‘నమస్తే సార్..’ ఎవరిదో పిలుపు వినిపించింది. స్టాఫ్ రూమ్‌లో కూర్చుని టీచింగ్ నోట్స్ రాస్తున్న నేను తలెత్తి చూశాను. ఎదురుగా నమస్కరిస్తూ రామలక్ష్మి, వాళ్లబ్బాయి షణ్ముఖరావు నిలబడి ఉన్నాడు.
‘నమస్తే.. బాగున్నారా?’ అని పలకరించాను.
‘బాగున్నాము సార్. మీరు బాగున్నారా?’ అంది రామలక్ష్మి.
‘ఆఁ.. ఏం షణ్ముఖా.. ఎలా ఉంది కాలేజీ? క్లాసులు జరుగుతున్నాయా?’ ఉత్సాహంగా అడిగాను.
జరుగుతున్నాయంటూ తలూపాడు షణ్ముఖ.
‘తిరుగు ప్రయాణం ఎప్పుడు?’
‘ఎల్లుండే సార్.. నేను కూడా బాబుతో పాటు నూజివీడు వెళ్తున్నాను.’ మెల్లగా అంది రామలక్ష్మి.
‘గుడ్ షణ్ముఖ.. నీ కోరిక నెరవేరింది. ఇంకేం మనసులో పెట్టుకోకు. బుద్ధిగా చదువు. మంచి ఉద్యోగం సంపాదించుకో. అమ్మానాన్నలను బాగా చూసుకో. నీకు ఏం కావాలన్నా ఫోన్ చెయ్యి.. సరేనా..’
జేబులో నుంచి వెయ్యి రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టాను.
‘వద్దు బాబు..’ అంటూ రామలక్ష్మి డబ్బులు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించింది.
‘ఉండనీ రామలక్ష్మి.. ఖర్చులు ఉంటాయి కదా. దేనికైనా ఉపయోగపడతాయి.’
నా గొంతులోని గాంభీర్యాన్ని గమనించి ఆమె ఇంకేం మాట్లాడలేదు.
‘ఒక గురువుగా నా కొడుక్కి మంచి దారి చూపించారు. ఒక అన్నలా నా బతుకుని సరిదిద్దారు. మీ మేలు ఎప్పటికీ మరిచిపోను సారూ..’ దాదాపు ఏడుస్తున్నట్టుగా అంది.
‘సరేలే.. అవన్నీ ఇప్పుడెందుకు? ఇక మీ కష్టాలన్నీ తీరినట్టే. సంతోషంగా ఉండండి.’
‘అదంతా మీ చలవే.. వెళ్లొస్తాం సార్..’ అంటూ చేతులు జోడించింది. కొడుకుని తీసుకుని వెళ్లిపోయింది.
ఒక్కసారిగా ఎగసిపడిన ఆలోచనలతో నా మనసు గతంలోకి జారిపోయింది.
ఉదయం తొమ్మిదిన్నర గంటలు కావస్తోంది. స్కూల్ అసెంబ్లీ ముగిసింది. క్యూ లైన్లలో పిల్లలు ఉత్సాహంగా తరగతి గదుల వైపు కదులుతున్నారు. మరోవైపు ఆలస్యంగా వచ్చిన పిల్లలు గుంజీలు తీయిస్తూ ఆపసోపాలు పడుతూ కనిపిస్తున్నారు.
‘స్టాఫ్ రూమ్‌కు ఒకసారి అందరూ రండి!’ అంటూ ప్రధానోపాధ్యాయులు ఆఫీస్ రూమ్ వైపు నడిచారు. ఏదైనా ముఖ్య సమాచారం ఉంటే మొదటి పీరియడ్‌కు ముందే అందరినీ పిలిచి క్లుప్తంగా చెప్పి పంపించడం ఆయనకు అలవాటు.
డిసెంబర్ నెల. చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. సన్నగా వణికిస్తూనే ఉంది.
‘గుడ్ మార్నింగ్ డియర్ టీచర్స్.. అందరికీ నైట్ విజిట్ ప్రోగ్రామ్ వేశాను. షెడ్యూల్ ఒకసారి చూడండి. అభ్యంతరాలు ఉంటే చెప్పండి.’ అంటూ సర్క్యులర్ బుక్‌ను టేబుల్‌పై ఉంచుతూ అన్నారు.
