ఉదయం పది గంటల సమయంలో జైలర్ ఆనంద్ కేంద్ర కారాగారంలోని తన ఆఫీసుకి చేరుకున్నాడు. అతను తన గదిలోకి వెళుతున్న సమయంలో అటెండర్ రాజు వచ్చి ‘సార్, తమర్ని సూపరెంటెండెంట్ గారు పిలుస్తున్నారు’ అని చెప్పాడు. ఆనంద్ వెంటనే వరండాలో చివర ఉన్న జైలు సూపరెండెంటు గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే సూపరెంటెండెంట్ రాజారాం ‘ఆనంద్! కంగ్రాట్యులేషన్స్.. మీకు సూపరెండెంటుగా ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి. మిమ్మల్ని రాజమండ్రి కేంద్ర కారాగారంలో సూపరెండెంటుగా నియమిస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు వచ్చాయి’ అంటూ ఆనంద్ కి కరచాలనం చేస్తూ ఆర్డర్ కాపీ అతనికి ఇచ్చాడు. ఆనంద్ ఆ కాపీని అందుకుంటూ ‘థాంక్యూ యు సార్.. కానీ నాకు ఇంకా రెండేళ్లే సర్వీసు వుంది. ఇప్పుడు నేను ఈ పట్నాన్ని వదిలి బదిలీ మీద వెళ్ళలేను సార్!. ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ పట్నంలోనే నేను ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయాను. నా కూతురు, అల్లుడు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి నాకు ఈ పదోన్నతి, బదిలీ ఇష్టం లేదు. మీరు మన జైళ్ల శాఖ ఐజీగారితో మాట్లాడి ఈ బదిలీని రద్దు చేయిస్తే మంచిది’ అన్నాడు ఆనంద్.
అతని మాటలకు రాజారాం ఆశ్చర్యపోతూ ‘ఆనంద్, ఎప్పుడు వచ్చినా పదోన్నతి పదోన్నతే. దాన్ని మనం కాదనకూడదు. ఇక బదిలీలు అన్నవి ప్రభుత్వ ఉద్యోగులకు అందులోనూ మరీ ముఖ్యంగా మన పోలీసు శాఖలో సర్వ సాధారణం. అదీకాక రెండేళ్ల నుంచి ఆ జైలులో సూపరెండెంట్ పదవి ఖాళీగా వుంది. అందుకే నీకు పదోన్నతి కల్పించి, అక్కడ నియమించారు. కాబట్టి నువ్వు కాదనకుండా వెళ్లి అక్కడ ఛార్జ్ తీసుకో. నిన్ను ఈ రోజే రిలీవ్ చెయ్యమని ఐజిగారు చెప్పారు. సాయంత్రం నీకు సెండాఫ్ పార్టీ. ఆ తరువాత నిన్ను రిలీవ్ చేస్తాను’ అని చెప్పాడు రాజారాం.
అతని మాటలకు ఆనంద్ సమాధానం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. తన గదికి వచ్చి ఆలోచిస్తూ అక్కడే లంచ్ సమయం వరకూ కూర్చున్నాడు. ఆ తర్వాత లేచి మళ్ళీ సూపరెండెంట్ రాజారాం గదికి వెళ్ళాడు. అతన్ని చూసి రాజారాం ఆశ్చర్యపోయాడు.
‘ఏంటి ఆనంద్, ఏమైనా చెప్పాలా?’ అన్నాడు రాజారాం.
‘సార్, మా తమ్ముడు రాజమండ్రి కారాగారంలో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతను మా ఊరి రాజకీయాలకు బలైపోయి అన్యాయంగా చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడు. ఒక హత్య కేసులో అతన్ని కోర్టు దోషిగా తేల్చడంతో అతనికి ఏడేళ్ల శిక్ష పడింది. నిజానికి వాడు ఆ హత్యను చెయ్యలేదు. కానీ ప్రత్యర్థుల కుట్రతో ఒక స్త్రీ చేత తప్పుడు సాక్ష్యం చెప్పించడంతో వాడు శిక్షకు గురయ్యాడు. స్వయంగా నా తమ్ముడే అక్కడ కారాగారంలో ఖైదీగా శిక్షను అనుభవిస్తుండగా.. నేను అక్కడ జైలు సూపరెండెంటుగా ఉద్యోగం చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందుకు నా మనసు అంగీకరించటం లేదు. కాబట్టి దయచేసి ఈ బదిలీని రద్దు చెయ్యండి. అవసరం అయితే నా పదోన్నతి కూడా రద్దు చేయించండి. నాకు ఇంకా రెండేళ్లు సర్వీసు వుంది. ఈ రెండేళ్లు ఇక్కడే నేను జైలర్ గా ఉండి పదవీ విరమణ చేస్తాను’ అని చెప్పాడు ఆనంద్.
