ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతెలుగుతేజం

6 గంటల క్రితం

TELUGU TEJAM KATHA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 07:18 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

ఆఫీస్ రూంలో తన ముందు నిలబడ్డ బక్కచిక్కిన ఆరడుగుల ఆంజనేయులును తేరిపార జూశాడు పిప్పళ్ల బస్తాలాగా వూరిపోయన ఒళ్లుతో సీటంతా ఆక్రమించిన శీనప్ప.

‘ఏంది సంగతి? అన్నట్లు ఉరిమాడు శీనప్ప.

‘సార్, మన జాంజిబార్ ఇంటర్నేషనల్ స్కూల్లో అన్ని సబ్జెక్టుల టీచర్లకూ నెలకు ముప్పై వేల జీతం వుంది. తెలుగు టీచరునైన నాకు మాత్రం ఇరవై వేలే. ఇదెక్కడి అన్యాయం సార్?’ బాధను అభినయిస్తూ చెప్పాడు ఆంజనేయులు.

‘ఏందేంది? తెలుగు టీచరు శాలరీ పెంచాల్నా? అసలేముందయ్యా తెలుగులో. టైంలేదు గానీ నేనే చెప్పి పారేస్తును తెలుగు క్లాసు. సాంస్ర్కీట్ తీసుకోమంటే వినకుండా కొందరు పిలకాయలు తెలుగు క్లాసులోనే కూలబడుండారు. ఐనా పిలకాయలందరితో ఇంగ్లీష్ మాట్లాడాలని సర్కులర్ ఇచ్చుండాము గదా, నువ్వేమో తెలుగులోనే మాట్లాడతా వుండావంట. ఏంది కత?’ అని మళ్లీ ఉరిమాడు శీనప్ప.

‘తెలుగు టీచర్ని, నేనెట్ల ఇంగ్లీషులో మాట్లాడేను సార్?’

‘మాట్లాడాలయ్యా, ఎవరి కోసం మాట్లాడతావు? నెల తిరగంగానే ఇరవై ఏలు బిళ్లకుడుముల్లాగా ఇస్తా వుంటిమి. మేనేజ్మెంట్ అంటే అంత నిర్లక్షమా. స్పీకిన్ ఇంగ్లీష్ మై బోయ్’ శీనప్ప హితబోధతో తాను వచ్చిన పని మరచిపోయాడు ఆంజనేయులు.

‘అట్నే సార్, ఇంగ్లీషులోనే స్పీకుతా’ అని కరస్పాండెంట్ గది నుండి బయటకు నడిచాడు ఉసూరుమని.


‘అమ్మా, మన పిలకాయ ఆంజనేయులుకు మంచి సంబంధం తెచ్చుండాను. మీరు వూ.. అంటే ఈ ఆదివారం పిల్లను చూసుకోను పోయొస్తాము’ మధ్యవర్తి గురునాథం ఆంజనేయులు నాయనమ్మ ప్రభావతి ముందు వాలి అన్నాడు. ఒక యాక్సిడెంట్లో ఆంజనేయులు తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుండి ఆంజనేయులు తన నాయనమ్మ ప్రభావతితో బాటూ స్వంత ఊరు తిరుపతి దగ్గరే వున్న చిగురువాడలో నివసిస్తూ వున్నాడు. రోజూ షేర్ ఆటోలో తిరుపతి వెళ్లి, వస్తూ వుంటాడు.

‘ఏందబ్బా గురునాథం! అమ్మాయి ఫోటో ఏదైనా వుండాదా?’ గురునాథం తెచ్చిన ఫొటోలో అమ్మాయి సుబ్బలక్ష్మిని చూసి ముచ్చటపడింది ప్రభావతి వక్కాకు నములుతూ.

‘పంతులుగారూ, నాకిప్పట్లో పెళ్లీ, గిళ్లీ ఏమీ వద్దంటే మళ్లీ ఈ సంబంధాలు పట్టుకొనొస్తా వుండారు’ బామ్మ ఇచ్చిన కాఫీని జుర్రుకుంటూ తాగుతూ అన్నాడు ఆంజనేయులు.

‘అట్ల అంటే ఎట్లా అంజి బాబూ! ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు పెద్దవాళ్లు’ బామ్మ ఇచ్చిన కాఫీ గ్లాసు ఆత్రంగా అందుకుంటూ అన్నాడు గురునాథం.