రాత్రిపూట గ్రామాల్లో పర్యటించి, విద్యార్థుల చదువులు ఎలా సాగుతున్నాయో వారి తల్లిదండ్రులతో చర్చించి, పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి రూపొందించిన కార్యక్రమం అది.
మా పాఠశాల క్లస్టర్ పరిధిలో సుమారు ఏడు గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని పిల్లలు ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి, ఏడు నుంచి ఎనిమిదో తరగతికి మా పాఠశాలలో చేరుతారు. మగపిల్లలు రోజూ సైకిళ్లపై, ఆడపిల్లలు బస్సుల్లో పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుకుంటారు.
వారానికి మూడు పూటలు రాగిజావ, మధ్యాహ్నం గుడ్డుతో కూడిన పౌష్టికాహారం, ప్రభుత్వం అందించే పలు రకాల సదుపాయాలతో వారి విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది.
ప్రతి ముగ్గురు ఉపాధ్యాయుల బృందానికి రెండేసి గ్రామాల చొప్పున కేటాయించి జాబితాను ప్రధానోపాధ్యాయులు తయారు చేశారు. శంకరరావు మాస్టారు, గోవిందరావు మాస్టారు, నేనూ ఒక బృందంగా ఏర్పడ్డాం. స్కూల్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రంగంపేట, మెట్టూరు గ్రామాలు మాకు కేటాయించారు.
‘ఈరోజు నుంచే నైట్ విజిట్స్ మొదలుపెట్టండి మాస్టార్లు. తల్లిదండ్రులతో మాట్లాడండి. పిల్లల్ని ఇంటి దగ్గర చదివించమని చెప్పండి. నా వీలును బట్టి నేను కూడా వచ్చి మీతో జాయిన్ అవుతాను. ఫొటోలు తీయడం మర్చిపోకండి. పైవాళ్లకు పంపించాలి కదా.’ నవ్వుతూ ఆదేశించారు ప్రధానోపాధ్యాయులు.
‘అలాగే సార్.’ అంటూ సర్క్యులర్‌పై సంతకాలు చేసి మేము ఎవరి తరగతులకు వారం వెళ్లిపోయాం.
ఆదేరోజు సాయంత్రం ఆరు గంటలకు అనుకున్నట్టుగానే రంగంపేట జంక్షన్ దగ్గర ముగ్గురు ఉపాధ్యాయులం కలిశాం. జంక్షన్ దగ్గర టీ తాగి మోటారు బళ్లపై రంగంపేటకు బయలుదేరాం.
ఆ ఊరు పట్టణానికి దగ్గరగా ఉండటం వల్ల గ్రామస్తులంతా పొట్ట పోసుకోవడానికి తెల్లవారితే పట్టణానికి చేరుకుంటారు. రోజువారీ కూలి సంపాదించుకుని సాయంత్రానికి ఇళ్లకు చేరతారు. ఆడవాళ్లు ఇంటి సరుకులు కొనుక్కుని ఇళ్లకు చేరితే, ఎక్కువ మంది మగవాళ్లు కాస్తంత మద్యం సేవించి ఇళ్లకు వెళ్తారు.
ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పిల్లల చదువుల గురించి వాకబు చేశాం. తల్లిదండ్రులు చెప్పిన మాటల్లోని సారమంతా ఒక్కటే.
‘పిల్లలు ఇంటి దగ్గర పుస్తకాలు తీయడం లేదు. ఎప్పుడూ సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది చదువు మానేసి ఖాళీగా ఉన్న సీనియర్ విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లిపోతున్నారు.’
ఇలా రకరకాల ఫిర్యాదులు మా ముందుకు వచ్చాయి.
సాధ్యమైనంత వరకు సమస్యలకు పరిష్కారాలను సూచించి, చదువును నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని వివరించాం. తల్లిదండ్రులు సాయంత్రం ఇళ్లకు వచ్చిన తర్వాత రోజులో కనీసం ఒక గంటైనా పిల్లల చదువుకు కేటాయించి, వారి చదువును పర్యవేక్షించాలని చెప్పాం.
