తెలంగాణ : హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలపడంతోపాటు, ధర్నా నిర్వహిస్తున్న టీఎన్జీఓ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బిఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హరీష్ రావు.. సుబేదారి పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లారు. హరీష్ రావును అరెస్ట్ చేయడంపై బిఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు శాంతియుతంగా ప్రజా సమస్యలపై స్పందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాలతో నిర్బంధాలకు పాల్పడుతోందని, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బిఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. ఈ ఘర్షణతో హన్మకొండ కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం (జిఒ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ) ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా, టీఎన్జీఓలు కూడా ధర్నా నిర్వహించాయి. ముందుగా హరీష్ రావు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అన్ని ఆంక్షలను దాటుకుని హరీష్ రావు హనుమకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. హరీష్ రావు రాకతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హన్మకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత - హరీష్ రావు అరెస్ట్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)