అతని మాటలకు రాజరాం ఆశ్చర్యపోతూ ‘ఆనంద్, నీ బాధను నేను అర్థంచేసుకున్నాను. అయినా మనలాంటి అధికారులకు రాగ ద్వేషాలు వుండకూడదు. అయినా నీ విషయాన్నీ నేను డీజీపీ గారితో మాట్లాడి, నీ బదిలీని ఆపించే ప్రయత్నం చేస్తాను’ అని చెప్పాడు. ఆ తర్వాత ఆనంద్ తన గదికి వచ్చాడు.
అతను వచ్చేసరికి అక్కడ ఓ ఏభై ఏళ్ళ వ్యక్తి కూర్చుని కనిపించాడు. అతను ఆనంద్ ని చూడగానే ‘మిస్టర్ ఆనంద్, నా పేరు మధుసూదన్, జిల్లా జడ్జిగా పనిచేస్తున్నాను’ అని చెప్పాడు.
ఆనంద్ అతనికి నమస్కారం పెట్టి ‘సార్! ఏ పని మీద వచ్చారు?’ అని అడిగాడు.
‘ఒక ఖైదీని కలవడానికి వచ్చాను. అందుకు మీ అనుమతి కావాలి’ అని చెప్పాడు. అతని మాటలకు ఆనంద్ ఆశ్చర్యపోతూ ‘మీరు ఒక ఖైదీని కలవడమా? ఆశ్చర్యంగా ఉంది సార్. అయినా మీరు అనుమతి కోరడమేమిటి? మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎవరినైనా కలవవచ్చు’ అన్నాడు ఆనంద్.
‘ఆనంద్, నేను మీలాగే ప్రభుత్వ ఉద్యోగిని. నియమాలు అందరిలాగే నాకూ వర్తిస్తాయి. ఎవరూ వాటికి అతీతం కారు. ఆ ఖైదీ ఎవరో కాదు. నా కొడుకే. అతని పేరు రాహుల్. సంవత్సరం క్రితం నుంచి అతను ఇక్కడ మీ జైల్లో కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు. అతనికి శిక్ష వేసింది కూడా నేనే. అందుకే వాడు ఇక్కడ శిక్షను అనుభవిస్తున్నప్పటి నుంచి నేను వాడిని చూడటానికి రాలేదు. కానీ కడుపు తీపి నన్ను కట్టిపడేసింది. నాలోని కన్నతండ్రి అనే పాశం, కొడుకన్న కడుపు తీపిల ముందు నా న్యాయమూర్తి పదవి ఓడిపోయింది. అందుకే ఇప్పుడు వాడిని చూడాలని వచ్చాను. ఎంతైనా నేను కూడా మనిషినే కదా? బంధాలకు, అనుబంధాలకు ఎవరూ అతీతులు కారు అనడానికి నేనే ఉదాహరణ’ అని చెప్పాడు మధుసూదన్. అతని మాటలు విని ఆనంద్ ఆశ్చర్యపోయాడు. రాహుల్ అన్న ఖైదీని గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. కొద్ది క్షణాలకు అతని రూపం గుర్తుకు వచ్చింది. అతన్ని కలవటానికి ఒకసారి అతని తల్లి వచ్చింది. అంతే, ఆ తర్వాత ఇంకెవరూ రాలేదు. తెల్లగా, పొడవుగా ఉంటాడు. ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. ఎవరి విషయంలోనూ తలదూర్చడు.
‘సార్! మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మీరు మీ కొడుక్కి శిక్షను వెయ్యడమేమిటి? మీరు కావాలనుకుంటే ఆ కేసు విచారణ నుంచి తప్పుకోవచ్చు. ఆ పని ఎందుకు చెయ్యలేదు? ఒక కొడుకు కేసుని విచారించి, అతనికి కన్నతండ్రే న్యాయమూర్తి కుర్చీలో కూర్చుని శిక్షను వెయ్యడం అన్నది నమ్మలేని విషయమే అయినా చాలా గొప్ప పని. సామాన్యులు ఎవరూ చెయ్యని పని అది’ అన్నాడు ఆనంద్ చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.
‘మీరు చెప్పింది నిజం ఆనంద్. కానీ ఉద్యోగస్తుడికి రాగ ద్వేషాలు ఉండకూడదు. పనినే అతను దైవంగా భావించాలి. తప్పు చేస్తే ఎవరినీ వదలకూడదు. ఆ విషయంలో తన, పర అనే బేధాలు ఉండకూడదు’ అని చెప్పాడు జస్టిస్ మధుసూదన్.
‘మీ వంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి, మీ ఆలనా పాలనలో పెరిగిన మీ కొడుకు నిజంగా హత్య చేసాడంటే నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఏం జరిగింది?ఎలా జరిగింది? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి’ అన్నాడు ఆనంద్.