మాట వినని పక్షంలో సంబంధిత ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని సూచించాం. పరీక్షలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి, ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలని కోరాం.
రోజూ ఇస్తున్న వర్క్ పూర్తి చేయించడం, ఉదయం సాయంత్రం బాధ్యతగా చదివించడం వల్లే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాం.
తర్వాత మెట్టూరు చేరుకున్నాం.
రాత్రి ఎనిమిది దాటింది. వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేమూ, మాతో పాటు వస్తున్న విద్యార్థుల సందడి తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
‘సార్.. షణ్ముఖ ఇల్లు ఈ వీధిలోనే సార్..’ అంటూ ఓ కుర్రాడు ఓ వీధి మలుపును చూపించాడు.
షణ్ముఖరావు పదో తరగతి క్లాసులో టాపర్. తెలివైన విద్యార్థి. కానీ ఈ మధ్య ఎందుకో చదువులో కాస్త వెనకబడ్డాడు. దానికి కారణం తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
‘సరే.. పదండి.’ అంటూ అందరికంటే ముందు పెద్ద అడుగులతో ముందుకు నడిచాను.
ఓ ఇంటి ముందు మెట్లపై కూర్చుని కొంతమంది గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని చూసి ‘బాగున్నారా సార్’ అంటూ పలకరించారు.
‘షణ్ముఖ ఇల్లు ఇదే సార్..’ అంటూ పిల్లలు ఎదురుగా ఉన్న ఇంటిని చూపించారు.
రోడ్డు దాటి గుమ్మంలోకి ప్రవేశించి తలుపు కొట్టబోతుండగా లోపలి నుంచి పెద్దగా శబ్దాలు, కేకలు, ఏడుపులు వినిపించాయి.
మేమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం.
మళ్లీ తలుపు కొట్టడానికి జంకి వెనక్కి తిరిగి రోడ్డు దగ్గరకు వచ్చాం.
‘ఇంట్లో నుంచి అరుపులు, కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి?’ అని ఇందాక పలకరించిన వ్యక్తులను ఆశ్చర్యంగా అడిగాను.
‘ఓ అదా.. అదో పెద్ద కథ లెండీ సార్. పదండి.. మేము కూడా వస్తాం.’ అంటూ వాళ్లు మా వెనకాలే నడిచారు.
తలుపు కొట్టగానే ఏడో తరగతి చదువుతున్న ప్రమీల (షణ్ముఖ చెల్లెలు) వచ్చి తలుపు తీసింది.
‘సార్.. మీరా..’ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ మమ్మల్ని లోపలికి ఆహ్వానించింది.
మేమంతా లోపలికి అడుగుపెట్టగానే అక్కడి దృశ్యం మమ్మల్ని ఒక్కసారిగా నిర్ఘాంతపరిచింది.
ఏడుస్తూ ఒక మూలన కూర్చున్న రామలక్ష్మిని కాళ్లతో తన్నుతున్న కూర్మయ్య (షణ్ముఖ తండ్రి), ‘అమ్మను కొట్టొద్దు’ అంటూ అతన్ని రెక్క పట్టుకుని వెనక్కి లాగుతున్న షణ్ముఖరావు కనిపించారు.
ఎంత దుఃఖాన్ని ఉగ్గబట్టుకుని ఉన్నాడో పాపం.. అతని ముఖం కమిలిన మామిడిపండులా కనిపిస్తోంది.
నాలో ఆవేశం పెల్లుబికింది. మరేమీ ఆలోచించకుండా కూర్మయ్యను రెండు చేతులతో లాగి పక్కకు తోసేశాను.
‘తాగేసి వచ్చి భార్య పై చేయి చేసుకుంటున్నావా? అదీ నీ పిల్లల ముందేనా? సిగ్గు లేదా? నువ్వసలు మనిషివేనా?’ అంటూ కోపంగా అరిచాను.
అతను కూడా తగ్గలేదు. పిచ్చిపిచ్చిగా అరుస్తూ నన్ను కిందకు తోసేసి కొట్టడానికి మీదకు వచ్చి చేయి ఎత్తాడు.
