేదా? ... అంతమంది అలా చూస్తుంటే బాగోదు కదా!..." అన్నాను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి._ "మరి ఏం చేసేది బాబాయ్? పేదవాళ్ల ఇంట్లో పుట్టిన పసిబిడ్డల కలలు చిద్రమైపోకుండా ఉండాలంటే.. ఇలాంటి కష్టాలు ఎన్నో పడాలిగా" అందామె చిరునవ్వుతో.
ఆ సమాధానం ఈ దేశ అసమానతలపై ఊహించని చెంపదెబ్బలా నాకు తగిలింది.
"పేదల పిల్లలందరూ ఇక్కడ ఆడుకోవాలని ఆశపడి వస్తున్నారు. వీలు కాక ఏడుస్తుంటే, వాళ్ల తల్లిదండ్రులచే కర్కశంగా దెబ్బలు తింటున్నవారే.. వారిని ఎవరు ఓదారుస్తారు? వారి చిన్ని కోరికలు ఎలా తీరుతాయి? వాడిని కొట్టలేకే...నేను ఇలా.. " అంటూ ఆమె తన చున్నీని నడుముకు చుట్టుకొని, మళ్లీ వంగడానికి సమాయుత్తం_ అవుతోంది.
అప్పుడు నాకు ఓ ఆలోచన కలిగింది. ఈ పార్కు పక్కనే మాకు కొంత భూమి ఉంది. కాలక్షేపానికి తీర్థయాత్రల పేరిట డబ్బులు ఖర్చు చేయిస్తున్న పిల్లలూ ఉన్నారు. వారు ఇస్తున్న డబ్బు కూడా ఉంది. నా పిల్లల్ని ఒప్పించి కనీసం కొన్నైనా ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్స్_ ఆ స్థలంలో పెట్టించి, "ఇక్కడ అందరూ ఆడుకోవచ్చు" అని బోర్డు పెట్టించాలి అనుకున్నాను. వెంటనే ఫోన్ అందుకున్నాను. పేదరికం నుండి ఎదిగిన నా కూతుర్లు అందుకు కాదనరు అనే నమ్మకం కూడా నాకు వుంది.
కొరికాన ఆనంద్
9618425970









కామెంట్‌లు (0)