‘ఇందులో అభ్యంతరం దేనికి. వాస్తవాలు అందరికీ తెలియవలసిందే. నా కొడుకు ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడు. ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయికి అంతకు మునుపే ఒకబ్బాయితో ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఆ సంబంధాన్ని కొనసాగించింది. అది మా అబ్బాయి దృష్టికి వచ్చి, మందలించినా ఆ అమ్మాయి వినలేదు. ఒక రోజు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మా అబ్బాయి కోపం ఆపుకోలేక ఆ అబ్బాయిని హత్య చేశాడు. ఏదైనా నేరం నేరమే. కాకపోతే వాడు ఆవేశంలో ఆ హత్య చేసాడు. కాబట్టి యావజ్జీవ శిక్ష కాకుండా ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నా చేతులతో కలాన్ని పట్టుకొని రాసాను. ఆ సమయంలో నా కళ్ళ ముందు నా కన్న కొడుకు రాహుల్ కనిపించలేదు. ఆవేశంతో హత్య చేసిన ఒక దోషి మాత్రమే కనిపించాడు. ఒక కన్న తండ్రిగా నేను ఆ తీర్పుని ఇచ్చినందుకు ఎన్నో రోజులు ఏడ్చాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇంకా గడుపుతున్నాను కూడా!’ అని చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పాడు న్యాయమూర్తి మధుసూదన్.
ఆనంద్ న్యాయమూర్తి చెబుతున్న మాటలను సీరియస్ గా వింటూ.. ఆలోచిస్తున్నారు. ‘ఎంత న్యాయమూర్తులమైనా మేము చట్టానికి అనుగుణంగానే తీర్పులు ఇవ్వాలి.’ అంటూ మధుసూధన్ గట్టిగా గాలి పీల్చి వదిలాడు. ఆ తరువాత అతను జైలు లోపలికి వెళ్లి తన కొడుకు రాహుల్ ని చూసి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పటికి సాయంత్రం ఐదు గంటలైంది.
న్యాయమూర్తి మధుసూదన్ వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ లో అంతర్మధనం మొదలైంది. ఆత్మ శోధన కలగసాగింది. అతను ఆలోచించసాగాడు. తనేమో తన తమ్ముడు శిక్ష అనుభవిస్తున్న కారాగారానికే వెళ్లనని చెప్పిన వ్యక్తి. కానీ ఇందాక వచ్చిన న్యాయమూర్తి మధుసూదన్ తన కొడుక్కే శిక్షను తన చేతులతో వేసి రాగ ద్వేషాలకు ఉద్యోగులు అతీతంగా ఉండాలని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మధుసూదన్ వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఆలోచనల్లో మార్పు రాసాగింది. కొద్ది సేపటికి అతని ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. ఇపుడు అతనికి ప్రశాంతంగా ఉంది. సాయంతరం డ్యూటీ ముగిసిన తర్వాత ఆనంద్ సూపరిండెంట్ రాజారాం గదికి వెళ్లి ‘సార్, నన్ను ఈ రోజే రిలీవ్ చెయ్యండి. రేపే నేను రాజమండ్రి వెళ్లి అక్కడ కారాగారంలో సూపరిండెంట్ గా పదవీ బాధ్యతలు చేపడతాను’ అని చెప్పాడు. అతని మాటలకు రాజరాం ఆశ్చర్యపోయాడు. ‘రాజమండ్రి కారాగారంలో మీ తమ్ముడు జైలు శిక్షను అనుభవిస్తున్నాడనీ, అందువల్ల ఆ కారాగారానికి సూపరింటెండెంటుగా వెళ్లడం నాకిష్టం లేదనీ ఉదయం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళతామని చెబుతున్నారు. ఇంతలోనే ఈ మార్పుకి కారణం ఏమిటి?’ అని అడిగాడు రాజారాం.
‘స్వంత తమ్ముడు శిక్ష అనుభవిస్తున్న కారాగారంలో అధికారిగా పనిచెయ్యడం నైతికంగా మంచిది కాదని ఈ మధ్యాహ్నం వరకూ నేను భావిస్తూ వచ్చాను. అయితే ఉద్యోగంలో రాగ ద్వేషాలకు, బంధుప్రీతికి తావుండకూడదని ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. అతని మాటలు నా కళ్ళు తెరిపించాయి. దాంతో ఉదయం నుంచి నన్ను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. అందుకే అక్కడికి వెళ్లకూడదన్న నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు అక్కడికి నేను ఇష్టపూర్వకంగా, ఆనందంగా వెళతాను’ అని చెప్పాడు ఆనంద్.
గన్నవరపు నరసింహమూర్తి
77520 20123








కామెంట్‌లు (0)