- అమెరికా పన్నాగాలు సాగనివ్వం : పెజిష్కియాన్
టెహ్రాన్ : ఇరాన్‌ను అమెరికా మరో వెనిజులాలా మార్చేందుకు కుట్ర చేసిందని, కానీ అమెరికా దాడులను ఇరాన్ ధైర్యంగా తిప్పికొట్టి అగ్రరాజ్య పన్నాగాలను సాగనివ్వ లేదని అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ వారోత్సవాల’ ప్రారంభం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రసారం చేసింది. అమెరికా ఇరాన్‌ను మరో వెనిజులాలా మార్చేందుకు యత్నించిందని, కానీ ఇరాన్ తన ప్రతిఘటన, ఐక్యత, సంఘీభావంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శక్తిగా ఆవిర్భవించిందన్నారు. దేశ ప్రజలు అద్భుతమైన విజయాన్ని సాధించారని ప్రశంసించారు. ‘‘శత్రు దేశం సాగిస్తున్న ఈ ఆర్థిక యుద్ధంలో అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధ సమయంలో మనం ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ, సహాయం చేసుకుంటూ ఎలాగైతే ఐక్యంగా నిలబడ్డామో, అలాగే ఇప్పుడు కూడా ఎదిరించాలి’’ అని అన్నారు. నాయకత్వం చూపిన మార్గాన్ని అనుసరించాలని, ఐకమత్యం, సంఘీభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. మనం వివేకంతో వ్యవహరిస్తే ఏ శక్తి కూడా లొంగిపోయేలా బలవంతం చేయలేదని, నిస్సహాయులుగా వదిలివేయలేదని అన్నారు. ఐక్యత, సంఘీభావం, సానుభూతితో పాటు దేశ నాయకత్వాన్ని అనుసరించడం, మనం నమ్మిన మార్గంలో పయనించడం అవసరమన్నారు.








కామెంట్‌లు (0)