‘వాడికేమి తెలుసు పిచ్చిసన్నాసి అట్నే గుర్నాథమూ! ఈ ఆదివారం పొద్దన పదిగంటలకు పిల్లను చూసుకోను వస్తామని వాళ్ల వాళ్లకు చెప్పు, అట్నే నువ్వు ఆ రోజు పొద్దునే ఇక్కడకు రా’ అన్నది ప్రభావతి ఆనందంగా.


‘తెలుగు టీచరు అంటే పిలక పెట్టుకొని, పంచె కట్టుకొని వూడిపడతారు అనుకోనుండా. మరేంది మామూలుగానే వుండారు!’ అని ఆంజనేయులును చూసి నవ్వింది సుబ్బలక్ష్మి.

‘సుబ్బలక్ష్మిగారూ! తెలుగు అన్నా తెలుగు టీచర్లన్నా మనవాళ్లు చాలామందికి చిన్నచూపు వుంది. మన మాతృభాష తెలుగు. మన సంస్కృతి, మన సంప్రదాయం తెలుగు. సుందర తెలుగు అన్నాడు. తమిళకవి భారతి, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు వెనిస్ యాత్రికుడు నికోలాక్వికాంటీ. మన వాళ్లకింకా మన తెలుగు భాష గొప్పతనం అర్థం కాకపోవడం శోచనీయం’ అన్నాడు ఆంజనేయులు.

‘మీరెట్లాంటి పెద్ద పదాలు వాడితే మా బోటోళ్లకు అర్థం కాదు. ఏ సైన్సో, మాథ్సో ఐతే ట్యూషన్లు చెప్పుకోనైనా బతకచ్చు. తెలుగు టీచర్ని కట్టుకొని ఏం సుఖపడతావు అంటా వుండారు మా ఫ్రెండ్సు. కానీ మీ సంబంధం ఒప్పుకోలేదంటే ఇంట్లో వాళ్లు అరుస్తారు. కాబట్టి మీరే నేను నచ్చలేదని చెప్పేయండి’ అన్నది సుబ్బలక్ష్మి నవ్వుతూ.

భారమైన మనసుతో గదిలోంచి బయటకు వచ్చాడు ఆంజనేయులు. ‘లక్షణమైన పిల్ల. నీకెందుకు నచ్చలేదురా’ అని దారి పొడుగునా బామ్మ గొణుగుతూనే వుంది.

‘ఇద్దో ఆంజనేయులూ, నేను మీ పల్లెకొస్తావున్నా. మన స్కూలు బస్సు డ్రైవరు రహీము మీ పల్లెలోనె గదా వుండేది. అతని ఇల్లు నీకు తెలుసునా?’ స్కూలు వైస్ ప్రిన్సిపాలు నూకరాజు నుండి ఫోన్ వచ్చింది ఆంజనేయులుకొక ఆదివారం.

‘తెలుసు సార్’ అన్నాడు ఆంజి. ఆర్టీసీ బస్సులాగే సెంటరుకు వెళ్లి నూకరాజును రిసీవ్ చేసుకున్నాడు ఆంజనేయులు. టీకొట్టు భాష దగ్గర టీ తాగించాడు.

‘ఏమైంది సార్, అట్లా మా వూరికొచ్చేసుండారు’ నూకరాజును అడిగాడు ఆంజనేయులు.

‘ఏమీ లేదు ఆంజనేయులూ, మన స్కూలు బస్సు డ్రైవరు రహీము పని మానేస్తానని నెలరోజులుగా గొణుగుతా వుండాడు. జీతం తక్కువంట. ఐదువేలు ఎక్కువియ్యాలంటాడు. అప్పటికీ మూడువేలు ఎక్కువిస్తామన్నాము. దానికీ ఒప్పుకోలే. రెండు రోజులుగా పనికే రాలే. పేరెంట్సు ఒకటే గోల. మనకి వేరే ఏ డ్రైవరూ దొరకలా. అందుకే వాడికి నచ్చజెప్పి, పనికి వచ్చేలా చూడాలని వచ్చుండా. వాడి ఇల్లు చూపించు. నేనే అతనితో మాట్లాడతా’ అన్నాడు నూకరాజు. ఆంజనేయులు నూకరాజుకు రహీం ఇల్లు చూపించాడు.

