బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్' చెల్లదు : కేంద్ర ఎన్నికల సంఘం

8 గంటల క్రితం

'Family Register Certificate' is not valid: Election Commission of India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కొత్తగా జారీ చేస్తున్న 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల' చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జులై 25న జారీ చేసిన జీఓ నంబర్ 172 ప్రకారం 'మీసేవ' ద్వారా ఇచ్చే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఓటరు నమోదు, పరిశీలన ప్రక్రియలో ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ కార్యదర్శి నవీన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO)కి అధికారిక లేఖ రాశారు. గతంలో తహశీల్దార్లు క్షేత్రస్థాయి విచారణ, పత్రాల తనిఖీ చేపట్టిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను జారీ చేసేవారని ఈసీ పేర్కొంది. కానీ, జీఓ 172 ప్రకారం ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా, కేవలం రేషన్ కార్డు డేటా ఆధారంగా ఆన్‌లైన్‌లో రెండు రోజుల్లోనే ఈ సర్టిఫికెట్లు ఇస్తున్నారని గుర్తు చేసింది. ఫలితంగా ఈ కొత్త సర్టిఫికెట్ కేవలం 'రేషన్ కార్డు'తో సమానమని వివరించింది. రేషన్ కార్డులు పౌరసత్వానికి నిశ్చయాత్మక ఆధారం కావని, ఓటరు జాబితా తనిఖీకి వాటిని ప్రామాణికపత్రంగా పరిగణించలేమని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈసీ లేఖలో ఉటంకించింది. అందువల్ల కొత్త జీఓ కింద ఇచ్చే ఫ్యామిలీ సర్టిఫికెట్లను గుర్తింపు పత్రాలుగా స్వీకరించలేమని తెలిపింది. అయితే, జీఓ 172 రాకముందు (జులై 25, 2026 కంటే ముందు) పాత విధానం ప్రకారం తహశీల్దార్ల విచారణ ద్వారా పొందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మాత్రం SIR పరిశీలన ప్రక్రియలో ఆమోదిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్