ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల అసంతృప్తి

22 నిమిషాల క్రితం

micro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 10:52 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- కంపెనీ విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యోగులు బహిరంగ లేఖ

- స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం

- 60 వేల మందికి స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!

న్యూయార్క్: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థలో పని పరిస్థితులు దిగజారుతున్నాయని ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో.. కంపెనీ విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యోగులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏఐ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతతో ఉద్యోగులు, వినియోగదారులు, పర్యావరణ ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

'కన్సర్న్డ్ మైక్రోసాఫ్ట్ వర్కర్స్' పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ లేఖ అక్టోబర్ 26న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ప్రకటనకు ముందే ఉద్యోగుల మధ్య చర్చకు వచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఏఐ పెట్టుబడులు పెరిగినప్పటి నుంచి పని పరిస్థితులు మరింత ఒత్తిడితో కూడుకున్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. పెరుగుతున్న పనిభారం, తరచూ జరిగే సంస్థాగత మార్పులు, ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతామనే భయాలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు.

ఏఐతో అదనపు పనిభారం

ప్రతి పనిలోనూ ఏఐ సాధనాలను ఉపయోగించాలని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని లేఖలో ఆరోపించారు. సరైన శిక్షణ, స్పష్టమైన అవసరం లేకుండానే కొత్త ఏఐ వ్యవస్థలను ఉపయోగించాలని సూచిస్తున్నారని విమర్శించారు. ఏఐ రూపొందించిన పనుల్లో తప్పులను సరిదిద్దడం, ప్రమాణాలకు అనుగుణంగా లేని ఫీచర్లను తొలగించడం వంటి పనులకు అదనపు సమయం కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. పని సులభతరం కావాల్సింది పోయి, కొత్త సాంకేతికత మరింత పనిభారాన్ని సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ వ్యవస్థల అభివృద్ధి, వినియోగంలో ఉద్యోగుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏఐ వినియోగాన్ని తప్పనిసరి చేయవద్దని, దాని ఆధారంగా ఉద్యోగుల ప్రయోజనాలను నిలిపివేయడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం వంటి విధానాలను అనుసరించవద్దని కోరారు. వినియోగదారులు, సమాజ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 2030 నాటికి కార్బన్ నెగటివ్, వాటర్ పాజిటివ్, జీరో వేస్ట్ లక్ష్యాలను సాధించేందుకు కంపెనీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

కంపెనీ ఒప్పందాలపైనా ప్రశ్నలు

మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల నిర్మాణ ప్రణాళికల్లో పారదర్శకత లోపించిందని ఉద్యోగులు విమర్శించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, ఇజ్రాయెల్ సైన్యంతో కంపెనీకి ఉన్న ఒప్పందాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని ఏఐ సంస్థల వద్ద పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు కేంద్రీకృతం కావడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్వచ్ఛందంగా వైదొలుగాలని ప్రకటన

భారత్, అమెరికా, బ్రిటన్, కెనడాలోని ఎంపిక చేసిన ఉద్యోగులకు స్వచ్ఛందంగా సంస్థను వీడే అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ పథకం పరిధిలోకి సుమారు 60 వేల మంది ఉద్యోగులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏఐ, కోపైలట్, విండోస్, ఎక్స్‌బాక్స్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులు ఇందులో ఉన్నారు. సంస్థను వీడే వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలో సహకారం అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే 60 వేల మందిని తప్పనిసరిగా తొలగిస్తున్నట్లు ఈ ప్రకటన అర్థం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో సుమారు 23 వేల మంది అర్హులైన ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తించనుంది. అయితే ఎంతమందికి ఈ ఆఫర్ అందుతుంది, ఎంతమంది స్వచ్ఛందంగా వైదొలుగుతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

లాభాలు పెరిగినా.. జీతాల పెంపుపై అసంతృప్తి

కంపెనీ భారీగా ఏఐ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, కొంతమంది ఉద్యోగుల వార్షిక వేతనాల పెంపు ఒక శాతం కంటే తక్కువగా ఉందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మరోవైపు, అక్టోబర్ 26న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రకటించిన రెండు రోజుల తర్వాత మైక్రోసాఫ్ట్ 3.66 బిలియన్ డాలర్ల త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే లాభాలు 32 శాతం పెరిగాయి. కంపెనీ ఆదాయం 92.3 బిలియన్ డాలర్లకు చేరింది. డేటా సెంటర్లతో సహా మూలధన వ్యయం కూడా 45.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.

సెప్టెంబర్‌లో కంపెనీని వీడిన సీనియర్ డిజైన్ ఉద్యోగి గ్రెచెన్ థామస్ సైతం పని పరిస్థితుల్లో వచ్చిన మార్పులను విమర్శించారు. ఏఐ సహా కొత్త టెక్నాలజీలపై వేగంగా ప్రయోగాలు చేయడం లేదనే అంచనా కారణంగా తనకు లభించే లాభాల వాటా ప్రభావితమైందని ఆమె పేర్కొన్నారు.

ఏఐతో ఉద్యోగ విరమణకు సంబంధం లేదంటున్న కంపెనీ

మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ మాత్రం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకానికి ఏఐ కారణంగా జరుగుతున్న ఉద్యోగ మార్పులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్త అవకాశాలను అన్వేషించాలనుకునే ఉద్యోగులకు మద్దతు ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. అయితే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండవని హామీ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా లేరు.

2026 జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై నెలలోనే 4,800 పోస్టులను తొలగించింది. స్వచ్ఛందంగా వైదొలిగే ఉద్యోగుల స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టకపోతే మిగిలిన సిబ్బందిపై పనిభారం మరింత పెరుగుతుందని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏఐ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్న మైక్రోసాఫ్ట్.. అదే ఏఐ కారణంగా ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుండటం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్