‘నువ్విక్కడే వుండు, నేనింట్లోకి పోయి మాట్లాడి వస్తా’ అని రహీం ఇంట్లోకి పోయాడు నూకరాజు. అలా వెళ్లినవాడు పదినిమిషాల తర్వాత మొఖం వేలాడేసుకొని వచ్చాడు.

‘ఏమైంది సార్?’ అడిగాడు ఆంజనేయులు.

‘ఆ రహీం మందులో వున్నాడు. పనికి రానంటే రానని అలిగి కూర్చున్నాడు. నేను ఎంత బతిమాలినా లాభం లేకపోయింది’ అన్నాడు నూకరాజు.

‘మీరిక్కడే వుండండి సార్’ అని ఆంజనేయులు రహీం ఇంటిలోనికి వెళ్లాడు.

రహీం దోస్తులతో ఒక టేబుల్ చుట్టూ వున్న ఛెయిర్స్ లో కూర్చుని వున్నాడు. టేబుల్

పై మందుసీసా, కూల్ డ్రింక్స్, పకోడీ, చిప్స్ వున్నాయి.

‘ఏమి రహీం భాయ్ అలిగినావంట. అలుగుటయే ఎరుగని మహా మహితాత్ముడు అజాతశ్రతువే అలిగిన నాడు/సాగరములన్ని ఏకము గాకపోవు/ కర్ణులు పదివేలురన నెత్తురు సత్తురు రాజరాజా’ అని ఆంజనేయులు పద్యం అందుకోగానే ఫక్కున నవ్వేశాడు రహీం.

‘ఆంజి భాయ్, నాకు నాటకాలన్నా, పద్యాలన్నా ఎంత ఇష్టమో నీకు తెలుసు. మన వూరిలో తిరుపతి కేశవులు ట్రూపు ఎప్పుడు నాటకం వేసినా నేను ముందు వరసలోనే వుంటాను’ అన్నాడు రహీం ఆనందంగా. ఆంజనేయులు పకోడీ నములుతూ రహీంతో అదీ- ఇదీ మాట్లాడి మరుసటి రోజు నుండి పనిలోకి వెళ్లేలా ఒప్పించాడు.

‘ఎంతైనా ఒకే వూరి వాళ్లం. ఇంకో మూడు నెలల్లో ఈ మూడు వేలు కాకుండా ఇంకో రెండు వేలు నీ శాలరీ పెంచే పూచీ నాది’ అన్నాడు ఆంజనేయులు. రహీం ఒప్పుకున్నాడు. ఆ శుభవార్త నూకరాజు చెవిలో వేసేసరికి అతడు పరమానంద భరితుడయ్యాడు. ఆంజనేయులు ఇమేజ్- మేనేజ్ మెంట్ దృష్టిలో పెరిగిపోయింది.


‘అమ్మా, మొన్న పొరబాటున ఆ సుబ్బలక్ష్మి వాళ్ల సంబంధం చెప్పాను. మీరు సరే అంటే గజలక్ష్మి అనే చక్కనైన పిల్ల సంబంధం మాట్లాడతాను’ పెళ్లిళ్ల పేరయ్య గుర్నాథం చెప్పాడు ప్రభావతితో.

‘ఏమాత్రం వద్దు గురునాథం గారూ, ఆ సుబ్బలక్ష్మితోనే తలబొప్పి కట్టింది. ఈ గజలక్ష్మి ఏం ఇక్కట్లు పెడుతుందో’ మధ్యలో అందుకొని, చిందులు తొక్కాడు ఆంజనేయులు.

‘ముమ్మాటికీ అలా జరగదండి. ఆ సుబ్బలక్ష్మి చదువు, సందె లేని పిల్లాయె. ఈ గజలక్ష్మి అలా కాదే. డిగ్రీ, బీఇడి చేసి మధురవాణి హైస్కూల్లో టీచరుగా పనిచేస్తూ వుంది. కాబట్టి మనవాడిని అర్థంచేసుకొని సహకరిస్తుంది. పైగా త్యాగరాజ కీర్తనలు పాడిందంటే ఎవరైనా మైమరచి పోవలసిందే’ అన్నాడు గురునాథం ఊగుతూ. ఆ మాటలకు ఎగిరి గెంతేసింది ప్రభావతి. ఆ ఆదివారం పెళ్లి చూపులకు గజలక్ష్మి ఇంటి గడప తొక్కాల్సిందే అని డిసైడ్ చేసింది.


