మైక్రోసాఫ్ట్ సేవలు 18 గంటలు బంద్ - 74 దేశాల్లో కోట్లాదిమందికి ఇక్కట్లు ..!
సైటెక్ : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఆధారపడే మైక్రోసాఫ్ట్ సేవలు సాంకేతిక సమస్యతో స్తంభించిపోయాయి. అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలెట్ వంటి కీలక సేవలు దాదాపు 18 గంటలపాటు అంతరాయానికి గురికావడంతో 74కు పైగా దేశాల్లో తీవ్ర ప్రభావం పడింది. కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు, వ్యాపార సంస్థలు, విమానయాన రంగం ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
ఈ అంతరాయం కారణంగా ఉద్యోగులు తమ రోజువారీ విధులను నిర్వహించలేకపోయారు. అవుట్‌లుక్ ద్వారా ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడం నిలిచిపోవడంతో సమాచార మార్పిడికి ఆటంకం ఏర్పడింది. టీమ్స్ సేవలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కోపైలెట్ సహా ఇతర సేవల వినియోగదారులూ ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమస్య వెనుక సైబర్ దాడి గానీ, ఎఐ ఏజెంట్ల ప్రమేయం గానీ లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
నెట్‌వర్క్ మార్పులే కారణం !
గతంలో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన అప్‌గ్రేడ్ ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక లోపం, ఇటీవల నెట్‌వర్క్‌లో చేసిన మార్పులు ఈ అంతరాయానికి కారణమని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సమస్యను గుర్తించి సరిదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
విమానయాన రంగంపైనా ప్రభావం ...
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం విమానయాన కార్యకలాపాలపైనా ప్రభావం చూపింది. పలు దేశాల్లో విమాన సేవలకు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. మరోవైపు ఓపెన్ ఎఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు వినియోగించే కొన్ని ఎఐ సేవల కనెక్టర్లపైనా ఈ సమస్య ప్రభావం చూపినట్లు సమాచారం.
లక్షల్లో ఫిర్యాదులు ...
సేవల్లో అంతరాయాన్ని పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ గణాంకాల ప్రకారం ... అమెరికా కాలమానం ప్రకారం అవుట్‌లుక్ సేవలపై ఫిర్యాదులు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 1,38,058కు చేరాయి. అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టి గురువారం సాయంత్రానికి 34,490కు చేరుకున్నాయి. మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్ సేవలపైనా వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
వినియోగదారులకు క్షమాపణలు ...
ఈ పరిణామంపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ... వినియోగదారులు, భాగస్వాములకు క్షమాపణలు తెలిపింది. సమస్యకు కారణమైన సాంకేతిక లోపాన్ని గుర్తించి పరిష్కరించినట్లు ప్రకటించింది. సేవలను పునరుద్ధరించే క్రమంలో ఒక్కసారిగా అన్నింటినీ అందుబాటులోకి తీసుకురాకుండా దశలవారీగా ప్రారంభించి, వాటి పనితీరును పరిశీలించినట్లు వివరించింది. ప్రస్తుతం చాలా వరకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని వెల్లడించింది.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం ... సమగ్ర నివేదిక విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అంతరాయం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తీసుకోనున్న చర్యలను ఆ నివేదికలో వెల్లడించనున్నట్లు పేర్కొంది.








కామెంట్‌లు (0)