హైదరాబాద్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితి విషమించి ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు వరంగల్‌లోని ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2004 డిసెంబర్‌లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టి, అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు ఎనిమిదేళ్ల పాటు సేవలందించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా సేవలందించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








కామెంట్‌లు (0)