క్లాసులో చదివే పిల్లలకంతా రోజూ ఒక మంచి పద్యాన్ని చెప్పించి, వాళ్ల తల్లిదండ్రుల దగ్గరో, ఇంటిలోని తాతలు, నాయనమ్మలు వంటి పెద్దవారి వద్దనో ఆ కంఠతా పట్టిన పద్యాన్ని సమయం చూసి, వల్లించమని చెప్పాడు ఆంజనేయులు పిలకాయలతో. వారం తరువాత ఆంజనేయులు క్లాస్ రూంలో వుండగా ప్రిన్సిపాల్ రమ్మని కబురుపెట్టారు. ‘మళ్లీ ఏం కొంప మునిగిందో’ అని భయపడుతూ ఆంజనేయులు ప్రిన్సిపాల్ భజగోవిందం గదిలోకి అడుగుపెట్టాడు. సఫారీ సూట్‌లో దర్జాగా ఛెయిర్లో కూర్చుని వున్న ముప్పై ఐదేళ్ల వ్యక్తిని చూసి ఠారెత్తిపోయాడు ఆంజనేయులు.

అతను షాక్ నుండి కోలుకోకముందే ‘ఈయన మా తెలుగు టీచర్ ఆంజనేయులు గారు’ అని అతడిని సఫారీ సూట్ వ్యక్తికి పరిచయం చేశాడు భజగోవిందం.

సఫారీ సూట్ వాలాకు అయోమయంలోనే చేతులు జోడించాడు ఆంజనేయులు. సూట్ వాలా ఆంజనేయులు చేతులు పట్టుకొని వూపేస్తూ ‘మాస్టారూ, మీరు మాకు మహోపకారం చేశారు’ అన్నాడు. ఆంజనేయులు బిత్తరపోయాడు.

‘నేను మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. నేను మీకు ఉపకారం చేయడమేమిటి సార్?’ అన్నాడు అయోమయంగా.

‘చెప్తాను. నా పేరు సూరిబాబు. నేను సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాను. మా నాన్నగారి పేరు రెడ్డెప్ప. పెద్ద భూస్వామి. పాటలన్నా, పద్యాలన్నా చెవులు కోసుకుంటాడు. నేను చాలా కాలంగా మా నాన్నను పొలాలు కౌలుదారులకు అప్పగించి, పల్లెటూరు వదలి నా దగ్గర వుండిపొమ్మని పోరు పెడుతున్నాను. కానీ మా నాన్న అందుకు ససేమిరా అంటున్నాడు. మీరు క్లాసు పిల్లలకు పద్యాలు నేర్పించి, రోజూ ఒక పద్యం పెద్దవాళ్ల దగ్గర చెప్పమన్నారా, నిన్న అనుకోకుండా మా ఇంటికి వచ్చిన మా నాన్న దగ్గర ఆ పద్యాలు పాడి వినిపించాడు మావాడు బాబీ. మా నాన్న చాలా సంతోషించి, రోజూ మనవడు చెప్పే పద్యాలు వినడానికి మా ఇంట్లోనే ఇక వుండిపోతానన్నారు. ఈ ఘనతంతా మీదే!’ అన్నాడు ఆనందంగా. ఆంజనేయులుకు నోట మాట రాలేదు.

సూరిబాబు పదివేలకు చెక్ రాసి, భజగోవిందం చేతికిచ్చి ‘ఇది ఆంజనేయులు గారికి మా ఫామిలీ తరఫున బహుమానం. తెలుగు భాషకు వారు చాలా మంచి సేవ చేస్తున్నారు. కాబట్టి నెల నెలా మీకీ చెక్ పంపుతాను. జీతంతోపాటూ ఆంజనేయులుకు నేనిచ్చేది ఉడతా భక్తిగా ఇవ్వండి. ఆంజనేయులు గారు ఏ స్కూలుకు మారినా, నేను మా బాబీని ఆ స్కూలుకు పంపి, ఈ పారితోషికం ఇస్తూనే వుంటాను’ అన్నాడు. సూరిబాబు ఇంకా ఆంజనేయులును ఎన్నో విధాలుగా పొగిడి శెలవు తీసుకున్నాడు. అతడు వెళ్లిపోయాక భజగోవిందం, ‘ఆంజనేయులూ, నువ్వు మంచిపని చేస్తున్నావు. నీకు జీతం తక్కువిచ్చి పొరబాటు చేస్తున్నాం. ఇక మీదట నీకు మిగతా టీచర్లతో సమానమైన జీతం ఇస్తాం. అదనంగా ఈ సూరిబాబు నుండి వచ్చే పదివేలు కూడా ఇస్తాం’ అన్నాడు. ఆంజనేయులుకు ఒక్కసారిగా కొండెక్కినంత సంబరం కలిగింది.