వెంటనే నా వెనుక ఉన్న గ్రామస్తులు ఒక్క సారిగా అతన్ని పట్టుకుని బయటకు లాగి తీసుకెళ్లారు.
‘అతనెవరనుకున్నావురా? స్కూలు మాస్టారు. పిల్లలు చదువుతున్నారా? లేదా? అని తెలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చాడు. అంతేగానీ నిన్ను కొట్టడానికి కాదు. మాస్టారు మీదకే కలబడతావా? బుద్ధుందా? ఆయన అన్నదాంట్లో తప్పేముంది?’ అంటూ అతనికి వివరించారు.
కొద్దిసేపటికి కూర్మయ్యకు విషయం అర్థమైంది. తన తప్పు ఒప్పుకుంటూ నా చేతులు పట్టుకున్నాడు.
అవమానంతో, బాధతో బిత్తర చూపులు చూస్తున్న రామలక్ష్మి అక్కడే నిలబడిపోయింది. గ్రామస్తులు ఒక్కొక్కరుగా వచ్చి గుమిగూడారు.
‘ఏమీ అనుకోకండి సార్.. ఇవేవీ మనసులో పెట్టుకోకండి. మూగోడు వాడు. ఆ అమ్మాయి మీద అనుమానం. రోజూ తాగేసి వచ్చి ఇలా గొడవ చేస్తుంటాడు. ఆ అమ్మాయి మంచిది. ఏ పాపమూ ఎరగదు. మేము ఎన్నో రకాలుగా చెప్పి చూశాం. అయినా వినిపించుకోడు. మూర్ఖుడు. వీడి వల్ల భార్యా పిల్లలు నలిగిపోతున్నారు.’ అని గ్రామస్తుల్లో ఒకరు చెప్పారు.
షణ్ముఖ, ప్రమీల ఒక మూలన కూర్చుని అందరినీ అమాయకంగా చూస్తున్నారు.
‘సమస్య అర్థమైంది.. పరిష్కారం వెతకాలి.’ నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది.
‘జరిగింది మరిచిపోవడానికి ఇది చిన్న అవమానమా? ఈ విషయం నలుగురికీ తెలిస్తే నాకెంత అవమానం? నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలను. పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు కనీసం ఆరు నెలలు జైలు శిక్ష పడుతుంది.’ ఆవేశంగా అన్నాను.
‘అయ్యా సూర్యం మాస్టారు.. మీకు పుణ్యం ఉంటుంది. అంత పని చేయకండి. వాడు చేసింది తప్పే. ఒప్పుకుంటున్నాం కదా.. దయచేసి వాడిపై కంప్లైంట్ ఇవ్వకండి.’ అంటూ ఊరి సర్పంచ్, మరికొందరు పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేశారు.
‘అంటే మీ ఊరి పరువు కోసం నేను అవమానం భరించాలా? ఇదేనా మీరు చెప్పే న్యాయం?’ అని ప్రశ్నించాను.
‘బాబ్బాబు.. అలా అనకండి. పెద్ద మనసుతో వాడిని క్షమించమని అడుగుతున్నాం అంతే.’ అంటూ ఊరి సర్పంచ్ గడ్డం పట్టుకుని మరీ వేడుకున్నాడు.
‘సరే.. మీరంతా ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నాదొక షరతు.’ కొంచెం గంభీరంగా అన్నాను.
‘ఏంటి సార్ అది?’ అని అడిగారు.
‘అతను రేపటి నుంచి మందు మానేయాలి. నా కోసం కాదు.. అతని కుటుంబం కోసం. ఒకవేళ తాగి వచ్చినా ఎవరి జోలికీ వెళ్లకూడదు. ముఖ్యంగా తన భార్య జోలికి అసలు వెళ్లకూడదు. పిల్లలను ప్రతిరోజూ దగ్గరుండి చదివించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి.
పది రోజులు గడిచిన తర్వాత నేను మళ్లీ వస్తాను. విచారిస్తాను. ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ అతనిలో కనిపించాలి. లేదంటే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఈ విషయం అతనికి అర్థమయ్యేలా చెప్పండి.’ అని అన్నాను.
