గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Spam Calls - ఇకపై గుర్తు తెలియని కాల్స్ కు చెక్ ..!

2 గంటల క్రితం

Spam Calls – Put an end to calls from unknown numbers!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 02:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

నెట్ వర్క్ : మీ ఫోన్‌కు ఓ కొత్త నంబర్‌ నుంచి కాల్‌ వచ్చిందా ? అవతల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలంటే ఇకపై ట్రూకాలర్‌ వంటి యాప్‌లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఫోన్‌ మోగగానే కాలర్‌ పేరు, నంబర్‌ నేరుగా స్క్రీన్‌పై కనిపించేలా కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. గుర్తుతెలియని కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ బెడదను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.


థర్డ్‌ పార్టీ యాప్‌లతో పనిలేదు ...

కాలర్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ (CNAP) పేరుతో ఈ సదుపాయాన్ని అమలు చేయాలని టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. నవంబర్‌ 1 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించింది. దీంతో మన ఫోన్‌లో సేవ్‌ చేయని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినా, టెలికాం సంస్థల వద్ద నమోదైన వివరాల ఆధారంగా కాలర్‌ పేరు కనిపిస్తుంది. అయితే, ఈ సదుపాయం స్పామ్‌ కాల్స్‌ను పూర్తిగా అడ్డుకుంటుందని చెప్పలేం. కాల్‌ చేసేవారి వివరాలను గుర్తించడంలో మాత్రం ఉపయోగపడుతుంది.


4జీ, 5జీ ఫోన్లకే ప్రస్తుతానికి ...

ప్రస్తుతానికి 4జీ, 5జీ వంటి హైస్పీడ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌లలోనే CNAP సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లకు ఈ సదుపాయాన్ని విస్తరించే అంశంపై స్పష్టత లేదు. మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి కాల్‌ వచ్చినప్పుడు టెలికాం ఆపరేటర్ల సబ్‌స్క్రైబర్‌ డేటాబేస్‌లో నమోదైన పేరును స్క్రీన్‌పై చూపిస్తారు.


అంతర్జాతీయ కాల్స్‌కు ప్రత్యేక గుర్తింపు ....

విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో మాత్రం కాలర్‌ పేరుకు బదులుగా ‘ఇంటర్నేషనల్‌ కాల్‌’ అని కనిపిస్తుంది. కాల్‌ ముగిసిన తర్వాత అవతలి వ్యక్తి నంబర్‌ను పేరుతో సహా ఆటోమేటిక్‌గా సేవ్‌ చేసుకునే అవకాశం ఉండదు. అవసరమైతే వినియోగదారులే ఆ వివరాలను మాన్యువల్‌గా సేవ్‌ చేసుకోవాలి.


పేరు కనిపించకూడదనుకుంటే..?

తమ వివరాలు ఇతరులకు కనిపించకూడదనుకునే చందాదారులకు కూడా వెసులుబాటు ఉంది. కాలింగ్‌ లైన్‌ ఐడెంటిఫికేషన్‌ రిస్ట్రిక్షన్‌ (CLIR) సదుపాయాన్ని ఎంచుకున్నవారి పేరును కాలర్‌ ఐడీలో చూపించరు.


మొత్తంగా, కొత్త CNAP వ్యవస్థ అమల్లోకి వస్తే గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడం మరింత సులభం కానుంది. అయితే, ఈ సేవల ప్రభావం వాటి అమలు విధానం, టెలికాం నెట్‌వర్క్‌ మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఫోన్‌ మోగగానే ‘ఎవరు చేస్తున్నారు?’ అని ఆలోచించే పరిస్థితికి ఈ కొత్త సదుపాయం కొంతవరకు తెరదించనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్