ఆంజనేయులు, బామ్మ ప్రభావతి పెళ్లిచూపుల కోసం వచ్చి గజలక్ష్మి ఇంట్లో కూర్చుని వున్నారు. గజలక్ష్మి తండ్రి పీతాంబరం, తల్లి ఆండాళ్లు హడావిడిగా వున్నారు. కాఫీలు తాగాక, గజలక్ష్మినొక త్యాగరాజ కీర్తనను ఆలపించమని కోరింది ప్రభావతి. ‘నగుమోము కనలేని....’ అన్న కీర్తనను గుక్కతిప్పుకోకుండా పాడింది గజలక్ష్మి. ప్రభావతి ఆనందానికంతు లేదు.

‘అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవాలంటే ఆ గది వుంది’ అన్నాడు పీతాంబరం. చెప్పినదే తడవుగా ఆ గదిలోకి దూరింది గజలక్ష్మి. వెనుకగానే ఆంజనేయులు వెళ్లాడు. ‘మీకు నేను నచ్చకపోయినా, నా వుద్యోగం నచ్చకపోయినా ఇప్పుడే చెప్పేసెయ్యండి’ అన్నాడు ఆంజనేయులు.

‘మీకేమి, మహారాజులా వున్నారు. టీచరుద్యోగమైనాక తెలుగైనా ఒకటే, సైన్సైనా ఒకటే, ఆ మాటకొస్తే నేనూ టీచర్నే కదా, నాది ఒకటే కండిషను’ అంది గజలక్ష్మి.

‘ఏమిటో ఆ కండిషను’ ఎకసెక్కంగా అన్నాడు ఆంజి.

‘మీకు పల్లెలో రెండెకరాలు పొలం వున్నదని మీ బయోడేటాలో చూశాను. నేను పనిచేసే మధురవాణి స్కూలు అమ్మకానికుంది. ఓనరు ఇరవై లక్షలు చెబుతున్నాడు. నా దగ్గర ఒక ఐదు లక్షలు వుంది. మీ పొలమమ్మి మీరో పదిలక్షలు తెస్తే, మిగతాది అప్పు చేసైనా ఆ స్కూలు మనం కొని, స్వంతంగా నడుపుకోవచ్చు. బాగా నడుపుకొంటే నాలుగైదేళ్లలో ఆ అప్పు తీర్చేయవచ్చు’ అంది గజలక్ష్మి.

ఆంజనేయులు నవ్వి, ‘నేను చదువుకొన్నదీ, ఇన్నాళ్లూ మా ఇల్లు గడిచినదీ ఆ పొలం నుండి వచ్చే ఫలసాయంతోనే. ఇన్నాళ్లూ స్కూల్లో నా సంపాదన బ్యాంకులో దాస్తూ వచ్చాను. ఆ మొత్తం దాదాపు పది లక్షలు వుంటుంది. స్కూలు కొనడానికి ఆ మొత్తం సర్దడం నాకు పెద్ద పనేం కాదు’ అన్నాడు. గజలక్ష్మి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ‘ఐతే మన పెళ్లికి నీకు ఓకే కదా’ అన్నది.

‘ఓకేనే కానీ, నాదీ ఒక షరతు’ అన్నాడు ఆంజనేయులు.

గజలక్ష్మి ఆందోళనగా ‘ఏమిటది?’ అన్నది.

‘మన స్కూల్లో పిల్లలు ఇంగ్లీషులోనే మాట్లాడాలన్న నిబంధన వుండకూడదు, అలాగే మూడు నెలలకొకసారి పద్య పఠనంలో పోటీలు పెట్టి, గెలుపొందినవారికి బహుమతులివ్వాలి’ అన్నాడు ఆంజనేయులు.

గజలక్ష్మి ఆనందంగా ఆ షరతుకు ఒప్పుకొంది.

రాచపూటి రమేష్

9866727042​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్