అప్పుడు నా మాటలకు గ్రామస్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
సైగల ద్వారా కూర్మయ్యకు విషయమంతా వివరించారు. అతనికి పూర్తిగా మత్తు దిగిపోయింది. నా కాళ్లపై పడి ఏడుస్తూ క్షమించమని వేడుకున్నాడు.
‘మీ షరతులన్నింటికీ కూర్మయ్య ఒప్పుకున్నట్టే. అయినా అవన్నీ అతని మంచికే కదా.. అంతా మంచే జరుగుతుంది. చాలా సమయం అయింది. మీరు బయలుదేరండి సార్.’ అని గ్రామస్తులు అన్నారు.
అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరేసరికి రాత్రి పదకొండు అయ్యింది.
వారం రోజులు గడిచాయి.
షణ్ముఖరావులో చాలా మార్పు వచ్చింది. అన్ని సబ్జెక్టుల్లోనూ చురుగ్గా, చలాకీగా తయారయ్యాడు. మార్కుల్లో తన మొదటి స్థానాన్ని తిరిగి సాధించాడు. ఉపాధ్యాయులందరి చేత ‘శభాష్’ అనిపించుకున్నాడు.
‘నాన్న మునుపటిలా లేడు సార్. చాలా మారాడు. తాగుతాడు కానీ తాగిన రోజు ఎవరినీ ఏమీ అనకుండా ఒక మూలన కూర్చుంటాడు. అమ్మ జోలికి అసలు వెళ్లడం లేదు. ఇంట్లో ఇప్పుడు అంతా బాగుంది సార్.’ అని ఒకరోజు గోవిందరావు మాస్టారుతో షణ్ముఖరావు చెప్పిన మాటలు విని నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది.
ఊహించినట్టుగానే షణ్ముఖరావు పదో తరగతి పరీక్షలు బాగా రాశాడు. ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. అలాగే నూజివీడు ట్రిపుల్ ఐటీ సీటు కూడా సంపాదించుకున్నాడు.
ఆనందంతో రామలక్ష్మి తన కొడుకును ట్రిపుల్ ఐటీ కాలేజీలో చేర్పించింది. ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం తన కొడుకుతో ఇప్పుడు వచ్చి తీసుకుని వెళ్లింది.
‘సూర్యా సార్.. షణ్ముఖ స్కూలుకు వచ్చాడు. మిమ్మల్ని కలిశాడా?’ అని గోవిందరావు మాస్టారు వచ్చి అడగడంతో గత ఆలోచనల నుంచి బయటకి వచ్చాను.
‘కలిశాడు సార్.. ఇప్పుడే మాట్లాడాను.’ అని సాలోచనగా అన్నాను.
‘ఆరోజే గనక మనం వాళ్ల ఇంటికి వెళ్లకపోయి ఉంటే.. మీరు అలా సమయస్ఫూర్తిగా హెచ్చరించి ఉండకపోతే.. నిజంగా షణ్ముఖ పరిస్థితి దారుణంగా ఉండేది. ఏదేమైనా అతనికీ, అతని తల్లికీ ఎంతో మేలు జరిగింది. రియల్లీ, హి ఈజ్ లక్కీ ఫెలో సర్.’ అన్నాడు గోవిందరావు మాస్టారు.
‘అవున్సార్.. మనిషికి ఉన్న సప్తవ్యసనాల్లో ఈ తాగుడు అత్యంత ప్రమాదకరమైనది. ఇది అనేక రూపాల్లో మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. అందుకు షణ్ముఖ జీవితం ప్రత్యక్ష ఉదాహరణ.
ఇది మనం చూసిన, మనకు తెలిసిన ఒక షణ్ముఖరావు కథ మాత్రమే. మనకు తెలియకుండా ఎక్కడెక్కడో మొగ్గ దశలోనే రాలిపోతున్న విద్యా కుసుమాలు ఎన్నో ఉన్నాయి.’ అని బాధగా నిట్టూర్చాను.
పాలకొల్లు రామలింగస్వామి
9441416049








కామెంట్‌లు (0)